Previous Page Next Page 
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 17


                      మూడు అపూర్వ వస్తువులు
                                                                 జొన్నలగడ్డ రామలక్ష్మీ

    సూర్యారావు ఆలోచన లొకపట్టాన తేలలేదు. అతనికి అర్జంటుగా అయిదువేలు కావాలి. లేకపోతే వున్న ఊళ్ళో స్వంతిల్లు అమ్మేయాల్సి వుంటుందని తండ్రిరాశాడు. ఆయన వుత్తరం చదివేక ఎలాగో తల తాకట్టు పెట్టయినా అయిదువేలు సంపాదించాలని అతనికి తోచింది.
    అయితే సూర్యారావు తల విలువ అయిదువేలు చేస్తుందని అంగీకరించే స్నేహితులు చాలా తక్కువ మంది వున్నారు. అల అంగీకరించగలిగిన వారిలో అయిదు వేలివ్వగలిగిన వారొక్కరు కూడాలేరు. ఏది ఏమైనా సూర్యారావు ఊరిమీద పడి నాలుగిళ్ళూ తిరగాల్సి వుంది.
    అతను అప్పుడే వచ్చిన పేపరు తీసుకుని తిరగేయసాగాడు.
    పేపరు చదువుతూండగా సూర్యారావు నొక ప్రకటన ఆకర్షించింది.
    "పట్టుకుంటే పదివేలు బహుమానం!
    ఈ పైన ఫోటోలోవున్న వ్యక్తికోసం పోలీసులు వెదుకుతున్నారు. ఇతను అనేక రకాల నేరాల్లో భాగస్వామి. ఇతనివద్ధ మూడు విచిత్రవస్తువులున్నాయి. ఒకటి బాల్ పెన్. ఈ పెన్ మీద ఒక అమ్మాయి బొమ్మ వుంటుంది. తన క్రింద తిప్పితే ఆ బొమ్మ బట్టలు విప్పుకుంటుంది. ఆ పెన్ తో అతడు గాజుపలకలు కోస్తాడు.
    రెండవది ఆటోమేటిక్ కెమేరా. అది ఫోటోలు తీసుకొనేందుకనువైనదే అయినా దూరాన్నుంచి మనుషులను షూట్ చేయడానికి కూడా అవకాశమున్నదని పోలీసులు విశ్వసిస్తున్నారు.
    మూడవది పాకెట్ రేడియో దాన్ని తను ట్రాన్స్మిటర్ గా వాడుతున్నాడని అనుమానముంది. నిత్యం మారువేషాల్లో తిరిగే ఈ వ్యక్తి పై పోలికల్లో ఉండే అవకాశమున్నదని భావించబడుతోంది. ప్రమాదకరమైన ఈ వక్తిని పట్టివ్వ గలిగినవారికి పదివేల రూపాయలు క్యాషు బహుమతి ఇవ్వబడుతుంది...."
    సూర్యారావుకు చాలా ఉత్సాహం వచ్చింది.
    గబగబా వెళ్ళి స్నానం చేసేశాడు. తర్వాత స్నానాల గదిలోంచి బయటకు వచ్చి వేగంగా బట్టలు మార్చుకుని ఇంటికి తలుపు తాళం వేసి-వీధిలోపడ్డాడు.
    సూర్యారావు ఉత్సాహానికి క్కారణం లేకపోలేదు. ప్రకటనలో వున్న మూడు విచిత్ర వస్తువులనూ రెండు రోజుల క్రితమే అతను చూశాడు. పేపర్లో ఫోటోలో వున్న వ్యక్తిని కూడా అతను నాలుగురోజుల క్రితం ఒక హోటల్లో చూశాడు. ఆ వ్యక్తి ఆ హోటల్లోనే ఉంటున్నాడు పన్నెండో నంబరు గదిలో. అంత ఖచ్చితంగా ఆ వివరాలు గుర్తుండడాని క్కారణముంది.
    ఆ వ్యక్తి పక్కన చాలా అందమైన ఆడపిల్లవుంది. ఆ పిల్లవైపు ఒకసారి చూస్తే-దృష్టి మరలించుకోవడం చాలాకష్టం. తనూ ఆ పిల్లవైపే చూస్తూండిపోయాడు. అతనూ ఆమే చాలా ఉత్సాహంగా, చనువుగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
    అతను కాసేపలా కబుర్లు చెప్పి లేచి నిలబడ్డాడు. ఆమెకూడా లేచింది. ఇద్దరూ హోటల్ మెట్లువైపున నడిచారు. అప్పుడే వాళ్ళు తన పక్కగా వెళ్ళారు. వెళ్ళేముందతను సర్వర్ని పిలిచి-"ఎవరైనా నా కోసం వస్తే నా గదికి పంపించు. ఆ సీట్లోకే వస్తాను. నా రూం నంబరు తెలుసుగా-పన్నెండు...." అన్నాడు.
    అతని వాలకంబట్టి ఏ స్మగ్లరేనా కాడుగదా అని కాసేపు అనుకున్నాడు తను. అతని రూపం కూడా ఆ పిల్ల రూపంతో పాటు తన బుర్రలోవుండిపోయాయి. పేపర్లో ఫోటో చూడగానే తనకు గుర్తువచ్చేసింది.
    ఈ వ్యక్తి బహుశా ఓ వారంరోజుల క్రితం ఈ ఊరువచ్చి వుంటాడు. ఆ హోటల్లో మకాంచేసి ఉంటాడు. అనంతరం తనదగ్గరున్న విచిత్రవస్తువుల్ని ఒకొక్కటే ఎవరికో ఒకరికి అమ్మేసివుంటాడు.
    రెండ్రోజుల క్రితం రామారావు దగ్గర తనా బాల్ పెన్ చూశాడు-"ఆడపిల్లని నగ్నంగా చూస్తావుటోయ్....." అన్నాడు రామారావు తనలో తనకర్ధంకాక నవ్వితే బాల్ పెన్ చూపించి ప్రదర్శించాడు.
    "బాగుంది-" అన్నాడు తను.
    "ఎక్కడదని అడగవేం?"
    "చెప్పు....." అన్నాడు తను.
    "సారీ-చెప్పకూడదు...." అన్నాడు రామారావు.
    "బాగుంది-" అన్నాడు తను.
    "పెన్నూ బాగుందన్నావ్ అదెక్కడి నుంచి వచ్చిందో చెప్పనంటూంటేనే బాగుందంటున్నావ్"-అని "నిజంగా చెప్పకూడదులే-ఇది గ్లాస్ కటింగ్ ఇన్ స్ట్టుమెంట్ కూడా" అన్నాడు రామారావు.
    తను ఆశ్చర్యపడ్డాడు. కుహూహలం పెరిగింది-"నేను కొంటానొకటి. ఎంతో, ఎక్కడ దొరుకుతుందో చెప్పకూడదూ...." అన్నాడు.    
    "చెప్పేవిషయమైతే ఎప్పుడో చెబుదును...." అన్నాడు రామారావు.
    ఆ రోజే సాయంత్రం తను రంగనాధం ఇంటికి వెళ్ళాడు. భోజనానికి పిల్చాడతను.
    రంగనాధం వివాహితుడు. కానీ బాధ్యతల్లేవు. అతని జీతం డబ్బుల్లో హాయిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. అతని భార్యకూడా చాలా అందంగా వుంటుంది.
    "ఈవేళ ఈయన మిమ్మల్ని భోజనానికెందుకు పిలిచారో తెలుసా"-అంది రంగనాధం భార్య కాంతిమతి.
    "నువ్వు చెప్పినా అతనెలాగూ నమ్మడు, నువ్వు చెప్పక పోయినా నేనెలాగూ కెమెరా చూపిస్తాను"-అన్నాడు రంగనాధం.
    "కెమేరా ఏమిటి-కొన్నావా?"
    "లేదు కానీ కొన్ని రోజులు మనింట్లో వుంటుంది."
    తను కెమేరాని పరీక్షగా చూశాడు. వ్యూ చూస్తూంటే కొత్తగావుంది లోపలేవో బోర్డర్లూ-అంకెలూ వున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS