"ఇదంతా ఎందుకు?" అన్నాడు రాం గోపాల్.
"నాతొ కలిసి వుండడం ఆమెకు బాధ్యతగా మారాలి. అలాగే ఆమెలో పిశాచి లక్షణాలేమైనా వుంటే పురోహితుడి మంత్రాలతో అవీ బయటపడతాయి...."
రాం గోపాల్ నవ్వి - "నువ్వు చాలా అమాయకుడివి " అన్నాడు.
"ఏం?" అన్నాడు సుగుణ్.
"మగవాడు తన్ను మోసం చేస్తాడేమోనని భయపడి ఆడది అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. నువ్వు ఆడదానికి భయపడుతున్నావు. నువ్వు చెప్పేవన్నీ వింటుంటే ఆ అమ్మాయి నీకు తగదని పోస్తోంది. నీకు మంచి అమ్మాయిని నేను చూస్తాను. అనవసరంగా తొందర పడకు. ఈమె గురించి పదిమందికీ తెలియనివ్వకు. గుట్టు చప్పుడు కాకుండా నీ ఎనిమిది వేల విలువా రాబట్టుకో . ఆ తర్వాత నువ్వే ఆమెను వదిలేసెయ్...."
"నువ్వు ఇలాంటి సలహా ఇస్తావని నేననుకోలేదు...." అన్నాడు సుగుణ్ నీరసంగా.
"నా మాట విను. అనుభవం మీద చెబుతున్నాను. ఆమెను భార్యగా చేసుకోవాలన్న ప్రలోభానికి లోను కాకు. అప్పుడు నేనిచ్చిన సలహాను ఓ వారం రోజుల తర్వాత నువ్వే మెచ్చుకుంటావు. ఆడది అందేవరకూ -- ఆమె జీవితాంతం కావాలనిపిస్తుంది. ఒకసారి అందిన ఆడది మగాడి ఆకర్షణ ను కోల్పోతుంది. కొత్త రుచులు కోరడం మగబుద్ది...." అన్నాడు రాం గోపాల్.
నాకు అలా అనిపించడం లేదు. కానీ నీ సలహా మాత్రం పాటిస్తాను ...." అన్నాడు సుగుణ్.
4
చలం పార్కులోని ఆ జంటనే గమనిస్తున్నాడు. అతడా జంటకు చాలా దగ్గర్లో వున్నాడు. కానీ తను ఆ జంట కళ్ళ బడకుండా అతడు జాగ్రత్త తీసుకున్నాడు. వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ అతడికి వినబడుతున్నాయి.
కాసేపటికి ఆమె లేచి వెళ్ళిపోయింది.
అతడు మాత్రం అక్కడే కూర్చుని వున్నాడు. చలం అతడిని సమీపించి --" కంగ్రాచ్యులేషన్స్ !" అన్నాడు.
అతడు ఆశ్చర్యంగా చలాన్ని చూసి -- "మీరెవరో నాకు తెలియదు -" అన్నాడు.
'అందుకే కంగ్రాచ్యులేషన్స్ చెప్పాను " అన్నాడు చలం.
"నాకేమీ అర్ధం కాలేదు" అన్నాడతను.
"నేనెవరో మీకు తెలియదు. అయినా మీకు పరిచయం లభించింది. అందుకే అభినందిస్తున్నాను అన్నాడు చలం.
"మీ పరిచయం అంత గొప్పదా?" అన్నాడతడు.
"ఈ పరిచయం వల్ల పోవలసిన మీ ప్రాణాలు నిలబెట్టబాడ్డాయనుకోండి. అప్పుడు నా పరిచయం గోప్పదవుతుందా , కాదా ?"
"మిస్టర్ - మీ డొంకతిరుగుడు మాటలు కట్టిపెట్టి అసలు విషయం చెప్పండి. నాకేమీ అర్ధం కాలేదు--"
చలం దీనంగా ముఖం పెట్టి - "అయితే తిన్నగా చెబుతాను. మీ ప్రాణాలిప్పుడు ప్రమాదంలో వున్నాయి." వాటిని కాపాడుకోవడం మీ చేతుల్లోనే వున్నది -" అన్నాడు.
"నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయా , ఎలా?
"ఇంతవరకూ మీతో మాట్లాడి వెళ్ళిన ఆ అందాల రాశి గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆమె కామినీ పిశాచి ...."
అతడు తెల్లబోయి - "కామినీ పిశాచి .....అంటే?" అన్నాడు.
"కామినీ పిశాచితో సంపర్కం లభిస్తే -- మనిషి క్రమంగా క్షీణించి పోయి - ఆఖరుకు చచ్చిపోతాడు. ఈమెను ప్రియురాలిగా స్వీకరిస్తే -- మీరు క్షీణిస్తారో లేదో చెప్పలేదు కానీ -- చావడం తధ్యం ---" అన్నాడు చలం.
అతడు జాలిగా చలం వంక చూసి - "మిస్టర్ - మీరు ఆమెను ప్రేమిస్తున్నారా? లేనిపక్షంలో ఆమె పై పగ పట్టి వుండాలి !" అన్నాడు.
"ఆ రెండు విషయాలూ మీకు అనవసరం. మీ కళ్ళలో నాపై జాలి కూడా కనపడుతోంది. అదీ అవసరమే! ఇటీవలే ఒకతను నా సలహాను పెడ చెవిన పెట్టి నిండు జీవితాన్ని కోల్పోయాడు --" అన్నాడు చలం.
"ఎవరతను ?"
"అతడు పేరు చెబుతాను. అడ్రసు కూడా ఇవ్వగలను!"
'చెప్పండి !"
"అతడి పేరు సుగుణ్...."
5
"నాపేరు ప్రకాష్!' అన్నాడతను.
"కూర్చోండి --" అన్నాడాయన.
"సుగుణ్ మీ అబ్బాయే కదూ !"
అయన ముఖం గంబీరంగా మారిపోయింది -- " ఇప్పుడు మీకు వాడి ప్రసక్తి ఎందుకు?"
"మీ అబ్బాయి అర్ధాంతరంగా హత్య చేయబడ్డాడని విన్నాను. అందుకు కారణాలు తెలుసుకుందామని వచ్చాను..."
"ఆ అబ్బాయి హత్య చేయబడడమా -- అలాగని ఎవరు చెప్పారు మీకు?" అన్నాడాయన ఆశ్చర్యంగా.
"చెప్పలేదు, ఊహించాను --"
"మీ ఊహ పొరపాటు. మా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు--" అన్నాడాయన.
ప్రకాష్ సాలోచనగా -- "నేను విన్నదేమిటంటే మీ అబ్బాయిని ఒక కామినీ పిశాచి ఆవహించిందని --" అన్నాడు.
'అలాంటిదేమీ మాకు తెలియవు -" అన్నాడాయన.
'దయుంచి ఏం జరిగిందో మీరు నాకు చెప్పగలరా?"
"గతాన్ని కెలక్కండి. నేను తట్టుకోలేను ..."
"ప్లీజ్ -- మీరు నిజం చెప్పకపోతే నేనూ మీ అబ్బాయి లాగే చనిపోయే అవకాశం వున్నది --" అన్నాడు ప్రకాష్.
అయన ప్రకాష్ పరిస్థితి విన్నాక జాలిపడి కొన్ని వివరాలు చెప్పాడు. ప్రకాష్ శ్రద్దగా విన్నాడు.
ఆయనకు నలుగురు కొడుకులు. సుగుణ్ మూడవవాడు. అతడికి చదువు తిన్నగా రాలేదు. అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడని తండ్రి రోజూ తన్నేవాడు. టెన్త్ క్లాసు పరీక్ష తప్పాడని తండ్రి చావగోడితే ఇంట్లోంచి పారిపోయాడు సుగుణ్. అతడి కోసం పేపర్లో ప్రకటన వేయించినా ఫలితం లేకపోయింది.
ఓ ఏడాది తర్వాత సుగుణ్ ఆ ఊళ్ళో నే ఫ్యాన్సీషాపు తెరిచాడు. ప్రారంభోత్సవానికి ఇంటిల్లపాదినీ పిలిచాడు. ఆతర్వాత ఇంటికి మాత్రం రాలేదు. తల్లి నిత్యం బ్రతిమాలుతూ వుండేది. నలుగురు కొడుకుల్లోకి సుగుణ్ పరిస్థితే మెరుగ్గా వున్నదని పించుకుని ఆర్నెల్ల క్రితం ఇంటికి వచ్చాడు సుగుణ్. అయితే ఇంట్లో ఎల్లకాలం వుండననీ -- త్వరలోనే పెళ్ళి చేసుకుని బయటకు వెళ్ళి పోతానని సుగుణ్ తల్లికి చెప్పాడు. పెళ్ళి విషయంలో తలిదండ్రుల మాట విననని కూడా అతడు స్పష్టంగా చెప్పాడు.
సుగుణ్ కు వేరే ఇల్లు వుంది. అది చిన్న డాబా యిల్లు. సుగుణ్ స్వార్జితంగా కొనుక్కున్న ఇల్లు అది. సుగుణ్ అప్పుడప్పుడు రాత్రిళ్ళు అక్కడ గడుపుతుండే వాడు. అతడి కాట్టే మంచి పేరు లేదు. తల్లిదండ్రులకు అతడు ధనసాయం చేస్తున్నాడు. ఇంట్లో మంచిగా వుంటున్నాడు. అందుకని అతడి గురించి ఇంట్లో ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. అందులోనూ అతడి మనస్తత్వం గురించి అందరికీ బాగా తెలుసు.
చనిపోయే రోజున సుగుణ్ బ్యాంకు నుంచి ఎని,మిది వేలు తీశాడు. ఆ డబ్బు లీల అనే యువతికివ్వాలని అతడు ముందు రోజు డైరీలో రాసుకున్నాడు. ఆరోజు అతడు ఆ డబ్బును లీలకు ఇచ్చాడని, సాయంత్రం తన యింట్లో లీలను భార్యగా ప్రవేశ పెట్టదలిచాడనీ సుగుణ్ స్నేహితుడు రాం గోపాల్ చెప్పాడు.
సుగుణ్ సాయంత్రం నాలుగింటికి ఇంటికి వచ్చాడు. వివాహం గురించి ఇంట్లో ఏమీ చెప్పలేదు. నాలుగున్నర ప్రాంతాన ఓ పెద్ద కేక పెట్టాడు. డాక్టర్ని పిలిచారు. డాక్టరు వచ్చేలోగా అతడి ప్రాణం పోయింది. డాక్టరు పోలీసుల్ని పిలవమన్నాడు. సుగుణ్ కి విష ప్రయోగం జరిగిందన్నాడు. పోలీసుల్నీ పిలిచారు. వాళ్ళు బాగా విచారించారు. సుగుణ్ తలిదండ్రుల కోసం ఏమీ వుంచలేదు. ఫ్యాన్సీ దుకాణం సుగుణ్ పేరునే వున్నది. పది రోజులకు ముందు అతడు దానిని మరొక పేరుకు మార్చాడు.
పోలీసులు సుగుణ్ తలిదండ్రులను అనుమానించలేదు. అతడు వారికి స్వయానా కొడుకు. ఆపైన అతడి మరణం వల్ల వారికే ప్రయోజనమూ లేదు. వారు గోవిందరావు ను అనుమానించారు. ఫ్యాన్సీ దుకాణం గోవిందరావు పేరు మారీన తర్వాత పది రోజుల్లోనే సుగుణ్ మరణించాడు.
అయితే పోలీసుల అనుమానం సరైనది కాదు. గోవిందరావు లక్షలకు అధిపతి. ఓ చిన్న ఫ్యాన్సీ దుకాణం కోసం హత్య చేయాల్సిన అవసరం అతడికి లేదు. ఆపైన సుగుణ్ ఫ్యాన్సీ దుకాణాన్ని గోవిందరావు పేరున మార్చడానికి కారణమున్నది. అతడు దానిని గోవిందరావుకు కుదవబెట్టాడు.
గోవిందరావు ను అడిగితే - సుగుణ్ తలమునిగే అప్పుల్లో వున్నాడని - తనకు యాభై వేలు బాకీ పడి - దుకాణాన్ని కుదువబెట్టాడనీ -- అతణ్ణి నిరాశా నిస్పృహలు అవరించాయనీ ఆత్మహత్య చేసుకోవాలనుందని అంటుంటేవాడని చెప్పాడు.
గోవిందరావు చెప్పిన నిరాశా నిస్పృహలు సుగుణ ముఖంలో -- తలిదండ్రులేన్నడూ చూడలేదు. అయితే అతడు చాలా గుట్టయిన మనిషి. తన వారి వద్ద తన ఓటమిని అంగీకరించే మనస్తత్వం కాదు అతడిది.
పోలీసులు ఆత్మహత్యగా నిరూపించారు. అందరూ అది సబబు అని అనుకున్నారు. కేసు తేలిపోయింది.
"మరి - లీల విషయం ఏమిటి?" అన్నాడు ప్రకాష్.
'సుగుణ్ డైరీలో ఒక విశేషం వున్నది. వాడు లీల అనే అమ్మాయిని భార్యగా స్వీకరిచదలిచాడు. ఆ అమ్మాయి కామినీ పిశాచి అని ఒకతను వాడిని హెచ్చరించాడు. ఆ డైరీని మేము పోలీసులకు చూపించలేదు. ఆ హెచ్చరిక ప్రకారమే సుగుణ్ మరణించారు --" అన్నాడు సుగుణ్ తండ్రి.
6
"చెప్పండి !" అన్నాడు డిటెక్టివ్ వెంకన్న.
"లీల అనే అమ్మాయి నన్ను కోరింది. తనకు మగవాడి అండ కావాలనీ -- తన అసలైన భార్యలా అణిగిమణిగి ఉంటాననీ -- నేను అసలైన భర్త లా తన కోసమే జీవించనవసరం లేదనీ చెప్పింది. ఆమె నాకు నచ్చింది. నాలుగు నెలల పాటు నాతొ ఉండడానికి ఆమె ఎనిమిది వేలు అడిగింది. ఇచ్చేద్దామనే నిర్ణయించుకున్నాను. " అన్నాడు ప్రకాష్.
"ఇది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం" అన్నాడు వెంకన్న.
"అసలు విషయం చెప్పనివ్వండి -- " అన్నాడు ప్రకాష్.
