ఆమె తడబడింది - "అవును కదూ! నేను ఇప్పటికే వివాహితను. మన ఇద్దరికీ వివాహం జరగాలంటే నేను విడాకులు తీసుకోవాలి." ఒక్క క్షణం ఆగి - ఆమె "నేను నా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోవాలి. విడాకులు తీసుకోవాలి.... భారతనారి - మొదటి భర్త - విడాకులు -- సంప్రదాయం -- చాలా బాగుంది కదూ!"
ఆమె నవ్వుతోంది కానీ ఆ నవ్వు వెనుక ఆనందం లేదు. దేని గురించి మధన పడుతున్న సమయంలో ఏడవలేక నవ్విన విధంగా ఉందా నవ్వు.
నేను - "భయంగా ఉంటె నీగదిలో సాయంగా ప్రసాద్ పడుకుంటాడు --" అన్నాను.
"వద్దు - ఎవ్వరూ వద్దు. నా కిప్పుడే భయమూ లేదు అందామె.
ఆమె వెళ్ళి నిద్రపోయాక నేను ప్రసాద్ ని పిలిచి ఆమె గది తలుపుల దగ్గర మంచ మేసుకుని పడుకోమని గదిలో ఏమాత్రం అలికిడి వినిపించినా వచ్చి నన్ను లేపమనీ చెప్పాను.
రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో ప్రసాద్ వచ్చి నన్ను లేపాడు. " శాంతామ్మ గారు గదిలో ఏదో చప్పుడవుతోంది -" అన్నాడు వాడు కంగారుగా.
వాడి మాటలకు నాలోని మత్తు వదిలి పోయింది. నేను లేచి వరండాలో లైటు వేశాను. ఇప్పుడు గది కిటికీ లోంచి శాంత కనబడుతోంది. ఆమె మంచం మీద కూర్చుని ఉంది. నన్ను చూసి లేచి నిలబడి - "మీకు నిద్ర పట్టడం లేదా ?" అనడిగింది.
"ఒకసారి తలుపు తియ్యి -" అన్నాను.
శాంత తలుపు తీసింది . - "ప్రసాద్ నీగదిలో ఏదో చప్పుడవుతోందని విని కంగారు పడ్డాడు. నిద్రపట్టక చీకట్లో పచార్లు చేస్తున్నావా?" అనడిగాను.
"అంతేననుకొండి !" అందామె.
కానీ నాకు గదిలో ఒకటి రెండు మార్పులు కనబడ్డాయి. గది మధ్యలో టేబుల్ లాగబడి ఉంది. దాని మీద కుర్చీ లో ఒక పెట్టి ఉంది. నేను వాటిని చూపిస్తూ "బహుశా నిద్రపట్టక ఈ పని చేశావనుకుంటాను -"అన్నాను.
"ఊ" అందామె సంకోచించకుండా.
"శాంతా!" అన్నాను కాస్త తీవ్రంగా -- "నీ మనసును నువ్వు కాస్త అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నించు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు" అన్నాను. ఆమె ముఖం చేతుల్లో దాచుకుని అంది -"రాజా! నన్ను క్షమించండి . నాకు బ్రతకాలని లేదు."
"బ్రతుకంటే నీకు ఆశ కలిగిస్తాను. బ్రతుకులోని తీపి నీకు రుచి చూపిస్తాను. ఇప్పుడు టైము మూడు గంటలు కావస్తోంది. కొద్ది గంటలలో తెల్లవారనుంది. మనం అప్పుడు బయల్దేరి నీ భర్త ఊరు వెడదాం. శోభనాద్రి ని ఒప్పించగలనన్న ధైర్యం నాకుంది -" అన్నాను కాస్త ఆవేశంగానే.
ఆమె ఆశ్చర్యంగా నా ముఖంలోకి చూసి -" నా భర్త మీకు ఎలా తెలుసు?" అంది.
నేనలికరచుకున్నాను. ఆవేశంలో నోరు జారాను. ఒక్క క్షణం ఆలోచించాక అనుకోకుండా ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారం లభించవచ్చునన్న భావం కలిగింది. ఇంక ముసుగులో గుద్దులాట ఎందుకని ఆమెకు వివరంగా మొదట్నించి జరిగినదంతా చెప్పాను. అన్నీ విన్నమీదట ఆమె షాక్ తిన్నట్లు కనిపించింది - " అయితే నా గురించిన ఈ ఏర్పాట్లు నా భర్త వల్లనే జరిగిందన్నమాట. అయితే మన వివాహం అయిన తప్పక అంగీకరిస్తారు. తన భార్యను కేవలం ప్రేమ కారణంగా ఒక వయసులో ఉన్న బ్రహంచారి యువకుడితో ఏకాంతవాసం చేసే పరిస్త్జితులు కల్పించిన అయన నా కోరిక ఎటువంటి దైనా సరే తప్పక తీరుస్తారు. మీరన్న విధంగా ఈరోజు వెళ్ళి ఆయనకు కలుద్దాం!"
నన్ను ఇదేసందేహం చాలా తరచుగా పీడిస్తూ వస్తోంది. శోభనాద్రి తన భర్తను నా దగ్గర ఇంత నిస్సంకోచంగా ఎలా వదలగలిగాడు అని, అయినా మేమిద్దరం ఇన్నాళ్ళ ఏకాంత వాసంలో తప్పు చేయకుండా మసిలామంటే -- అతను మనుష్యుల అంచనా వేయడంలో చాలా గట్టివాడనే అనుకోవాలి. అతడు అంత గట్టివాడైతే తన భార్య ప్రవర్తన వెనుకనున్న రహస్యాన్నెందుకు అంచనా వేయలేక పోయాడు?
జవాబు నాకు వెంటనే తోచలేదు. కానీ ఎంతటి సమర్దు డైనా కూడా తను ప్రేమించిన వారి విషయంలో తప్పుటంచనాలు వేయడం సాధారణంగా జరుగుతూంటుంది.
నేను శాంత వైపు ప్రేమగా చూసి - "నీ సమస్య పరిష్కారం లభించడానికి ఇంక ఇరవై నాలుగు గంటలు వ్యవధి కూడా లేదనుకుంటాను --" అన్నాను.
టైము మూడున్నర అయినట్లుంది. గోడ గడియారం టంగున అరగంట కొట్టింది.
8
ఆ ఊర్లో మేము ట్రయిన్ దిగేసరికి రాత్రి పదిన్నర గంటలయ్యింది. శాంత నాతొ నెమ్మదిగా "బండి కాస్త లేటవుతుందేమోననుకున్నాను. కానీ రైట్ టైముకే వచ్చేసింది. మనం నా భర్త యింటికి పన్నెండు గంటల ప్రాంతంలో వేదదాము. అంతా తెలిసినవాళ్ళు- ఆ వీధిలో ఉన్నారు. నేను ఎవరి కంటా పడదల్చుకోలేదు. మళ్ళీ తెల్లవారేసరికి మనం రైల్వే స్టేషనులో ఉండాలి -" అంది.
మేము ఒక సినిమా దియేటర్ లో దూరి సినిమా ఓ గంటకు పైగా కాలక్షేపం చేసి బైటపడి శోభనాద్రి ఇంటి వైపుగా శాంత కోరిక పై కేవలం కాలినడకనే బైలుదేరాం. శోభనాద్రి ది మూడంతస్తుల మేడ. అంత మేడా కూడా ఆ క్షణంలో నిర్మానుష్యంగా ఉన్నదనడానికి సూచనగా తాళం వేసి ఉంది. శాంత తన చేతి సంచి లోంచి తాళం చెవి బయటకు తీసింది. నేను విశాలమైన ఇంటి ముందు ఆవరణనూ నిశ్శబ్దమైన ఆ వాతావరణాన్నీ ఆశ్చర్యంగా గమనిస్తున్నాను. తలుపు తీస్తూ "ఈ రోజు బుధవారం కదా! అయన క్లబ్బుకు వెళ్ళి రాత్రి ఒంటి గంటకు వస్తారు -" అంది.
శాంత లైటు వేసింది. చక్కని విశాలమైన నడవ అది. ధనవంతుల ఇల్లని చెప్పకనే స్పష్టమవుతోంది. ఇద్దరం వెళ్ళి చెరో కుర్చీలోనూ చతికిల పడ్డాం. నేను టైము చూసుకుని - "శోభనాద్రి రావడానికి ఇంకా నలభై నిముషాలున్నట్లుంది -' అన్నాను.
"ఊ" అందామె సాలోచనగా.
నేను కాస్త అనుమానంగా "ఇంత పెద్ద ఇంటిలో నువ్వూ, నీ భర్త ఇద్దరే ఉంటున్నారా?" అని అడిగాను.
శాంత నవ్వింది - "ఇక్కడి రాత్రి వాతావరణానికి పగటి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఈ ఇంటికి ఆధునికమైన అన్ని రక్షణలూ ఉన్నాయి. అయిన ఒక కాపలావాడు కూడా ఉన్నాడు. వాడు సాధారణంగా కనపడడు. కానీ ఎవరైనా కొత్తవారూ ఇంటి ముందు ఒక క్షణానికి మించి నిలబడితే వాడు హటాత్తుగా ప్రత్యక్షమవుతాడు. ఉన్దయం ఏడు గంటలు అయ్యేసరికి ఈ ఇల్లు పనివాళ్ళతో కోలాహలంగా ఉంటుంది. రాత్రి ఎనిమిది గంటలు దాటేసరికి ఈ ఇంటి యజమాని, యజమానురాలు మాత్రమే మిగులుతారు."
ఆమె చెప్పిన మాటలు ఆ ఇంటిని చూస్తుంటే నాకు శాంత - తెలివి తక్కువతనంలో గొప్ప అదృష్టాన్ని చేజేతులా వదులు కొనున్నదని అనిపించింది. శాంత హోదాను తలుచుకుంటే నాకు కాస్త భయంగా కూడా వేసింది. కడుపులో చల్ల కదలకుండా హాయిగా రోజులు గడపడానికి సరిపడ్డ అస్తీకి వారసుడినే అయినప్పటికీ శాంతకు ఇంతటి హోదాను ప్రసాదించడం నావల్ల సాధ్యపడదు.
నిముషాలు గడుస్తున్నాయి. నాకు ఆదుర్దాగా ఉంది. కంగారుగా ఉంది. నా మనసు ఏదో కీడును శంకిస్తోంది.
తన భార్య ప్రవర్తనలోని పిచ్చితనానికి అర్ధం విచారించి ఆమెను మళ్ళీ మామూలు మనిషిగా చేయవలసిందిగా కోరిన భర్త దగ్గరకు వెళ్ళి "నీ భార్యకు విదాకులిచ్చేయ్ ఆమెను నేను పెళ్ళి చేసుకుంటాను -" అని చెప్పాలి. చెప్పడం నావల్ల అవుతుందా? చెప్పేక శోభనాద్రి రియాక్షన్ ఎలాగుంటుంది? ఒకవేళ అతనిందుకు అంగీకరిస్తే భార్య భర్తలుగా సాటి బంధువులతోనూ, సమాజం లోనూ మా స్థానం ఎలా ఉంటుంది? ఎన్నో రకాల ఆలోచనలు మనసును కమ్మేస్తున్నా. వాటి బారి నుంచి తాత్కాలికంగా తప్పించుకోడానికి నేను శాంత ముఖంలోకి చూశాను. ఆమె ముఖం కూడా ఆందోళనను వ్యక్తం చేస్తోంది. కొద్ది క్షణాల క్రితం ఆమెలో కనపడ్డ ఉత్సాహం ఇప్పుడు కనపడడం లేదు.
