'అడుగు మాధవ్! నా దగ్గర మొహమాటం ఎందుకు?' అంది నళిని.
'నీవు నన్ను మనఃస్ఫూర్తిగా ప్రేమించావా నళినీ!' అన్నాడు. అతని కంఠం ఎందుకనో బిగుసుక పోయింది.
'మాధవ్! నీకా సందేహం ఎందుకని కలిగింది?' కాతరస్వరంతో అడిగింది నళిని.
'ప్రేమికుల మధ్య, రహస్యాలుండవ్ నళినీ! నీవు నన్నింత వంచించగలవని అనుకో లేదు. నేనెంత బుద్దిహీనున్ని నళినీ! నీవు, నా జీవన సర్వస్వానివి అనుకొన్నాను. అందుకనే కామేశ్వరి మీ ఆశ్రయంలో వుండి చదువుకొంటూందనే ఉదేశ్యంతో, కామేశ్వరిని మా అన్నయ్యకిద్దామనుకున్నారనే విషయం చెప్పాను. అప్పుడన్నా, కామేశ్వరి, నీకు 'పిన్ని' అవుతుందని చెప్పావ్ కాదు! ఎంత తప్పుగా మాట్లాడాను? మా అన్నయ్య ఆమెని ప్రేమించాడని నీతో చెప్పాను! అప్పుడన్నా చెప్పలేదు నీవు! ఎంత గుట్టు కల దానివి! కాలేజీలో వక్క సారన్నా నీవు ఆమెని 'పిన్ని' అని పిలిచే దానివి కాదు! మీ ఇద్దరి మధ్యా నున్న సంబంధాన్ని కాలేజీలో ఎవరికీ తెలీకుండా వ్యవహరించే దానివి! ఇప్పుడు మా అన్నయ్య ఎంతగా కుమిలి పోతున్నాడో నీకు ఎల్లా తెలుస్తుంది! వివాహితురాలయిన యువతిని పట్టుకుని ప్రేమించానంటూ అవమానించుతే ఎంత సాహస కృత్యం! తప్పుకాదూ నళినీ! నీకెందుకు ఆ కామేశ్వరి మీద, ఇంత ఘృణ పెరిగింది? అ అమాయకురాలు నీకే మపకారం చేసిందీ' ఆగాడు మాధవ.
'నేను చెప్పేది కాస్త వింటావా, మాధవ్!' అంది నళిని.
'ఏం వినాలి నళినీ? ఇంత ఘాతుకం చేసాక? ఎన్నెన్ని వాగాను నీతో! మా అన్నయ్యతో కామేశ్వరికి మాట్లాడటానికి అవకాశం కల్పించమన్నాను! నీవు వట్టి రాయివి నళినీ. పాలరాతి శిల్పానివి! నీలో స్పందన లేదు! ఈ మాటలు అన్ని మీ నాన్న దాకా వెళ్ళితే ఎంత అవమానకరంగా వుంటుంది. మాకు?' అన్నాడు.
'మా నాన్నదాకా ఎందుకు వెళతాయి మాధవ్! ఆ మాత్రం నాకు తెలీదా! ఇంక కాలేజీలో మానడుమ నున్నసంబంధం తెలియనియ్యలేదని అన్నావ్! ఎల్లా తెలియనియ్యాలి మాధవ్! మా వదినగానో అక్కగానో పరిచయం చెయ్యాల్సిన పరిస్థితిలో నున్న కామేశ్వరిని, మా సవతి తల్లిగా ఎల్లా పరిచయం చేస్తాను? నాకు ఎంత సిగ్గుగా వుంటుందో నీకేం తెలుసు? పవిత్రమైన మాతృ స్థానంలో నిలవాల్సిన అర్హత ఈ చిన్న అమ్మాయికి వుంటుందా! 'అమ్మా' అనే పిలుపు ఎంత మధురమయినది మాధవ్! మా నాన్న ఎంతో తప్పు చేసారు! ఈ వయసులో ఆయనకు పెళ్ళేమిటి! అంతగా పెళ్ళి చేసుకోవాలన్న వాంఛ ఆయనకు వుంటే, ఏ బాల్య వితంతువునో చేసుకోవాలి కాని, నాతో రమారమి వయసున్న పిల్లని, నా మాతృస్థానంలో నిలబెడతారా! ఎల్లా ఆమెని, సంబోధించేది! నాకు 'అమ్మ' అనే మూర్తి కన్నులకు కట్టుతూ వుంటుంది! పచ్చని శరీరం! అక్కడక్కడ నెరసిన తల వెంట్రుకలతో సిద్ధసిగ జుట్టుకున్న తలతో, నుదుట మెరసే నయాపైసంత కుంకుమతో నాకళ్ళెదుట, నా మాతృ మూర్తి ప్రత్యక్షమౌతూ వుంటుంది! బిగిసిన యవ్వనంతో, వయ్యారపు నడకలతో, కోరికల తృష్ణతో, తళతళ్ళాడే కళ్ళతో నిడుపాటి వాల్జడతో, నాతో సమానంగా కాలేజీలో జేరి చదువుకుంటానంటూ తయారయిన ఈ పిల్ల నాకు మాతృ మూర్తి అవుతుందా మాధవ్! నువ్వే చెప్పు!' నళిని ఆగింది.
'పోనీ! కాలేజీ విద్యార్దులందరి ఎదుటా మీ సంబంధాన్ని తెలియకపోతే ఫరవా ఏమీ లేదు! నా పద్ధతికూడా ఎందుకు దాచాలీ విషయాన్ని! నిజమైన జీవిత భాగస్వాముల మధ్య రహస్యం వుంటుందా నళినీ! దీనివల్ల నాకెంత అవమానంగా వుందో తెలుసా' అన్నాడు మాధవ్!
'నా నోటితో నేను నాకు అసహనం కలిగించే విషయాన్ని ఎల్లా చెప్పను మాధవ్! నాకు మా మధ్యనున్న సంబంధాన్ని నా నోటితో ఉచ్చరించటానికే అసహ్యం!' అంది నళిని.
'ఇక్కడ కూర్చున్నారా జంట పక్షులు!' అంటూ, రామనాధం వారిని సమీపించాడు. మాధవ్ ఏమీ అనలేదు. నలువైపులా సంజ చీకట్లు, అలముకొంటున్నాయి.
'నన్ను క్షమించండి రామనాధంగారూ! కామేశ్వరిని, మా నాన్న మొన్న వేసంగిలో పెళ్ళి చేసుకున్నారు! ఆ మాట తనతో చెప్పలేదని, మీ తమ్ముడు బాధపడుతున్నారు. నాకు ఇంత వయసులో మా నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకున్నారని నలుగురికీ తెలియటం సిగ్గు కలిగించుతుంది. అందుకని, నాకు నేను ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేదు!' అంది నళిని.
'దానిదేముంది నళినీ! ఎవరి అభిప్రాయాలు వారివి! దానిలో మనకు పోయిందేముంది?' న్నాడు నిర్లిప్తతగా.
'ఇంకో విషయం రామనాధంగారూ! మీరు కామేశ్వరిని ప్రేమించారని మాధవ్ చెప్పాడు, కామేశ్వరి చిన్నపిల్ల! ఆమె ఏ పరిస్థితిలో మా నాన్నని పెళ్ళి చేసుకుందుకు ఒప్పుకుందో నాకు తెలీదు! మీరు ప్రేమించుతున్నట్లు ఆమెకి తెలుసునో లేదో నాకు తెలీదు! మీరిద్దరూ కలుసుకుని మాట్లాడే అవకాశం వుంటే, ఆమె అభిప్రాయం ఎల్లా మారుతుందో మరి! మీరు ఆమెని స్వీకరించే పక్షంలో, ఆమె ఈ వివాహాన్ని రద్దు చేసుకోదలుచుకుందేమో ఎవరికి తెలుస్తుంది! మీ ఇద్దరి మధ్యా మాట్లాడుకునే అవకాశాలు విరివిగా లభింప చేద్దామనే ఉద్దేశ్యం కూడా నాకు వుండేది! ఆమె వివాహిత అని తెలిస్తే మీరు ప్రేమించరేమో అనే అనుమానం నాకు వుండేది. జీవితాంతం, తన్ని ఏ విధంగానూ రంజింప చేయలేని భర్తకి భార్యగా పడుండి, ఆమె యవ్వనాన్ని అడవి గాచిన వెన్నెల చేయమంటానికి మాకేం అధికారం వుంది? అది ఆమె వ్యక్తిగత సమస్య. ఆ సమస్యని ఆమె ఎలా పరిష్కరించుకుంటుందో, అని నాకు ఆలోచన కలిగేది! మాధవ్, మీరు ఆమెని ప్రేమించారని చెప్పగానే సముద్రంలో మునిగిపోతున్న వాడికి తెప్పలు కన్పించినట్లు సంతోషపడ్డాను. నేనెందుకు కామేశ్వరి పెళ్ళి విషయం గుప్తంగా వుంచానో తెలీక, మాధవ్, నా మీద దురభిప్రాయ పడుతున్నాడు చూడండి!" అంది నళిని.
'ఛీ ఛీ!' రామనాధం భయం కపితుడైనాడు. 'నేను కామేశ్వరినిప్రేమించావా! ఏరా మాధవ్! ఎల్లా అన్నావు ఆ మాట!' అన్నాడు రామనాధం.
'అవును అన్నయ్యా! కామేశ్వరిని చూసి వచ్చినది మొదలు, నీకు ఇంకే పెళ్ళి కూతుళ్ళూ నచ్చటం లేదు! ఎంత మంచి సంబంధం వచ్చినా ఏదో వంక పెట్టి పెళ్ళి వద్దంటున్నావు! ఇక్కడ, నళినితో కామేశ్వరి కాలేజీకి వొచ్చేది. సహజంగా చదువుకునే అమ్మాయిలే పెళ్ళిళ్ళు కాగానే చదువులు మానేస్తారుకదా! అల్లాంటిది కామేశ్వరి పెళ్ళి అయ్యాక చదువుకోటం మొదలు పెట్టిందని నేనెల్లా వూహించు తాను? ఎల్లానూ పెళ్ళికాక చదువు కొంటూంది కదా! నీ మనసుకు నచ్చినపిల్ల! కాస్త మీ ఇద్దరి మధ్య మాట కలుస్తే, మీ ఇద్దరి అభిప్రాయాలు ఒకటయి ఒక ఇంటివారు అవుతారని ఆశపడ్డాను. తప్పేముంది నాది? అన్నయ్యా!' అన్నాడు మాధవ.
రామనాధం గాఢంగా నిట్టూర్చాడు!
'నీ భావుకత్వం ఇంతవరకూ వచ్చిందన్న మాట! మాధవ్! ఎంతమాటన్నావ్! నేను ఎప్పుడన్నా నీతో కామేశ్వరి తప్ప ఇంకే పిల్లా నాకు నచ్చదని చెప్పావా? నీ వూహాగానంతో పాపం, ఆ అమాయికురాలికి ఒక మచ్చ తెచ్చిపెట్టావు. నాకూ, నాన్నగారికీ ఏ పిల్ల నచ్చి వారి కట్నకానుకలు వచ్చి, సంప్రదాయం నచ్చితే ఆ క్షణమే నేను పెళ్ళి చేసుకుంటాను! అంతేకాని ఈ కామేశ్వరి కోసం నేను బెంగ పెట్టుకున్నానా? సినిమాల్లో లాగా, మీరు వ్రాసే ప్రేమకధల్లో లాగా నేను కామేశ్వరి కోసంజీవితాంతం మజ్నూనై పోయి బ్రహ్మచారిలా వుండిపోతావనుకున్నావా? ఒకచోట పిల్ల నచ్చుతుంది. కట్నం నచ్చదు! పిల్ల నచ్చిందని చెప్తాం! కట్నం నచ్చక పోతే పిల్లనూ వదులు కుంటాం! నాలుగు సంబంధాలు చూసుకునే వాళ్ళం! మనకు ఈ ప్రేమలూ, గీమలూ ఏమిటి సాధారణ సంసార్లకి!' అన్నాడు రామనాధం.
'ప్రేమించే వాళ్ళు సంసార్లు కారా! ప్రేమ అనేది సంసార లక్షణం కాదంటా రేమిటి మీరు?' అంది నళిని. రామ నాధం కామేశ్వరిని ప్రేమించలేదని తెలియ గానే ఎందుకనో, నళిని హృదయం తేలిక పడింది! ఇప్పుడామె మనస్సు ఉల్లాసంగా వుంది!
'ఛఛ! అది నా ఉద్దేశం కాదు! అదంతా ఒక తరహాకి చెందినది! కాస్త బాధ్యతలు తెలిసిన వివేకవంతులయిన వాళ్ళు ఈ ప్రేమలు అంటూ వెర్రెత్తి పోరు! సంసార్లలో మటుకు ఆత్మీయిత వుండదా! అదొక పవిత్రమైన బాధ్యతగా కుటుంబీకులు ఒండొరుల పట్ల, ఆత్మీయతను పెంచుకుంటారు! ప్రేమ అనేది, ఒక వింత ఆకర్షణశక్తి కలది! ఆకర్షణ వేరు; ఆత్మీయత వేరు కదా!' అన్నాడు రామనాధం.
చంద్రుడు నువ్వుమొఖంతో, సాగరతరం గాల పరుగులను చూస్తూ ఆకాశం మీదకి నడుస్తున్నాడు!
'రాత్రవుతోంది! ఇంక నువ్వు వెళ్ళవా నళినీ!' అన్నాడు మాధవ లేస్తూనూ...
'నా మీద కోపం పోయింది కదా!' నవ్వుతూ అంది నళిని.
'ఆఁ! నవ్వే చంద్రుడూ ఆ తారకలూ, ఈ సముద్రుడూ, సాక్షి వుంటారు!' అన్నాడు మాధవ్.
'ఆ సాక్ష్యాలు కావ్యనాయికలకి! నాకు పనికిరావు!'-అంది నళిని.
'అయితే ఎల్లా!' తెల్ల ముఖం చేసాడు మాధవ్.!
'మీ అన్న సాక్షిగా, నా మీద మీరు ఏమీ కోపం పెట్టుకోలేదని చెప్పండి!' అంది నళిని.
'మధ్యన నేను దొరికానా! మీ కథనాలకి!' అన్నాడు రామనాధం. మాధవ నవ్వాడు! ఉత్తేజకరమైన వాతావరణం ఉల్లాస భరితమైంది!
* * *
