ఇది ఇప్పటి అల్లుడికి కావలసిన ఉన్నత యోగ్యతా పత్రం!
'పిల్ల ఫాషన్ గా ఉంటుంది.... ఫలానా తార....అనుకుంటారు. ఇరవై వేల నగదు; తండ్రి ప్రభుత్వ పలుకుబడి కలిగినవాడు....'
ఇప్పటి యోగ్యతలు శ్యామలకు లేవు. తనకు లేవు.
'తాతా! నే పోతున్నాను.....' ఆలోచన నించి తేరుకున్నాడు.
'ఆ.....పో, అమ్మా...ఇదిగో!'
శ్యామల ఆగింది.
'నువ్వొచ్చే టప్పటికి మామ య్యొచ్చినాడా?'
'రాలేదు.'
'నన్నయ్య కనబడితే -- ఎండేక్కింది, ఈ పూటకు చాలించమన్నానని చెప్పు.'
'సరే!'
శ్యామల అడ్డదారి దాటి బళ్ల బాటలో పడింది. పొలం నించీ ఇంటి వేపుగా వెళుతున్న నన్నయ్య బండి నెమ్మదిగా వస్తుండటం కనిపించింది. ఎద్దులు రెండూ నెమరేస్తూ నడుస్తున్నాయి. నన్నయ్య బండి జొల్ల కానుకుని కళ్ళు మూసుకుని తూగుతున్నాడు. రాత్రి నిద్ర లేదు. చుక్క పొడవక ముందు బండి కట్టాడు. శ్యామల వెనకాల బండేక్కింది. నన్నయ్య లేవలేదు. కోడి కళ్ళలా మూసుకుని 'గుర్రు' కొడుతూన్నాడు. నవ్వుకుంది. ఏమిటీ మనిషి? ఎద్దులు మరో దారి వెళితే? లేదా మత్తులో తూగి బండి కింద పడిపోతే! ఆమె కోక చిలిపి ఆలోచన నోచ్చింది. రెండు పగ్గా లందుకుంది. దారి మళ్ళించి మళ్లీ పొలాని కెళ్ళే దారిలో నిలిపి వెళ్లి పోవాలను కుంది.
ఎద్దులు రెండూ మొదట ఒప్పుకోలేదు. కానీ, ముకుతాళ్ల బిర్రు తాకి, సెలగోలు దెబ్బ తిని బలవంతంగా ఒప్పుకున్నాయి. అయినా, ఆమె సారధ్యానికి స్పష్టంగా అర్ధం తెలియలేదు వాటికి. అయోమయంగా కట్ట ఎక్కేశాయి. కుడి చక్రం పైకి లేచింది. 'కెవ్వు' న కేకేసినా జరగవలసింది ఆగలేదు. తమ తప్పేమీ లేదన్నట్లు నిలుచున్నాయి ఎద్దులు! నన్నయ్యకు మెలుకువ వచ్చి చూస్తె ఏమీ అర్ధం కాలేదు. తాను నిద్రబోతున్నాడు. అది తనకూ, తన ఎద్దులకూ అలవాటే ! ఇదెట్లా జరిగింది? నిద్రలో కలేమో! కానీ, తన కాలు ఇంకా బండి వొగల కింద ఇరుక్కునే ఉంది. తన మీద పడిపోయిన శ్యామల ఇప్పుడే లేచింది. దుమ్ము దులుపుకుంటుంది.
నన్నయ్య లాక్కున్న కాలితో పాటు రక్తపు ముద్ద లాంటి పాదం బైటి కొచ్చింది. శ్యామల ఒక్క ఊరుకున వచ్చి అందుకుంది. నన్నయ్య వారించినా వినకుండా చీరే కొంగు చించి రక్తం తుడిచి , కట్టు కడుతుంది. ఆమె చేసిన పని అక్షేపిస్తున్నట్లు రక్త మింకా ఎగసి పడుతుంది. శ్యామల కళ్ళలో నీళ్ళుబుకుతున్నాయి. రక్తం చూసి భయపడిందనుకున్నాడు నన్నయ్య. లేచి నిలుచున్నాడు. పడిపోయిన బండి నెత్తసాగాడు. పొంగే భుజ దండాలు, ఉబికే రొమ్ము, వూరించే బలం! ఆ ప్రాచీన పురుషుని కళ్ళు విచ్చుకుని చూస్తుంది శ్యామల. బండి సరిగా నిలిపి కుంటుకుంటూ వెళ్లి నొగల్లో ఎక్కాడు.
'శ్యామలమ్మా ! భయం లేదులే-- ఎక్కు!'
శ్యామల ఎక్కింది.
'ఎన్నడిట్టా సేయలేదు. ఈరోజేమో ఈటికి బుద్ది పెడదోవ దొక్కింది!'
ఆ పేడ దోవ తొక్కిన బుద్ది వాటిది కాదని చెప్పలేదు శ్యామల. ఇంకా ప్రమాదం జరిగి ఉంటె ఏమయ్యేది? ఛీ! ఛీ! అనుకుంటుంది.
'చాలా నొప్పిగా ఉంది కదూ?'
'ఆ పోతుంది. పెద్ద దెబ్బెం కాదు. ఏదో గీసుకుంది. రగతం కారింది. అదురుష్టం బాగుంది. నీగ్గానీ తగిలుంటే..."
"నాకు తగిలుంటే ఏమవుతుంది?'
'ఎంత బాధ గుండెది?'
"ఎవరికి?'
'ఎవరి కేందమ్మా! అందరికీ......'
'నీకు తగిలితే ఎవరికీ బాధ కలుగదూ?'
'నా ఇసయం వేరు, నీ ఇసయం వేరు.'
'ఏమీ వేరు లేదు.'
'అంతా తాత పోలిక! "నన్నయ్య ! బాపనోడూ, మాదిగోడూ మనుషులే! కుక్కల్ని ఒళ్లో ఉంచుకుని తిరుగుతున్న రోజుల్లో మనిషికీ, మనిషికీ తేడా లేంది?' అంటాడు. అందరి లాగా దొంగ మాటలు సేప్పడాయన.'
'దొంగ మాటలు కావని ఋజువేముంది?'
'ఆయన మనసే ఋజువు . నా కళ్ళే ఋజువు.'
'అయన బ్రాహ్మ లింట్లో చేసుకున్నాడు. కూతుళ్ళ నూ వాళ్ళకే ఇచ్చాడు. రేపు కొడుక్కూ అంతే?'
'వాళ్ళు కావాలని చేసుకున్నారు.'
'సరే! నేను మీ కులం లో వాణ్ణి కావాలంటే ....'
శ్యామల మాటలు నన్నయ్య కు నచ్చలేదు. అయినా, ఈ మధ్య ఆమెతో మాట్లాడాలంటే భయం! ఆమె దిక్కు చూడాలంటే భయం! తన వయస్సు లో అర్ధ వయస్సు ఆమెకు. ఆమెను చూస్తె అదురెందుకో అర్ధం కాదు నన్నయ్య కు.
తనను చూస్తూనే తప్పించుకు పోతాడు నన్నయ్య. అంత గొప్ప శరీరం! బండి నేత్తగల శక్తీ ఉన్న అతనికి అంత భయ మెందుకో? తనకు మళ్ళీ ఇట్లా అడిగే అవకాశాన్ని నన్నయ్య ఇవ్వడు. 'పలకవెం?' ఇంకో అడుగు ముందు కేసింది.
'ఒకవేళ నేను నిన్నే అన్నాననుకో....'
'శ్యామలమ్మా! అట్లాంటి మాట లనకు!'
శ్యామల నవ్వింది.
'నిజంగా ననుకుంటూన్నావా? నేను నిన్నా పెళ్లి చేసుకునేది!'
నన్నయ్య మనసు తేలికపడింది.
'మొత్తానికి గాంధీ మహాత్ముడు కానీ, మా తాతగారు లాంటి వాళ్లు కానీ కులాలు లేవనడం తప్పే! ఎక్కడికి పోతాయి?'
'తప్పెందుకయితుంది?' అన్నాడు ఆప్రయత్నం గానే.
'తప్పు లేదా? అంతా ఒక్కటేనా?'
'ఆ అంతా ఒక్కటే!'
'మరయితే మాలో కలవనంటావెం?'
'కలవటానికి కుల మొక్కటేనా? నే నెక్కడా! నువ్వెక్కడా?'
'కులం ;లేకపోతె ఇద్దరం ఒక్కచోటే ఉన్నాము. ఆస్తి లో కూడా తేడా లేదు. అయితే, ఒక్కటే కష్టం! మా తాతగారికి ద్రోహం చేస్తున్నాననిపిస్తుంది. బాధగా ఉంటుంది కదూ?'
'ఉండదూ మరి....'
నవ్వుకుంది శ్యామల.
'అదే వేరే దూరపు వాళ్ళయితే?....'
'అది వేరే రకం!"
'సరే! నీ రకమేదో తెలిసిపోయింది...' నవ్వుతుంది.
నన్నయ్య కర్ధం కాలేదు.
ఎక్కడో పొరపాటుపడ్డాననుకున్నాడు.
'ఇంకెప్పుడు ఈమెతో మాట్లాడగూడదు ' అని విసుక్కుని ఎద్దు ల్నదిలించాడు!
ఆ సంవత్సరం పంట కూడా మాములుగా అరిస్టాలన్నీ గడిచి పండినా ననిపించుకుంది. అనంతయ్య గోదాదేవికి ఉత్తరం వ్రాశాడు. వాసవి కీ, శ్యామల కూ పెళ్లి చేయాలి గనక, ఈ ఏడు గుత్త లివ్వలేననీ, నోటు వ్రాయిస్తాననీ , సెలవులకు తప్పక రావాలనీ, వచ్చే టప్పుడు తెలుపమనీ వ్రాశాడు. ఈలోగా విచారించ వలసినవీ, సంతోషించవలసినవీ , సంఘటనలు జరిగినాయి. సూర్యనారాయణ కూ, సుబ్బరామయ్య కూ పొలం లో దారి దగ్గరా, పంట కళ్ళం భాగం దగ్గరా జరిగిన ఘర్షణ విచారించ దగ్గవైతే, సంతోషించవలసింది సరస్వతి మాతృమూర్తి కావటం! అంతలో పల్లెలకు పెట్టిన ధూమ కేతువు లాంటి పంచాయితీ ఎన్నికలు! ఆ ఊళ్ళో ప్రెసిడెంటంటే సుబ్బరామయ్య ! అది మారేది కాదనుకునే వాళ్లు. అందుకు యత్నం చేసేవాళ్ళు లేరు. కానీ, విచిత్రంగా మార్పు వచ్చింది. సుబ్బరామయ్య తన చిన్న కొడుకు రాధా క్రిష్ణను ప్రెసిడెంటు చేయాలను కోవడంతో, మార్పు రావలసిన అవసరాన్ని గుర్తించారు. అన్యాయానికి, దౌర్జన్యానికి దీర్ఘ ప్రాణ ప్రతిష్ట చేయబూనుకోవటం చాలా మందికి నచ్చలేదు. ఆ నచ్చని వాళ్ళలో సూర్యనారాయణ ఉన్నాడు. ఆ సంగతి తెలిసిన వాళ్లు సూర్యనారయడ్ని నిలబడ మన్నారు. సూర్యనారాయణ మొదట ఒప్పుకోకుండా మధ్యే మార్గం సూచించాడు. ఆ సూచన ప్రకారం ప్రెసిడెంటు గా సుబ్బరామయ్య నే ఉండమన్నారు. సుబ్బరామయ్య తిరస్కరించాడు. అయిష్టంగా నైనా సూర్యనారాయణ దిగక తప్పలేదు. తరవాత అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకోకే తప్పలేదు. అనంతయ్య, వాసవిమ సరస్వతి వారింప జూసినా లాభం లేకపోయింది. తండ్రీ కొడుకుల మధ్య భయపడే పరిణామాలు గావన్నాడు. అయితే, బుద్ది పూర్వకంగా అనుకోక ముందే వాతావరణం మారిపోతుంది. ఇటుపక్క వాళ్లు, అటు పక్కవాళ్లు ఏవో తగాదాలు, ఎవరి వాళ్ళ వైపు వాళ్లు , మాట్లాడక తప్పని ఘట్టాలు, పొలాని కేళుతున్నప్పుడు వెంట వచ్చే పరివారాలు! గడ్డి వాముల కాల్పులు, అప్పుడప్పుడూ వచ్చే సమితి పదవీ కాంక్షులు , ముందుగా వినిపించే ఓటు ఖరీదు! ఆశలు, పౌరుషాలు, కుట్రలు, ఈర్ష్యలు, ఏవో ఎత్తులు.....చివరకు సూర్యనారాయణ గూడా తలుచుకుంటే ఆశ్చర్యం కలిగించే స్థాయి లోకి జారాడు. ఎట్లాగైతేనేం? ఎన్నికల జాతర దగ్గర పడింది. వచ్చే, వచ్చే అనుకుంటుండగా ఆగిపోయింది తాత్కాలికంగా. సుబ్బరామయ్య తిప్పలు పడి 'స్టే ఆర్డర్' తెచ్చుకున్నాడు. ఊపిరి విడిచారు కానీ, ఉద్రిక్తత తగ్గలేదు.
* * * *
అనంతయ్య ఒక ఎకరా మరీ వంక పట్టుగా ఉన్న దాన్ని దిగువ మారవ కట్టి ఇనుప వాగేటి తో కదిలిస్తే మేలనుకున్నాడు. అందుకు నాలుగు కాండ్ల ఎద్దులవసరం! ఒకటి తనవి, ఇంకా రెండు కాండ్లు అద్దెకు రమ్మని నన్నయ్య నంపినాడు. నన్నయ్య వచ్చి 'సరస్వతమ్మ! అయ్యగారు ఉన్నారా?' అనడిగాడు. ఇప్పుడే బైటి కెళ్ళాడనీ, ఎందుకో కూలోళ్లు కావాలను కుంటున్నాడనీ చెప్పింది. నన్నయ్య మాదిగే ఇండ్ల వైపుగా వచ్చాడు. అప్పుడే రాముల గుడి దగ్గరి నుంచీ వస్తున్న సూర్యనారాయణ , వెంట వస్తున్న వాళ్ళ నాగమని చెప్పాడు. వాళ్లు-- వస్తూన్న నన్నయ్య ను చూసి అక్కడనే ఆగిపోయారు. సూర్యనారాయణ అడుగుతున్నాడు. నన్నయ్య చెబుతూ, నెమ్మదిగా ఇద్దరూ నడుస్తున్నారు. కనుచీకటి వేళ! కాలిపోయిన గడ్డి వాముల వాసనింకా వదల్లేదు. నలుగురు మనుషులు కొత్త వాళ్ళు, కోడెల బేరగాళ్ళలా ఎదురుగా వస్తున్నారు. నన్నయ్య ను అగ్గి పెట్టె అడిగారు. నన్నయ్య ఆగి జేబు తడుముకుంటూన్నాడు. రెండడుగులు ముందు కెళ్ళిన సూర్యనారాయణ -- 'అమ్మో!' అన్న కేకతో తల ఎత్తాడు. ముందుకు దూకాడు. వీపు భగ్గుమని, నెత్తురు బుగ్గ ఎగిసింది. బాకు దిగిందని గ్రహించాడు. అయినా, ఆగలేదు.
చేతిలో ఆయుధం లేదు. ఒకని కింద పడదోసి కర్ర గుంజుకున్నాడు. లేచేలోగా తల మీద దెబ్బతో స్పృహ తప్పింది. ఈ వార్త ఎవరి కెట్లా చెప్పాలో తెలియక గాలి ఆగింది! చీకటి రహస్యంగా దాచి పెట్టాలని చూసింది. అప్పుడే ఊళ్ళో అన్నం పెట్టించుకుని వస్తున్న అబ్బిగాడు చూశాడు. ఒక్క కేక వేశాడు! ఆ కేకలో శబ్దం కంటే అర్ధం బల,మైంది. అందర్నీ లాక్కొచ్చింది. అంతా అలజడి! కోపం, రోషం, కక్ష! సరస్వతి స్పృహ తప్పి పడిపోయింది. ఎవరెవరు ఎట్లా ఉన్నారో చెప్పడం కష్టం! సుబ్బరామయ్య, రాధా క్రీష్ణల దుఃఖం చూడలేక పోయారు. కోపం, కక్ష అనే భావాలు మాయమయ్యాయి, వాళ్ళకు తెలియకుండానే , ఇక మిగిలింది దుఃఖం! అదే అన్ని భావాలకూ మారుగా చుట్టూ ముట్టింది.
