
పరీక్షలు సంతృప్తిగా వ్రాశాము నేనూ, రత్నా.
ఇద్దరికీ క్లాసు వస్తుందన్న భరోసా ఉంది.
సాయంకాలం రత్న వచ్చింది. అన్నయ్యా, నేనూ హాలులో కూర్చున్నాం. నాకంటే ముందు అన్నయ్యే ఆహ్వానించాడు చిరునవ్వుతో, 'రా, రత్నా. కూర్చో' అంటూ.
నాకోసం తరుచు ఇంటికి వస్తూ పోతూండడంవల్ల రత్నకూ, అన్నయ్యకూ పరిచయస్నేహాలు అభివృద్ధి చెంది, ఇరువురి అంతరంగాలూ అనురాగవల్లరితో బంధించబడ్డాయని నాకు తెలుసు. వారికి ఏకాంతం కల్పించాలన్న ఉద్దేశ్యంతో పనివంకతో ఇంట్లోకి వెళ్ళాను. బయటి గదిలో వారి సంభాషణ వినబడుతూనే ఉంది. కిటికీ పక్కగా నిల్చుని వారిద్దరిని ఓరగా చూస్తూనే ఉన్నాను.
'పరీక్షలయిపోయాయి. ఏమిటి తరవాత ప్రోగ్రాం?' అన్నయ్య నవ్వుతూ అడిగాడు.
'సెలవుల్లో మీ ప్రోగ్రాం ఏమిటి?' ఎదురుప్రశ్న ప్రశ్నించింది రత్న.
'అబ్బో! నాకు పనులకేం తక్కువలేదు.'
'ఏమిటి అన్ని పనులు?'
'రూప చదువు అయిపోయింది. ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాను. నంబర్ వన్ అయిపోయింది. నంబర్ టూ- నేను వరించిన అమ్మాయికి అంగీకారమైతే ఆశ్రమప్రవేశం చెయ్యడం. నంబర్ త్రీ - రూప కల్యాణం.' ఉత్సాహంగా చెప్పాడు.
'మీ హృదయం దోచుకోగలిగిన ఆ అదృష్టవతి ఎవరో?' ఓరగా చూచింది. ప్రేమికులకు ఇది ఒక వెర్రి. తమ హృదయానికి తెలిసిన విషయమే అయినా ప్రియుల నోటినుండి వింటేగాని హాయి లేదు!
'చెప్పనా?' చిలిపి చూపులతో కవ్విస్తూ అడిగాడు.
'ఊఁ.'
'నా హృదయాన్ని దోచుకున్న దొంగ ఇదిగో!' అంటూ రత్న చెయ్యి పట్టుకొన్నాడు అన్నయ్య.
'అసలు దొంగ ఎవరో ఇప్పుడెందుకు చెప్పడం కాని ఆమె అంగీకరించకపోతేనో?' వస్తూన్న నవ్వును పంటికింద నొక్కిపెట్టి, గంభీరంగా అంది రత్న.
'బలే గడుసుపిల్లవు!' అన్నయ్య కొంటెగా నవ్వుతూ రత్న చెక్కిలిమీద చిటిక వేశాడు. 'మరొకసారి దొంగ వయ్యావు. అంగీకరించకపోతే ఆ బుగ్గలు గులాబీలు పూయవు.'
'చాల్లెండి చమత్కారం!' ఆనందంతో, సిగ్గుతో రత్న ముఖం ప్రపుల్లమైంది. 'అంగీకరించదే అనుకోండి' అంది సాగదీస్తూ.
'సన్యాసాశ్రమం! నాలాంటివాళ్ళకు తొందరగా ప్రవేశం ఇస్తుంది.' గమ్మత్తుగా ముఖం వేలాడవేసుకొన్నాడు.
'పాపం! లోకంలో ఆడపిల్లలకు కరువు వచ్చినట్లు.' తమాషాగా పెదవి విరిచింది.
'ఎందరు ఉన్నా నా రత్నకు సాటి రారు.'
'భక్తుడి నిష్కళంక ప్రేమకు మెచ్చి దేవత వరం ఇస్తూంది. కోరిన అమ్మాయిని పెళ్ళాడి గృహస్థ జీవనం సాగించు!'
'ధన్యోస్మి!' నతమస్తకు డయ్యాడు.
'రూప పెళ్ళి అన్నారు; సంబంధం చూశారా?'
'ఏదీ? రూప అనుమతితో వరుడికోసం వేట సాగించాలి.'
'ఏం పెళ్ళో! రూప ఎలాగై పోయిందో చూశారా?'
'ఏమైంది?' కంగారుపడ్డాడు అన్నయ్య.
'ఆ ముఖంలోఓ నవ్వూ లేదు; ఉత్సాహమూ లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచనలతో పరధ్యానంగా ఉంటూంది. ఎంత ప్రయత్నించినా కారణం కనుక్కోలేకపోయాను. ఏమైంది తెలియదు. ఈ పరిస్థితిలో అది పెళ్ళికి ఒప్పుకుంటుందని అనుకోను.'
'ఏమైంది?' కంగారుపడ్డాడు అన్నయ్య.
'ఆ ముఖంలో ఓ నవ్వూ లేదు; ఉత్సాహమూ లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచనలతో పరధ్యానంగా ఉంటూంది. ఎంత ప్రయత్నించినా కారణం కనుక్కోలేకపోయాను. ఏమైంది తెలియదు. ఈ పరిస్థితిలో అది పెళ్ళికి ఒప్పుకుంటుందని అనుకోను.'
'నిజమే.' అన్నయ్య దీర్ఘంగా నిట్టూర్చాడు. 'రూప అలాగైపోవడానికి కారణం ఉంది. నాలుగైదు నెలలప్పుడు కిషన్ అకాలమరణం గురించి నువ్వు వినే ఉంటావు. చిన్న వయస్సులోనే పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన చిత్రకారుడు. అతడు మా ఊరివాడే. బంధువు కూడా. అతడి దగ్గిరికి చిత్రలేఖనం నేర్చుకొంటానని వెళ్ళేది రూప, సెలవుల్లో వెళ్ళినప్పుడు. కిషన్ ధనసంపద లేకపోయినా రూపసంపదకూ, విద్యాసంపదకూ లోటులేనివాడు. రూపకు అతడు యోగ్యుడని భావించాను. రూపకూడా అతడిని ప్రేమిస్తూందని గ్రహించాను. ఒకనాడు రూప కిషన్ తో తన వివాహ ప్రస్తావన తెస్తుందనీ, అందుకు మనఃపూర్వకంగా అంగీకరించాలనీ అనుకొన్నాను. వారిద్దరి సుఖ సంసారానికి సర్వసౌఖ్యాలు ఏర్పరచాలని మురిశాను. రూపను ఎవరికిచ్చి చేసినా నా ఆస్తిలో సగం దానికి ఇచ్చి మా ఊళ్ళో నే పెట్టుకోవాలని ఆశించాను కనక, కిషన్ కు ఇచ్చి చేస్తే ఒకే ఊళ్ళో ఉంటుంది - ప్రతినిత్యం చూచుకోవచ్చని అనుకొన్నాను. అందరి ఆశల్ని తెంచివేసి కిషన్ పాము కాటుతో చనిపోయాడు. ఇంకా అదృష్టం అప్పటి రూప దుఃఖం చూసి పిచ్చిదే అవుతుందనుకొన్నాను. దైవం ఒకింత దయ తలిచాడు. అప్పటినుండీ అది అలా కుమిలిపోతూంది. చూచీ చూడనట్లు ఉంటున్నానేగాని లోలోపల వేదన పడుతూనే ఉన్నాను.'
'అన్నయ్యది ఎంత నిండు హృదయం! కిషన్ తో నా ప్రేమను గురించి తెలిసినా ఎన్నడూ బయట పడలేదు!' ఆశ్చర్యపోయాను.
'తెలిసి ఉండీ రూప వివాహానికి సుముఖత చూపుతుందని ఎలా అనుకోగలిగారు?'
అన్నయ్య మౌనం వహించాడు.
'అందుకనే నే నొక కార్యక్రమం నిర్ణయించాను. రూపను వెంటబెట్టుకుని ఊళ్లు తిప్పుకు వస్తాను. ప్రసిద్ధ ప్రదేశాలన్నీ చూసి వస్తాము. ఈ ప్రయత్నంతో రూపలో మార్పు తప్పకుండా వస్తుందని నమ్ముతున్నాను.'
'రత్నా, నీ మేలు జన్మలో మరిచిపోను.' అన్నయ్య ఆనందాతిరేఖంతో రత్న చెయ్యి అందుకొన్నాడు. 'రూప నా ప్రాణం. అది బాధపడడం నేను సహించలేను. అతి మృదువైనది దాని హృదయం. తగిలినదెబ్బ మామూలు కాదు. దాన్ని మామూలు మనిషిని చేసే బాధ్యత ఈ క్షణంనుండి నీ కప్పగిస్తున్నాను.'
అన్నయ్య కళ్ళలో నిండిన నీళ్ళ తళతళలలో నామీద అతడికి ఎంత ప్రేమో వెల్లడి అవుతూంది. నేనంత అదృష్టవంతురాలిని, దేవుడివంటి అన్నయ్యను కలిగి ఉన్నందుకు! రత్న నిజంగా రత్నమే! కర్తవ్యనిష్ఠ, లక్ష్యసాధన దానిసొత్తు. రత్నే లేకపోతే నేనేమై పోదునో!
'రూప కళ్యాణం లోనే మన కల్యాణమూ.'
'ఓహో.'
ట్రేలో కాఫీ తీసుకుపోయి రత్నకూ, అన్నయ్యకూ ఇచ్చి నేనొకటి తీసుకొని కూర్చున్నాను. మరునాడు అన్నయ్య ఊరికి వెళ్ళడానికీ, నేనూ రత్నా యాత్రకు బయలుదేరడానికీ నిర్ణయమైంది, కార్యక్రమం.
రెండునెలల తరవాత కలకత్తాలో ఉన్నాము. అన్నయ్యకు వ్రాసి తెప్పించుకొన్న మనీఆర్డర్ తోపాటు అన్నయ్య నుండి ఓ ఉత్తరంకూడా వచ్చింది, రత్న యూనివర్సిటీ కి రెండవదిగాను, నేను క్లాసుతోను పాసయినందుకు అభినందనలు తెలుపుతూ. సరి అయిన అడ్రస్ ఇస్తే తను ఫలానానాటికి అక్కడికి వస్తాననీ, రూపను చూడబుద్ధి వేసిందనీ వ్రాశాడు.
దిక్కు తోచకుండా పోయింది మాకు. అన్నయ్య వస్తే ఇంతా వ్యర్ధం! సమస్య ముందు పెట్టుకొని సతమతమౌతున్నాము.
కడుపులో చెయ్యిపెట్టి మెలిపెట్టినట్లు కాసాగింది. నడుంమీద చెయ్యి పెట్టుకొని భారంగా గదిలో పచార్లు చెయ్యసాగాను.
'ఏమిటి సంగతి?' అనుమానిస్తూ అడిగింది రత్న.
'అదే...ఏమిటో...' చెప్పలేక నవ్వేసి ఊరుకొన్నాను.
'రెన్నెల్లు ముందు! కలిగిన బిడ్డను ఏం చెయ్యాలని సతమతమవుతూంటే భగవంతుడే తీరుస్తున్నట్లు న్నాడు.' శిశువు బ్రతికి పుట్టదన్న సంతోషంతో నర్సుకోసం పరిగెత్తింది రత్న.
నర్సుతో గదిలోకి అడుగుపెట్టిన రత్న, నాకు పుట్టిన శిశువు ఏడుపు విని గుమ్మంలోనే కొన్ని క్షణాలు కొయ్యబారి నిలుచుండి పోయింది.
బాబుకు స్నానం పోసి నాపక్కలో పడుకోబెడుతూన్న నర్సుతో అంది రత్న: 'ఏడవనెల. బిడ్డ బ్రతికి పుడతాడనుకోలేదు!'
'ఏడవనెలలో పుట్టిన బిడ్డకు ప్రాణగండమేమీ ఉండదు.' అదేదో దైవమాయలా భావిస్తూన్న రత్న సందేహం తీర్చివేసింది నర్సు.
బాబుకు ఏడురోజులు నిండాయి. బాబును ఏ అనాథ శరణాలయంలోనో చేర్చి ఇంటికి వెళ్ళి పోవాలన్న రత్న ఆలోచన నన్ను కలవరపెడుతూంది. బాబును చూచుకొంటూంటే నా కిషన్ బతికివచ్చినట్లుగా ఉంది.
బాబును ఒళ్ళో పడుకోబెట్టుకొని ముద్దులాడుతున్నాను.
రత్న వచ్చింది. దాన్ని దగ్గిరికి పిలిచి బాబును చూపించాను. 'అంతా తండ్రి పోలిక. రంగుమాత్రం నాది వచ్చింది. చూడు, ఆయన ఫోటో చూశావుగా?'
రత్న ముఖం చిట్లించింది, నా ఆనందోద్వేగం చూచి.
'అంతా తండ్రి పోలిక. తండ్రి ఎవరినీ నొప్పించిన వాడు కాదుగా! రెన్నెల్లు ముందుగానే నా బరువు తీర్చి తండ్రిపేరు నిలబెట్టాడు. అమ్మ కష్టం చూడలేడు నా బాబు!' బాబును గుండెల కద్దుకొని పొంగి పోతున్నాను. మాతృవాత్సల్యంలో ఎంతటి మాధుర్యం!
'రూపా!' రత్న కంఠం కటువుగా ధ్వనించింది. 'ప్రేమ ఇవ్వడానికీ, పొందడానికీ కొందరికి అర్హత ఉన్నా, అధికారం ఉండదు.'
నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
నా కన్నీరు చూచి కదిలిపోయింది రత్న. 'వాడిపై మమత పెంచుకోకు, రూపా. వాడెంత నీకు ప్రియమైనా, వాడికి నువ్వెంత కావలసినా మీ తల్లీ బిడ్డలకు వియోగం తప్పదు.' జాలిగా నిట్టూర్చింది. రత్న కళ్ళలోనూ అశ్రువులు నిండాయి.
మరురోజు రైలు ఎక్కాము.
గంటసేపు పోరు పెట్టిపెట్టి కన్నులు మూశాడు బాబు, రాత్రి రెండుగంటలవేళ. నాకూ నిద్ర తూగుతున్నది. బాబును రత్నకు ఇచ్చి రగ్గు కప్పుకొని పడుకొన్నాను. తెల్లవారి రత్న లేపేవరకూ ఒకటే మొద్దు నిద్ర. 'లే, రూపా. బాబుకు పాలు పట్టు కడుపునిండా.'
రత్న చేతులనుండి బాబును అందుకొని పాలు పట్టాను. వాడికి కడుపు నిండిందేమో కళ్ళూ చేతులూ కదిలిస్తూ ఆట మొదలుపెట్టాడు.
'లే, లే. నీ బాబు ఆటపాటలు చూచి మురిసిపోయే భాగ్యం నీకు లేదు' అంటూ నా ఒళ్ళో నుండి బాబును లేపి బెర్త్ మీద పొత్తిలి ఏర్పరచి పడుకోబెట్టింది.
సూటుకేసూ బెడ్డింగూ ఎప్పుడు మార్చిందో, మరో పెట్టెలోకి.
'పద!' నా వెన్ను తట్టింది.
సంగతి అర్ధమయ్యేసరికి నా గుండె ఆగిపోయినంత పని అయింది. 'ఇలా అర్ధాంతరంగా నా బాబును వదిలివెయ్యలేను. ఆకలి అయితే బాబుకు పాలెవరు పడతారు?' బాబును ఎత్తుకోబోయిన నా రెక్కపట్టి లాగింది రత్న. 'డబ్బుకు పద. అతడు వస్తాడు. చెప్పిన మాట విను.'
'ఎవరు?'
'చదువూ, సంస్కారమూ ఉన్న ఒక మానవుడు. బాబుకు అన్యాయం జరగనియ్యడని నా ఆత్మ చెబుతున్నది. టీ తాగడానికి దిగాడు. అతడు వచ్చేలోగా మనం వెళ్ళిపోవాలి.'
'బాబూ, నా బాబూ!' బాబును గాఢంగా గుండెల కదుముకొన్నాను, ఆవేశంగా, దుఃఖం పొర్లుతూండగా ముద్దు పెట్టుకొన్నాను. 'నిన్ను విడిచి ఎలా పోనురా, తండ్రీ?' అన్నాను. 'ఆకలేసి ఏడిస్తే నీ చిన్ని పొట్టకు పాలు పట్టడానికి అమ్మ ఉండదు కదా, నాన్నా?' అన్నాను. పిచ్చిదానిలా ఏమేమో అన్నాను.
బాబును నా చేతులనుండి లాగి బెర్త్ మీద పడుకో బెట్టింది రత్న.
రత్న నా చెయ్యిపట్టి లాగుతూండగా బాబును గాఢంగా. చుంబించి జలజలా కన్నీళ్ళు రాలుస్తూ వెళ్ళిపోయాను. అబ్బా! ఎంత దురదృష్టకరమైన అనుభవం!
సంధ్య వాలుతూండగా రత్న ఊరు చేరాము.
రత్న ఇంటిముందే వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. వాడు గోకులాష్టమీ. మా బండి ఇంటిముందు అగినప్పుడు ఉట్లు కొడుతున్నారు.
'యశోదాదేవికడ గోకులమందు మురిపెంగా, అల్లరిగా, పోకీరీగా పెరిగాడు చిన్ని కృష్ణుడు. కాని, కన్నతల్లి దేవకీదేవి బిడ్డకు దూరమై ఆమె పొందిన సంక్షోభం ఎంత దుర్భరమైంది! రత్న చెప్పిన మాటలకు బాబు సుఖంగా ఉండగలడనీ ధైర్యం వహించినా నా కడుపుశోకం తీరే దెలాగ? ఈ పాలబరువును భరించే దెలాగ?'
అన్నయ్య వచ్చి నన్ను తీసుకువెళ్ళాడు. అమ్మ ద్వారా పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు. కొంతకాలం ఆగమని చెప్పాను. కొన్నాళ్ళపాటు ఉద్యోగం చెయ్యాలనీ సరదాగా ఉన్నదన్నాను.
నా పట్టుదల మీద రత్నకూ, అన్నయ్యకూ వివాహం జరిగింది అదే నెలలో. రత్న మా ఇంటికి కాపరానికి వచ్చింది. అన్నయ్య ఉద్యోగం వదిలేసి ఇంటి దగ్గిరే ఉంటూ ఇంటి వ్యవహారాలు చూచుకొంటూ, నాన్న 'కృష్ణా రామా' అనుకొంటూ కాలం గడిపే అవకాశం కల్పించాడు.
అప్పుడప్పుడు బాబును తలుచుకొంటూ ఏడవడం చూచి, తమ ఊరివాడైన ఒక డాక్టరు దగ్గిర వాడు సుఖంగా పెరుగుతున్నాడని చెప్పి ఓదార్చింది రత్న. నా పొరు పడలేక అతడు ఏ ఊళ్ళో ఉంటున్నదీ చెప్పింది కాని చిరునామా ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోలేదు.
బాబును కలుసుకోవాలన్న కోరిక పెట్టుకోక పోయినా బాబు పెరుగుతూన్న ఊళ్ళో ఉండాలనిపించింది. లెక్చరర్ గా ఉద్యోగం వేయించుకొన్నాను. మామూలు మనిషిగా పైకి మెలుగుతూన్నా కిషన్ స్మృతి, బాబు ముద్దుమేమూ గుర్తు వచ్చి నన్ను ఆరడి పెడుతూనే ఉన్నాయి. కన్నీళ్లు కాల్వలు కట్టిస్తూనే ఉన్నాయి.
* * *
