25
నిన్నటి దిగులు ధోరణి రఘును ఇంకా వదలలేదు. అలానే కారు నడుతున్నాడు. అందాలన్నీ పోగుచేసి, ఒకచోట ఉంచినట్టున్న అరుణ అతని పక్కనే ఉంది. అతడ్నే పరీక్షగా చూస్తుంది. రఘు మనస్సులో చెలరేగే అశాంతి ఎక్కువయ్యే కొద్దీ , స్పీడో మీటర్ ముల్లు కూడా పైపైకి పోతుంది.
"స్టాప్! ప్లీజ్ స్టాప్!' అంది అరుణ. ఏదో అవాంతరం వచ్చి పైన పడ్డట్టు.
"ఆ?" ఏదో పరధ్యానంగా ప్రశ్నిస్తూనే రఘు బ్రేక్ వేశాడు . ఒక చిన్న ఏనుగు చేసిన ఘీంకారం లా కీచుమంటూ కారు ఆగింది.
"ఏం? ఏం జరిగింది , ఆరూ?"
"అయితే అంత ఘోరం జరిగినా కూడా నీకు తెలియదన్న మాట!"
"ఆ?"
"స్పీడో మీటర్ అరవై టచ్ చేసింది. మన వెనకాల ఫర్లాంగు కొక్కరు చొప్పున ముగ్గురు క్షత గాత్రులై గిలగిల లాడుతున్నారు! అరుగో , పోలీస్!'
మద్రాసు నగరంలో పోలీసుల కేం కొదవ?ఏదో పోలీసు బండి అటువైపే వస్తుంది!
"ఓ గాడ్!" అన్నాడు రఘు. అతణ్ణి భయం ఆవహించింది. పోలీసు బండి వారిని దాటి వెళ్ళిపోయింది. అరుణ పకపక నవ్వింది. రఘూ కేమీ అర్ధం కాలేదు.
"అయితే ఆ ముగ్గురూ మన కారు కింద పడలేదన్న మాట? థాంక్ గాడ్! పద, రఘూ, ఇక మనం పోవచ్చు!" అంది అరుణ చిలిపిగా.
"అరుణా, ఇటువంటి వేళాకోళం లోని అభిరుచి తో ఆనందించే ధోరణి లో లేను నేనిప్పుడు" అంటూ రఘు కారు స్టార్ట్ చేశాడు.
"అబ్బో! చాలా తీవ్రంగా ఉన్నావే! డబ్బు కావాలా, రఘూ?"
"అవసరం లేదు. ధన్యవాదాలు!"
"మరి ఇంకెందు కబ్బా , మానసికంగా నువ్వింత కటకట లాడడం?"
"నేనేమీ కటకట లాడడమూ లేదు కిటకిటలాడడమూ లేదు."
"ఆహా! నీవా మాట అన్నంత మాత్రాన నేను నమ్ముతానా? ఆ బుంగమూతి బయలుదేరి నప్పటి నుంచీ నాతొ కూడా మాట లాడనివ్వని మౌనం, నువ్వు కాలేజీ లో క్లాసెస్ అటెండవుతున్న ప్పుడు కూడా మోగే ఈ ట్రాన్సి స్టర్ రేడియో ఇలా పనీ పాటు లేకుండా ఉండడం, మనస్సు లోని ఆవేదనా, అక్కసూ ఎక్కువయ్యే కొద్ది పైపైకి పోయిన స్పీడో మీటర్ ముల్లూ -- ఇవన్నీ నేను గమనించలేదనా? అసలు సంగతేమిటి, రఘూ? నాన్నగారు కోప్పడ్డారా?"
రఘు ఏమీ మాట్లాడలేదు. అటువంటి పరిస్థితుల్లో మౌనమే తనకు తగ్గ భూషణ మనుకున్నాడు.
"ఇదుగో , నా మీద ఒట్టు. మనసులోని బాధ మరో వ్యక్తీ తో పంచుకున్నప్పుడే మన మనసు కాస్త తేలిక పడుతుంది. అది మామయ్య గారి సిద్దాంతం. అందులో ఎంతో సత్య మున్నదని నాకు ప్రాక్టికల్ గా తెలుసు. నిజం చెప్పు. మామయ్య గారు కోప్పడ్డారా?" ఏమన్నా అన్నారా?"
"నన్ను దూషించడం, నిన్ను భూషించడం -- ఆయనగారికి అలవాటేగా?"
"తప్పు చేసినప్పుడు మామయ్య గారు నన్నూ దూషిస్తారుగా?"
"ఓహో , అయితే నేనేనో పుట్టెడు తప్పులు చేశాననీ , అంతటికీ తగ్గ మోతాదు లో నాన్నగారు నన్ను కొప్పాద్దార ని తమరు తెల్చేసు కున్నారన్న మాట?"
"దానికి ప్రత్యేకంగా బుద్ది కుశలత అవసరం లేదండీ, యువరాజావారూ! అమ్మ నిన్నేమీ అనదు. ఇంట్లో నౌకర్ల కు -- అంటే సుబ్బారావు గారూ, అయ్యం గార్ల దగ్గిర నించీ నాయర్ , నవనీతం మొదలయిన వారందరికీ -- నీవంటే దాడ! ఇక నేనా? ఏదో... దిక్కూ మొక్కూ లేనిదాన్ని; మిమ్మల్ని నమ్ముకుని, మీ ఇంట పడి ఉండేదాన్ని! మిమ్మల్ని నే నేమనగలను? అనగలవారు మామయ్యగారొక్కరే! నా అనుమానం , ఆయనగారు ఆ అనడాన్ని నిన్న రాత్రి కాస్త గట్టిగా అన్నారేమో అని!"
"ఇంకేం? అన్నీ విడమరిచి, వివరించి, విశదీకరించి ఉన్న నిజాన్నేదో నీవే, ఊహించావు గా? సంతోషించు!"
"అదే తప్పు అని నేననేది! నీవిలా బుంగమూతి పెట్టుకుని తీవ్రంగా ఉంటె నేను సంతోషించడమా? ఇంపాసిబుల్! అయినా నాకు తెలియక అడుగుతాను, రఘూ, బాగా చడుకొమ్మనడాని కన్నా, మామయ్యగారు మరే ఉద్దేశం తోటి నిన్ను మందలించరుగా? అటువంటప్పుడు గంటల తరబడి ఆయనగారన్నదాన్నే మననం చేసుకుంటూ నీవు బాధపడి, నన్నూ, కారునూ కూడా ఇలా బాధపెట్టడం మంచిది కాదు. అందుకని , గో స్లో! కీస్ లెప్ట్! పొరపాటున అవి కమ్యునిస్టు స్లోగన్ల నుకునేవు, నీ పుణ్యాన!"
"ఏం? కమ్యూనిస్టు లంటే నీకంత చులకన గా ఉందా?"
"రామరామ! వాళ్ళ తోవని వాళ్ళు అన్ని రంగాల్లో నూ అడ్వాన్సు కావడంతో వింతేమిటి? రష్యా సంపాదించిన ప్రోగ్రెస్ మరే దేశం సంపాదించింది? అయితే ఇప్పుడు నాకొక అనుమానం వచ్చింది , రఘూ! ఈ సినిమాలూ , క్రికెట్ టెన్నిస్ మొదలయిన పోటీలు, రేసులూ , పేకాట లూ మొదలయిన హాబీల్లా గానే పొరపాటున అటు రాజకీయాల్ని కాస్త హాబీగా ఉంచు కుంటున్నావా ఏమిటి?"
"అరుణా, నీనిది వరకే చెప్పాను. నా మనసు బాగాలేదు. దయచేసి నన్నిలా వదిలెయ్యి!"
"అల్ రైట్! అయినా చదువుకునే అబ్బాయిలకూ, రాజకీయాలకూ అసలు సంబంధం ఉండకూడదు. అది మీరెంత త్వరగా అవగాహన చేసుకుంటే అంత మంచిది!"
"చిత్తం! మీరిచ్చిన సలహా సదా నా మనసులో పదిల పరుచు కుంటాను. ఇప్పటికైనా ణా తృప్తి కలిగిందా తమకు?"
"చిత్తం."
ఈలోగానే కాలేజీ ఆవరణ చేరుకుంది. అరుణను దొంగ చాటున చూసి సంబర పడ్డారు కొందరు విద్యార్ధులు. కొందరు ఆకతాయులు ఈలలు వేశారు. మిత్ర బృందం రఘును చుట్టూ ముట్టింది. అందరికీ నమస్తే చెప్పి, అరుణ తన దారిన తాను వెళ్ళిపోయింది.
దీనివల్ల మనం తేల్చు కోవలసినదేమిటంటే , అరుణ సేతుపతి గారి బంధువర్గం లో అతి ముఖ్యమైన ఒక్కర్తేగా తయారయిందనీ, అరుణకు రఘు పైని అపరిమితమైన ఆదరాభిమానాలు ఉన్నాయనీ, అరుణ అంటే రఘు కొద్దో గొప్పో భయభక్తుల్నీ ప్రదర్శిస్తాడనీని.
నిజంగా రఘు అరుణ వద్ద గోము చేసి డబ్బు తీసుకునేవాడు. నాన్నగారు నెలకని కేటాయించిన అరవై రూపాయలు ఏ మూలకు? అప్పుడప్పుడు చాముండేశ్వరి వద్ద వందో, రెండు వందలో పట్టేవాడు! ఇక అమ్మను కూడా అడగడం అంత మంచిది కాదనుకున్న ప్పుడు అరుణను ఆశ్రయించే వాడు. అతను అరుణ వద్ద ఏ విషయాన్నీ దాచేవాడు కాదు. అడగ్గానే అరుణ చెక్కు వ్రాసి ఇచ్చేసేదను కుంటున్నారా? అబ్బే!
"ఎందుకూ నీకిప్పుడు డబ్బు? ఓహో! ఈవేళ ఇండిపెండెన్స్ కప్పు కదూ?"
రఘు బెదిరిపోయేవాడు! "శ్...శ్...., అంత బిగ్గరగా అనకు! పొరపాటున నాన్నగారు విన్నారంటే ...."
"వినడం కాదండీ, యువరాజావారూ! ఒకనాడు కళ్ళారా చూస్తారు. ఆనాడు అబ్బాయి గారి పెళ్ళవుతుంది!"
"అయితే నీతోటేగా?"
"రఘూ! అటువంటి చిలిపి మాట లనవద్దని ఎన్నిమార్లు చెప్పానూ నీకు? గో, మాన్ . నీకొక్క రూపాయ కూడా ఇవ్వను!"
'ఆరూ, ఆరూ, ప్లీజ్! ఈ దెబ్బతో నీ అప్పంతా తీర్చేస్తా."
"ఏం? రాత్రి గుర్రం కలలో వచ్చి చెప్పిందా?"
"అబ్బబ్బ! నీకు నచ్చ చెప్పాడమెలా? అసలు గుర్రాల సంగతి నీకేమీ తెలియదు! ఈవేళ ఇండిపెండెన్సు కప్పులో ప్రిన్సెస్ రాయల్ పరిగెడుతుంది!"
"కప్పులో పరిగెత్తే గుర్రం రేస్ కోర్స్ లో ఏం పరిగెడుతుంది?"
"అన్నిటికీ క్రాస్ ఎగ్జామినేషనేనా, ఆరూ? నామాట నమ్ము! ప్రిన్సెస్ రాయల్ అంటే మామూలు గుర్రం అనుకుంటున్నావా? దాని తండ్రి కింగ్ ఆఫ్ కింగ్స్!........."
"దాని తల్లి క్వీన్ అప్ క్వీన్స్! కానీ, ఆ పుణ్య దంపతులకు పుట్టింది గాడిద పిల్ల! ముద్దుగా , వంశ గౌరవం కోసం ప్రిన్సెస్ రాయల్ అని పేరు పెట్టుకున్నారు! అంతే! ఆ గుర్రం గెలవనే గెలవదు! చూస్తూ చూస్తూ నా డబ్బు నీకిచ్చి ఆ గాడిద మీద పెట్టుబడి పెట్టడం నాకిష్టం లేదు!"
"అల్ రైట్! మళ్ళీ ఎప్పుడయినా నిన్నో కానీ అడిగితె ఒట్టు!" అంటూ కోపంగా రుసరుస లాడుతూ వెళ్ళిపోబోయాడు రఘు! అరుణ అతణ్ణి ముద్దుగా ఆపేది, బుజ్జగించేది; ఏ రెండు మూడు వందలకో చెక్కు వ్రాసి ఇచ్చేది! అలా గడుస్తున్నాయి రోజులు.
