ఇద్దరూ లోపలకు పూజగదిలోకి వెళ్ళారు. అక్కడ దేవుడి మందిరంలో ఓ చిన్న ప్లాస్టిక్ చెట్టు ఉన్నది. అది తమాషాగా కదుల్తోంది.
"చూశావా-యిప్పుడే ఆయన యెవరికో షేక్ హాండిచ్చారు. యేమయిందో యేమో విరగబడి నవ్వుతున్నారు...." చెట్టు కదలికనుబట్టి శారద చెప్పుకు పోతోంది.
"రికార్డు కూడా ఆన్ చేశావా?"
"ఆహా-అది చక్కగా యే టైముకు ఏయే ముఖ్యకార్యాలు జరిగాయో టైపుచేస్తోంది. శరీరంలో కలిగే ముఖ్యమైన మార్పులన్నీ నాకు తెలిసిపోతున్నాయి. నేను చెబితే ఆయన ఆశ్చర్యపోతున్నారు. నువ్వు నిజంగా మేధావిని-" అంది శారద.
స్వరూప్ నిట్టూర్చి-"యెందరో మేదావులకువలే నేనూ భగ్న ప్రేమకున్ని-" అన్నాడు.
స్వరూప్ వంక శారద అదోలా చూసి-"నన్ను, ప్రేమను కలిపి మాట్లాడ్డం నాకింకా నచ్చలేదు-"అంది.
"అలా కలిపి ఆలోచించడంవల్లనే నేను నీ కోసం ఈ ఎలక్ట్రానిక్ వృక్షాన్ని చేయగలిగాను-" అన్నాడు.
ఎలక్ట్రానిక్ వృక్ష నిజంగానే గొప్ప మేధాశక్తితో చేయబడింది. మనిషి నరాల సంచలనాన్ని కదలికతో ప్రతిఘటించగలదా వృక్షం. అది శారద కోసం అహోరాత్రాలు పరిశ్రమించి తయారుచేశాడు స్వరూప్. అందుకు శారద కూడా అవసరమైన సమాచారన్నిచ్చింది. ఏ రకం కదలికకు రఘులో నరాల సంచలనం ఏ విధంగా కలుగుతుందో-స్వరూప్ ఇచ్చిన పరికరాల ద్వారా రికార్డు చేసింది. ఎలక్ట్రానిక్ వృక్షాన్ని స్వరూప్-రఘుకి అనుగుణంగా తయారుచేశాడు.
"X-Y-3 ఫ్లూరైడ్ అయిపోయింది-అందుకే నీ కోసం కబురుపెట్టాను-" అంది శారద.
"బహుశా అందుకే అయుంటుందని నేను ఊహించాను-" అంటూ జేబులోంచి ఓ సీసా తీశాడు స్వరూప్.
ఎలక్ట్రానిక్ వృక్షంలో సంచలనం కలగాలంటే రఘు ఆ ద్రవం రోజుకు ఒక చుక్క చొప్పున తాగాలి. ఆ ద్రవం రక్తంలో సులభంగా కలిసిపోతుంది. రోజుకు ఒక చుక్క నరాల సంచలనాన్ని - ఎలక్ట్రానిక్ వృక్షానికి పంపడానికి ఖర్చవుతుంది. ఎన్ని చుక్కలు వేస్తే అన్ని రోజులు పనిచేస్తుంది ఎలక్ట్రానిక్ వృక్షం.
"చాలా థాంక్స్-" అంది శారద ఆ సీసా అందుకుంటూ నాలుగైదు రోజుల్లో భర్త ఆఫీసు పనిమీద నెలరోజులు టూర్ వెళ్ళబోతున్నాడు. అప్పుడాయన ఎలా ప్రవర్తిస్తాడో ఏమిటో-ఈ మందు ఎంతైనా అవసరమే!
స్వరూప్ శారదవంక అదోలా చూసి-"ప్రవర్తన సరిగాలేని అతడిపై నీకంత మోజు ఎందుకు?" అన్నాడు.
'మరీ ఇలా ఉంటాడని పెళ్ళికి ముందు అనుకోలేదు" అంది శారద.
ఆ మాటలకు స్వరూప్ కళ్ళు మెరిశాయి-"శారదా! తెలివైనవాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకుంటారు-"అన్నాడతను.
"అందుకేగదా నీ సాయం కోరాను-"
"మరో విధంగా నీకు సాయపడడానికి కూడా నేను సిద్దంగా వున్నాను" అన్నాడు స్వరూప్.
"అంటే?"
"శారదా! నన్నర్ధం చేసుకో నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. పరాయి ఆడదాని గాలి సోకినా నాకు నచ్చదు. నువ్వు తప్ప నాకు వేరెవ్వరూ వద్దు. ఇలా భావించే నన్ను వదిలి-ఎలక్ట్రానిక్ వ్రుక్షంతో అనుక్షణం హద్దులో ఉంచవలసిన మగాడి చుట్టూ నీ మనసు యెందుకు తిరుగుతోందో-ఈ వివాహంలో నువ్వు పొందే సుఖమేమిటో నాకు అర్ధం కావడంలేదు. రఘును అదుపులో ఉంచడంకోసం ఎలక్ట్రానిక్ వృక్షం తయారు చేశాను. అతణ్ణి వదిలిపెడతానంటే నిన్ను నాదాన్ని చేసుకుందుకు నే నెన్నడూ సిద్దంగానే ఉంటాను-"
శారద ఆ మాటలకు కోపగించుకోలేదు. జాలిగా అతడివంక చూసి-"నిన్నో, నన్నో దురదృష్టం వరించింది. అష్టకష్టాలూపడి అతణ్ణి అదుపుచేయడానికి ప్రయత్నిస్తాను తప్పితే మరో మగాణ్ణి నా జీవితంలోకి ఆహ్వానించలేను. ఆ సంగతి నీకు తెలుసు-" అంది.
"సరే-మరి నేనుంటాను. మీ ఆయనకు X-Y-3 ఫ్లూరైడ్ ని దేంట్లో కలిపిస్తున్నావు. కాఫీలోనే కదా?- అందులో తప్ప మరెందులో వేసినా అది ఇమడదు. వాసన తెలిసిపోతుంది-" అన్నాడు స్వరూప్.
"రోజూ ఆఫీసుకు వెళ్ళేముందు ఆయనకు కాఫీ ఇస్తాను. అందులో ఈ ద్రవం కలుస్తుంది...." అని- "ఆయన ఆఫీసు పనిమీద పెద్ద టూర్ వేస్తున్నారు. ఇది అర్జంటయింది-" అంది శారద.
"అర్జంటంటే ఎన్నాళ్ళేమిటి?"
"నెలరోజులనుకోవచ్చు-" అంది శారద. స్వరూప్ వెళ్ళిపోయాడు.
"నెలరోజులు నిన్ను విడిచి వుండాలి. ఎలాగో!" అన్నాడు రఘు.
"నాకూ అలాగేవుంది. కానీ నా మనసెప్పుడూ మిమ్మల్ని వెన్నంటే వుంటుంది-" అంది శారద.
"ఇది హెచ్చరికా?"
"కాదు-ప్రేమ!" అని నవ్వింది శారద.
"అవును శారదా-మనది విచిత్రమైన ప్రేమ! కండపట్టివున్న ఆడదాన్ని చూస్తే నాలో కండకావరం చెలరేగుతుంది. కానీ నా మనసులోని ప్రేమ నీకుమాత్రమే పరిమితం. క్షణక్షణమూ నాపైన అనుమానం నీకు, కనీ నేనే కావాలి నీకు. నేను లేనిదే నువ్వు బ్రతకలేవు. నువ్వు లేనిదే నేను బ్రతకలేను. అయితే మన జీవితాల్లో కొత్త మార్పులొస్తున్నాయి. నీలోని అనుమాన భూతం క్రమంగా చచ్చిపోతోంది. నాలోనూ మార్పు వస్తోంది. నీ మనసు నన్ను వెన్నంటి ఉండడం కాదుగానీ నాకు పరాయి స్త్రీలపట్ల విముఖత పెరిగింది. మొన్న క్లబ్బులో ఓ స్త్రీ నన్ను కొంటెగా తాకితే నేను గ్రుడ్లెర్రజేసి చూశాను. నేను మైపోతున్నాను శారదా-మారి పోతున్నానేమిటి-మారిపోయానేమో కూడా-" అన్నాడు రఘు.
శారద అతడి ముఖంవంక చూసి-"యెంత అమాయకంగా ఉంది?" అనుకుంది. అప్రయత్నంగా ఆమె అతడి బుగ్గలమీద ముద్దుపెట్టుకుని-"మన ప్రేమ విచిత్రమైనదే కావచ్చు. కానీ అది అమరం కూడా-" అంది.
"ఐ లవ్ యూ శారదా!" అంటూ అతడామెను బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. శారద చేతులు అతణ్ణి బలంగా పెనవేసుకున్నాయి.
