సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు గౌరీ నెహ్రూ పార్కుకు వచ్చింది. ఆమె కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న శాస్త్రి "చాలా థాంక్స్ -- అన్న ప్రకారం వచ్చేశావు!" అన్నాడు.
'అప్పుడే చనువు పెంచేశారు !" అంది గౌరీ.
"ఈ క్షణం నుంచే మన చనువు పెరుగుతుంది. నువ్వూ నన్నెలా పిలిచినా నా కభ్యంతరం లేదు-" అన్నాడు శాస్త్రి.
'అలాగే , నీ పేరు ...." అంది గౌరీ.
"సోమనాధ శాస్త్రి "అన్నాడు శాస్త్రి.
గౌరీ తనే స్వయంగా రిక్షా మాట్లాడింది. ఇద్దరూ ఓ రిక్షా ఎక్కారు. రిక్షా ఆగిన వెంటనే శాస్త్రి రిక్షా వాడికి డబ్బులిచ్చాడు. గౌరీ అతన్ని రెండు మూడు సందులు తిప్పి ఓ ఇరుకు సందులోకి తీసుకు వెళ్ళింది. అక్కడ నిర్మానుష్యంగా ఉంది. ఆ సందులోకి వచ్చిన గోడకు ఓ గుమ్మం ఆ గుమ్మనికో తలుపు.
"ఇది మా ఇంటి దొడ్డి తలుపు " అంది గౌరీ.
శాస్త్రి ఆశ్చర్యంగా - "మనం దొడ్డి దారిన ప్రవేశిస్తూన్నామా?" అన్నాడు.
"మనం పోతున్నది రాజమార్గం కాదు కదా" అంది గౌరీ - "ఇంకేం మాట్లాడకండి. మనం లోపలకు వెళ్ళేక మిగతా విశేషాలు మాట్లాడుకోవచ్చు ...."
గౌరీ తలుపులు తోసింది. లోపల గడియ వేసి లేదు. కాబట్టి వెంటనే తెరుచుకుంది. గౌరీ లోపలకు వచ్చి గడియ వేసింది. ఇద్దరూ దొడ్డి లోకి ఆ తర్వాత ఇంటిలోకి ప్రవేశించారు. ఇంట్లోకి ప్రవేశించడానికి ఏ విధమైన అడ్డంకీ లేదు. జారగిల వేసి ఉన్న తలుపులు తోసుకుని ఇంట్లోకి ప్రవెశించారిద్దరూ.
అప్పుడు గౌరీ మళ్ళీ తలుపులు లోపల్నుంచీ వేసి చటుక్కున శాస్త్రిని సమీపించి - "డబ్బు ముందుగానే ఇవ్వాలి ." అంది.
శాస్త్రి జేబులోంచి అయిదు వంద రూపాయల నోట్లు తీసి ఆమెకు అందించాడు. ఆమె లెక్క పెట్టుకుని లోపల ఎక్కడో దాచి వచ్చింది.
'ఇంట్లో ఎవరు లేరా?" అన్నాడు శాస్త్రి.
"ఇంటికి వీధి వైపు తాళం వేసి వుంది" అంది గౌరీ.
"ఇలా తలుపులు తెరిచి వుంచుకుంటే ప్రమాదం కాదా?"
"ఇంతవరకూ ఏ ప్రమాదమూ జరుగలేదు. నాలుగైదేళ్ళుగా ఉన్న ఈ ఏర్పాటు ఇక ముందు కూడా కొనసాగుతుంది..."
"మీ దగ్గరకు వచ్చిన మగవాడేవరైనా మిమ్మల్ని మోసం చేస్తే ... అంటే ఈ ఏర్పాటు తెలిసి ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి ...."
గౌరీ నవ్వి -- "ఆ భయం మాది, మీ కవసరం లేదు . మీరు వచ్చినపని చూసుకు వెళ్ళండి ...." అంది.
శాస్త్రి ఆమెను దగ్గరగా తీసుకుని చనువుగా ముద్దు పెట్టుకున్నాడు. గౌరీ అతడిని మృదువుగా విడిపించుకుని "గదిలోకి పోదాం" అంది నెమ్మదిగా. ఆమె ఆవేశం లో ఉన్నదని అతడికి తెలుస్తూనే ఉంది.
ఇద్దరూ గదిలోకి వెళ్ళారు. శాస్త్రి అక్కడి అలంకరణల గురించి ఏర్పాట్ల గురించి ఏవేవో ప్రశ్నలు వేస్తున్నాడు.
గౌరీ విసుగ్గా - "ఇవన్నీ వృధా ప్రశ్నలు. నాలుగు గంటలయ్యేసరికి మనమిక్కడి నుంచి బయటపడాలి. ఈ విషయం గుర్తుంచుకోండి " అంది.
స్త్రీగా ఆమె ఇస్తున్న ప్రోత్సాహం శాస్త్రిని రెచ్చ గొట్టింది. అతను బలంగా ఆమెను కౌగలించుకుని -- "కారణం తెలియదు కానీ నాకంటే నువ్వే ఆవేశంగా ఉన్నావు " అన్నాడు.
గౌరీ చిరాగ్గా - 'అవును - నిజమే ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పడానికి నా ఆవేశం చల్లార్చాలి " అంది.
శాస్త్రి మరింతగా ఆమెను హత్తుకున్నాడు.
పావుగంట తర్వాత ఇద్దరిలో ఆవేశం చల్లారింది.
"ఇప్పుడు చెప్పు. నీ అవేశాని క్కారణం ఏమిటి?" అన్నాడు శాస్త్రి.
"మూడు వారాల తర్వాత ఇదే మొదటి బేరం ....' అంది గౌరీ.
"ఎందుకని?"
"మా ఇంట్లో ఒక ఆత్మహత్య జరిగింది. అందువల్ల పోలీసులు మా ఇంటి మీద కొంతకాలం పాటు నిఘా వేశారు...."
"ఆత్మహత్య చేసుకున్నదేవరు?"
"కళ్యాణి - వరుసకు చెల్లెలవుతుంది ...." అంటూ గౌరీ కళ్యాణి వివరాలిచ్చింది.
శాస్త్రి అప్పుడే తెలిసినట్లుగా , "అయ్ సి -- ఇంతకీ ఆ అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది?" అన్నాడు.
"తెలియదు " అంది గౌరీ.
"మీ ఇంట్లో ఉన్న మనిషి గురించి మీకెందుకు తెలియదు . తెలిసే వుంటుంది !"
"నిజంగా నాకు తెలియదు. దానికి జీవితం మీద ఉన్న మోజు ఇంకెవ్వరికీ ఉండదు. మేము ఊరికి వెళ్ళే ముందు కూడా తన భావి జీవితం గురించి కనే కలలు నాకు చెప్పింది...."
"నువ్వూ , కళ్యాణి ఎక్కువగా మాట్లాడుకుంటారా ?"
"దానికి నేనంటే చాలా ఇష్టం...."
"శాస్త్రి క్షణం తటపటాయించి - "కళ్యాణి మనస్తత్వం ఎలాంటిది?" అన్నాడు.
గౌరీ అతని వంక తేరిపార చూసి - "ఈ ప్రశ్నలన్నీ నువ్వెందుకు అడుగుతున్నావ్ ?" అంది.
"కుతూహలం కొద్దీ . నువ్వు చెప్పినదాన్ని బట్టి చూస్తె కళ్యాణి ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేయబడ్డదని తోస్తోంది. కళ్యాణి ని హత్య చేస్తే ఈ ఇంట్లో వాళ్ళెవరో చేసి వుండాలి. అలాంటి అవసరం ఎవరికి ఉంటుంది?" అన్నాడు శాస్త్రి.
గౌరీ భయంగా శాస్త్రి వంక చూసి - "ఎవర్నువ్వు ? పోలీసుల మనిషివా, లేక ప్రయివేటు డిటెక్టివా?" అంది.
"పోలీసులకూ, డిటెక్టివ్ లకూ నిగ్రహం వుంటుంది. నేనో సామాన్య వ్యభిచారిని. అప్పుడప్పుడు మాత్రం కధలు రాస్తుంటాను. మనుషుల మనస్తత్వాలు పరిశీలించడం నా హాబీ -" అన్నాడు శాస్త్రి.
'అలాంటి హాబీలు నాకు కిట్టవు. నా మీద దయ యుంచి కళ్యాణి గురించి నన్నేమీ అడక్కు. దాని గురించి తలచుకున్నప్పుడల్లా నా గుండె తరుక్కు పోతోంది ...." అంది గౌరీ.
"ఒక్కమాట ....నువ్వీ వృత్తి లో ఎందుకు ప్రవేశించావ్ ?" అన్నాడు శాస్త్రి.
"జవాబు నా దగ్గర లేదు" అంది గౌరీ.
"పోనీ - నువ్వీ వృత్తిలో ప్రవేశించినట్లు కళ్యాణికి తెలుసా?"
"ప్లీజ్ నన్నేమీ అడగొద్దు.."
"కళ్యాణి కూడా నీకులాంటిదేనా ?"
"ఈ ప్రశ్నలన్నింటికి నేనెందుకు జవాబు చెప్పాలి ?"
"ఎందుకా? కళ్యాణి లాగే నువ్వు కూడా చచ్చే అవకాశ ముంది కనుక.
గౌరీ తడబడుతూ - "అలా ఎందుకు జరుగుతుంది ? దాని పద్దతులు వేరు. నా పద్దతులు వేరు. నా జీవిత విధానమే నాకు శ్రీరామ రక్ష." అంది. అంతకుమించి అతను ఎన్నడిగినా ఆమె జవాబు చెప్పడం లేదు.
తనమీద అనుమానం కలగకుండా ఉండేందుకు గానూ శాస్త్రి ఆమెతో మరి కాసేపు ప్రేమ కబుర్లు చెప్పి , సరదాగా గడిపి, నాలుగు గంటల ప్రాంతంలో అక్కడ నుంచి బయటపడ్డాడు.
7
ఉలిక్కిపడి . "ఎమిటన్నావ్ ?' అన్నాడు శాస్త్రి.
"అవును సార్! కళ్యాణి ని ఒకతను ప్రేమిస్తున్నాడు " అన్నాడు రమణమూర్తి. అతడి కళ్ళలో తను కనుగొన్న అద్భుత రహస్యానికి గర్వం కనబడుతోంది.
"వివరంగా చెప్పు" అన్నాడు శాస్త్రి.
'అతని పేరు కమలాకరం. స్టేట్ బ్యాంక్ లో ఆఫీసరు. మనిషి అందంగా, హుందాగా ఉంటాడు. కళ్యాణి కోసం ప్రతిరోజూ సాయంత్రం ఆ కంపెనీకి వెళ్ళేవాడు. కళ్యాణిని పెళ్లి చేసుకోవాలని అతను తపించి పోతున్నాడు. ఆమె పెళ్ళి వాయిదా వేయడానికి కారణం ఉద్యోగ మేనని అతడి అనుమానం. అందుకే ఆమెను ఉద్యోగంలోంచి తీసి వేయమని కంపెనీ మానేజర్ని పలుమార్లు రిక్వెస్టు చేశాడు. కానీ కళ్యాణి వంటి సమర్దురాలీని ఉద్యోగం లోంచి తీసి వేయడానికి ఆ మేనేజరు ఇష్టపడలేదు."
"ఇంకా ఏం చెప్పాడు మేనేజర్ ?"
"కళ్యాణి గురించి చాలా మెచ్చుకున్నాడా మేనేజర్ . ఆడపిల్లలు- అందులోనూ కళ్యాణి అంత అందంగా ఉండే వాళ్ళు-- అంత సమర్ధవంతంగా పని చేయడాన్ని అపూర్వంగా అభివర్ణించాడాయన. కళ్యాణి చనిపోయిందంటే అయన కెవరో ఆత్మబంధువు పోయినట్లుందిట. జీవితమంటే ఎంతో మోజున్న కళ్యాణి తన జీవితాన్ని విధంగా అంతం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని కూడా అయన అన్నాడు."
"కమలాకరాన్ని కలిసేవా ?"
"లేదు. మగవాళ్ళని కలుసుకుని కలుసుకుని బోరు కొట్టింది. ఈ పర్యాయం ఆ డ్యూటీని మీకు అప్పచెప్పి నేను ఏమైనా సరే సుబ్బరామయ్య గారమ్మయిల్ని కలుసుకోవాలను కుంటున్నాను" అన్నాడు.
"పెళ్ళయ్యే వరకూ ఆ పని మాత్రం చేయకు. కమలాకరం వద్దకు మనమిద్దరం కలిసే వెడదాం" అన్నాడు శాస్త్రి.
శాస్త్రితో కలిసి ఎక్కడకు వెళ్ళాలన్నా రమణమూర్తి కి చాలా సరదా. శాస్త్రి ఎలా ప్రశ్నలడుగుతాడూ, ఎదుటి వాళ్ళను ఎలా బోల్తా కొట్టిస్తాడూ అన్నది క్షుణ్ణంగా పరిశీలించి - అ ట్రిక్కులన్నీ నేర్చుకోవాలని అతడి ఆశ.
