Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 17

 

    అప్పుడు గుర్తించాను. వెంకన్న ఎందుకోచ్చాడో తెలియకుండా అతడితో నేను మాట్లాదనంటే యిక్కడున్న వారందరికీ నా మీద అనుమానం వస్తుంది. అసలు వెంకన్నకే లేనిపోని అనుమానాలు రావచ్చు.
    ఏది ఏమైనా వెంకన్న తో ఏకాంతంగా మాట్లాడడమే మంచిది. మా సంభాషణ నలుగురూ వినే చోట జరగడం శేయస్కారం కాదు. ఇలా గనుకుని 'సరే! అయితే ఆయన్ను పైకి రమ్మనమను" అన్నాను.
    బాయ్ వెళ్ళిపోగానే తలుపు గడియ పెట్టాను. కిటికీ తలుపులు వేశాను. కర్టెన్లు లాగాను.
    నా దగ్గరిప్పుడు రెండు లక్షల రూపాయలున్నాయి. అవి వెంకన్న కళ్ళ బడకుండా చేయాలి. నాకింకే ఉపాయమూ తోచలేదు. బెల్టు గట్టిగా బిగించి బనియన్ లోంచి లోపలకు నోట్ల కట్టలు జారవిడిచాను.
    అన్నీ వందరూపాయల కట్టలు. మొత్తం యిరవై . వంటికి గుచ్చుకుంటున్నాయి. వాటి వల్ల పొట్ట కాస్త ఎత్తయింది. కానీ పెద్దగా తెలియడం లేదు. ఇలా అనుమానించడం కష్టం. అనుమానిస్తే నా కర్మ!
    వెంకన్న పేరు చెబితే నా వళ్ళు జలదరిస్తోంది. ఆరేళ్ళు జైలు శిక్ష పడవలసింది నాకు. అయన నేరాన్ని కప్పి పుచ్చాడు. మరోసారి అలాంటి పని చేస్తే తనే స్వయంగా పోలీస్ స్టేషన్లో అప్పజేపుతానన్నాడు.
    ఇప్పుడాయన అన్నంత పనీ చేస్తాడా?
    కాలింగ్ బెల్ మ్రోగింది.
    పెట్టుడు మీసాలు సవరించుకున్నాను. గరుకు గడ్డాన్ని రుద్దుకున్నాను. అంతా సరిగ్గానే వుంది. అద్దం ముందుకు వెళ్ళాను. అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలు.
    మేకప్ లో మంచి ప్రావీణ్యమే సంపాదించాను.
    అయినా వెంకన్న నన్ను గుర్తు పడతాడా?
    మళ్ళీ కాలింగ్ బెల్ మ్రోగింది.
    వెళ్ళి తలుపు తీశాను.
    ఎదురుగా డిటెక్టివ్ వెంకన్న!
    నాకేసి చూసి నవ్వుతున్నాడు. ఆ నవ్వు చూడగానే అయన నన్ను గుర్తు పట్టాడని అనుమానం వచ్చింది. అయినా మేకపోతు గంభీర్యం వహించాను.
    వెంకన్న లోపలకు అడుగు పెట్టాడు. తనే తలుపు వేశాడు.
    నేనేమీ మాట్లాడలేదు. అయన ఓ కుర్చీలో కూర్చున్నాడు. "నువ్వూ కూర్చో రమణ!' అన్నాడు.
    రమణ నా అసలు పేరు కాదు. హోటల్లో ఉండడానికి సృష్టించుకున్న మారుపేరు. అంటే వెంకన్న ను నేనెవరో తెలియదన్న మాట!
    తృప్తిగా నిట్టుర్చాను. కూర్చున్నాను.
    "నువ్వేమీ అనుకోకూడదు. నేనొక చోరీ వ్యవహారం పరిశోధిస్తూ యిక్కడకు వచ్చాను" అన్నాడు వెంకన్న.
    అయన తన చురుకు చూపులతో నా వంటిని గుచ్చుతున్నాడు. ఆ చూపులు బనియన్ కూ, నా శరీరానికి మధ్య నున్న నోట్లను గుచ్చుకున్నట్లు నాకు అనిపిస్తోంది.
    "నిన్న రాత్రి శ్యామలరావు యింట్లో చోరీ జరిగింది. దొంగ అత్యాశకు పోయి యినప్పెట్టే లో వున్న మొత్తం రెండు లక్షలూ కాజేశాడు. వెంటనే శ్యామలారావు ఫోన్ చేసి నన్ను పిలిచాడు. నేను రంగంలోకి దిగాను."
    "ఊ"
    "దొంగ యెవరో సులభంగానే తెలిసిపోయింది."
    "ఎలా?'కుతూహలంగా అడిగాను.
    "ప్రతి దొంగకూ ఓ పద్దతి వుంటుంది. అదే వాడిని పట్టించ్చింది" అని ఆగాడు వెంకన్న.
    నేనాలోచిస్తున్నాను. ఏమిటా పద్దతి! నేను చేసిన ఒకే ఒక్క దొంగతనం వెంకన్నకు తెలుసు. అందులోనూ ఇందులోనూ అయన గమనించిన పోలిక ఏమిటి? గట్టిగా ఆలోచిస్తున్నాను.
    "దొంగ పేరు సుబ్రహ్మణ్యం !" అన్నాడు వెంకన్న.
    ఉలిక్కిపడ్డాను. అది నా అసలు పేరు. అంత సులభంగా వెంకన్న యెలా తెలుసుకున్నాడు?
    "సుబ్రహ్మణ్యం దొంగతనం చేశాక ఇంటివారిని మంచానికి తాళ్ళతో కట్టి పోతాడు. అది అతడి ప్రత్యేకత. అదొక ప్రత్యేకమయిన ముడి. ఒక అరగంట శ్రమపడితే అ బంధాలను విదిపించవచ్చు...."    
    బాప్ రే... ఎంత పొరపాటు చేశాను? వెంకన్న ఇంత దూరం ఆలోచించగలడని నేననుకోలేదు. అయన వెంటనే నా వెంట పడకుండా ఉండటానికి -- ఇంటిలో ఎక్కువసేపు బందీగా వుండకుండా ఉండటానికీ అలా చేశాను. అదే నా కొంప ముంచింది.
    వెంకన్న జేబులోంచి రెండు చాక్లెట్స్ తీశాడు. ఒకటి నాకిచ్చి ఒకటి తను తిన్నాడు. నేను చాక్లెట్ నోట్లో వేసుకున్నాను. తియ్యగా ఎంతో బాగుంది.
    "దొంగ సుబ్రహ్మణ్యం అని తెలియగానే అతడింటికి వెళ్లాను. ఇంట్లో అడిగితె రెండ్రోజులుగా ఊళ్ళో లేడు అన్నారు. అర్జంటు పని వుంటే ఫలానా హోటల్ మేనేజరు కు సమాచారం అందజేయమన్నారన్నారు. అంతే -- అతడెక్కడున్నాడో నాకు తెలిసిపోయింది..." అన్నాడు వెంకన్న.
    ఆర్నీ -- ఈ డిటెక్టివ్ లెంత అసాధ్యులు? నేనింట్లో ఈ హోటల్ గురించి చెప్పకుండా ఉండాల్సింది. చెప్పినా రహస్యంగా ఉంచమనాల్సింది. రహస్యంగా వుంచమంటే అమ్మకో పెద్ద అనుమానం వస్తుంది. అది ఊరు ఊరంతా చర్చించేలా పాకిపోయినా ఆశ్చర్యం లేదు. ఇంక మీదట ఆ పనిచేయకూడదు. అయినా రెండ్రోజులు ఇంట్లో లేకపోతె అర్జంటు సమాచారా లేముంటాయి? అంతా నా తెలివి తక్కువ....
    "హోటల్లో ఎంక్వయిరీ ని బట్టి సుబ్రహ్మణ్యం యిల్లు వదిలిన రోజునే ఇందులో ప్రవేశించిన వారు ఇద్దరే నని తేలింది. అందులో ఒకామే స్త్రీ. రెండవది నువ్వు...." ఆగాడు వెంకన్న.
    'అయితే?' అన్నాను. నా గొంతు తడారిపోయింది.
    'అయితే ఏముంది--రెండు రెళ్ళు నాలుగు...."
    నాకు స్పృహ తప్పుతుందా అనిపించింది.
    "వేషం బాగానే వేశావు కానీ వెంకన్న ముందు వేషాలేయ్యడం నువ్వు చేసిన పెద్ద తప్పు!" అన్నాడు వెంకన్న.
    "మీరు చెప్పేది నా కర్ధం కావడం లేదు" అన్నాను.
    "మిస్టర్ సుబ్రహ్మణ్యం -- నా హెచ్చరికను నువ్వు పాటించలేదు. ఈ పర్యాయం నేను నిన్ను వదల దలచుకోలేదు. చేసినదానికి తగిన శాస్తి అనుభవించు....'
    "నన్ను మీరే రక్షించాలి..... తమ్ముడి చదువుకు అర్జంటుగా అయిదొందలు కావలసోచ్చాయి. వేరేదారి కనబడలేదు...."
    వెంకన్న ను దబాయించి ప్రయోజనం లేదని నాకు తెలుసు.
    "వేరే దారి కనబడక కాదు...నువ్వు వెతుక్కోలేదు....అంతే!"
    అదీ నిజమేనేమో .....కానీ ఇప్పుడు నేనేం చేయాలి?
    "నువ్వు తిన్నగా శ్యామలరావు గారింటికి వెళ్ళు. జరిగినదానికి క్షమార్పణ లు చెప్పుకుని అయన డబ్బు ఆయనకిచ్చేసేయ్. అయన క్షమిస్తే ఇది చివరి దొంగతనం. క్షమించకపోతే పోలీసులు ఎలాగూ నీకిది చివరి దొంగతనం చేస్తారు...."
    "నేను వెళ్ళను...."
    "వెళ్ళి తీరాలి. నీకూడా నేను రాకపోయినా కూడా వెడతావు నువ్వు" అని నవ్వాడు వెంకన్న -- 'ఇప్పుడు నువ్వు తిన్న చాక్లెట్ వుంది చూశావూ -- అది విషం! సరిగా రెండు గంటల లోపున దానికి విరుగుడు పడాలి. లేకపోతె చచ్చిపోతావు. ఆ విరుగుడు శ్యామలరావు దగ్గర వుంది....' అన్నాడు వెంకన్న.
    నాకు నవనాడులూ స్తంభించి పోయాయి. నేను విషం మింగానా? ఈ వెంకన్న.....అసాధ్యుడు! అయన వంక కోపంగా చూశాను.
    "నీ ప్రాణాలు రక్షించుకుందుకు నీకింకా తొంభైయ్యారు నిమిషాలు మాత్రమే టయముంది" అన్నాడు వెంకన్న.
    చటుక్కున లేచాను. వీధిలోకి పరుగెత్తాను.
    హోటల్ గేటు ముందు కోయవాడు -- "బాబూ! జాతకం తిరుగుతుందా?" అన్నాడు. వాడి వంక గ్రుడ్లురిమి చూశాను.
    శ్యామలరావు విరుగుడు ఇవ్వకపోతే .....నా జీవితకాలం నిముషాల్లోకి వచ్చేసింది.
    నేను శ్యామలారావు ఇల్లు చేరేసరికి అయన దగ్గిర యిద్దరు మనుషులున్నారు. నన్ను చూస్తూనే అయన -- 'అడుగో -- మావాడోచ్చాడు . డబ్బు తీసుకుని వెడుదురు గాని--" అన్నాడు.
    నేను మాట్లాడకుండా మొత్తం రెండు లక్షలూ వాళ్ళకి ఇచ్చేశాను. వాళ్ళు వెళ్ళిపోయారు. శ్యామలరావు నావంక అభిమానంగా చూసి -- "నీ ఉపకారం మరిచిపోలేను. ఏం కావాలో కోరుకో --"అన్నాడు.
    అయన వెటకార మాడుతున్నాడని అర్ధమయింది.
    "ముందు విషానికి విరుగుడు కావాలి" అన్నాను.
    'అందుకింకా కాస్త టయముంది!"అన్నాడాయన.... "ముందు నీకేం కావాలో కోరుకో!"
    అది వేళాకోళమే కావచ్చు. నేను కోరుకోవడం లో నష్టమేముంది? "నా కుద్యోగం లేదు. అది ఇప్పించండి. అర్జంటుగా వెయ్యి రూపాయలు కావాలి. అవి ఇప్పించండి. ప్రస్తుతానికి నా కోరిక -- " అన్నాను.
    'అలాగే -- కానీ ఇప్పుడు నువ్విచ్చిన రెండు లక్షలు నేను నీకు బాకీ వున్నాను. అది నువ్వు సంపాదించుకున్న డబ్బు. ఒక్కసారిగా నీ బాకీ తీర్చలేను. రేపు వచ్చి నువ్వు కోరిన వెయ్యీ , నా బాకీ మొదటి వాయిదా పాతికవేలూ పట్టుకు పో -- ఉద్యోగం సంగతి -- ఒకటి రెండు నెలల్లో చూద్దాం--" అన్నాడు శ్యామలరావు.
    అది కలో, నిజమో తెలియలేదు నాకు.
    "మీరు నాతొ వేళాకోళమాడుతున్నారు" అన్నాను.
    "వేళాకోళం నీతో ఎందుకాడతాను! నువ్వు నాకు సమవుజ్జీవి కాదు...."
    "మరి మీ మాటల అర్ధం ఏమిటి?"
    "నువ్వు నాకు ఉపకారం చేశావు. అందుకిది ప్రత్యుపకారం అంతే!" అన్నాడు శ్యామలరావు.
    "నేనుమీకు ఉపకారం చేశానా, ఎప్పుడు?" అన్నాను.
    "నువ్వు వెళ్ళిన అరగంటకు నేను నీ కట్ల నుంచి బయటపడి -- డిటెక్టివ్ వెంకన్న కు ఫోన్ చేసి రప్పించి నిన్ను పట్టుకోమని చెప్పాను. అయన ఇక్కడి పరిస్థితి చూసి మర్నాటి కల్లా దొంగ దొరుకుతాడని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకో గంటకి ఇన్ కంటాక్స్ వాళ్ళు నా యింటి మీద దాడి చేశారు. నా శత్రువు లెవరో రహస్య సమాచారం సేకరించి డిపార్టుమెంటుకు తెలియజేశారు. నువ్వు వచ్చి వుండకపోతే నాపని అయ్యేది. మచ్చలేని జేవితం గడుపుతున్న ఈ శ్యామలరావు ఏదో అదృశ్య శక్తి కాపాడుతోంది. ఆ అదృశ్య శక్తి నిన్ను పంపించిందనిపించింది. అందుకే నిన్ను సన్మానించా లనుకున్నాను....." అని ఆగాడు శ్యామలరావు.
    నేను నిశ్చేష్టుడనై నిలబడ్డాను.
    అయన నాకు ఓ చాక్లెట్ యిచ్చి --"ఇది విరుగుడు !" అన్నాడు.
    చటుక్కున అది మింగాను.
    మర్నాడు శ్యామలరావు నాకు నిజంగానే ఇరవయ్యారు వేలు ఇచ్చాడు. కోయవాడికి పాతిక రూపాయలివ్వడం కోసమని నేను హోటల్ వైపుగా పరుగెత్తాను.

                                      ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS