"నిఖిల్ తొందరగా తయారవ్వు. నీతో అర్జంటుగా పని వుంది" వరండాలోంచే కేకేశాడు భార్గవ.
"మా ఆవిడకు తల రుద్దగానే వచ్చేస్తున్నా....కాదు కాదు....సారీ! మా ఆవిడ నా తల రుద్దగానే చిటికెలో వచ్చేస్తాగా" అంటూ బాత్రూంలోకి చొరబడ్డాడు నిఖిల్. నిర్లిప్త నవ్వుకుంది.
"ఏమండోయ్ శ్రీవారూ....తల రుద్దుకోవటం అంటే, జుట్టు పీక్కోవటం కాదు. కళ్ళు మూసుకుని జాగ్రత్తగా రుద్దుకోండి....వ్వెవ్వెవ్వే..." అంటూ నవ్వుతూంది నిర్లిప్త.
చంద్రబింబం లాంటి మోముకు దానిమ్మ పళ్ళలాంటి పలువరస తళుక్కుమంటూంటే ఆ మెరుపు తీగను కన్నార్పకుండా చూశాడు భార్గవ వరండాలోంచే.
ఆ మల్లె సోయగాల, సౌరభానికే అతడు 'క్షణం పాటు' ఆకర్షితుడయ్యేది.
మగాడి చూపు పడగానే ఆడదానికి అర్జంటుగా గుర్తొచ్చే పమిటను పదిలంగా సర్దుకుంది ఓసారి నిర్లిప్త భార్గవ చూపుల్ని గమనించి.
నిశ్శబ్దాన్ని నిలుపలేక....
"బాబీ...స్కూల్ కెళ్ళిపోయాడా అన్నయ్యా?" అంది.
"వెళ్ళాడు. వాడి ఐక్యూతో రోజు రోజుకూ నన్ను చంపుకు తింటున్నాడు" అతని గొంతులో గుర్తుపట్టలేని అస్పష్టత.
"మీరేమిటీ అదోలా వుంటున్నారు?" అంది నిర్లిప్త తలుపు వారగా నిల్చుంటూ. భార్గవ గాఢంగా నిట్టూర్చి "ఏమీ లేదులే..." అన్నాడు. ఏమీ లేదులే..." అన్నాడు. ఏమీ లేదులే అన్న దాంట్లోనే ఏదో వున్నదని తెలియకనే తెలుస్తుంది.
"మీరు_మీరు మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదా?" అంది కొద్దిసేపటి తర్వాత.
"అడవిలో కూడా వెన్నెల కాస్తే కనీసం ఒక్క చెట్టయినా, పుట్టయినా ఆనందిస్తూనే వుంటుంది. నా జీవితం అడవికాచిన వెన్నెలే అయినా, వెన్నెల వెలుగునంతా చందమామలాంటి బాబిగాడిలోనే చూసుకుంటున్నాను గాని, ఆ వెన్నెల్లో చీకటిరేఖల్ని చూడలేదింతవరకూ..." అన్నాడు తన రచనా ధోరణిలో.
"ఈ వయసులో మీకో తోడూ నీడా వుండాల్సింది కదా, మీరయినా ఎంతకాలం బాబిగాడి బాగోగులు చూస్తారు. కనీసం బాబిగాడి కోసమైనా..."
"వచ్చినావిడ బాబిగాడి బాగోగులు స్వార్ధంతో చూడకపోతే నాకు మరో సమస్య కొనితెచ్చుకున్నట్టవుతుంది నిర్లిప్తా....! ఈ సూచన నిఖిల్ ఎప్పుడో చెప్పాడుగాని, నా భార్య ఫోటోను చూస్తే చాలు మరో ఆడది ఆ ఇంట్లో సంచరించడానికి నాకు మనసొప్పదు. ఒకరి శోకంలోంచే ఒక శ్లోకం పుడుతుందన్నట్లు....గొప్ప ట్రాజెడీ రైటరుగా నాకీ పేరు రావటానికి నా గుండెల్లో పేరుకుపోయిన వేదన కావచ్చు..." ఆ వేదనను పేర్చిపెట్టిపోయిన నా భార్య కీర్తికి మూలస్థంభం కావచ్చు" దాంపత్యసుఖాల హద్దులు దాటించి శిఖరపు ఔన్నత్యాన్ని అందించిన ఆమె జ్ఞాపకాల పరంపరల నుండి పెల్లుబికిన అతని మాటలకు గొంతు గాద్గిదంగా మారింది.
"మగాడి రచన వెనుక ఆడది వుందంటారుగాని....మృత్యుముఖం లోకి పోయి విషాదాన్ని మిగిల్చి కూడా ఇంకా మీ రచనలకు ఆమె ప్రేరనై నిలుస్తుందంటే నిజంగా ధన్యురాలు....!! అందుకేనా ప్రతి రచన ఆమెకే అంకితం ఇస్తుంటారు?" అంది నిర్లిప్త.
"ఇప్పటివరకూ నే రాసిన ప్రతి అక్షరాన్ని ఆమె స్మృతి శకలాలతో పేర్చి అంకితంగా అందించాడు. ఇప్పుడు రాస్తున్నదే ఇస్తానో లేదో....నవల చిదరంటా నే బ్రతికుంటే..." వేదాంతం నింపుకున్నట్లు మాట్లాడాడు భార్గవ.
నిర్లిప్త ఆ మాటలకు ఆశ్చర్యపోయినట్లు చూసింది.
"ఏమిట్రా నువ్వు ఛస్తావా? నీ రచనలతో ఇంకా ఎంతమంది పాఠకుల్ని చంపి నువ్ చావాలి? అయినా చచ్చేంత ఖర్మ నీకేం పట్టింది...?" అన్నాడు నవ్వుతూ నిఖిల్ బాత్ రూం లోంచి వస్తూనే.
"ఇప్పుడు వచ్చిపడిన సమస్యే అది....చావు బ్రతుకుల సమస్య. అందుకే మనం అర్జంటుగా టెలిఫోన్ డిపార్ట్ మెంట్ కెళ్ళాలి నువ్వు తయారవు" తొందరపెట్టాడు భార్గవ.
నిర్లిప్త ఏమిటని అడగలేకపోయింది.
"బాబోయ్ టెలిఫోన్ భవన్ కా? అందులో ఒక శూర్పనక వుంటుంది మరి" అన్నాడు నిఖిల్ భయంగా.
"అదే నీకెవరో అమ్మాయి తెలుసునన్నావ్ కదా!"
"తెలుసు...అదే శూర్పనఖ" అన్నాడు మళ్ళీ.
"శూర్పనఖా....ఆవిడెవరు? ఆమె మీకెలా తెలుసు...?" అంది నిర్లిప్త కాస్తంత అనుమానాస్పదంగా చూస్తూ.
నిఖిల్ తలెత్తి "నేను రాముడి లాంటివాన్ని. నన్నలా అడుగుతా వేమిటి?" అన్నాడు కొంటెగా.
"శూర్పనఖ రాముడి దగ్గరకు వచ్చినా....రాముడెప్పుడూ సీత దగ్గర శూర్పణఖ విషయం ఎత్తనే లేదు తెలుసా...?" అంది నిర్లిప్త కూడా కొంటెగా.
"అయినా ఈ శూర్పనఖది ఓ పెద్ద కథలే! నేను కాలేజీ రోజుల్లో వున్నప్పుడు మా ఫ్రెండొకడికి రోజూ ఫోన్ చేసేవాడ్ని క్రెడిల్ ఎత్తగానే నంబర్ ప్లీజ్...అన్న కోమలమైన కంఠం...ఆ కంఠం వినగానే మా ఫ్రెండును మర్చిపోయి ఆవిడగారితో కబుర్లు చెపుతూ కూర్చునేవాడ్ని కబుర్లు కాస్త రోడ్డు దిగి ప్రేమ గుంటల్లో పడి పార్క్ దాకా పరిగెత్తింది ఫోన్ లోనే. ఓసారి పార్క్లోకి రమ్మంది. వెళ్ళానంతే!
బొగ్గు గనుల్లోంచి బయటపడ్డ శిలాజంలా....
కంకర్లను అణగద్రొక్కే రోడ్ రోలర్ లా.... 'ఓ__క్'....డోకొచ్చినట్లవుతుంది" అన్నాడు నిఖిల్ విత్ యాక్షన్ తో.
నిర్లిప్త నవ్వాపుకుంటూ "ఇంకా ఏమీ అనలేదా?" అంది. భార్గవ కూడా నవ్వాడు.
"ఎందుకనలేదు. నన్ను పెళ్ళి చేసుకుంటే మా నాన్న డబుల్ కాట్ మంచాలు మూడు కంబైండ్ గా చేయించిస్తాడంది. వాళ్ళ నాన్న ఫ్లయివుడ్ కార్పెంటరేమో అనుకున్నా, కాదుట ఆవిడగారి ఆకారాన్నిబట్టి అంత సైజు మంచం..." అన్నాడు నిఖిల్ నవ్వేస్తూ.
"అంతటి పరిచయమేనా? ఇంకేమైనా..." అడిగింది నిర్లిప్త.
