Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 17


    "ఎలా తెలుసుకొంటారు?"    
    "మీరే చూద్దురు గాని!"

                                     10

    "నాకు సీమపై ద్వేషం లేదు. ప్రేమ లేదు నే నామె నొక ప్రయోగం గురించి ఎన్నుకున్నాను. నా ప్రయోగం విజయవంతమయింది.....నా రహస్యాలు కొన్ని సుకుమార్ కు తెలుసు. అతడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. వ్యాపారంలో అభివృద్ది సాధించడానికి ఎవరైనా తప్పుదార్లు తొక్కక తప్పదు. అవి సుకుమార్ కి తెలిశాయి. అతడు నా హార్డ్ వేర్ షాపును తన కమ్మమని బలవంత పెడుతున్నాడు. అతడిని అంతం చేయాలి. ఎలా?
    "బాగా ఆలోచించాను. చిన్నతనం నుంచీ హిప్నాటిజ మంటే నాకు ఆసక్తి ఒక స్నేహితుడివద్ద కొన్ని ట్రిక్స్ నేర్చుకొన్నాను. వాటిని ఆడపిల్లలమీద ప్రయోగించేవాణ్ణి. హిప్నాటిజం ప్రభావంతో వాళ్ళు నా ఇష్టానికి తలవంచేవాళ్ళు. వారిచేత బట్టలు విప్పించి నెమ్మదిగా వారిపై హిప్నాటిజాన్ని ఉపసంహరించేవాణ్ణి. అప్పుడు వారు తమ పరిస్థితేమిటో తెలియక సతమతమయ్యేవారు. నన్ను తప్పుపట్టలేక, తాము తప్పుచేయలేక విచిత్రమైన మానసికావస్థకు గురయ్యేవారు. కొందరు నాకు లొంగి పోయేవారు. కొందరు నాకు దూరంగా ఉండేవారు. వాళ్ళు నాకు భయపడేవారు తప్ప ద్వేషించేవారు కాదు.
    "సీమతో ఆ విధంగా పరిచయం పెంచుకొన్నాను. బీచివద్ధ ఆమెను దగ్గరగా తీసుకొనేవాణ్ణి ముద్దుపెట్టుకునే వాణ్ణి. శరీరం తడిమేవాణ్ణి కాసేపు హిప్నాటిజం, కాసేపు వాస్తవం. ఆమెకూడా విచిత్రావస్థకు గురయింది. నాతో పెళ్ళిని వ్యతిరేకించింది. నవనీత్ ని కథలోకి లాక్కొ'చ్చింది. నే నామెను హిప్నాటిజంతో లొంగదీసుకొని నిజం తెలుసుకొన్నాను. చివరికామె పెళ్ళికి అంగీకరించింది.    
    "నా పనిమనిషిని హిప్నాటిజానికి గురి చేసేవాణ్ణి సీమను రకరకాల బాధించేవాణ్ణి. నా యింటికి కొందరు స్నేహితులను రప్పించేవాణ్ణి వాళ్ళను హిప్నాటిజానికి గురిచేసి సీమపై అత్యాచారం జరుగడానికి ప్రోత్సహించే వాణ్ణి తమకేం జరుగుతున్నదీ స్నేహితులకు తెలియదు. సీమతో వారిని ప్రతిఘటించవద్దనీ నా వ్యాపారానికీ, ధన సంపాదనకూ ఆమె సహకరించాలనీ చెప్పేవాన్ని. ఆమెకది నచ్చేదికాదు. ప్రతిఘటించేది. అత్యాచారం కొనసాగేది కాదు.
    సీమ నా గురించి పుట్టింట్లో నేరాలు చెప్పేది. సీమను హిప్నటైజ్ చేసి ఆమెచేత అవన్నీ అబద్దాలని వారికి చెప్పించేవాణ్ణి ఫలితంగా సీమ నొక అబద్దాలకోరుగా ఇంటిల్లపాదీ భావించేవారు. తనమీద తన కెందుకు అదుపు లేదో సీమకు తెలిసేది కాదు. ఆమె కిష్టంలేని పనులు ఆమెచేత హిప్నాటైజ్ చేసి చేయించేవాణ్ణి. వాస్తవంలో అది గ్రహించిన సీమ నా హిప్నాటిజం గురించి తెలియక మానసికంగా తనలో ఏదో తేడా ఉందని భయపడేది.
    "ఆ తర్వాత నుంచి ఆమెను ఆహ్మహత్య చేసుకోమనీ లేకపోతే చంపుతాననీ బెదిరించసాగాను. నేను చెప్పినట్లు చేయకపోతే-వేరే దారికూడా ఆమెకు లేదని చెప్పాను. నా మాట ఆమె కాదనలేదనీ తప్పక ఆత్మహత్య చేసుకుంటుందనీ చెప్పసాగాను. అందుకో కొత్త పద్ధతి అవలంబించాను. రెండు గవ్వల నామెకు చూపించి అవి నా కళ్ళనీ-అవి చూస్తూండగా నేను చెప్పినవన్నీ చేయాలనీ ఆమెకు హిప్నాటిజంతో సూచించేవాణ్ణి. అప్పుడు నేనిల్లు వదిలిపెట్టినా కూడా సీమ ఆ గవ్వలనే చూస్తూ నేను చెప్పిన పనులన్నీ చేసేది.
    "సీమకింక తను ఆత్మహత్య చేసుకొంటానన్న భయం పెరిగి ఒక రోజున ఇల్లు వదిలి పారిపోయింది. రోజంతా ఆమెకోసం వెతికాను. రాత్రి పదకొండు గంటలు దాటాక ఆమె నాకు రోడ్లమీద తిరుగుతూ కనిపించింది. చూపులతో వశపర్చుకొని ఇంటికి తీసుకొనిపోయాను. గవ్వల నామె ముందుంచిఎన్ని గంటలకు ఆత్మహత్య చేసుకోవాలో చెప్పాను. ఈలోగా పొరుగూళ్ళో గుళ్ళో పూజ కూడా చేయించుకొని వచ్చాను.
    "సీమ నాత్మహత్యకు పురమాయించేక తిరిగి పొరుగూరు వెళ్ళాను. అక్కడివాళ్ళకు నేను కార్లో బయటకు వెళ్ళినట్లు చెప్పవద్దని కోరాను. డాక్టరు చెప్పిన ప్రకారం సీమ ఆత్మహత్య రాత్రి మూడు గంటల ప్రాంతాల జరిగింది. ఆ సమయంలో నేను పొరుగూర్లో పేకాడు తున్నాను కాబట్టీ-రాత్రి పన్నెండు నుంచీ నేను అక్కడే ఉన్నాను కాబట్టీ వాళ్ళెవరూ నన్ననుమానించి లేరు. పొరుగూర్నుంచి తిరిగిరాగానే ఆమె ఆత్మహత్యకు కారణం ప్రేమేనని అంతా అనుకొనేటందుకు బలమైన సాక్ష్య ముండాలని ముందుగా సిద్ధంచేసి ఉంచుకొన్న ఉత్తరాన్నామెవద్ధ భద్రపరిచాను.
    "సీమ ఆత్మహత్య నా ప్రయోగానికో పెద్ద విజయం. ఇక సుకుమార్ ను కూడా యిదే విధంగా తుదముట్టించ గలను"
    మోహనరావునీ మాటలు చెప్పడం ముగియగానే అతడి ఎదురుగా ఉన్న వ్యక్తి "చెప్పింది చాలు.....ఇక కాసేపు పడుకో!" అన్నాడు.
    మోహనరావు వెంటనే వాలి కళ్ళు మూసుకొన్నాడు.
    గోవర్ధన్ కిల్లర్ బయటినుంచి లోపలికి వచ్చారు.
    కిల్లర్ అక్కడి వ్యక్తితో కరచాలనం చేసి-"థాంక్యూ-డియర్ ప్రొఫెసర్! హిప్నాటిజంతో ఓ హంతకుడి బండారం బయట పెట్టించారు-...."అన్నాడు.
    ప్రొఫెసర్ నవ్వి - "మీకు సహకరించడం నా బాధ్యత అయితే రికార్డయిన ఈ విశేషాన్ని మీరు ఆధారంగా ఉపయోగించుకొనేందుకు లేదు...." అని యేదో చెప్పబోయాడు.
    కిల్లర్ అతణ్ణి మధ్యలోనే వారించి-"మోహనరావు నోటితో చెబితే తప్ప జరిగిందేమిటో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము. ఇలాంటిదేదో జరిగిందన్న అనుమానమున్నా - సరిగ్గా ఏం జరిగిందో ఊహించలేక వశీకరణకు వశీకరణమే మందని భావించి అసలు విషయం తెలుసుకుందుకు మీ సాయం తీసుకొన్నాను. ఇప్పుడు మోహనరావుకు జరిగింది తెలియనివ్వకుండా సుకుమార్ విషయంలో అడ్వాన్సు కానిచ్చి రెడ్ హేండిడ్ గా పట్టు కోవాలి. అది ఇన్ స్పెక్టర్ గోవర్ధన్ బాధ్యత...." అన్నాడు.
    గోవర్ధన్ కిల్లర్ ని కౌగలించుకొని - "ఇదంతా ఎలా సాధించారు మీరు? సింపుల్ ఆత్మహత్యను హత్యగా నిరూపించి హంతకుణ్ణి పట్టుకున్నారు....." అన్నాడు.
    "మోహనరావు అతి తెలివికిపోయి ఓ ప్రేమలేఖను ఆమె వద్ద ఉంచడం పెద్ద పొరపాటు. అటుపైన చావుకు ముందు సీమ నన్ను కలుసుకొని ప్రాణాలు రక్షించమని అర్ధించడం అతడి దురదృష్టం అప్పుడు నేనామె కళ్ళలో చూసిన జీవిత కాంక్ష సేప్పటికీ మర్చిపోలేను...." అన్నాడు కిల్లర్ నిట్టూర్చి.
    "కిల్లర్స్ ని పట్టుకొనే మీకు కిల్లర్ పేరు సరైనది కాదు...." అని గోవర్ధన్ యేదో అనబోయాడు.
    "అఫ్ కోర్స్.....అయామ్ కిల్లరాఫ్ లైస్...." అని నవ్వాడు కిల్లర్.


                              -:అయిపోయింది:-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS