Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 17


                               దొంగ దొర అవుతాడా?

    నాకు బాగా తెలుసు. ఆ ఇంట్లో పదివేలకు తక్కువ రొక్కముండదు. యాభైవేలయినా విలువచేసే నగలుంటాయి. వెండి కంచాలుంటాయి. ఒకరాత్రి సరయిన పట్టుపట్టితే కనీసం ఓ పాతికవేలు చిక్కుతుంది.
    దొంగతనం నా వృత్తి. అందులో నేను ఆరితేరిన వాణ్ణనే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికో పాతిక దొంగతనాలవరకూ చేసుంటాను. ఇంకా పట్టుబడలేదు.
    నాకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది. గవర్నమెంటు ఆఫీసుల్లో-ఆఫీసర్లకి నెలకు జీతాలు రెండువేలకు లోపేనట. కానీ వాళ్ళందరూ దర్జాగా వుంటారు. వాళ్ళ పెళ్ళాలు అపర లక్ష్మీదేవిల్లాగుంటారు.
    నాకూ పెళ్ళయింది. నాభార్య నాకళ్లకు అందంగా వుంటుంది. నాజూకుగా వుంటుంది. కానీ దాని ముఖంలో లక్ష్మీకళలేదు. చూడగానే అతి సామాన్యంగా అనిపిస్తోంది. సినిమాల్లో స్నేహితురాళ్ళకీ మధ్య వున్న హీరోయిన్ పేదదయినా సరే-అతి సులభంగా గుర్తుపట్టేయవచ్చు. గొప్పింటివాళ్ళుకూడా  అలాగే!
    కానీ నేను, నాభార్య, పిల్లలు-అందరూ చాలా సామాన్యంగా వుంటాం. అయితే నా సంపాదన ఆ ఆఫీసర్ల కంటే బాగా ఎక్కువే. ఏటి మొత్తంమీద నేను సంపాదించింది చూసుకుంటే-నెలకు అయిదారు వేలకుతక్కువ వుండదు. మరి ఈ డబ్బంతా ఏమైపోతోంది?
    నా భార్యకు నేనేం చేస్తానో తెలుసు. దానికి నేను దొంగతనాలు చేయడం ఇష్టంలేదు. అందుకే పిల్లలకు- మీనాన్న పెద్ద ఆఫీసరని చెబుతుంది.
    చిన్నప్పుడయితే నమ్మేవారు కానీ ఇప్పుడువాళ్ళు ఎదుగుతున్నారు. నమ్మడం లేదు. వాళ్ళు చదువుకునే స్కూల్లో ఆఫీసర్ల పిల్లల్లా వుండమని వాళ్ళకెప్పుడో తెలిసిపోయింది.
    నాకు ముగ్గురు పిల్లలు. మధ్యది ఆడపిల్ల. దానికి పన్నెండేళ్ళు. పెద్దవాడికి పదిహేను. ఆఖరివాడికి పది. వాడి తర్వాత నాభార్య ఆపరేషన్ చేయించుకుంది. అప్పట్లో నేనంత పట్టించుకోలేదు కానీ అది మంచిపనే చేసిందని తర్వాత తర్వాత తెలిసింది.
    ఎంత సంపాదించినా ఎందుకు నిలవడంలేదో నాభార్య కర్ధమైనట్లుంది. నేను దొంగతనంచేసి ఎందరిళ్ళో దోచాను గదా-వాళ్ళందరి వుసురూ తగిలి నాడబ్బు నిలవడంలేదు అంటుందది.
    అది నేను నమ్మను. ఉసురు తగిలే మాటయితే-కోట్లాది ప్రజలను అనుక్షణమూ మోసం చేస్తూకూడా హాయిగా వుండగలుగుతున్న రాజకీయ నాయకుల మాటేమిటి?
    నాడబ్బు నిలబడక పోవడానికి నా వ్యసనాలు కారణమని నాకు తెలుసు. నా చరిత్ర మంచిది కాదు. ఆడవాళ్ళకోసం, తాగుడుకోసం, పేకాటకోసం-నేను డబ్బును మంచి నీళ్ళలా ఖర్చుచేస్తాను. అందుకే నేను దొంగతనం చేసి పదివేలు సంపాదించినా అది నా అప్పులు తీర్చడానికే గానీ అవసరాల కుపయోగించదు.
    ఎప్పుడూ అప్పుల్లో వుండడం వల్లనే నేను తఃరచుగా దొంగతనాలు చేస్తుంటాను.
    నాడబ్బు కష్టపడి సంపాదించింది కాదు కాబట్టి-అలా వృధా చేయగలుగుతున్నానని నా భార్య అంటుంది. దానికి బొత్తిగా ఏమీ తెలియదు. పుస్తకాల్లో రాసినవీ, నలుగురు అనేవీ తప్పితే స్వంతంగా ఒక్కముక్క మాట్లాడటం రాదు దానికి. కష్టపడి సంపాదించుకుంటూ-నాకులా డబ్బు తగలేసుకునేవారిని చాలామందిని నేనెరుగుదును. అది స్వభావాన్ని బట్టి వుంటుందంతే!
    ప్రస్తుతం నేను తీర్చవలసింది ఆరేడు వేల దాకా వుంటుంది. కానీ ఈ పర్యాయం నేను నాయింట్లో రకరకాల ఫర్నీచర్ కొని-నా ఇంటిని ఆఫీసర్ల యింటికిలా తీర్చి దిద్దుదామనుకుంటున్నాను. ఖరీదయిన బట్టలతో నా కుటుంబాన్ని ఆఫీసర్ల కుటుంబంలా కనబడేలా చేద్దామనుకుంటున్నాను.
    ఇలా చాలాసార్లు అనుకున్నాను గానీ-ఆచరణలో కుదరలేదు. అందుక్కారణం దొరికిన డబ్బుకూ అప్పుకూ సరిపోవడం.
    ఈ పర్యాయం కాస్తపెద్ద కొంపను పట్టాలనుకున్నాను. అప్పుడే ఈయింటి నెన్నుకున్నాను. ఈ యింట్లో నాకు పాతికవేల రూపాయల దాకా దొరుకుతాయి. దొరికీ దొరకగానే నా మనసు మారిపోకుండా వెంటనే నావాళ్ళకు అన్నీ అమర్చాలి.
    ఆ ఇంటాయన్నెప్పుడూ చూడలేదు. ఆవిడ్ని చాలా సార్లు చూశాను. చాలా అందంగా వుంటుంది.
    వాళ్ళ ఇంతివి పెద్దపెద్ద అరుగులు. అలా వెళ్ళే సిటీ బస్సొకటి ఆ ప్రాంతాలే ఆగుతుంది. అందుకని ఆ యింటి ముందు నిలబడినా, అరుగులమీదనో అరగంట కూర్చున్నా ఎవ్వరూ అనుమానించరు. నేను ఈ అవకాశాన్ని తీసుకొని తరచుగా అక్కడే తచ్చాడుతూండేవాడ్ని.
    ఒక పర్యాయం ఆవిడ ఒక సాధువుకు బియ్యం వెండి పళ్ళెంలో తీసుకువచ్చి వేసింది. ఆయన ఆవిణ్ణి ఆశీర్వదించి-"అమ్మా! నాబోటి వారిలో ఎందరో దొంగలుంటారు. ఇలా వెండిపళ్ళేలను భిక్షసమయంలో బయటకు తీసుకురావడం మంచిదికాదు" అంటూ సలహా ఇచ్చాడు.
    "నేనేం చేసేది స్వామీ-మా యింట్లో వెండిసామాను తప్పలేదు" అందామె. అలా అన్నప్పుడామె మాటల్లో గర్వమేకాని భయం కనబడలేదు.
    ఆమె మాటలు నన్ను మరింత పరవశున్ని చేశాయి. అప్రయత్నంగా ఆమె మెడవంక చూశాను. లక్ష్మీదేవిలా వున్నదామె. ఆమె మెడ విలువ పాతిక ముఫ్ఫయివేలకు తక్కువుండదు.
    లాభంలేదు-ఈ ఇంటినోపట్టు పట్టాలని నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ళుగానో అలోచించి ఆలోచించి ఈ రోజుకు ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురాగలిగాను.
    ఆ యింటికో దొడ్డిగుమ్మం అవతలి వీధిలోకివుంది. ప్రహరీ మరీ ఎత్తయినదికాదు. అవతల వీధిలో రాత్రి తొమ్మిది దాటితే బొత్తిగా జనసంచారముండదు.
    ఇంతగొప్ప వాళ్ళయుండి కారులేకపోవడం ఆశ్చర్యం నాకు. ఎందుకంటే వీధివైపు ముఖద్వారం తప్ప మరేమీ లేదు. అది ఎత్తరుగుల ఇల్లు. దొడ్డిగుమ్మం యిద్దరు మనుషులొకసారి పట్టేటంత మాత్రమే వుంటుంది. ఆ యింట్లోకి కారు వెళ్ళేదారిలేదు కాబట్టి వాళ్ళకు కారులేదనే నిశ్చయానికి వచ్చాను నేను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS