Previous Page Next Page 
విశాలి పేజి 17


    అనసూయమ్మ కొడుకుతో సహా ఇన్నాళ్ళూ మకాం వెయ్యడం ఆశ్చర్యంగానే ఉంది విశాలికి. కానీ, పైకి ఆ మాట అనగలదా?
    ఆ రోజు సాయంత్రం జడ వేసుకుందామని విశాలి దువ్వెన తీసుకుంటుండగా-"నేను వేస్తాను రా, అమ్మా!' అంటూ చేతిలో దువ్వెన లాక్కుంది అనసూయమ్మ.
    "అక్కర్లేదు! నేను వేసుకుంటాను" అంది విశాలి కదలకుండా అలాగే నిలుచుని.    
    చాప తీసుకు వచ్చి వేసి, బలవంతంగా విశాలి రెక్క పుచ్చుకు లాక్కొచ్చి కూలేసింది. అయిష్టంగానే కూర్చుంది విశాలి.
    "చక్కటి జుట్టమ్మా నీది. ఈ వయసులో నాకే కళ్ళు కుడుతున్నాయి నీ జుట్టు చూస్తుంటే!"
    ".... .... .... .... ...."
    "నీ మంచితనం, నీ రూపం చూస్తుంటే నీ లాంటి కోడల్నే తెచ్చుకోవాలనుంది."
    నవ్వుకుంది విశాలి. 'తెచ్చుకో! తెచ్చుకో మరి ఆ కోడలికి నీ లాంటి అత్త కావాలని ఉండద్దూ!'
    "ఇక్కడికి వచ్చాక నిన్ను చూసినప్పటినించీ మా వాడు తెగ పొగుడుతున్నాడు నిన్ను, నా దగ్గర చేరి."
    ముళ్ళమీద కూర్చున్నట్టుంది విశాలికి.
    ఆ మాట్లాడకపోవడం, అదంతా సిగ్గే కాబోలనుకుంటూందావిడ.
    "ఏమే, పిల్లా, మాట్లాడవు? సిగ్గంతా అప్పుడే ఒలికించకు. కాస్త దాచుకోమరి.....ఒప్పుకున్నట్టేనా! మా వాడితో చెప్పనా?" జడ అల్లడం పూర్తయి చెంపలు దువ్వుతూంది.
    చటుక్కున లేచింది విశాలి. "క్షమించండీ. నా కా ఉద్దేశం లేదు."
    గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయింది.
    "ఓ యబ్బో! ఏం చూసుకుని ఆ మిడిసిపాటు! పెళ్ళంటూ అయితే అదే పది వేలనుకోక ఎందు కా ధిక్కరింపు? ఏదో పోనీకదా అయినవాళ్ళ పిల్లని, పెళ్ళి కాక పడున్నావని దయ తలిస్తే మంచిపనే! మంచి శాస్తే చేశావు. చూస్తూ ఉండు. నీ కీ జన్మలో పెళ్ళి కాదులే. నీకు తగ్గ అన్నే దొరికాడు. ఇంత కట్నం పోసి నీ పెళ్ళి చేస్తాడనుకుంటున్నావా? ముమ్మాటికీ చెయ్యడు.....అవునులే, అసలీ పాటికి ఊరుమీద పడి ఎంతమందితో తిరిగావో! నువ్వు కోడలైతే నాక్కూడా అప్రతిష్ఠ. లేనిపోని సంత నా కెందుకు?..."
    అసనూయమ్మ సణుగుడు వినిపిస్తూనే ఉంది. అదేమీ పట్టించుకోకుండా వంటపనిలో మునిగిపోయింది విశాలి.
    "ఏమిటే, అమ్మా! ఎవరి మీదే దాడి చేస్తున్నావు?" లోపలికి అడుగు పెట్టాడు మారుతి.
    "ఎక్కడ పడి తిరుగుతున్నావురా ఇంతసేపు?"
    "బాగుందేవ్ నా మీదికి తిప్పావేమిటి చక్రం!" నవ్వబోయిన మారుతి పెదవులు తల్లి ముఖం చూసి ముడుచుకుపోయాయి.
    "చాలు, నాయనా! చాలు ఈ మర్యాద, నడు, పోదాం మన ఊరు." గబగబా బయటపడి ఉన్న తమ బట్టలు పెట్టెలో కుక్కి, తాళం వేసింది అనసూయమ్మ.
    "అసలేం జరిగిందే?"
    "ఇంకా ఏం జరగాలి! ఇది నా కవమానం కాదూ? నీకేం తక్కువైందనీ! అంత పొగరుగా, అంత ధైర్యంగా జవాబు చెపుతుందీ? చూస్తాను, చూస్తాను. దాన్నెవడు చేసుకుంటాడో నేనూ చూస్తాను."
    విశాలి తనని చేసుకోనన్నదని అర్ధమైంది మారుతికి కొంచెం సేపటికి. అవమానం, కోపం, బాధ పెనవేసుకు పోయాయి.
    "అసలు అడ్డమైనవాళ్ళనీ అడగమని నీ కెవరు చెప్పారు? నువ్వెందు కడిగావ్!" అంటూ తల్లి మీదేగిరాడు.
    మారుతి అన్న ఆ మాట విశాలికి కారం రాసినట్ల యింది. అయినా తను మాత్రం నోరు విప్పదలుచుకోలేదు. అందుకే మౌనంగా వాళ్ళన్న మాటలన్నీ భరిస్తూ ఉండిపోయింది.
    రామం ఇంట్లో అడుగు పెడుతూండగానే తడిలేని కళ్ళని ఒత్తుకుంటూ, "వస్తాం, నాయనా" అంది అనసూయమ్మ తెల్లబోయాడు రామం.
    "ఏమిటి మీ రున్న పళంగా బయలుదేరినట్టుంది మీ తీరు చూస్తుంటే?"
    రామం ప్రశ్నకి జవాబివ్వకుండా చూపులతో విశాలిని మింగేస్తూంది అనసూయమ్మ.
    "అసలేమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా మిమ్మల్ని?"
    "ఎందుకులే, నాయనా! చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇప్పటికైనా బుద్ది వచ్చింది నాకు. మా మర్యాద దక్కించుకుందామనే పోతున్నాము."
    విశాలి మీదకి దృష్టి సారించాడు రామం.
    దృష్టి మరల్చుకుంది విశాలి.    
    "వెళ్ళరా! వెళ్ళు. రిక్షా ఓటి పిలుచుకురా!" కొడుకుని కసిరిందావిడ.
    "నా తప్పేమైనా ఉంటే చెప్పండి. క్షమించండి. అంతేగానీ మీరిలా హఠాత్తుగా వెళ్ళిపోతే మా కందరికీ బాధగా ఉంటుంది." ఆవిడ చేతిలో పరుపుచుట్ట అందుకోబోయింది విశాలి.
    "వెళ్ళరా! రిక్షా పిలవమని చెప్పానా లేదా నీకు? ఇంకా ఇక్కడే నిలబడ్డావే?"
    రిక్షా కోసం వీధిలోకి పరుగెత్తాడు మారుతి.
    నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు రామం.
    వినిపించుకోలేదావిడ.
    లోపలికి వెళ్ళి మహాలక్ష్మితో చెప్పింది.
    "ఊఁ" అని ముభావంగా ఉండిపోయింది మహాలక్ష్మి.
    మహాలక్ష్మి బ్రతిమాలుతుందనుకున్న ఆశ నిరాశే అవగా నీరుకారిపోయింది అనసూయమ్మ.
    రిక్షా రావడం, వాళ్ళు వెళ్ళడం ఒకదానివెంట ఒకటి జరిగిపోయాయి.
    అంతే! వాళ్లటు వెళ్ళారో లేదో ఇంతెత్తున చెల్లెలి మీద లేచాడు రామం.
    "నే నేమీ అనలేదన్నయ్యా వాళ్ళని. అయినా ఎందుకంటాను? మంచీ చెడూ ఆ మాత్రం తెలియదా నాకు?"
    "ఆఁ బాగా తెలుసు! అందుకే ఇలా అయింది రభస. ఏమీ అనందే వాళ్ళు అలా ఉన్నపళంగా ఎందుకు వెళ్ళి పోతారు? మధ్యాహ్నం నేను భోజనం చెయ్యడానికి వచ్చినప్పుడుకూడా ఈ వేళ వెళుతున్నట్టు వాళ్ళు మాట మాత్రంగానైనా నాతో చెప్పలేదుగా? ముందే వాళ్ళు ఈ వేళ వెళదామని అనుకుని ఉంటే మధ్యాహ్నం నాతో చెప్పి ఉండేవారు. నువ్వేదో అనే ఉంటావు వాళ్ళది."
    మాటిమాటికీ అన్నయ్య 'నువ్వేదో అనే ఉంటావు' అని అనడంతో విశాలిలో సగం ఓపిక నశించింది.
    "ఎందు కన్నయ్యా నీకు నా మీ దంతనుమానం? నేను వాళ్ళనేమీ అనలేదు. కానీ ఆవిడ అడిగినదొకటి నా కిష్టం లేదని మాత్రం చెప్పాను. దానికే ఆవిడంత రభస చేసింది. నే నేదో ఆవిడని తిట్టినట్టు మాట్లాడింది నీ దగ్గర."
    "ఏమడిగిందావిడ?" రామం కళ్ళలో కుతూహలపు ఛాయలు.
    తల దించుకుంది విశాలి.    
    "నేను వాళ్ళబ్బాయిని పెళ్ళి చేసుకోవాలిట."
    "ఏం, వాడికేం తక్కువని? నువ్వెందుకుకాదన్నావ్!"
    "అన్నయ్యా!" పిచ్చిగా చూసింది విశాలి.
    "వేలకి వేలు కట్నాలు గుమ్మరించి నీ పెళ్ళి నేను చెయ్యగలననుకుంటున్నావా? కాళ్ళ దగ్గిరి కొచ్చిన, కట్నం తీసుకోని సంబంధం కాలదన్నుకోవట మెందుకు?  అందం కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటూ కూర్చుంటే అవదు. ఏదో గంతకి తగ్గ బొంత అని సరిపెట్టుకోవా లంతే!"
    "అందం కావాలి, ఇది కావాలి, అది కావాలని నే నెప్పుడూ అనను. నా కసలు పెళ్ళే కాకపోయినా ఫర్వాలేదు, నేను బాధ పడను. కానీ.... కానీ.....ఇటువంటి..." దుఃఖంతో గొంతు పూడుకు పోయి మరి మాట్లాడే లేకపోయింది విశాలి. రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని అక్కడినించి వెళ్ళిపోయింది.
    అర్ధంలేని కోపంతో ఊగిపోయాడు రామం. పిచ్చిగాపచార్లు సాగించాడు.
    
                                *    *    *

    "అక్కా" అంటూ తలుపు తోసుకుని లోపలికి వచ్చింది చిట్టి.  

                                        
    స్కూల్ నించి ఇంటికి వెళుతూన్నట్టుంది, చేతిలో పుస్తకాలున్నాయి.
    అప్పుడే జడ అల్లుకోవడం పూర్తిచేసిన విశాలి, దువ్వెనలో ఇరుక్కున్న జుట్టు తీసి పారెయ్యడానికి ఇవతలికి వస్తూ చూసింది చిట్టిని.
    ఈ మధ్య చిట్టి ఇటువైపు రావటం లేదు.
    చూసి చాలా రోజు లవడంవల్ల చిట్టిలో వచ్చిన మార్పులు ఇట్టే పసికట్టింది విశాలి.
    ఇదివరకటికంటే పొడుగెదిగింది. ఒళ్ళూ వచ్చింది.
    "స్కూలునించేనా రావడం?"
    "ఊఁ!" చేతిలో పుస్తకాలు కిటికీలో పెట్టి, చెంచాతో గ్లాసు నోదాన్ని అదేపనిగా బాదుతున్న రాజేంద్రని దగ్గిరికి తీసుకుంది చిట్టి.
    వచ్చినప్పుడల్లా రాజేంద్రతో ఆడుకోవడమే పని. అందుకే వాడికి చిట్టి దగ్గిర కొత్తేమీ లేదు.
    'ఈమధ్య రావడం మానేశావేం, చిట్టీ?"
    "ఊ రెళ్ళామక్కా! నిన్ననే వచ్చాం!"    
    "అదా సంగతి! ఏ ఊ రెళ్ళారు?"
    "మా చిన్న పిన్ని పెళ్లైంది. అందుకని వెళ్ళాం.
    పెళ్ళయిపోయాక తిన్నగా వచ్చెయ్యకుండా అమ్మేమో మా పెద్దమ్మా వాళ్ళ ఊరు, చిన్నమామయ్యా వాళ్ళ ఊరునన్నుకూడా తీసుకుంది వెళ్ళింది. అందుకని ఇన్నాళ్ళు ఆలస్యమైపోయింది. మా నాన్నగారేమో పెళ్ళయి పోగానే ఇక్కడికి వచ్చేశారు."
    "ఊహూఁ! ఉండు, మొహం కడుక్కొస్తాను." పెరట్లోకి వెళ్ళి చల్లటి నీళ్ళతో మొహం కడుక్కొని, "నువ్వుకూడా మొహం రుద్దుకుంటావా, చిట్టీ?" అంటూ కేకేసింది.
    "వద్దిప్పుడింటి కెళ్ళిపోతానుగా!"
    నవ్వొచ్చింది విశాలికి.
    "నువ్వింటి కెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతావన్నానా?" కప్పులో ఇన్ని అటుకులు వేసి, కాసిని పాలు పోసి, పంచదార వేసి చెంచాతో కలుపుతూ చిట్టి కందించింది.
    "మరి వీడికో!" రాజేంద్ర బుగ్గమీద ముద్దెట్టుకుంది చిట్టి.
    తన బుల్లి చేత్తో చెంపమీద తుడిచేసుకున్నాడు వాడు.
    "వాడది తినడు. వాడికో బిస్కట్టిస్తాను." అత్త చేతిలో బిస్కటు చూస్తూనే మీద పడి లాక్కున్నాడు వాడు. తినడం పూర్తిచేసి, పెరట్లోకి వెళ్ళి చేతులు కడుక్కుని వస్తుండగా రామం ఇంట్లో అడుగు పెట్టాడు. రామాన్ని చూస్తే అప్పటికి ఇప్పటికీ భయమే చిట్టికి. చిట్టిని చూస్తే అప్పటికీ, ఇప్పటికీ చిరాకే రామానికి ఏదో వింత మృగాన్ని చూసినట్టు చిట్టి రామాన్ని చూడటం, ఎవరో శత్రువుని చూసినట్టు రామం చిట్టిని చూడటం గమనించింది విశాలి.
    వెళతానని విశాలితో మెల్లిగా చెప్పి, భయం భయంగా రామం వంక చూస్తూ వెళ్ళిపోయింది చిట్టి.
    "ఈ పిల్లెందు కొచ్చింది మనింటికి?" విశాలి అందించే కాఫీగ్లాసందుకుంటూ, చిట్టి వెళ్ళినవైపే చూస్తూ తన చిరాకంతా చూపించాడు రామం.
    "ఊరికే! ఎప్పుడైనా వచ్చి కాసేపు కూర్చుని వెళుతూ ఉంటుంది."
    అయిష్టంగా తల తిప్పాడు రామం.
    నవ్వుతూ వచ్చి తండ్రి కాళ్ళు పట్టుకు లాగాడు రాజేంద్ర.    
    అదేమీ పట్టనట్టు గ్లాసుకింద పెట్టి లేచిపోయాడు రామం.
    "విశాలీ!"
    మహాలక్ష్మి పిలవడంతో అక్కడినుంచి కదిలింది విశాలి.
    "ఏం వదినా?" అంటూ మహాలక్ష్మి గదిలో అడుగుపెట్టిన విశాలి భయంతో, అనుమానంతో బిత్తర పోయి నిలబడింది.
    చేత్తో గుండెలమీద రాసుకుంటూ, బాధతో మెలికలు తిరిగిపోతూంది మహాలక్ష్మి.
    "వదినా! గుండెల్లో నెప్పి ఎక్కువగా వస్తోందా?"
    అవునన్నట్టుగా తల ఆడించింది మహాలక్ష్మి.
    పక్కన కూచుని మెల్లిగా తన చేత్తో రాస్తూ ఒక రెండు మూడు నిముషాలు చూసింది విశాలి. సద్దుకున్నట్టు కనిపించలేదు.
    అంతకంటే మహాలక్ష్మి బాధ ఎక్కువవుతూంది. కంగారుగా ఇవతలికి వచ్చింది విశాలి.
    బట్టలు మార్చుకుని, తల దువ్వుకుని ఎక్కడికో బయలుదేరుతున్నాడు రామం.
    "అన్నయ్యా! వదినకి గుండెల్లో నెప్పి ఎక్కువగా వస్తోందిట. డాక్టర్ని పిలుచుకొస్తావా?"
    వినిపించుకున్నట్టే లేడు రామం.
    చెప్పుల్లో కాళ్ళు దూర్చాడు.
    "అన్నయ్యా!"
    "తరవాత చూద్దాం. ఇప్పుడు నేను అర్జెంటుగా ఒక చోటికి వెళ్ళాలి." విజయ నవరంగ్ దగ్గిర తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆలస్యం చేసి విజయ నవస్థ పెట్టడమే?
    కంగారుగా ఏదో అనబోయింది విశాలి.    
    "అబ్బబ్బ! ఎందుకు విసిగిస్తావ్! నా కిప్పుడు పని ఉంది. తరవాత చూద్దాం. అయినా ఆ ప్రాణం ఇప్పుడప్పుడే పోయేది కాదులే. పోయేవాళ్ళు పోక బతికున్న వాళ్ళనికూడా చంపుకు తినడం ఎందుకూ?"
    తెల్లబోయింది విశాలి.
    అన్నయ్యేనా ఈ మాట లంటున్నది?
    స్పష్టంగా వింటున్నదీ, కళ్ళారా చూస్తున్నదీ కాదని ఎలా అనుకోగలదు?
    ఇంత నిర్దయగా ఎలా ప్రవర్తించగలుగుతున్నా డన్నదే అర్ధం కాదు.
    కట్టుకున్న భార్యని కాలానికి వదిలి, కోరికలతో కళ్ళు మూసుకుపోగా, మత్తుగా కదిలిపోయినమనిషి కన్నా పశువు నయం కాదా?
    వీధిలోకి వెళ్ళి ఎదురింటి వాళ్ళబ్బాయి సత్యాన్ని పిలిచింది విశాలి.
    "చూడు, సత్యం! డాక్టరు విశ్వనాథం గారిల్లు తెలుసుకదూ నీకు? పరుగెత్తుకెళ్ళి ఆయన్ని పిలుచుకొస్తావా? మా వదినకి గుండెల్లో నెప్పి ఎక్కువగా వస్తోంది."
    "ఆయన ఊళ్ళో లేరుగా! రెండు మూడు రోజుల్లో రావచ్చు."
    విశాలి గుండెల్లో రాయి పడింది.    
    ఆయన ఊళ్ళో లేరంటే ఇంకో డాక్టరు దగ్గిరికి వెళ్ళక తప్పదు. ఆయన తప్ప మిగిలిన డాక్టర్లందరూ తమ ఇంట్లో వాళ్ళకి కొత్తే. అదీకాక దగ్గర్లో ఇంకో డాక్టరెవరూ లేరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS