Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 17

 

    యువకుడు మౌనంగా తలాడించాడు.
    "నీపేరు ?" అన్నాడు గురవయ్య.
    "రాజ్ కుమార్ --"
    'అచ్చం రాజకుమారుడి లాగే ఉన్నాడు" అనుకుంది గులాబి.
    "మిస్టర్ రాజ్ కుమార్! ఈ పెట్టెలో ఏముందో నేను చూడొచ్చా?" గంబీరంగా అడిగాడు గురవయ్య.
    "చూడకూడదు -" అన్నాడు రాజ్ కుమార్.
    "నేను గౌరవంగా బ్రతుకుతున్నాను. ఒకరి చేత ఇంత వరకూ వేలెత్తి చూపించుకోలేదు. నువ్వు ప్రభుత్వాధికారివో, స్మగ్లరువో నాకు తెలియదు. నీవంటి వాడు నా యింట్లో చొరబడితే- పట్టుకుని పోలీసులు కప్పగించడం నా బాధ్యత. నిజానిజాలు పోలీసులే తెల్చుతారు" అన్నాడు గురవయ్య.
    అప్పుడు యువకుడి చేతిలో నల్లటి వస్తువోకటి నిగనిగలాడుతూ మెరిసింది.
    అది పిస్తోలు!
    పిస్తోలు తిన్నగా గురవయ్య గురి పెట్టబడి ఉంది.
    "ఈ బ్రీఫ్ కేసు మీ యింట్లో ఉంటుంది - తిరిగి నేనొచ్చి తీసుకెళ్ళే వరకూ. ఇది పోలీసుల పరం చేశావా - నువ్వూ నీ కూతురూ వికలాంగులై రోడ్ల మీద అడుక్కుంటారు. నేను ప్రమాదకరమైన మనిషిని. నాజోలికి రాకు. నేను చెప్పినట్లు విను" అన్నాడతను.
    గురవయ్య తెల్లబోయాడు.
    గులాబి అరాధనాపూర్వకంగా ఆ యువకుడి వంకే చూస్తుంది.
    జరుగుతున్నదేమిటో ఆమెకు తెలియడం లేదు.
    ఆమె కంటి కతడు దుర్మార్గుడిలా కాక హీరోలా కనబడుతున్నాడు.
    "నేను వెడుతున్నాను" అంటూ యువకుడు వెనకడుగు వేశాడు.
    'అగు" అన్నాడు గురావయ్య.
    మరుక్షణం గురవయ్య చేతిలోంచి కత్తి ఒకటి శరవేగంతో రాజ కుమార్ కుడి చేతిని తాకింది.
    రాజకుమార్ చేతిలోని పిస్తోలు ఎగిరి దూరంగా పడింది.
    "కదలకు...." అన్నాడు గురవయ్య.
    జరిగిన విశేషానికి రాజ కుమార్ నిశ్చేష్టుడయ్యాడు.
    గురవయ్య చేతిలో యిప్పుడు మరో కత్తి ఉంది.
    "నేను కావాలని నీ చేతికి కత్తి పిడి తగిలేలా విసిరాను. కాబట్టి నీకే గాయమూ అనలేదు. కత్తి మొన ఈసారి సూటిగా నీ గుండెల్ని తాకుతుంది...." అన్నాడు గురవయ్య.
    "ఎవర్నువ్వు? ఏదైనా ముఠా నాయకుడివా?" అన్నాడు రాజకుమార్ ఆశ్చర్యంగా.
    "నా పేరు గురవయ్య. నేర్పుగా కత్తి విసరడం నా వృత్తి. నేను విసిరిన కత్తి తుపాకి గుండును మించిన వేగంతో పోతుంది. నా గురి అర్జునుడి గురి కంటే గొప్పది."
    "ఓహ్ -- నీ పేరు విన్నాను" అన్నాడతడు.
    "ఇప్పుడు నా నేర్పు చూద్దువు గాని ....ముందు మర్యాదగా లోపలకు నడు..." అన్నాడు గురవయ్య.
    గత్యంతరం లేక అతడు లోపల గదిలోకి నడిచాడు.
    గురవయ్య అతణ్ణి గోడ కానుకొని నిలబడమన్నాడు. గోడకు కొత్తగా అట్ట తాపడం చేయబడి ఉంది. అతడానుకుని ఉన్నచోట పూర్వపు గుర్తులేమీ లేవు.
    "కదిలావా - కత్తులు నీ శరేరాన్ని చీల్చుతాయి. అలాగే కదలకుండా నిలబడు....' అన్నాడు గురవయ్య.
    రాజకుమార్ గోడ కానుకుని కదలకుండా నిలబడితే గురవయ్య కత్తులు విసిరాడు.
    గులాబి సంతోషంతో చప్పట్లు కొట్టింది.
    "కత్తులన్నీ వాడిగా ఉన్నాయి. కదిలావా -- నీ శరీరం తునాతునక లవుతుంది. అలాగే ఉండు ... నేను వెళ్ళి పోలీసులను పిల్చుకొని వస్తాను " అన్నాడు గురవయ్య.
    "వద్దు ...." అన్నాడు రాజకుమార్.
    "నువ్వు నన్నాపలేవు. నేనొచ్చి కత్తులు తీసేదాకా నువ్వు కదలలేవు. వస్తాను." అన్నాడు గురవయ్య.
    రాజకుమార్ గురవయ్యవంకే చూస్తున్నాడు.
    గురవయ్య గులాబితో - "చూడమ్మా! నేను గంటలో పోలీసుల్ని వెంట బెట్టుకుని వస్తాను ...ఈలోగ నీకు నిద్ర వస్తే పడుకో " అన్నాడు.
    "నేనూ నీతో వస్తాను" అంది గులాబి.
    "వద్దమ్మా -- రాత్రిపూట నువ్వెందుకు ?" అంటూ గురవయ్య వెళ్ళిపోయాడు.
    తండ్రి వెళ్ళగానే తలుపులు వేసి రాజకుమార్ దగ్గరకు వెళ్ళింది గులాబి.
    "మా నాన్నంటే ఏమనుకున్నావు? పిస్తోలు చూసి బెదిరి పోతాడనుకున్నావా? అనవసరంగా ఆయన్ను రెచ్చగొట్టి కత్తులబోనులో చిక్కుకున్నావు -- " అంది గులాబి.
    రాజకుమార్ నిట్టూర్చి -- "నా గురించి నాకు బెంగ లేదు. దేశం గురించి , మీ నాన్న గురించీ బెంగ పెట్టుకున్నాను...." అన్నాడు.
    "ప్రమాదం నీకైతే -- మా నాన్న గురించి బెంగేందుకు ?" అంది గులాబి.
    "నేను ప్రభుత్వ గూడచారిని. మన దేశం మీద కుట్ర నన్ను తున్న పొరుగు దేశపు పధకం వివరాలు తెలుసుకున్నాను. ఈలోగా వాళ్ళ మనుషులు నా వెంట బడ్డారు. వాళ్ళ కళ్ళు గప్పి నేను మీ యింట్లో ప్రవేశించాను.
    నేను వాళ్ళకు దొరికినా ఫరవాలేదు. ఈ కాగితాలు దొరక్కూడదనుకున్నాను. మీ నాన్న వెంటనే ఒప్పేసుకుంటే బాగుండేది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు వెడతాడు. పోలీసుల్ని రప్పిస్తాడు. ఊరంతా విదేశీ కుట్ర దారులు మాటు వేసి ఉన్నారు. వాళ్ళకు నా ఉనికి తెలిసిపోతుంది. వాళ్ళ నాపేశక్తి పోలీసులకు లేదు. గూడచారుల కుతంత్రాలకు పోలీసులు తట్టుకోలేరు. ఆ విధంగా రహస్య పత్రాలు శత్రువుల పాలవుతాయి. నా ప్రాణాలు కూడా శత్రువులు పొట్టన పెట్టుకోవచ్చు.
    ఇంతకూ నీ తండ్రి కారణం. నీ తండ్రిని ప్రభుత్వం అనుమానిస్తుంది. విదేశ గూడచారి అంటుంది. నేను మీ యింట్లో రహస్య పత్రాలు దాచడానికి ప్రయత్నించానని విదేశీ గూడచారులకు తెలిస్తే మీ నాన్నకు ప్రభుత్వ గూడచాతులతో సంబంధ ముందని వాళ్ళనుమానిస్తారు. అన్ని వైపులా నించి అందరూ మీ నాన్నను వేటాడ్డం మొదలు పెడతారు ..."
    గులాబి భయంగా -- "మరి నువ్వు స్మగ్లరువి కాదా ?" అంది.
    "నన్ను చూస్తె నీ కలాగని పోస్తోందా?" అన్నాడు రాజకుమార్.
    "లేదు --" అంది గులాబి వెంటనే.
    "నన్ను వెంటనే ఈ కత్తుల బోనులోంచి విడిపించు. ఆ విధంగా మన దేశాన్నీ, మీ నాన్ననూ కూడా రక్షించు కున్నదాని వౌతావు...." అన్నాడు రాజకుమార్.
    "ఇవన్నీ నువ్వు మా నాన్నకు చెప్పాల్సింది...."
    "చెప్పెవాడినే! కానీ అర్ధం చేసుకునే తెలివి లేని వాడి కెన్ని చెప్పి ఏం ప్రయోజనం!" అన్నాడు రాజకుమార్.
    "నాకా తెలివి ఉందా?"
    "కొన్ని విద్యల్లో నేర్పరితనం ఉన్నవారికి లోకజ్ఞానం ముండదు. మీ నాన్న ముఖం చూడగానే నాకా విషయం తెలిసింది. నీ విషయమలా కాదు. నీ ముఖంలో వర్చస్సుంది. తెలివి కొట్టొచ్చినట్లు కనబడుతోంది..."
    గులాబి మొహమాటంగా నవ్వింది.
    "నీ పేరు?" అన్నాడతడు.
    'గులాబి ....' అందామె.
    "రూపానికి తగ్గ అందమైన పేరు " -- అని అతడు నిట్టూర్చి - "గులాబీ ! గతంలో నిన్ను చూసి ఉంటె ప్రమాదకరమైన ఈ గూడచారి వృత్తిని చేపట్టి ఉండే వాణ్ణి కాదు. హాయిగా నీలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుని జీవితంలో నలుగురికిలా స్థిరపడి ఉండేవాణ్ణి ...." అన్నాడు.
    "నీ వృత్తి నీ కిష్టం లేదా?"
    అతడు తిరిగి నిట్టూర్చి - 'చూశావుగా ప్రస్తుతం నా పరిస్థితి. నీ తండ్రి మంచివాడు. దేశభక్తుడు. అయన నన్ననుమానించి బందిస్తేనే ప్రస్తుతం నా గతి లాగుంది. శత్రువులు బంధిస్తే వేరే చెప్పాలా?" వాళ్ళు గుండు సూదులతో గుచ్చి ఆ కన్నాల్లో కారం చల్లి నిమ్మకాయలు పిండుతారు. ఒకో తల వెంట్రుకె పట్టి లాగుతుంటారు. ఆ బాధలు భరించలేరు - ఎటువంటి దైర్య వంతులూ కూడా !" అన్నాడు.
    "మరి నువ్వెండుకీ వృత్తిని చేపట్టేవు ....? అందామె.
    "ఏం చేయను? నాకెవ్వరూ లేరు. ఇంట్లో సవతి తల్లి పోరు ....' అంటూ అతడు తనకు సంబంధించిన ఓ విషాద గాధ చెప్పాడు.
    ఆ కధ వింటూ గులాబి చలించిపోయింది. ఆమె కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి.
    'గులాబీ! నన్ను విడిపించవూ?" అన్నాడతడు దీనంగా.
    గులాబి మాట్లాడలేదు.
    "అమాయకమైన నీ ముఖం. అందమైన రూపం. కోమలమైన నీ శరీరం కఠినత్వాన్నీ భరించలేవు గులాబీ! నువ్వు నీ దేశం కోసం. నీ తండ్రి కోసం, నా కోసం నన్ను విదిపించాలి. అందుకు ప్రతిఫలంగా ఒకరోజున నిన్ను భారత ప్రభుత్వం సన్మానిస్తుంది. ప్లీజ్ ....నన్ను విడిపించు ....గులాబీ! నన్ను విడిపించు ...."
    ఏమనుకుందో గులాబీ అతణ్ణి సమీపించి -- ఒకో కత్తినే తీసి నేలమీద పడేయసాగింది.

                                    3
    "ఎంతపని చేశావమ్మా?" అన్నాడు గురవయ్య.
    'ఆడపిల్లల్ని వల్లో వేసుకోవడం లో వాడికి వాడేసాటి. ఇంతవరకూ వాడు -- ఆడపిల్లల సాయం తోటే తప్పించుకుంటూ వస్తున్నాడు. ఈరోజూ అలాగే జరిగింది --" అంటూ నిట్టూర్చాడు పోలీసినస్పెక్టర్ .


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS