కాని ఎవర్నీ ఏవిధంగానూ మోసంచేసి యెరగను. మోసాలతో ఎదుటి మనసును దగ్గర చేసుకోలె. నీ అభిప్రాయాలు పరోక్షంగానైనా తెలుసుకోవాలి. అదే వుద్దేశ్యంతో నాకు కావాల్సిన విషయాలని, మరికొన్ని విషయాలతో కలిపి నవ్వునుమానించడానికి అవకాశం లేకుండా అడిగాను. అన్నిటికీ నీ వుద్దేశ్యాలు తెలిపినట్టే బహుభార్యాత్వం గురించీ-వర్ణాంతర వివాహాలగురించీ కూడా తెలియ జేశావు. నీ అభిప్రాయాలే ఆచరణీయాలుకానీ నన్ను చాలా క్రుంగ దీశాయి. ఐనా ఆశ వదులుకోక నా గాధంతా పూసగుచ్చినట్టు తెలియ జేశాను. అందులో అసత్యాలుగానీ - అతిశయోక్తులు గానీ లేవు. మన స్నేహానికి కావలసింది ఒక్కటే కృష్ణా! నన్ను నువ్వు నమ్మాలి. ఆ నమ్మికే నాకు కావాలి.
నా బ్రతుకును సుఖమయం చేసుకోవాలని- కోరిన విధంగా గడుపుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది ఆవేశంతో చెప్పుకున్న నిర్ణయం కాదు. దీనికి ఆటంకాలు రానేరావు. వచ్చినా లెక్క చేయదల్చులేదు.
కృష్ణవేణీ! నిన్ను దైవసన్నిధిలో పసుపుతాడు కట్టి నా భార్యగా స్వీకరిస్తాను. నీతో బ్రతుకు గడుపుకొంటాను. దీనికి నీ అనుమతికావాలి. కానీ నాకోరిక కాదంటావని అనుకోను. నువ్వు ప్రాజ్ఞురాలివి. చదువుకున్నదానివి. ఆలోచించు, దౌర్భాగ్యుడు మాధవ్ బ్రతుకు దృష్టిలో వుంచుకు క్షణం ఆలోచించు నీ కేవిధంగానూ అన్యాయం జరగదు. నిన్ను దేవతలా పూజిస్తానని-ప్రాణాలు తీసి నీ చేతుల్లో పెడతాననీ లేనిపోని కబుర్లు చెప్పను. నాతోడు నీడగా-నాకష్టసుఖాలలో పాలుపంచుకునే అర్ధాంగిగా-నాకు పిత్రుస్థానం ప్రసాదించే గృహిణిగా-నా భార్యగా చేసుకొంటాను.
ఈ యింటికి నువ్వు ఇల్లాలివి. నా పిల్లలికి నువ్వు తల్లివి. ఆ స్థానం ఎవరిదోకాదు. నీదే, నీదే కృష్ణవేణి!
నీలో నాకు నమ్మకం వుంది. నీమీద నాకు కోరిక వుంది. నీ సహచర్యం నాకు శాంతి ప్రసాదిస్తోంది. నీ ఒడిలో తలవుంచుకు నిద్ర పోయిననాడే నా హృదయం శాంతిస్తుంది. నన్ను కనికరించు వేణూ! నిన్ను ప్రాధేయపడుతున్నాను. ఒక్క క్షణం ఆలోచించు.
నిన్నేదో ఆవేశాలకు గురి చేస్తున్నానని అసహ్యించుకోకు. నిన్ను నువ్వు మరిచి ప్రవర్తించకు. ప్రతీవిషయం లోతుగా ఆలోచించు. నీమనసు చెప్పింది-నీ మనసుకు నచ్చింది-అదేమిటో నాకు తెలీజెయ్యి. అదృష్టానికీ, దురదృష్టానికీ మధు వూగిసలాడుతూ వుంటాను. నిండు బ్రతుకు నిర్ణయించుకొనే ఈ సమయంలో ఏ విధమైన అలక్ష్యమూవద్డు నీకు సంతృప్తి కానిపని చెయ్యను. నాకోసం నిన్ను అయిష్టానికి ఒత్తిడి చెయ్యను.
కాని నిన్ను భార్యగా నా ఇంటికి తెచ్చుకోవాలనీ-నీ సహచర్యలో కొత్త జీవితం ప్రారంభించాలనీ నీ సన్నిధిలో కాలం గడపాలని మనసు కోరుతుంది. నా బ్రతుకు నీచేతుల్లో వుంది. కృష్ణా! ఏనాడూ ఎవర్నీ అర్ధించి ఎరుగను. నా బాధ అర్ధం చేసుకుంటావనీ, నా బ్రతుకు బాగు చేస్తావనీ, నమ్మమంటావా?
నా గత చరిత్ర మర్చిపోనన్ను అవివాహితుడి గానే దృష్టిలో వుంచుకో నాకు పునర్జన్మ ప్రసాదించు.
నీ లేఖకోసం-నా భాగ్యం కోసం ఎదురు చూస్తూ వుంటాను.
మాధవ!
* * *
ఉత్తరం ముగించి నిశ్చలంగా కూర్చున్నాను. నాకంతా అయోమయమై పోయింది- కృష్ణవేణీ! నిన్ను దైవసన్నిధిలో పసుపుతాడు కట్టి నా భార్యగా స్వీకరిస్తాను."
"నా భార్యగా స్వీకరిస్తాను."
"దైవ సన్నిధిలో......నా భార్యగా.....స్వీకరిస్తాను."
రెపరెప కొట్టుకొంటూన్న కాయితాలని టేబుల్ మీదే విడిచి వెళ్ళి పరుపుమీద పడుకున్నాను. నుదుటి మీద అరచెయ్యివుంచుకుని కళ్ళుమూశాను. మాధవ్ ఎదుట నిలిచిప్రాధేయపడుతున్నట్లు అర్దిస్తున్నట్టూ దేవిరిస్తున్నట్టూ భ్రమ పడ్డాను. భ్రమకాదు. నిజమే' మాధవ్ ప్రాధేయ పడుతున్నాడు. వేడుకుంటున్నాడు. కాని, నేనేం చెయ్యను? నేనేం చెయ్యను? భార్యగా స్వీకరిస్తాడట. ఇష్టపడనా? ఎలా ఇష్ట - పడను? ఏనాడో మాధవ్ కి పెళ్ళయిందే! ఎలా ఇష్టపడను?
మాధవ్! మాధవ్ వంటి వ్యక్తి! రూపవంతుడు, గుణవంతుడు. అన్నిటినీ మించి నా మనసైన వాడు. ఎలా దూరం చేసుకోను? అన్నినాళ్ళ స్నేహం ఎలా మర్చిపోను? నన్ను నేను మర్చిపో గలిగిననాడే మాధవ్ ని మర్చిపోగలనేమో! అబ్బ! ఇంతటి విపరీత పరిస్థితిలో చిక్కుకుంటా నని ఏనాడూ అనుకోలేదు.
నేనేదీ నిర్ణయించుకోను. దేనికీ నా శక్తి చాలదు. ఎలా జరగనై వుందో అలా జరుగుతుంది. అంతే - మాధవ్ కి జవాబివ్వలేదు. ఈసంగతి రేణుకి చెప్పలేదు - ప్రతీరాత్రీ కావలసినన్ని కలలు కంటున్నాను - మాధవ్ కొత్త చిరునామా ఇస్తూ వెంటనే వుత్తరం రాశాడు. వాళ్ళ ఆఫీసు డామ్ ప్రాంతాలకు షిఫ్ట్ యిందట. సిబ్బంది అంతా అక్కడికి తరలి వెళ్ళిపోతున్నారట ఆ ప్రదేశాలు చాల మనోహరంగా వుంటాయట. కాకపోయినా తన ఒంటరి బ్రతుక్కి ఎక్కడున్నా ఒకటేనటా తనమీద కోపం వుంచుకోవద్దనీ- నా వుత్తరం కోసం క్షణం యుగంగా ఎదురు చూస్తున్నాననీ - నా స్నేహాన్ని మాత్రం దూరం చెయ్యవద్దనీ - ఇంకా చాలా చాలా. ఏదో జవాబు రాయటమే మంచిదని రాశాను. ఎంత ఆలోచించినా కలం సాగింది కాదు. ఏం చెప్పాలో తెలిసింది కాదు. పొడిపొడిగా నాలుగు మాటలు రాసి వూరుకున్నాను.
మాధవ్!
నమస్తే!
మీ ఉత్తరాల వల్ల అంతా తెలుసుకున్నాను. మీలో నాకు నమ్మకం వుంది గనుకే అంతా యధార్ధమనే నమ్ముతున్నాను. కాని నేను చెయ్యగల సాయం ఏమీ వుండదనే అనుకుంటాను. ఇంతటి సమస్యలని క్షణాల మీద తేల్చుకోలేము కదా? నా ఆలోచనలకే ఒకదారి లేదు. ఇక మీకేమని జవాబు చెప్పగలనో మీకే తెలియాలి. నా వుత్తరాలకేమీ ఆటంకాలుండవనీ - ఎప్పుడూ మీకు రాస్తుంటాననీ మాట ఇస్తున్నాను. అన్యధా తలచకండి.
స్నేహితురాలు.
కృష్ణవేణి!
దానికి జవాబు రాసినప్పుడు - "నువ్వు పూర్తిగా ఆలోచించుకో. నీ చదువు పూర్తి అయ్యాకే నిన్ను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కాని ఎప్పటికైనా నాకు నిరాశ మాత్రం కల్గించక" అని రాశాడు. తను విరివిగా ఒకే ధోరణిలో రాస్తూనే వున్నాడు. నాకే ఎటూ పాలుపోని పరిస్థితైంది. వోనాటి రాత్రి చిత్రమైన కలగన్నాను-
అరుణకీ నాకూ వివాదం - "నా భర్తని నీ వశం చేసుకుని మురవటానికి నీకు సిగ్గులేదా?" అంటూ నిలదీసింది అరుణ.
నేను అతి నిర్లక్ష్యంగా నవ్వి గర్వంగా - "సిగ్గుపడాల్సింది నేను కాదు. నువ్వు! మోడు వారిపోయిన ఒక జీవితాన్ని నా సహచర్యంతో చిగురింప జేశానని గర్వపడుతున్నాను నేను-" అన్నాను.
