Previous Page Next Page 
వసుంధర కథలు-13 పేజి 16


    సుబ్బారావు ఆర్గానిక్ కెమిస్ట్రీలో డాక్టరేట్ తీసుకున్నాడు. అతడి పరిశోధన లెక్కువగా ఆల్కహాల్సుకు సంబంధించినవి. ఆల్కహాలు తయారీ, వాటి లక్షణాలు గురించి కొత్త విశేషాలనతడు ఇంటర్నేషనల్ జర్నల్స్ లో తను కనిపెట్టిన విశేషాలు పబ్లిష్ చేశాడు. విశేషాలు కొత్తవే అయినా నేరస్థులకు పనికిరావు.
    డిటెక్టివ్ వెంకన్న అనుమాన మేమంటే-సుబ్బారావు తనకున్న పరిచయాల దృష్ట్యా ఇతరత్రా ప్రయోగాలు చేస్తున్నాడని! ఆ ప్రయోగాలనతడు ఆత్మతృప్తికో ధనాశతోనే చేస్తూండి ఉండవచ్చు. కానీ అతడి పరిచయాలకు కారణం-అతడి ఇతర పరిశోధనలే!
    ఆ పరిశోధన లేమిటో తెలుసుకోవాలంటే అందుకు ప్రవీణ్ కుమార్ ను పట్టాలి. అతడెవరో-ఎలాంటివాడో తెలుసుకోవాలి....
    వెంకన్న అనుచరులతడికి కార్యం సులభం చేశారు.....
    ఎక్స్-32 యే సమయంలో సుబ్బారావు శరీరంలో ప్రవేశించడానికి కవకాశముందో ఆ సమయంలో ఆఫీసులో అతణ్ణి కలుసుకున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి పరిచయస్థుల్లో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ ప్రవీణ్ కుమార్ చిరునామా కూడా యిప్పుడు తెలిసింది.
    వెంకన్న  ప్రవీణ్ కుమార్ యింటికి స్వయంగా వెళ్ళాడు. అది యిల్లు కాదు. చిన్న గది, ఓ మధ్య తరగతి గృహస్థు తనింటి వీధిగదిని నూర్రూపాయల కద్దెకిస్తే అందులో ఉంటున్నాడు ప్రవీణ్ కుమార్. సమయానికి ప్రవీణ్ కుమార్ ఊళ్ళో లేడు.
    ఇంటాయన్ను వెంకన్న ప్రవీణ్ కుమార్ గురించి ప్రశ్నలు వేశాడు. ఇంటాయన అతడి గురించి వివరంగా చెప్పాడు-"కుర్రాడు చాలా బుద్ధిమంతుడనే చెప్పాలి. మా యింట్లో పెళ్ళీడొచ్చిన ఆడపిల్ల లిద్దరున్నారు. వాళ్ళ వంక ఒక్కసారి కూడా కన్నెత్తయినా చూడలేదు. కానీ"
    "ఊఁ కానీ...."
    "అతడేం ఉద్యోగం చేస్తున్నాడో నాకు తెలియదు. రాత్రిళ్ళెక్కువగా యింట్లో వుండడు. టైము ప్రకారం ఆఫీసుకు వెళ్ళడం చోదోఅలేదు. పగలు సాధారణంగా యింట్లోనే వుంటాడు. ఏం చేస్తాడో తెలియదింట్లో కూర్చుని. పనిమనిషి చెప్పిన ప్రకారం-ఇంట్లో బ్రాందీ, విస్కీ బాటిల్సున్నాయి. అంటే గదిలో తాగుతూంటాడనుకోవాలి...."
    "మరలాంటి వాన్నింట్లో ఎలా ఉండనిచ్చారు?"
    "అలాంటివాడనుకునేందుకతడెప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. బైటకువస్తేచాలు-తలవంచుకునే వుంటాడు. ముఖ్యంగా ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు...." అన్నాడు ఇంటాయన.
    "అద్దె సక్రమంగా యిస్తాడా?"
    "డబ్బు విషయంలో అతడి నేమీ అనుకుందుకులేదు. అతడి వ్యవహారం చూసి నాకనుమానం వచ్చి-ఒక రోజున డబ్బప్పు కావాలన్నాను. అప్పుతీసుకుంటే అది అడ్వాన్సుగా ఉంచుకోవచ్చని నా ఆశ. ఎంత కావాలన్నాడతడు. వెయ్యిరూపాయన్నాను. మర్నాటికిస్తానన్నాడు. నిజంగానే యిచ్చేశాడు. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అంతేకాదు ఆ తర్వాత నెల ఫస్టుతారీఖుకల్లా అద్దెడబ్బులిచ్చి-"అప్పు మీ వీలునుబట్టి తీర్చండి, నేను అద్దెమామూలుగానే యిస్తుంటాను. రెండింటికీ లంకెపెట్టడం నాకిష్టముండదు-" అన్నాడు. ఇది జరిగి ఏడాది దాటింది. నేనింకా అతడికారువందలు బాకీ-"
    వెంకన్న ఆశ్చర్యంగా-"అతణ్ణి మీరేం ఉద్యోగం చేస్తున్నాడో అడిగి తెలుసుకోలేదా?" అన్నాడు.
    "ఎందుకు?" అన్నాడింటాయన.
    "మనదేశంలో అది సహజం. పవీణ్ కుమార్ మంచి పెళ్ళికొడుకు-"
    ఇంటాయన మొహమాటంగా - "నిజం చెప్పాలంటే నేనతడి వివరాలు తెలుసుకుందుకు ప్రయత్నించాను. పేరు తప్ప ఇంకేమీ నిజం చెప్పడం లేదని నాకు తోచింది. ఒకటి రెండుసార్లతడి తల్లిదండ్రుల ప్రస్తావన తెచ్చి- పెళ్ళి చేయకుండా ఎందుకూరుకున్నారని-అడిగాను. బదులుగా అతడు తాను పెళ్ళే చేసుకోనన్నాడు...." అన్నాడు.
    "ఎందుకుట?"
    "ఎందుకో తెలియదు కానీ అతడు పెళ్ళికి విముఖుడు. అతడికి తాగుడు అలవాటు బాగా వుందని రూఢి అయింది నాకు. కానీ దాంతో అతడెవర్నీ ఇబ్బంది పెట్టాడనుకోకు. అతడి ఉద్యోగం కూడా-నలుగురూ చేసేటైపు కాదనిపించింది. ఎందుకో మా ఆవిడకతడు నచ్చలేదు. పెళ్ళికొడుకుల లిస్టులోంచి అతడి పేరు తీసేశాం...."
    వెంకన్న ఇంటాయన్ను ప్రవీణ్ కుమారే ఊరెళ్ళాడో అడిగాడు.
    "అతడి పేరేకానీ ఊరు తెలియదు నాకు-" అన్నాడింటాయన.
    ఎప్పుడొస్తాడనడిగితే-వెళ్ళిన రోజే కానీ వచ్చేరోజు తెలియదన్నాడాయన. వెళ్ళిన రోజుకు సరిగ్గా మూడు రోజుల తర్వాత సుబ్బారావు చనిపోయాడు.
    ఆ యింట్లో ప్రవీణ్ కుమార్ ని కలుసుకునేందుకు స్నేహితులు కానీ, బంధువులు కానీ రాలేదు.
    వెంకన్న ఇంటాయనకు థాంక్స్ చెప్పి అక్కన్నించి బైటపడ్డాడు.

                                     5

    శ్రీకాంత్ ని వెంకన్న స్వయంగా కలుసుకోలేదు. అయితే అతడి గురించిన విశేషాలు వెంకన్న నాశ్చర్య చకితుణ్ణి చేశాయి.
    శ్రీకాంత్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగి నెలకు పన్నెండు వందల జీతం. భార్య, యిద్దరు పిల్లలు పిల్లలిద్దరూ మగాళ్ళు శ్రీకాంత్ తల్లిదం'డ్రులు, అత్తమామలు-అత్యంత సామాన్యులు. శ్రీకాంత్ చేసే ఉద్యోగంలో లంచాలు దొరికే అవకాశం చాలా తక్కువ అనడం కంటే-లేదనడమే సరైన మాట.
    అంతవరకూ బాగానే ఉంది.
    శ్రీకాంత్ భార్య పండుగల్లో పట్టుచీరలు, ఉత్తప్పుడు గార్డెన్ సిల్కు చీరలు కడుతుంది. వాళ్ళింట్లో పనిమినిషి, వంటమనిషి కూడా ఉన్నారు. శ్రీకాంత్ కొడుకులిద్దరికీ బంగారపు మురుగులున్నాయి. అతడింట్లో ఖరీదైన ఫర్నీచర్ తో పాటు కలర్ టీవీ, వీసీఆర్ కూడా ఉన్నాయి.
    శ్రీకాంత్ ఇంటద్దెగా ఎనిమిదివందలిస్తున్నాడు. అతడికి బజాజ్ చేతక్ స్కూటరుంది. కారు లేకపోవడం ఆశ్చర్యం.
    అతడికి ఎక్కడిదింత డబ్బు?
    శ్రీకాంత్ పై అవినీతి ఆరోపణలు లేవు ఇన్ కం టాక్సు డిపార్టుమెంట్ రెయిడ్సు చేయలేదు. ఇంకా చెప్పాలంటే అతడు కొన్న ప్రతి వస్తువూ ఆఫీసులో డిక్లేర్ చేయబడింది. చాలా వస్తువులతడు తల్లిదండ్రులు, అత్తమామల నుంచి గిఫ్టుగా పొందినట్లు ప్రకటించాడు. గిఫ్టు టాక్సు ఆయా వస్తువులకు సక్రమంగా పే చేయబడింది.
    శ్రీకాంత్ భార్య చాలామందికి ప్రయివేట్లు చెప్పి డబ్బు సంపాదిస్తోందని అతడాఫీసులో డిక్లేర్ చేశాడు. ఆ ఆదాయమెప్పుడూ ఇన్ కంటాక్సు పరిమితులకు లోబడే ఉంటోంది.
    అతడుండే వీధిలో వాకబుచేయగా శ్రీకాంత్ భార్య యెవరికీ ప్రయివేట్లు చెప్పడంలేదని తెలిసింది. లోతుగా వాకబుచేయగా శ్రీకాంత్ కి చాలా పెద్ద పరిచయాలున్నాయనీ-ఆ పలుకుబడితో తను వీధిలోని వారందరికీ సహకరించడంవల్ల-అందరూ అతన్నభిమానిస్తారేతప్ప-అతణ్ణి చూసి అసూయపడడంలేదనీ అర్ధమయింది.
    వెంకన్న శ్రీకాంత్ గురించి బాగా ఆలోచించాడు.
    సుబ్బారావు హత్యకేసు-సరైన దారిలోనే వెడుతోందనిపించిందతడికి.
    వెంకన్న అనుమానిస్తున్న ప్రకారం సుబ్బారావు పరిశోధన సంఘవిద్రోహకర శక్తులకు సహకరించాల్సి వుంది. అలా జరక్కపోవడంతో వాళ్ళు సుబ్బారావును హత్య చేయాలనుకున్నారు. శ్రీకాంత్ సంఘవిద్రోహకర శక్తులతో చేతులుకలిపాడనడానికి సందేహంలేదు. అతడు అక్రమంగా ధనం సంపాదిస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS