Previous Page Next Page 
మేఘమాల పేజి 17


    
                                     9

    ఇంటిగడపలెక్కుతుంటే లోపలికి వెళుతున్న ఇంటియజమాని త్యాగరాజును చూచి పలకరిస్తున్నట్లుగా చిరునవ్వు నవ్వాడు..
    బక్కగా, పొడుగ్గా వుండి, పొట్టి చేతుల చొక్కాను ప్యాంట్ లోపలికి వేసుకున్నాడు. బెత్తెడు వెడల్పు బెల్టు తాతల కాలం నాటిది పెట్టుకున్న సన్నటి ఫ్రేము కళ్ళజోడు అతడివయస్సును మరింత పెంచుతోంది. చెప్పులు, అడుగులు అరిగిపోయి, పాతవయి అసహ్యంగా వున్నాయి. చేతిలోని బరువైన కూరల సంచి భరించలేని భార్యలాగానే అతడిని మరింతగా క్రిందకు లాగుతోంది.
    'ఈలాంటి మనిషినా ఆమె అనుమానించేది?'
    నాలుగేళ్ళ పిల్లవాడు. 'నాన్నా అంటూ ఎదురు వచ్చాడు.
    ఆ పిల్లవాడికి అటు తల్లి పోలికగాని ఇటు తండ్రి పోలికగానీ రాలేదు-అదో విధంగా వున్నాడు!
    త్యాగరాజు లోపలికి వచ్చేశాడు.
    'శకుంతల దగ్గరకు వెళ్ళలేదా?' రాజేశ్వరి అడిగింది.    
    'లేదు.....ఇక్కడే పొద్దుబోయింది.....ఇటే వచ్చేశాను!'
    అతడి మనస్సంతా కలుషితమయింది.
    అందుకు నిదర్శనంగా నాలుగుమెతుకులు అంటీ అంటనట్లుగా ఎనిమిదిగంటలకు కొరికాడు.
    ముందు గదిలోకి వచ్చి చాప పరుచుకొని, బెడ్డింగ్ వేసుకొని పక్కమీదకు ఒత్తిగిల్లాడు.
    ఏవోమాటలు చెప్పుకుంటూ రాజేశ్వరీ, సత్యవతీ భోజనం చేస్తున్నారు.
    ఉన్నట్లుండి ఇంటి యజమానురాలి గొంతు ఖంగున మ్రోగింది.
    -మరుక్షణంలోనే పిల్లవాడి ఏడుపు తారస్థాయిని అందుకొన్నది.
    చికాకు వేసింది త్యాగరాజుకి.
    లేచి ఎక్కడికయినా వెళ్ళిపోదామా అనుకున్నాడు.
    'మీరు మనుష్యులు కారు....మీలో మనిషికి వుండవల్సిన లక్షణాలు లేవు.....నేను చెబుతున్నాను గదా.....వచ్చే జన్మలో మీరు మనుష్యులుగా పుట్టరు .... లేకపోతే మీరు చేసే నిర్వాకం ఇదా? .... నేను ఉరేసుకు చస్తాను.....దయ్యమై మిమ్మల్ని పట్టుకు పీడించకపోతే....' ఆమె వాగ్ధాటికి పిల్లవాడు ఏడ్వటంలో అబ్బుర మేమీ లేదు.....
    'ఆమె చచ్చి దయ్యమవటం దేనికి- బ్రతికుండగానే అంతకు మించి ఏడిపిస్తుంటే, ఆ మహానుభావున్ని!' త్యాగరాజు అనుకున్నాడు.
    రెండు క్షణాలు చెవులు రిక్కించి ఆ గోలను విన్న సత్యవతీ, రాజేశ్వరి - అదేదో మామూలు విషయంలా - తిరిగి మాటల్లో పడిపోయి అన్నం తిన సాగారు.
    ...దబ దబ మోత!
    ఎవరినో ఆ శిఖండి కొడుతున్నది...
    భర్తనా?.....లేక పసివాడినా?....
    ఏఁవో...
    పిల్లవాడు దిక్కులు పిక్కటిల్లేలా గగ్గోలు పెడుతున్నాడు...
    అయితే పిల్లవాడినే నన్నమాట!
    తరువాత అరగంటకు రాజేశ్వరి పక్క వేసుకుంటుండగా చిన్నగా అడిగాడు త్యాగరాజు: 'ఎందుకా పిల్లవాడిని అలా బాదుతుంది?' అని.
    'కన్నకొడుకైతే గదా?' నిర్లక్ష్యంగా అన్నది.
    'అదేవిటి-కొడుకు గాదా వాడు?'
    'వాడి దౌర్భాగ్యం..... పిల్లలు లేకపోతే తెచ్చి పెంచుకుంటున్నారట!'
    -త్యాగరాజు జాలిగా ఆ పిల్లవాడి మొఖాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు.
    'ఇంతకీ ఈ రోజయినా నాకు పక్కపలుకులు తెచ్చారా?' అన్నది.
    త్యాగరాజు తడబడుతూ, 'లేదు .....లేదు!' అన్నాడు. 'ఇప్పుడే ఎదురుగ్గా కొట్లో అందుకుంటాను!'
    రాజేశ్వరి వారించలేదు.
    ఆమెకు అన్నం తినగానే నోట్లో వక్కపలుకు వేసుకోకపోతే అదోవిధంగా వుంటుంది.
    అయిదు నిముషాల్లోనే తిరిగివచ్చిన త్యాగరాజును జాలిగా చూస్తూ, 'పాపిష్టి దాన్ని .... కష్ట పెట్టానుగదూ .... నన్ను క్షమించాలి!' అన్నది.
    'ఉఁహూఁ ... నాదే తప్పు .... క్షమాపణలు దేనికి!' అన్నాడు తిరిగి బెడ్డింగ్ మీద కూర్చుంటూ.
    తెరిచిన తలుపుకుండా పుచ్చపువ్వులా వున్న వెన్నెల లోపలకు జొరబడి నేల మీద పారాడుతోంది.
    సత్యవతి వంటయింటి గడపకు దగ్గరిగా తనచాప పరుచుకొని, పక్క వేసుకున్నది - తరువాత, వీళ్ళ సంభాషణ పట్టనట్లుగా కళ్ళు మూసుకు పడుకున్నది గూడా!
    
                                  *    *    *

    రాత్రి పదిగంటయింది.
    రోడ్డుమీద రద్దీ తగ్గటంతో ఆ ప్రదేశాన్నంతా నిశ్శబ్ద మావరించింది.
    అటూ యిటూ కదులుతున్న త్యాగరాజును చూస్తూ, 'మీకు నిద్ర పట్టలేదా?' అన్నది కొద్దిగా దూరంగా చాప మీద పడుకున్న రాజేశ్వరి తలెత్తి.
    'ఉఁహూ...' అన్నాడు.
    'ఏఁవైనా ఆలోచిస్తున్నారా?'
    'అదీ చెప్పుకో తగ్గంతగా లేదు!'
    'మరి?'
    'రాజేశ్వరీ! కాసేపు ఇలా వచ్చి కూర్చో?'
    ఒక్కసారి పడుకున్న సత్యవంక చూచి వచ్చి త్యాగరాజు బెడ్డింగ్ అంచుమీదగా కూర్చున్నది -తలవంచుకొని!
    'ఏఁవిటి?'
    'ఈరోజున నా మనస్సేఁవీ బాగోలేదు, రాజేశ్వరీ!' అన్నాడు దీనంగా.
    'ఏఁవైంది?
    'సాయంత్రం చంద్రం నాకోసరం ఎందుకు కభురంపాడో ఏఁవైనా గ్రహించావా?'
    'లేదు! .... ఏఁ వన్నారు?' అన్నది వింతగా చూస్తూ.
    'అప్పగింతలు చెప్పాడు!.... అన్నాడు ఒక్కక్షణమాగి. ఉలిక్కిపడింది రాజేశ్వరి.
    'ఏఁవైంది.....ఆయన ఆరోగ్యపరిస్థితి ఎలా వున్నది?' అడిగింది ఆదుర్దాగా.
    ఒక్కసారి తలెత్తి అటు తిరిగి పడుకొని వున్న సత్యవతి వైపుకు జాలిగా భయంగా చూచింది.
    'ఏఁవీ లేదు......మామూలుగానే వున్నది. వాడి భయం అది!'
    'మీరు ధైర్యం చెప్పలేదా?' అన్నది సంశయిస్తున్నట్లుగా అతడి మొఖంలోకి చూస్తూ.
    'ధైర్యం చెప్పకేం......చెప్పవల్సిందంతా చెప్పాను....కాస్తో, కూస్తో చీవాట్లుగూడా పెట్టి వచ్చాను!'
    రాజేశ్వరి ఒక్క క్షణం సాలోచనగా శూన్యంలోకి చూస్తూ వుండి- 'ఒకటి లేండి....ఉదయంనుండి సాయంత్రం దాకా ఏ పనీ లేకుండా అలా పడివుంటే-ఆయనకే గాదు-ప్రతి మనిషికీ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటయి!' అన్నది.
    'నిజమే మరి....కాని, మనం చేయగలిగిందేఁవున్నది!' అన్నాడు కళ్ళు మూసుకొని, చీకటిని చుట్టూ అల్లుకుంటూ. 'ఏఁవో....వాడా మాటలు చెప్పి నప్పుడు నా ఒళ్ళు గగుర్పొడిచింది రాజేశ్వరీ!.....అంతేగాదు, ఇప్పటికీ నా మనస్సు కుదుటపరుచుకోలేక పోతున్నాను!'
    రాజేశ్వరి చిన్నగా నవ్వి వూరుకున్నది.
    'సత్యవతిని గూడా ఇలాగే భయపెడుతున్నాడటనా-అయినా, సత్యవతి చాలా ధైర్యస్థురాలిలా కనబడుతున్నది నాకు!' అన్నది.
    'లేదుట!.... అదీ అడిగాను గూడా!'
    కొన్ని నిముషాలు మౌనంగా గడిచిపోయినయి.
    ఎక్కడో కుక్క చలి భరించలేనట్లు ముడుచుకుపోతూ, వికృతంగా ఏడుస్తోంది.
    'నేనొకటి చెబుతాను.....నన్ను మన్నిస్తావా, రాజేశ్వరీ!'
    'ఎలాంటి ఉద్వేగమూ లేకుండా, ఏఁవిటది?' అన్నది అతడికళ్ళల్లోకి చూస్తూ.
    'మనం అనుకున్నట్లుగా రేపుదయాన మనం వివాహం చేసుకోలేమేమో....కలతజెందిన మనస్సుతో సంతోషంగా పెండ్లి పీటలమీద కూర్చోలేఁవని భయంగా వున్నది!' అన్నాడు ఆవేదనతో.
    'ఇన్నాళ్ళూ లేని తొందర ఈరోజున దేనికి?.... కొన్నాళ్ళు ఆగుదాం ఏం ఫరవాలేదు!' అన్నది చాలా చిన్నగా స్థిమితంగా.
    'ఈ రోజు చాలా చెడుదినం రాజేశ్వరీ! ఉదయాన శకుంతలకు ఆ దుర్ఘటన జరిగింది ..... అంతేగాదు, మధ్యాహ్నం స్వామి చెప్పిన అతడికధనం నన్ను కలచివేసింది.....నేను చాలా దురదృష్ట వంతుడిని రాజేశ్వరీ!'అన్నాడు. 'చంద్రంమాటలు నా గుండెల్ని పిండి వేస్తున్నాయి...'
    రాజేశ్వరి నవ్వింది.
    తల ఊగిస్తూ, 'ఉఁహూఁ....అన్నది.
    తన కుడిచేతిని అతడి గుండెలమీదుగా వేసి సున్నితంగా నొక్కుతూ, 'మీరు దుర్బలులు అంటే ఎవరు నమ్ముతారు?.....నేనుమాత్రం నమ్మను......మీరు చెప్పిందే నిజమయితే, రాణి ఆమె కోరుకున్న సౌఖ్యమయిన జీవితాన్ని ఎన్నుకున్నందుకు మీ గుండె ఇంత రాయిలా మారి వుండేదే గాదు....శకుంతలను అన్నిమాటలు అని వుండే వారేగాదు......లోకులు కాకులై ఇంతగా అరుస్తున్నా నన్ను మీ దగ్గర ఇలా వుంచుకుండే వారేగాదు!' ఫక్కున నవ్వింది రాజేశ్వరి. 'అవన్నీ దేనికి సత్యవతి నడగండి.....మీరు చిన్నప్పుడే ఎంత ధైర్యస్థులో ఏకరువు పెడుతుంది!'
    'రాజా!' అన్నాడు ఆవేశంగా 'ఏవఁన్నావ్?'
    అతడు తన చేతిని పట్టుకో బోతుండగా తప్పించుకొని వెళ్ళిపోయి తన కోసరం వేసుకున్న చాపమీద పడుకున్నది.
    ఆ క్షణంలో ఆమె మనస్సు - ఈ గృహంలో జేరిన రోజుననే కొత్త చిరునామాతో ఇక్కడ పరిస్థితులను వివరిస్తూ వ్రాసిన జాబుకు సమాధానంగా -ఆ రోజు టపాలో వచ్చిన చెల్లెలు వ్రాసిన ఉత్తరం చుట్టూ తిరగసాగింది.
    శూన్యంలోకి దిగులుగా చూస్తూ ఉత్తరంలోని మాటలను మనస్సులో పేర్చుకో సాగింది.
    'అక్కా'
    నీవువ్రాసిన ఉత్తరం అందింది.
    అమ్మ ఆరోగ్యం కులాసాగానే వున్నది. నేను తిపుకు వెళుతూనే వున్నాను.
    నీవు కొన్నాళ్ళు అక్కడ వుండవల్సి వస్తుందేమోనని వ్రాసిన మాటకు అమ్మ మనస్సు కష్టపెట్టుకుంటున్నది. ఆమె భయం ఆమెది .... ఆమెబాద ఆమెది- మనవి ఎంత మంచి మనస్సులైనా తల్లిగా ఆమె పరిస్థితులకు దిగులు పడటంలో అసహజత్వం లేదేమో ననిపిస్తోంది.
    డబ్బుకోసరం మేము ఇబ్బందిపడటం లేదు. నీవు ఇంట్లో వుంచి వెళ్ళిన దాంట్లో ఇంకా ఇరవై రూపాయలు వుండనే వున్నయి-అవసర మనుకుంటే బ్యాంకులో తీసుకు వస్తాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS