ఈ విషయమే ఆలోచిస్తున్న రమణరావు కు హటాత్తుగా ఏదో స్పురించింది.
కోడి పులావు చేయాలంటే కోడిని చంపాలని తనకు తెలుసు. కాబట్టి కోడి చావుకు తను వ్యతిరేకుడు కాడు. తను కోడి పులావు అంటే బాగా ఇష్టపడతాడు. కాబట్టి కోడి హత్యను ప్రోత్సహిస్తున్నట్లు కూడా అవుతుంది. అటువంటప్పుడు తను హత్య చూడలేడు తప్పితే -- హత్యలను ప్రోత్సహించడనుకోవడం సబబు కాదు. ఇదే సూత్రాన్ని మనుషులకు వర్తింపజేస్తే?
కౌముది వంటి అందాల రాశి తన స్వంతం కావాలంటే రోశయ్య చావాలి.
రోశయ్య కోడి, కౌముది పులావు.
కోడిని తను చంపలేడు. ఎవరైనా చంపుతుంటే చూడలేడు. కానీ తనకు కోడి పులావు కావాలి, ఎలా?
రమణరావు వెంటనే పట్టయ్య గుర్తుకొచ్చాడు.
పట్టయ్య కోళ్ళను చంపడు. మనుషుల్నే చంపుతాడు. కనీ తినడానికి వాడికి కోళ్ళు కావాలి. మనుషులు పనికి రారు. అందుకని ఒకోసారి వాడు కోళ్ళ కోసం మనుషుల్నే చంపుతాడు. మనుషుల్ని చంపే పట్టయ్య కు పెద్దమనుషులు అండ వుంది. అందువల్ల వాడికి చట్టం గురించిన బాధ భయం లేవు.
పట్టయ్య గురించి రమణరావుకు తెలుసు. రమణరావు తండ్రి కూడా పెద్దమనిషి. ఆయనింటికి కూడా పట్టయ్య అప్పుడప్పుడు వచ్చి వెడుతుంటాడు. ఇంతకాలం రమణరావు కు పట్టయ్యంటే భయం. కానీఈరోజు వాడి అవసరం వచ్చినట్లు కనబడిందతనికి.
"నువ్వు భయపడే మనుషుల అవసరం నీకు వచ్చిందంటే సమాజంలో నీ అంతస్తు పెరుగుతునంట్లు లెక్క!" అంటూ వుంటాడు అతడి స్నేహితుడు పరుశురాం.
కౌముది వంటి స్త్రీని పొందగలిగితే సమాజంలో తన అంతస్తు పెరిగినట్లే లెక్క!
రమణరావు పట్టయ్య ఇంటికి వెళ్ళాడు. అతడి అదృష్టం కొద్ది పట్టయ్య ఇంట్లోనే వున్నాడు. అతన్ని చూసి గుర్తుపట్టి -- "మీ నాన్న రమ్మన్నాడా?" అన్నాడు.
"మా నాన్న కాదు . నాకే అవసరం వచ్చింది --" అన్నాడు రమణరావు.
పట్టయ్య రమణరావు ఎగాదిగా చూసి - "నువ్వూ పెద్దావాడివౌతున్నావన్నమాట!" అన్నాడు.
రమణరావు ఇబ్బందిగా ముఖం పెట్టి -- "నాకో పని తగిలింది. చేసి పెట్టగలవా?" అన్నాడు.
"ఏమిటో చెప్పు!"
"ఓ మనిషిని చంపాలి!"
పట్టయ్య అదోలా నవ్వి "ఆస్పత్రుల్లోంచి బిడ్డల్నేట్టుకోచ్చాను. పెద్దళ్ళలోంచి డబ్బు లేత్తుకొచ్చాను. ఇదీ అదీ అనీ కాక రకరకాల నేరాలు చేశాను. ఎంతో అనుభవం సంపాదించాను. దీన్ని బట్టి నేను తెలుసుకున్నదేమిటో నీకు తెలుసా -- అన్ని నేరాల్లోకి సులువైనది హత్య!" అన్నాడు.
"అయితే చేస్తావా?' అన్నాడు రమణరావు.
"ఎంతిస్తావు?" అనడిగాడు పట్టయ్య.
"ఎంత కావాలో చెప్పు!"
"నారేటు చాలా ఉంటుంది. ఫుట్ పాత్ మీద పాంటు గుడ్డ ధర లాగా! నువ్వు బెరమాడక పోవడంలో ఉంటుంది నా ధర ...." అన్నాడు పట్టయ్య.
"వివరాలన్నీ నీతో రేపు మాట్లాడతాను. నాకు పనిచేసి పెడతానని మాతిచ్చావు గదా అది చాలు" అన్నాడు రమణరావు.
"అడ్వాన్స్ ఏమైనా ఇస్తావా?' అన్నాడు పట్టయ్య.
"అది రేపే!"
"అయిదొందలేనా అడ్వాన్సు లేకుండా నేనెవరికీ మాటివ్వను. అద్వాన్సిచ్చే దాకా నేను నీకు మాటిచ్చినట్లు కాదు--" అన్నాడు పట్టయ్య.
రమణరావు తేలిగ్గా నిట్టూర్చి "అడ్వాన్సిచ్చాక మాటిస్తావుగా . నీ దగ్గర నేను మాట రేపు తీసుకుంటాన్లె" అని అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
ఇప్పుడతనికి ఒక ఉపాయం కనబడింది. రోశయ్య ను చంపడం తనకిప్పుడు సమస్య కాదు. చంపడం ఆవసరమా, కాదా అన్న నిర్ణయం తీసుకునేందుకే కాస్త వ్యవధి కావాలి.
సాయంత్రం అతను బీచికి వెళ్ళాడు. అక్కడ కౌముది అతడి కోసం ఎదురు చూస్తోంది.
"రారేమోననుకున్నాను...." అందామె.
"మీ కోరిక కష్టమైనదే-- కానీ మీ అందం నన్ను రప్పించింది--" అన్నాడు రమణరావు.
"నా అందం ఇంకా ఏం చేసిందో చెబితే విని సంతోషిస్తాను..." అంది కౌముది తాపీగా.
"మీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది --" అన్నాడు రమణరావు.
కౌముది నిట్టూర్చి -- "అందాన్ని చూసి పిచ్చేక్కితే -- మీరింక హత్యలెం చేయగలరూ?" అంది.
రమణరావు తడబడి -- "అబ్బే -- అది కాదు మాములుగా అయితే నేను హత్యలు చేయలేను. ఇప్పుడు రోశయ్య ను చంపాలనుకున్నా నంటే అందుకు మీ అందం ఎక్కించిన పిచ్చే కారణమనుకుంటున్నాను" అన్నాడు.
"చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు మీరు. బాగా తెలివైనవారు"అని ఆమె నిట్టూర్చి --" మనిషి తన తెలివితేటల్ని సాధారణంగా ఎదుటి మనిషిని మోసగించడానికే ఉపయోగిస్తాడు..."అంది.
"మీరన్నది ముమ్మాటీకి నిజం! నాకు సుపరిచితుడైన రోశయ్య ను చంపడానికి నా తెలివి తేటల్ను ఉపయోగించబోతున్నాను కదా!" అన్నాడు రమణరావు.
కౌముది అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ -- "అయితే మీరు రోశయ్యను చంపాలని నిర్ణయించుకున్నారన్న,మాట. చాలా థాంక్స్!" అంది.
"ఇప్పుడు మీరు నాకు మీ కధ మరి కాస్త వివరంగా చెప్పాలి--" అన్నాడు రమణరావు.
"నేను చెప్పాల్సిందేమీలేదు. మీరే చెప్పాలి.... రోశయ్య నేలా చంపబోతున్నారో...."
"వివరాలు పట్టయ్యనడిగి చెబుతాను..." అన్నాడు రమణరావు.
"పట్టయ్య-- వాడేవాడు?"
"కిరాయి హంతకుడు . రోశయ్య ను చంపడానికి వాణ్ణి నియోగించాను...." అన్నాడు రమణరావు.
కౌముది అసంతృప్తిగా "మధ్య ఈ పట్టయ్యేందుకు? రోశయ్య ను మీరు చంపలేరా?' అంది.
"పనిచేసేటప్పుడు మన చేతులకు మట్టి అవకూడదు. రోశయ్య ను చంపి నేను ఉరికంబం ఎక్కాలనుకోవడం లేదు. మీమెడలో తాళి కట్టాలనుకుంటున్నాను"అన్నాడు రమణరావు.
"ఉరికంబాన్ని నా మెడలో తాళిని కలిపి మాట్లాడ్డం నాకు నచ్చలేదు. అయినా రోశయ్యను చంపితే ఉరికంబం ఎక్కడ మెందుకు?' అంది కౌముది.
"రోశయ్యను చంపినందుకు మీరు నాకు పూల మాలలు వేయొచ్చు. కానీ ప్రభుత్వం అలా చేయదు కదా!"
"ఏడ్చినట్లుంది! మీరు రోశయ్య ను ఏ కోర్తుకో తీసుకెళ్ళి అక్కడి జడ్జి వచ్చేదాకా ఆగి అప్పుడు చంపాలను కొంటున్నారా?" అంది కౌముది.
రమణరావుకు ఒక నిముషం నోటమాట రాలేదు.
కౌముది చాలా తెలివైనది. మాటలు కూడా తెలివిగా ఆడుతోంది- ఆమె మనసులో ఉద్దేశ్యం ఆమె ద్వారానే తెలుసుకోవడం మంచిది. ఆ విషయం అతనామెకు చెప్పాడు.
కౌముది కోరుతున్నది వర పరీక్ష. ఆమెను వివాహం చేసుకోదల్చినప్పుడు రోశయ్య ను ఆమె కళ్ళెదుట స్వయంగా చంపాలి.
రమణరావు వణికిపోతూ "ఇదేం పరీక్ష! భర్తను హంతకుణ్ణి చేయాలనుకునే ఆడది ఉంటుందా?" అన్నాడు.
"నేనున్నాను. కానీ హత్య గురించి మీకు భయం లేదు. రోశయ్య చనిపోయేక ఆ శవాన్ని ఏం చేయాలో నాకు తెలుసు. అవన్నీ నేను చూసుకుంటాను. మీమీద హత్యానేరం మోపబడదు. కానీ హత్య మాత్రం మీరే చేయాలి?'
"నేనే ఎందుకు?' అన్నాడు రమణరావు .
"నన్ను వివాహం చేసుకోవాలన్న కోరిక మీకు లేకపోతే రోశయ్యను చంపాల్సిన అవసరం మీకు లేదు"
'అయితే మనం రేపు మళ్ళీ కలుసుకుందాం --" అన్నాడు రమణరావు .
"రేపు మనం కలుసుకునేది కార్యక్రమాన్ని నిర్ణయించడానికి. కాని పక్షంలో అదే మన ఆఖరి కలయిక అవుతుంది--" అంది కౌముది.
4
పట్టయ్య ద్వారా తన పని సులభమవుతుందని భావించిన రమణరావు కు ఆశాభంగమే అయింది.
తనిప్పుడెంచేయాలి? కౌముది కోరిక ప్రకారం రోశయ్యను హత్య చేయాలా?'
ఆ ఆలోచనకే అతడి ఓడలు జలదరించింది.
చాలాసేపు ఆలోచించేక అతడి ఊహలు కొత్త దారికి మళ్ళాయి.
రోశయ్య ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు. తనను అభిమానంగా చూస్తాడు. తను అతడి అభిమాని.
అలాంటి రోశయ్యను అసలు చంపడం ఎందుకు?
విషయమంతా వివరంగా రోశయ్య కే చెబితే ఆయనే ఎదో ఉపాయం చెబుతాడు.
తనకు అనుభవం తక్కువ. అసలీ కౌముది ఎవరో - రోశయ్య పై ఆమె ఎందుకు పగబట్టిందో -- తన పగ తీరాక ఆమె తన్ను ఆదరిస్తుందో, ఆదరించదో .....ఇవన్నీ ఎలా తెలుస్తాయి?
రమణరావు రోశయ్య ను కలుసుకుని తనకు జరిగిన అనుభవం చెప్పాడు.
రోశయ్య అంతా విని అనుమానంగా రమణరావు వంక చూసి -- "ఆ అమ్మాయి నిన్ను కలుసుకుని ఎంతకాలమైంది?" అన్నాడు.
రమణరావు చెప్పాడు.
