ఆ పరిస్థితుల్లో నేనామె దగ్గరకు వెళ్ళాను. ఒక నర్సు "కూతురి కోసం కలవరించి పోతోంది, మగతలో వుంది. ఒక్కసారి అమ్మా అని పిలిచి ఆవిడ చేతిలో చేయి వేసి చూడమని రిక్వెస్ట్ చేసింది.
నేనలా చేయగానే ఆవిడ నా చేతిని బలంగా పట్టుకుని "నీకోసం పెరట్లోపెద్ద నిధి వుంచానమ్మా! తీసుకుంటావు గదూ తప్పక తీసుకుని ఇంతకాలం స్వార్ధంతో నిన్ను బాధ పెట్టిన తల్లిని క్షమిస్తావు కదూ" అంది. ఆ క్షణంలో నాకు కళ్ళనీళ్ళు తిరిగాయి. ఆవిడ బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తోంది. తలచుకుంటే ఆ దృశ్యం నా కళ్ళముందు భయంకరంగా మెదుల్తోంది.
నా చేతిని పట్టుకునే నన్ను తన కూతురిగా భావిస్తూ ఆవిడ నా కళ్ళ ,ముందే మరణించింది. ఆవిడ నీ తల్లి అని నీఇంట్లో అడుగు పెట్టిన రోజునే తెలుసుకోగలిగాను."
"ఒక అపరిచితురాలు నీకు తన ఇంట్లో నిధి వుందని విచిత్ర పరిస్థితుల్లో చెప్పడమూ, నేను నీ స్నేహితురాలు సుజాతను ముమ్మూర్తులా పోలి వుండడమూ , అనుకోకుండా నువ్వు నా యింట అద్దెకు ప్రవేశించడమూ, నేను లేని సమయంలో మరో పురుషుడి సాయంతో పెరట్లో గోతులు తవ్వడమూ ఇవన్నీ కాకతాళీయంగా జరగడం తమాషాగా లేదు!" అన్నాను.
శోభ నవ్వి "అదే నేనూ నీతో అందామనుకుంటున్నాను. ఒకోసారి నిజాలు కల్పనకు మించి తమాషాగా వుంటాయి" అంది.
"నిజమే కొంతమంది కల్పనలను నిజాలుగా నమ్మించగలరు" అని, ;శోభా నువ్వు అదృష్టవంతురాలివి." అమ్మ చివరి క్షణాల్లో అక్కడ వున్నావు. నాకా అదృష్టం దొరకలేదు. నిజంగా ఏదైనా నిధి నా వశమై నా చేతుల్లో హక్కు వుంటే నీకు అందులో సమ భాగం ఇవ్వాలనుంది"అన్నాను.
'చాలా థాంక్స్" కానీ నిధి నీ వశం కావడానికి నువ్వు సరైన ప్రయత్నాలేమీ చేయడం లేదు" అంది శోభ ముక్తసరిగా.
'దొరకవలసిన నిధి మనకు దొరకనే దొరికింది. కానీ అందులో అన్నీ మనకు చిల్లరపెంకుల్లా కనపడుతున్నాయి" అన్నాను.
"నాకు తెలుసు వసంతా నన్ను వేళాకోళం చేయడానికి నువ్వే అక్కడ అది పాతి పెట్టావని" అంది శోభ.
ఉలిక్కిపడ్డాను. శోభ మనసులోంచి నిధి గురించిన ఆశలను తొలగించడం కోసం నేనా పని చేసిన మాట వాస్తవం. కేవలం నిధి కోసమే ఆమె నాతొ స్నేహం చేసి వున్నట్లయితే అంతటితో నన్ను వదిలి పెడుతుందనుకున్నాను. కానీ అలా జరుగలేదు.
నా అభిప్రాయంలో సుజాత అన్న చాలా తెలివైన వాడు. అతనే ఈ విషయం వూహించి ఆమెకు చెప్పి వుండాలి. బహుశా నా ఇంట్లో జరిగే ఆసక్తికరమైన ప్రతి విషయం గురించి ఇద్దరూ చర్చిస్తూ వుండి వుండాలి.
నేను శోభ వంక చూసి "అయితే నీకు అన్నీ తెలిసిపోయాయన్న మాట. ఇంకా మనం నిధి గురించి గట్టి ప్రయత్నాలు చెయ్యవలసి వుంది" అన్నాను.
12
మాఇంటికి వెంకట్రావు తల్లి కాస్త తరచుగానే రావడం జరుగుతోంటుంది.
ఆరోజు మొదటిసారిగా పెరట్లో మేము తీసుకొచ్చిన మార్పులు చూడ్డానికి ఆవిడ కుతూహల పడింది. నేను శోభా ఆవిడను పెరట్లో కి తీసుకెళ్ళాం. మేము చాలా అందంగా దొడ్డిని తయారు చేశామని ఆవిడ మెచ్చుకుంది.
ఒకోసారి దొడ్డంతా కలయ తిరిగి హటాత్తుగా "అమ్మా వసంతా దొడ్లో ఎక్కడా తులసి మొక్క కనపడదేం? మీ అమ్మ ఉన్నప్పుడూ రోజూ భక్తిగా తులసి పూజ చేసెదనుకుంటాను" అంది.
హటాత్తుగా నాకు గుర్తు కొచ్చింది. అమ్మ స్నానం చేశాక రోజూ ఉదయం తులసి మొక్కకు పూజ చేసేది. ఏడాది క్రితం వరకూ దొడ్లో తులసి కోట మట్టితో మెత్తి వుండేది. ఎందుకో అమ్మ ఆ కోటను ఎత్తేసి మొక్క మాములుగా భూమిలో పాతింది. రోజూ పూజ మాత్రం మానలేదు.
మనకు నిధి నిక్షేపాలను ఈ తులసి మొక్కే చూపిస్తుందమ్మా అంటుండేది. అప్పట్లో ఆ మాట అర్ధం నేను సరిగా గ్రహించలేదు. ఇప్పుడు నాకు అందులో ఏదో అర్ధ ముందని పించసాగింది.
సరైన సంరక్షణ లేక అమ్మ పోయిన కొద్ది వారాలకు ఆ మొక్క ఎండిపోతే నేను ఎన్నో పూజలు చేసిన అమ్మ అకాల మరణం నుంచి తప్పించలేక పోయింది ఆ మొక్క అని పీకి అవతల పారేశాను. బహుశా ఆ మొక్క క్రింద నిధి ఉన్నదేమో!ఆ మొక్క వుండే స్థలం నాకు బాగా గుర్తుంది.
"ఎండిపోతే అవతల పారేశానండీ" అని ఆవిడకి చెప్పినప్పటికీ నా మనసంతా ఏవేవో ఊహాల్లోకి పోతుంది.
"ఎంత పని చేశావమ్మా తులసి అంటే ఇంటి ఇలవేల్పు. రేపు నేను నీకో మొక్క పంపిస్తాను వేసుకో. పూజ చేసుకున్నా చేసుకోకపోయినా రోజూ కాసిని నీళ్ళు మాత్రం పోస్తుండు"అంది.
ఆవిడ వెళ్ళిపోయాక నేను శోభతో "నిధి ఆచూకీ దొరికింది"అన్నాను.
"బహుశా తులసి మొక్క కింద వుండి వుంటుందనుకుంటున్నావు కదూ" అంది శోభ సాలోచనగా.
"కానీ ఆ మొక్క యెక్కడుండేది ఇప్పుడు నాకు గుర్తు లేదు" అన్నాను.
శోభ ఒక్క నిముషం పాటు ఏమీ మాట్లాడలేదు. ఆ తరవాత ఏదో గుర్తుకు వచ్చిన దానిలా --" అన్నట్లు మరిచే పోయాను నా జాకెట్లు కుట్టేశాననీ ఈవేళ వచ్చి తీసుకు పోవచ్చుననీ బట్టలు కుట్టే జానకమ్మ తనకు చెప్పినట్లు ఆఫీసులో నా కొలీగ్ సుమిత్ర చెప్పింది. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుందామనుకుని మర్చిపోయాను. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను. నువ్వు కూడా వస్తావా?' అనడిగింది.
శోభ కావాలనే నాకా అవకాశం కల్పించిందో లేక నిజంగా తనకు పని వుందో తెలియదు కానీ, నేను మాత్రం ఈ అవకశాన్ని జారవిడవదల్చుకోలేదు. 'ఆఫీసు నుంచి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళాలంటే ఈ రోజెందుకనో బోరుగా వుంది" అన్నాను.
శోభ నన్ను బలవంతం పెట్టలేదు. ఆమె వెళ్ళిన తర్వాత అయిదు నిముషాలు మాత్రం ఆగాను. ఆ తర్వాత చకచకా దొడ్లో కి వెళ్ళాను.
జాగ్రత్తగా పరిశీలిస్తూ ఒకప్పుడు అమ్మ పూజలు చేసిన తులసి మొక్క పాతబడ్డ ప్రదేశాన్ని గుర్తించాను. అదృష్టవశాత్తు గునపం ఇంట్లోనే వుంది. తీసుకువచ్చి త్రవ్వడం మొదలు పెట్టాను. చేతులు వణుకుతున్నాయి. అది ఉద్రేకమూ కలిసిన వింత సమ్మిళిత భావాలు మదిలో మేదుల్తున్నాయి. నేను ఇంకా ఎంతో త్రవ్వకుండా వీధి తలుపు తట్టిన చప్పుడయింది.
ఎవరై వుంటారు? శోభ !" జానకమ్మ ఇంటికి వెళ్ళి రావడానికి కనీసం ముప్పావు గంట పడుతుంది, ఏమైతేనేం నేను త్వరగా మట్టి మళ్ళీ కప్పేసి గునపం లోపల పెట్టి చేతులు కడుక్కుని తలుపు తీయడానికి వెళ్ళాను.
వచ్చింది శోభే. "జానకమ్మ సినిమాకు వెడుతూ దారిలో ఎదురైంది" అందిశోభ.
శోభ పధకం నాకర్ధమైంది. చాలా తెలివిగా ఆమె నిధి వున్న స్థలాన్ని తెలుసుకోగలిగింది? పెరటి వైపు వచ్చి నా చర్యలను ఆమె పెరటి తలుపు ద్వారా చూసి ఉండే అవకాశముంది.
నాకు భయమూ, కోపమూ బెంగా వగైరా రకరకాల భావనలు కలిగాయి. కానీ నిస్సహాయురాలిని. ఆ స్థితిలో శోభను చేయిదాటనిచ్చి ఆమె ప్రియుడితో నిధి మీద దండయాత్ర చేయడానికి అవకాశమివ్వ కూడదనిపించింది.
అందుకే ఆమెతో "మంచి పనే జరిగింది. పద. నిధి కోసం ప్రయత్నిద్దాం" అని ఆమెను తీసుకుని దొడ్డిలోకి వెళ్ళాను. ఇద్దరం తవ్వకం మొదలు పెట్టాం. ఇందాక నేను తవ్విన చోటనే.
నిజానికి మేము ఎంతో లోతు తవ్వలేదు. ఖంగుమన్న శబ్దం వినబడింది. మరికొంత ప్రయత్నం మీద ఒక చిన్న ఇత్తడి పెట్టెను బయటకు తీశాం.
మరుక్షణంలో నా తల మీద ఏదో వస్తువు బలంగా పడినట్లనిపించింది.నా తల బరువెక్కింది. ఆ తర్వాత స్పృహ తప్పిందనుకుంటాను.
స్పృహ తప్పే ముందు "దొంగ - దొంగ" అన్న శోభ కంఠం నెమ్మదిగా నాచేవుల బడింది.
13
నాకు ఎదురుగా శోభ కనపడింది. నేను కళ్ళు విప్పగానే శోభ ముఖంలో ఆనందం కనబడింది. "ఎలా వుంది నీకు?' అనడిగింది.
నాకు ఇంకా తల కాస్త బరువుగా వుంది. జరిగినది గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాను. నెమ్మదిగా గుర్తుకు వస్తోంది. నేనూ శోభా పెరట్లో నిధి కోసం త్రవ్వడమూ. ఒక ఇత్తడి పెట్టెను వెలికి తీయడమూ. ఎన్నో ఆశలతో నేనా ఇత్తడి పెట్టె వంకే చూస్తూ ఉండటమూ, అంతే . ఆ తర్వాత మళ్ళీ యిప్పుడు నా ఎదుట శోభ!
'అసలేం జరిగింది? నేనిక్కడికి కేలా వచ్చాను?" అనడిగాను.
"మనం నిధి కోసం ప్రయత్నించి విజయం పొందిన సందర్భంలో ఎలా వచ్చాడో ఒక దొంగ వెధవ నీ తల మీద బలంగా కొట్టి నేనాశ్చర్యం లోంచి తేరుకునేలోగా నిధి వున్న యిత్తడి పెట్టెను బట్టుకుని పారిపోయాడు.
తక్షణ కర్తవ్యంగా నాకు నిన్ను హాస్పిటల్లో చేర్చడం తప్ప మరేమీ కనబడలేదు. అప్పట్నించీ నేను ఇక్కడే ఉండి నీకు స్పృహ రావడం కోసం ఎదురు చూస్తున్నాను. అదృష్టవశాత్తు నీకు తగిలిన దెబ్బ బలమైనది కాదుట" అంది శోభ నిట్టురుస్తూ.
