కొంతకాలం గడిచేసరికి ఒకనాడు అతని మీద దుమ్మెత్తి పోసిన పరిచయస్తులు కూడా అతని పనిని మెచ్చుకున్నారు.
"పిల్లాడు గట్టివాడే! మొండి పట్టు పట్టి నెగ్గుకోస్తున్నాడు. ఆ కిల్లీ కొట్టు లేదూ? దాని పక్క నో పుస్తకాల కొట్టు పెట్టేడుట. పత్రికలు, చిన్న చిన్న కదల పుస్తకాలు, తెల్ల కాగితాలు, పెన్సిళ్ళు లాంటివి అమ్ముతున్నాడుట."
"ఉదయం సాయంకాలం పేపర్లు పంచుతాడా? మెయిల్ వేళకు పత్రికలు, పుస్తకాలు పట్టుకుపోయి స్టేషను లో అమ్ముతాట్ట. మిగతా కాలం ఆ కొట్లో కూర్చుంటాడు."
"ఏదో, రోజురోజుకు బాగుపడుతున్నట్లే ఉంది అతని పరిస్థితి."
"బాగుందండీ, కష్టపడుతున్నాడో, బాగుపడుతున్నాడు. రోజంతా చాకిరీ చెయ్యటం లేదూ?"
"చాకిరి చెయ్యకుండా ఎవరికి గడుస్తున్నాదండి? ఇక్కడ అది కాదు ప్రశ్న. ఆచేసే పనిలో ఒక క్రమం, నిర్ణయం ఉండాలి. గానుగెద్దు రోజల్లా తిరుగుతుంది. ఎంత దూరం ముందుకు పోతుంది చెప్పండి! అలా తిరిగితే ఏమిటి లాభం?"
ప్రకాశం వినని ప్రజాభిప్రాయాలు ఇలా ఉన్నా , అతడు తన మనోగతాభిప్రాయాన్ని ఆరోజు తన డైరీలో సంతృప్తిగా వ్రాసుకొన్నాడు.
"ఈరోజు విజయదశమి. క్రిందటి సంవత్సరం ఈ రోజునే నేను నాటిన ఈ మొక్క, వెళ్ళు నాటుకొని ఈరోజు తోలి చిగురు పెట్టింది. అప్పన్న పెట్టిన అప్పులో కొంత చెల్లుబెట్టెను. ఒక పత్రిక ఏజెన్సీ కోసం సొమ్ము డిపాజిట్ చేసెను.
"నువ్వే పని చేపెట్టినా సఫలం అవుతుంది ప్రకాశం' అన్న వదిన దీవన ఫలించింది. బ్రతుకులో నా కింక భయం లేదు. ప్రగతి లో నాకింక శంక లేదు. కష్టించి సాధించలేని కార్యం లేదు. పట్టుదలతో పొందలేని పురోగతి లేదు. ఇది నాకు వేదం. ఇది నాకు గీత. ఇదే నా పూజా పాఠం."
ప్రకాశం తన డైరీ లో ఏం వ్రాసుకున్నాడో ఆ ఇంట్లో ఎవరికీ తెలియదు, కాని అతని ముఖంలో కనిపించిన సంతృప్తి మాత్రం అందరు చూసేరు.
మొదట్లో ప్రకాశం అలసి సొలసి ఇంటికి వచ్చి, ఇంట్లో అన్నగారి హేళనలకు, ఎత్తి పోడుపులకు బాధపడి దిగాలుగా కూర్చున్న సమయాల్లో జానకి అతడిని వై=ఉత్సాహపరిచేది , ధైర్యం చెప్పేది. "నీ అంతట నువ్వు నిర్మించుకొంటున్న కొత్త బాట ఇది, ప్రకాశం. రాళ్ళు, తప్పించుకొని, ముళ్ళ కంపలు తొలగించుకొని ముందుకు నడవాలి. అడవులు, కొండలు అవలీలగా దాటగల ఈ వయస్సులో , ఉత్సాహంతో ఉరకలు వేసే ఈ మనస్సుతో ఈ చిన్న గులక రాళ్లకు , పల్లేరు కాయలకు వెరచి అడుగు వెనక్కు లాక్కుంటావా? మంచికో, చెడ్డ కో ఓ దారి ఎన్నుకున్నావు. ధైర్యంగా ముందుకు నడువు." అనేది.
ఆ మాట తన అంతర్వాణికి ప్రతిధ్వనిలా అనిపించేది ప్రకాశానికి.
* * * *
అ సంవత్సరం పొడుగునా అనసూయమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటున్నది. నాలుగురోజులు తిరిగితే పది రోజులు పక్క మీద ఉండవలసి వస్తున్నది. ఆమె బాధ్యతలు కూడా తనే నిర్వహించవలసి రావడంతో జానకికి బాలవిహార్ లో కార్యభారం అధికమయింది. తనకు తోడుగా ఇంకెవరైనా ఉంటె కాని పని జరగడం కష్టమని పించింది.
వివిధ మనస్తత్వాలతో , రకరకాల వయస్సు లలో ఉండే పాతిక మంది పిల్లల్ని అదుపులో పెట్టి ఉంచడం అంత తేలికైన పనికాదు. అనసూయమ్మ ఆ గది లోంచి ఈ గదిలోకి మాట్లాడుతూ తిరుగుతుంటే పిల్లలంతా ఎక్కడి వారు అక్కడ నెమ్మదిగా తమ కార్యకలాపాలు సాగించుకొనే వారు. ఆమె మాటలో, చూపులో పిల్లల్ని వశపరుచుకొనే శక్తి ఉన్నట్లు అనిపించేది జానకికి.
జానకి అంతకు మించిన ప్రేమతో వారిని సముదాయిస్తున్నా ఆమె మాటకు పిల్లలు విలువ ఇవ్వరు. అందులో కాస్త పెరిగిన పిల్లల్ని అదుపులో పెట్టడం జానకి వశంలో లేకుండా పోతున్నది. ఈ విషయం గురించి అనసూయమ్మ తో మాట్లాడి, కొంతకాలం వరకైనా సాయంగా ఇంకొకర్ని వేసుకోవలసిన అవసరం ఉన్నదని భావించింది జానకి.
వరండా లో కుర్చీలో కూర్చున్న అనసూయమ్మ గేటు దగ్గర నుండే జానకిని చూసి, "ఇంకా నీ కోసం కబురు పంపుదామనుకొంటున్నాను. నువ్వే వచ్చేవు" అన్నది.
"బాలవిహార్ గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని...."
"నేననుకొంటున్నది అదే. ఆ మధ్య నీతో చెప్పెను కదూ, మాతమ్ముడు గోవింద బాబు వస్తున్నాడని? నిన్న రాత్రి రైల్లో వచ్చేడు. నీకు పరిచయం చేద్దామని కబురు పెట్టబోతుంటే నువ్వే వచ్చావు."
ఆవిడ మాట పూర్తీ కాకుండా ముప్పయి ఏళ్ళు పైబడ్డ వయస్సు లో ఉన్న ఓ వ్యక్తీ వరండా లోకి వచ్చేడు. పంచె కట్టిన తీరు, జుట్టు దువ్విన తీరు చూస్తె బెంగాలీ వాడిలా ఉన్నాడు. సన్నగా, పొడుగ్గా చామన చాయ శరీరం తో చూసేందుకు నవీన, సంప్రదాయానికి చెందినా వాడిలాగే ఉన్నాడు. అనసూయమ్మ చెప్పేవరకు అతడే ఆమె తమ్ముడు గోవింద బాబు అనుకోలేదు జానకి.
గోవింద బాబు అన్న పేరు బెంగాలీ పేరులా ఉన్నా మనిషి చూసేందుకు కూడా బెంగాలీ లాగే ఉంటాడనుకోలేదు. ఇతడు అనసూయమ్మకు ఎటువంటి తమ్ముడై ఉంటాడా అని ఆలోచించసాగింది. ముప్పయి నిండిన గోవిందబాబుకు, అరవై నిండిన అనసూయమ్మకు మధ్య పోలికలు వెతకడం అర్ధం లేని పని అనుకోంది. ఏదైనా ప్రత్యేకత ఉంటే ఆవిడే చెప్తుంది లే అని ఊరుకొంది.
పరిచయాలు అయేక అసలు విషయంలోకి వచ్చింది అనసూయమ్మ. "జానకి చాల మంచి పిల్లరా, గోవిందూ" అన్నది.
"నేను మంచాన పడ్డ ఈ ఏడాది పాటు తనే చాకచక్యంగా అంతా చూసుకొంటున్నది. నా అనారోగ్యం చూస్తె ఇంకా పూర్వంలా తిరగనిచ్చేది లేదు అనిపిస్తున్నది. అందుకే నీకు ఉత్తరం రాసేను. కాస్త జానకి పని తగ్గినట్టూ అవుతుంది. నీకు మా బాలవిహార్ చూసినట్టూ అవుతుందని రమ్మన్నాను.
"కొంతకాలం చూసి నీ కిష్టమైతే ఇక్కడే ఉండి పోవచ్చు. మాకు ఒక డాక్టరు అవసరం ఎప్పటి కప్పుడు ఉండేదే. ఇంతమంది పిల్లల్లో ఎప్పుడూ ఎవరికో ఒకరికి శైత్యం, పైత్యం ఉంటూనే ఉంటాయి. నువ్వయితే ఒక్క వైద్యమే కాక, మిగిలిన పనులు కూడా చూసుకు పొతుండవచ్చు" అన్నది ఆవిడ.
"సరే. ఆ విషయాలన్నీ తాపీగా మాట్లడుకోవచ్చు. అక్కా. ముందు నాకు మీరు చేస్తున్న పని నచ్చాలి. అటు తరువాత అక్కడి డిస్పేన్సరీ మూసుకు రావాలి. ఏదో ఒకటి రెండు నేలలైతే నాన్నగారు ఎలాగోలాగ చూడగలరు కాని, ఎల్లకాలం అంటే కష్టం. అతనికీ నీ వయసే ఉంటుంది కదా?"
"సరే , నీ ఇష్టం అన్నాను కదా! జానకీ , రేపు గోవింద బాబును తీసుకెళ్ళి మన ఆఫీసు, హాస్టలు , పిల్లల క్లాసు రూమ్ లు అన్నీ చూపించు. మన ఆదాయ వ్యయాలు కూడా చూపించడం అవసర్ధమే అనుకొంటాను. ఒకటి రెండు నెలలు ఉంటాడు కాబట్టి అన్నివిషయాలు అతను తెలుసుకొంటే నీకు కొంచెం పని తగ్గుతుంది.
"నాకు సులువుగా ఉంటె నేనే వస్తాను. లేకుంటే నువ్వే ఇతన్ని అందరికీ పరిచయం చెయ్యి. నాకు బదులుగా కొన్నాళ్ళు ఇతడు పని చేస్తాడని చెప్పు."
'అలాగేనమ్మా . రేపు ఉదయం ఇంటి నుండి తిన్నగా ఇక్కడికే వచ్చి గోవిందబాబు గారిని తీసుకొని వెళ్తాను."
"సరే, మరి నువ్వు వెళ్ళు. చీకటి పడుతున్నది" అన్నది అనసూయమ్మ.
గోవిందబాబుతో మాట్లాడేక అతడు బెంగాలీయే మో అన్న అనుమానం జానకికి తీరిపోయింది. అతని తాత, ముత్తాతల నాడు వీళ్ళ కుటుంబం ఉద్యోగ రీత్యా కలకత్తా వెళ్ళి పోయేరుట. గోవిందబాబు పుట్టుక, విద్యాభ్యాసం అంతా బెంగాలు లోనే జరిగింది. అతని తాతగారి పేరు గోవిందయ్య. బెంగాలు లో పెరగడం చేత తాతగారి పేరు పెట్టుకొన్నా, గోవిందబాబు గా తయారయ్యేడు ఇతడు.
వీరికి, అనసూయమ్మకు వేలు విడిచిన సంబంచాలేవో ఉన్నాయట. కాని, అనసూయమ్మ గారి భర్తకు, గోవిందబాబు తండ్రికి ఉన్న స్నేహం ఆబాధరాయణసంబంధం కన్న గొప్పది. ఆ మూలంగానే వీరింటికి, వారింటికి రాకపోకలు జరుగుతుండేవి.
గోవిందబాబుకు బాలవిహార్ వంటి సేవాసంస్థలంటే ఆదరం అభిమానం ఉన్నాయి. అతడు డాక్టరు డిగ్రీ పుచ్చుకొని కలకత్తా కు దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు లో డిస్పేన్సరీ పెట్టి అనాధలకు, దరిద్రులకు మందు మాకులిస్తూ చుట్టూ పక్కల గ్రామాల్లో సంచార ఆసుపత్రులు నడుపుతున్నాడు. తండ్రి తాతలు డబ్బు గడించవలసిన బెడద అతని పై పెట్టనందున తన ఆదర్శాలను ఆచరణ లోకి తెచ్చుకొనే ప్రయత్నం లో ఉన్నాడు గోవిందబాబు.
తన అభిప్రాయాలకు దగ్గరలో ఉన్న ఈ బాలవిహార్ ను అనసూయమ్మ ఎలా నడుపుతున్నాడో చూసి పోవాలని అతను అనుకొంటున్న సమయంలోనే ఆమె దగ్గరి నుంచి ఉత్తరం రావడం, ఇతడు ప్రయాణం కావడం జరిగింది.
జానకి అతన్ని బాలవిహార్ అంతా తిప్పి, పేరు పేరునా అన్నీ చూపించింది. అక్కడ పని చేస్తున్న వాళ్ళకూ పిల్లలకూ, అతన్ని పరిచయం చేసింది. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ప్రార్ధన జరుగుతున్నది. చిట్టి, పొట్టి, పాపలంతా పువ్వుల్లాటి తమ చేతుల్ని జోడించి, టీచరు ముఖం లోకి దృష్టి నిలిపి నించున్నారు. కాస్త పెద్ద వాళ్ళు, పాట నేర్చిన వాళ్ళు, పలక నేర్చిన వాళ్ళు టీచరు తో పాటు ప్రార్ధనలో తమ గొంతులు కలుపుతున్నారు.
"నీవే తల్లివి, తండ్రివి.
నీవే నా తోడూ నీడ...."
ఆ పసిపాపల నోట ఆమాట లెప్పుడూ జానకి కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాయి. ఆ పిల్లలకు ఆ మాటలలోఅర్ధం తెలియదు. తాము భరోసా పెట్టుకొన్న ఆ భగవంతుని గురించి అంతకన్నా తెలియదు. వాళ్ళకు కావలసింది టీచరు మెప్పడం.
"శభాష్ , పాపా! బాగా పాడే'వనో , "చూడు, ఆ బాబు ఎంత భక్తిగా కళ్ళు మూసుకుని ప్రార్ధన చేస్తున్నా" డనో అంటే, 'అంతేచాలు . తెలిసి చేసినా, తెలియక చేసినా భగవంతుడు వాళ్ళకు తల్లీ తండ్రీ అయి కాపాడాలని మనసులో కోరుకొంటుంది జానకీ.
ప్రార్ధన పూర్తయింది. పిల్లలంతా జానకిని చుట్టూ ముట్టేరు.
"అక్కా....అక్కా.... అమ్మ రాలేదా?"
"నాకు అమ్మను చూడాలని వుంది."
"అమ్మ నిన్న కూడా రాలేదు."
"ఈరోజు సాయంకాలం అమ్మ తప్పకుండా వస్తారమ్మా! నిన్న మీరు చేసిన కత్తి పడవలు,గూడు పడవలు ఇంకా లవంగాల బుట్టలు అన్నీ జాగ్రత్త గా ఉంచారా? అమ్మ రాగానే అని చూపించాలి. మరి."
'అక్కా....అక్కా.... మాటీచరు ఏరో ప్లేను చెయ్యడం నేర్పింది. నేనెంతో బాగా చేసెను. తీసుకొస్తాను. చూస్తావా?"
'ఇప్పుడు కాదు తరువాత చూస్తాను కాని నేనుమీ కోసం ఎవర్ని తీసుకోచ్చేనో చూసేరా?"
