Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 16


    ఇదామె ప్రియుడు సహించలేకపోయాడు. ఆమె మోహనరావుకు కూడా దక్కకూడదనుకున్నాడు. అందుకే ఆమె నాత్మహత్యకు ప్రోత్సహించాడు. ఇద్దరం కలిసి చచ్చిపోదామన్నాడు. తను చచ్చిపోతున్నట్లామెకు భ్రమ కలిగించాడు. ఆమె ఆత్మహత్య చేసుకొన్నప్పుడక్కడే ఉండివుంటాడు. ఏ విషమో మింగినట్లు నటించి ఉంటాడు. ఆ తర్వాత నిజంగా చచ్చిపోయాడో లేదో మనకు తెలియదు..."
    "చాలా ఫన్నీగా ఉందీ కథ...." అన్నాడు గోవర్ధన్.
    "ఎందుకని?"
    "భిన్న వ్యక్తిత్వాలు..."
    "డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ కథ చదివారా మీరు?"
    "చదివాను కానీ దీనికి అన్వయించలేను. అది నమ్మినాకూడా మీ కథలో యింకా చాలా లోపాలున్నాయి...."
    "ఆ లోపాలన్నింటికి బదులు దొరుకుతుంది-సీమ ప్రియుడెవరో తెలిస్తే.....!?"
    గోవర్ధన్ చిరాగ్గా-"అది మాత్రం యెలా తెలుసుకుంటారు?" అన్నాడు.
    "చాలా సులభం" అన్నాడు కిల్లర్. అతడు గోవర్ధన్ వద్ద నున్న సీమప్రియుడి లేఖను పరీక్ష గా చూశాడు. అదొక ఇన్లాండ్ లెటరు. దానిమీద పోస్టలు ముద్రలను పరిశీలించాడు. అదృష్టవశాత్తూ పరీక్ష గా చూస్తే వాటి వివరాలు సులభంగా తెలిశాయి.
    ఉత్తరం ఒకచోట పోస్టయింది. మర్నాడే రెండో చోటకు చేరుకొంది. చేరుకొన్న పోస్టాఫీసు సీమ పుట్టింటికి ఉత్తరాలు చేరవేసే స్థలం కాదు.
    "ఆశ్చర్యంగా ఉందే!" అన్నాడు గోవర్ధన్.
    "అంతే కాదు ఈ ఉత్తరం మీద ఫ్రం అడ్రసూ, టూ అడ్రసూ కూడా తిరిగి చదువలేని విధంగా కొట్టేయబడి ఉన్నాయి-"అన్నాడు కిల్లర్.
    "అందులో ఆశ్చర్యమేముంది? సీమ ఆ పని చేసి ఉంటుంది. ఇలాంటి ఉత్తరాలు యెవరి పేరున వచ్చాయో, యెవరు రాశారో తెలియడం ప్రేమికుల కిష్టముండదు...."
    "అది నిజమే....కానీ లోపల కూడా తేదీ కొట్టి వేయబడి ఉంది. అంటే ఈ ఉత్తరం తనకెప్పుడు వచ్చిందీ కూడా ఇతరులకు తెలియడం సీమ కిష్టంలేదన్న మాట.....అయితే పోస్టల్ ముద్రల్నిబట్టి తేదీ తెలుసుకుంటారని ఆమె అనుకుని వుండదు"
    గోవర్ధన్ నవ్వి-"మనం పోలీసు బుర్రతో తెలుసు కున్నాం గానీ-ముద్రల్లో తేదీలు స్పష్టంగా తెలియడం లేదు-" అన్నాడు.
    "అదీ నిజమే! కానీ ఈ ఉత్తరం సీమప్రియుడు ఆమె పెళ్ళికి ముందు రాసేడని ముందు మనం అనుకున్నాం. పోస్టల్ ముద్రలనుబట్టి చూస్తూంటే ఈ ఉత్తరం రాయబడి అయిదు వారాలు మాత్రమే అయింది...." అన్నాడు కిల్లర్.
    గోవర్ధన్ ఆశ్చర్యంగా-"అవును-"అన్నాడు.
    "దీన్ని బట్టి మనం రెండు విషయాలూహించవచ్చు. ఒకటి-సీమ ప్రియుడు-ఆమె పెళ్ళి సమయానికిక్కడ లేడు. ఇటీవలే తిరిగివచ్చి ఈ విషయం తెలుసుకుని ఆమెను కలుసుకొనే దారిలేక ఈ ఉత్తరం రాసి ఉంటాడు. రెండో పాసిబులిటీ యేమిటంటే....ఈ ఉత్తరం సీమకు కాదు.....వేరెవరికో అయుంటుంది....." అన్నాడు కిల్లర్.
    "అదెలా సాధ్యం?"
    "హంతకుడు మనని తప్పుదారి పట్టించడం కోసం ఈ ఉత్తరాన్ని సంపాదించి సీమ దగ్గరుంచి వుంటాడు..." అన్నాడు కిల్లర్.
    "మీరు నిజంగా కోడి గుద్దుకు-ఈకలు పీకుతున్నారు. మీ అనుమానాలు నెలా నివృత్తి చేసుకుంటారు?" అన్నాడు.
    "చాలా సింపుల్....ఈ ఉత్తరం చేరిన పోస్టాఫీసు రేంజిలో-ఈ తేదీ ప్రాంతాల జరిగిన వివాహాల గురించి తెలుసుకుంటాను. ఆ యా యువతుల పూర్వ పరిచయాల గురించి విచారించి వారిలో ఉత్తరం పోస్టయిన ప్రాంతాల వారెవరైనా ఉన్నారేమో చూస్తాను...."
    గోవర్ధన్ ఆశ్చర్యంగా-"యూ ఆర్ రియల్లీ ఏ జీనియస్-" అన్నాడు.
    
                                    9

    "డియర్ గోవర్ధన్! ఇప్పుడు చాలా విషయాలు తేలిపోయాయి..." అన్నాడు కిల్లర్ ఉత్సాహంగా.
    "చెప్పండి-...." అన్నాడు గోవర్ధన్ కుతూహలంగా.
    "ఈ ఉత్తరం ప్రియ అనబడే అమ్మాయికి వ్రాయబడింది. సుందర్రావు ఆమె కుత్తరం రాసిన భగ్న ప్రేమికుడు. ఆ ఉత్తరం ప్రియకు చేరలేదు....ఉత్తరం సుందర్రావే వ్రాశాడనడాని కిదిగో-సుందర్రావు దస్తూరీ సాక్ష్యం..." అన్నాడు కిల్లర్.
    "ఉత్తరం ప్రియకు చేరకపోతే ఈ అడ్రసు కొట్టి వేయడం ఎలా జరిగింది?" అన్నాడు గోవర్ధన్.
    "అన్నీ వివరంగా చెపుతాను-వినండి!" అన్నాడు కిల్లర్.
    ప్రియను సుందర్రావు ప్రేమించాడు. ఆమె అతడంటే ఇష్టపడింది కానీ వివాహానికి తల్లిదండ్రుల నిర్ణయానికే ప్రాముఖ్యత నిచ్చింది. ఇద్దరూ కలుసుకునేవారు. ఈలోగా ప్రియకు వివాహం కుదిరింది. సుందర్రావామెను కలుసుకునే అవకాశాలు తగ్గిపోయాయి. విషయాన్నతడర్ధం చేసుకోగలడని ప్రియ అతడికి తన పెళ్ళి శుభలేఖ కూడా పంపింది.
    వీరి ప్రేమ వ్యవహారం గురించి మోహనరావుకు తెలుసు. దూరపు బంధుత్వం కారణంగా మోహనరావుకు ప్రియ కుటుంబంతో పరిచయముంది. మోహనరావు ప్రియను రెండు మూడుసార్లు ప్రేమలేఖల గురించి అడిగాడు అవి దగ్గరుంటే ప్రమాదమనీ-నాశనం చేయమనీ చెప్పాడు. తనదగ్గర ప్రేమలేఖలేమీ లేవని ఆమె చెప్పింది.
    "మున్ముందు ఇంకా వస్తే?" అన్నాడతడు.
    "వస్తే ఇంకొక్కటి రావచ్చు. నా పెళ్ళి శుభలేఖ పంపాను...." అంది ప్రియ ఆమె అతణ్ణి కలుసుకోవడం తప్ప ప్రేమలేఖలు వ్రాసి ఉండలేదు.
    తన ఉత్తరం ప్రియకంది ఉంటుందని సుందర్రావను కొన్నాడు. పోస్టాఫీసు దగ్గర విచారించగా ప్రియ ఉత్తరాల గురించి రోజూ ఓ యువకుడు విచారిస్తూండేవాడని చెప్పాడు పోస్టుమాన్. అతడు చెప్పిన పోలికలు-మోహనరావుకు సరిపోయాయి అంటే మోహనరావు ప్రియకు వచ్చిన ఉత్తరాన్ని సంపాదించడానికి ప్రయత్నించి విజయం సాదించాడన్నమాట!
    "చాలా విచిత్రంగా ఉంది-..." అన్నాడు గోవర్ధన్.
    "విచిత్రమే కావచ్చు కానీ నేను చెప్పిన విశేషాలన్నింటికీ ఋజువు లున్నాయి-" అన్నాడు కిల్లర్.
    "ఈ ఋజువులలో మీ రింకా యేమి సాధంచదల్చు కొన్నారు?"
    "ప్రియ నాకు కొన్ని విశేషాలు చెప్పింది. మోహనరావు వద్ద వశీకరణ శక్తి ఉంద. ఏకాంతంలో ఆడపిల్లల దగ్గర అతడు చనువు తీసుకుంటాడు. వారించడం కష్టం. అతడి స్వభావం తెలుసుకొన్నాక ఆమె అతడిని ఏకాంతంగా కలుసుకొనేది కాదుట...."
    "తమ బలహీనతలను ఎదుటివారి వశీకరణ శక్తిగా భావించేవాడు కొందరుంటారు. ప్రియ వయసు ప్రభావానికి లోబడి ఉంటుంది..." అన్నాడు గోవర్ధన్.
    "కావచ్చు కానీ మోహనరావింట్లో పనిమనిషి కూడా కొన్ని విశేషాలు చెప్పింది ఆమె చెప్పిన ప్రకారం మోహనరావెన్నడూ సీమను తనముందు చిన్నబుచ్చలేదు. కష్టపెట్టలేదు. అయితే ఆ యింట్లో తనేం చేసేదో, అక్కడేం జరిగిందో తల బద్దలు కొట్టుకొన్నా ఆమెకు గుర్తుండేది కాదుట. అలా అప్పుడప్పుడు మాత్రమే జరిగేదిట..."
    "అంటే?"
    "మోహనరావు నేరస్థుడు. అందులో సందేహంలేదు. అయితే అతడెందుకు నేరం చేశాడో మనం తెలుసుకోవాలి. అందుకు ముహూర్తం రేపు..." అన్నాడు కిల్లర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS