నాలుగవ ఆస్థిపంజరం!
వసుంధర
రమణరావు సముద్రపుటోడ్డున అసహనంగా అటూఇటూ తిరుగుతున్నాడు. మిత్రుడు పరశురాం కోసం అతను చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాడు. అన్న టైముకు రాకపోవడం పరశురాం ప్రత్యేకత అని తెలిసి కూడా అతను విసుక్కోకుండా ఉండలేకపోతున్నాడు.
అయితే అనుకోకుండా రమణరావు విసుగు దానంతటదే మాయమయింది. అందుక్కారణం పరశురాం రాక కాదు, మెరుపుతీగ లాంటి ఓ అమ్మాయి అతనికి కాస్త దరిదాపుల్లోనే వచ్చి కూర్చుంది. ఆమె కళ్ళబడగానే రమణరావు అన్ని ఆలోచనలూ మరిచిపోయి కొద్ది సేపు పచార్లు కూడా మానేసి ఏకాగ్రతతో ఆమె వంకనే చూస్తూ ఉండిపోయాడు.
ఆమె వయస్సు ఇరవై కి లోపే ఉండాలి. మిసమిస లాడే యవనం. గులాబి రంగు వెన్నలా ఉన్నాయి. ఆమె బుగ్గలు. ఆమె కనులు అడవిలోని లేడిని గుర్తు చేస్తున్నాయి. ఆమె కట్టిన చీర ఆమె కేంతవరకూ అందాన్నిచ్చిందో చెప్పడం కష్టం కానీ తను మాత్రం అద్భుత సౌందర్యాన్ని సంతరించుకుంది.
అలాంటి అమ్మాయి తనకు కొద్ది గజాల దూరంలో ముఖం తనకు కనబడేలా కూర్చున్నప్పుడు రమణరావుకు పరుశురాం ఎలా గుర్తుకొస్తాడు?"
కాసేపటికి రమణరావు ఈ లోకంలోకి వచ్చాడు.
నేలకు తగిలిన రబ్బరు బంతి పైకి ఎగిరినా మళ్ళీ కాసేపటికి క్రిందకు రావసిందే కదా! రమణరావు మనసు కూడా వాస్తవంలోకి వచ్చింది కానీ దానిలో ఇప్పుడు పరుశురాంకు చోటు లేదు. ఆ అమ్మాయి ఎవరో అన్న కొత్త ఆలోచనలతో అతడి మనసు నిండిపోయింది.
మనిషికి ఆలోచనాశక్తి పనికొస్తుంది కానీ అన్ని ప్రశ్నలకు అది జవాబు ఇవ్వలేదు. అతడి మనసులో ఇప్పుడున్న ప్రశ్నకు జవాబివ్వగలిగేది ఆలోచనాశక్తి కాదు. ఆ అమ్మాయే!
స్వతహాగా రమణరావుకు చొరవ ఎక్కువ. అతడు ధైర్యంగా ముందడుగు వేసి ఆ అమ్మాయికి సమీపంలో కూర్చుంటూ -- "మీరు అన్యధా భావించారనుకుంటాను" అన్నాడు.
ఆ అమ్మాయి అతని వంక ఎగాదిగా చూసి ...."ఈ బీచి అందరిదీ నూ-- ఇక్కడ మీరు కూర్చుంటే నాకు అభ్యంతర మెందుకు?" అంది తియ్యగా.
ఆమె సమాధానం వింటూనే రమణరావు ఆమెకు కాస్త దగ్గరగా జరిగాడు --"ఈ బెచి మీది కాకపోవచ్చు. కానీ మీలో ఏదో ప్రత్యేకత ఉంది. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని చూడగానే ఈ బీచి మీదేననీ -- మీ అనుమతి లేనిదే ఇక్కడ కూర్చోరాదేమోననీ అనిపించింది. అందుకే అలా అడిగాను--"
ఆమె సిగ్గుపడింది. సిగ్గు అనేది భగవంతుడు ఆడవాళ్ళ కోసమే సృష్టించి ఉండాలి. ఆడదాని సిగ్గు మగవాడిని ఎంతగా ఆకర్షిస్తుందో చెప్పడం కష్టం. రమణరావు సిగ్గుతో ఎరుపెక్కిన ఆమె బుగ్గల్ని చూస్తూ "ఈరోజున నా జన్మ ధన్యమైంది!" అనుకున్నాడు.
ఇద్దరూ కాసేపు మౌనంగా వున్నారు. తర్వాత రమణరావే నెమ్మదిగా మళ్ళీ మాటలు ప్రారంభించి ఆమెను వివరాలడిగాడు.
ఆమె పేరు కౌముది. ఆమెకు నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. కానీ డబ్బుంది.
'అదెలా సాధ్యం -- అందులోనూ ఆడపిల్లకి!" అన్నాడు రమణరావు ఆశ్చర్యంగా.
"నా తండ్రికి బంధువులంటే అసహ్యం. అందుకని అయన ఎప్పుడూ వారందరికీ దూరంగానే ఉన్నాడు. మా అమ్మ పోగానే అయన వ్యాపారం మానేశాడు. అయిదు లక్షలు బ్యాంకులో నా పేరున ఫిక్సిడ్ డిపాజిట్లో వేశాడు. నాకు పదహారేళ్ళు రాగానే ఒకరోజు నాకు జీవితం గురించి పాఠాలు చెప్పి "నీకు సరైన వరుణ్ణి నువ్వే ఎన్నుకుని నేనిచ్చిన డబ్బుతో జీవితం హాయిగా గడుపు-"అని చెప్పి నాకు తెలియకుండా ఆ రాత్రే నన్ను వదిలి పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయనేమయ్యాడో తెలియదు నాకు. రెండేళ్ళ నుంచి నేను వంటరి పక్షిని" అందామె.
ఇంత అందం రెండేళ్ళ నుంచి ఒంటరిగా ఉందని తెలియగానే రమణరావు మనసు ఏదోలా అయిపొయింది. ఆమె ఒంటరితనం పోగొట్టడానికి తను సాయపడాలని అతననుకున్నాడు. అంతేకాదు తను మాత్రమే సాయపడాలని కూడా అతననుకున్నాడు. అలా అనుకుని తన కధ నతనామెకు చెప్పాడు.
రమణరావు తండ్రి లక్షాధికారి. అతను యూనివర్సీటి లో రిసెర్చి చేస్తున్నాడు. ఫారిన్ వెళ్ళాలని అతని కుంది. బిజినెస్ లో పెట్టాలని తండ్రి అనుకుంటున్నాడు.
"నిర్మోహామాటంగా అనేస్తున్నానని ఏమీ అనుకోకండి -- మీవంటి సౌందర్యరాశి తోడూ లభిస్తే అటు విదేశాలూ వెళ్ళను ఇటు వ్యాపారామూ చెయ్యను--" అన్నాడు రమణరావు.
"మరేం చేస్తారు?" అంది కౌముది కుతూహలంగా.
'ఆమె చెప్పినట్లే చేస్తాను. ...." అన్నాడు రమణరావు.
కౌముది నవ్వి "నేను చెప్పింది చేసిన వారినే పెళ్ళి చేసుకోవాలని ప్రతిజ్ఞాపట్టాను. అందుకే ఎంత డబ్బున్నా రెండు సంవత్సరాలుగా నాకు వరుడు దోరకడం లేదు -" అంది.
రమణరావు కళ్ళలో ఆశ మెరిసింది - "మీరు చెప్పింది చేస్తాను. అప్పుడు మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా?' అన్నాడతను.
కౌముది నవ్వి "నేను చెప్పింది చేయగల మగవాడు ఈ భూమ్మీద ఉంటే ఉండవచ్చు కానీ మనదేశంలో ఉంటాడని మాత్రం నేననుకోవడం లేదు--" అంది.
"మీరు చెప్పే పని ఏమిటో నేను తెలుసుకోవచ్చా?" అన్నాడు రమణరావు.
కౌముది ఏదో చెప్పబోయి ఆగిపోయింది.
సరిగ్గా అప్పుడే పరుశురాం వచ్చి రమణరావు భుజం మీద చేయి వేసి "సారీ బ్రదర్! చాలా ఆలస్యమైంది" అన్నాడు.
కానీ రమణరావు కిప్పుడు పరుశురాం వచ్చినందుకు అసహనంగా వుంది.
కౌముది తన వాచీ వంక చూసుకుని -- "రేపు ఇదే టైముకి బీచికి వస్తాను" అని లేచి వెళ్ళిపోయింది.
"ఇంకెప్పుడూ నేను ఆలశ్యం చేయను బ్రదర్ -- నీకు చాలా కోపం వచ్చినట్లుంది " అన్నాడు పరుశురాం. అతడికి తన ధోరణి తనదే కాని ఎదుటి వాళ్ళను అట్టే పట్టించుకోడు. అందువల్లనే కౌముది అతడి దృష్టి పధాన్నాకర్శించ లేదు.
"నాకోపం సంగతీ కేం కానీ -- రేపు నేను బీచికి వస్తున్నాను. నువ్వు ఆలశ్యం సంగతటుంచి -- అసలు బీచికి రావద్దు. వచ్చావంటే మాట దక్కదు" అన్నాడు రమణరావు.
పరుశురాం తెల్లముఖం వేసుకుని మిత్రుడి వంకనే చూస్తూ వుండిపోయాడు.
2
"మీకు రోశయ్య తెలుసా?' అంది కౌముది.
"ఏ రోశయ్య ?'అన్నాడు రమణరావు.
"శ్రీ వెంకటేశ్వరా వైన్స్ మర్చంట్స్...."
"రోశయ్య గారా?" అయన నాకంటే మా నాన్నగారికీ బాగా తెలుసు...." అన్నాడు రమణరావు.
"రోశయ్యను రోశయ్య గారు అనేవాళ్ళతో స్నేహం చేయడం నాకిష్టముండదు" అంది కౌముది.
రమణరావు ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. ఆమె బుగ్గలు ఎర్రగా కండాయి. అయితే ఆ ఎరుపు సిగ్గు వల్ల రాలేదు. కోపం వల్ల వచ్చింది.
"రోశయ్యగా...."అని ఆగి -- "రోశయ్య మీకు ఎలా తెలుసు?" అనడిగాడు రమణరావు.
"నాది మా అమ్మ పోలికే కానీ ఆమె అందం పూర్తిగా నాకు రాలేదు. రోశయ్య మా అమ్మను చంపేశాడు." అంది కౌముది.
"రోశయ్యగా.... రోశయ్య....హంతకుడా?" ఆశ్చర్యంగా అన్నాడు రమణరావు.
'అవును. వాడంటే నాకు నిలువెల్లా పగ...."అంది. కౌముది. అప్పుడామె అందం నాగుపాములా బుస కొట్టింది.
"రోశయ్య హంతకుడా?" మళ్ళీ అన్నాడు రమణరావు.
అతడికి రోశయ్య బాగా తెలుసును. అతడికి తెలిసినంతవరకూ రోశయ్య పరమ నిష్టాగరిష్టుడు. ప్రతి శనివారమూ అతడు భజనలు చేయిస్తాడు. తను చేస్తాడు. ముఖంలో ఎప్పుడూ చెరగని చిరునవ్వు వుంటుంది. నుదుట విధిగా కుంకుమ వుంటుంది. ఎదుటి వారు ఎంత మాటల్నా చలించడు. అతడి వినయ గుణాన్ని , సహన శీలాన్నీ ఊళ్ళో చాలామంది ఆదర్శంగా చెప్పుకుంటారు.
అయన పేరు వినగానే ప్రతి ఒక్కరికీ గౌరవభావం కలుగుతుంది. తన నెవరైనా మెచ్చుకున్నాప్పటికీ అయన - "పొట్ట కోసం సారాయి వ్యాపారం చేసే నేను మంచివాడి నేలగౌతాను? నన్నేవరేన్ని విధాల నిందించినా అది న్యాయమే!"అంటాడు. అలాగని సారాయి వ్యాపారము మానడు--" ప్రభుత్వం అనుమతించిన పనినే గదా నేనూ చేస్తున్నాను" అంటాడాయన.
"అవును . వాడు హంతకుడు...." అంది కౌముది.
"నేను నమ్మలేకపోతున్నాను. అయన నిజంగా హంతకుడే అయితే నా వళ్ళు జలదరించి పోతోంది? ఆయనతో నేను చాలా బాగా చనువుగా వుండేవాడ్ని" అన్నాడు రమణరావు.
"ఒక హంతకుడితో చనువుగా మసిలినందుకే మీ వళ్ళు జలదరించి పొతే ఎలా? నేను మిమ్మల్నే హంతకుణ్ణి చేయాలను కుంటున్నాను?" అంది కౌముది.
"ఏమన్నారు?' అన్నాడు రమణరావు షాక్ తిన్నట్లు.
"మీరు నాకోసం రోశయ్య ను చంపాలి!" అంది కౌముది.
రమణరావు కు ముచ్చెమటలు పోశాయి. ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ అతడికి నోట మాట రాలేదు.
"ఈ షాక్ తట్టుకోవడానికి మీకు సమయం పడుతుంది. రేపు ఇదే సమయానికి ఇక్కడ వుంటాను. మీరు మళ్ళీ కనబడకపోతే నేను మరో మనిషిని వెతుక్కుంటాను" అని వెళ్ళిపోయింది కౌముది.
3
రమణరావు ఇల్లుచేరాడు. కానీ షాక్ నుంచి మాత్రం తేరుకోలేదు.
కౌముది సౌందర్యం అసాధారణం. అటువంటి అందగత్తెను భార్యగా పొందగలిగితే అది అదృష్టమే! తనకు ఆమెను భార్యగా పొందే అవకాశం వచ్చింది. కానీ అందుకు తనో హత్య చేయాలి. అందులోనూ తనకు బాగా పరిచయమైనా రోశయ్య ను హత్య చేయాలి.
రమణరావు హత్యలు చేసేటంత గుండె దిటవుంటుందని ఎవ్వరూ అనుకోరు. అతను మాంసాహారం తరచు తీసుకోకపోయినా అప్పుడప్పుడు కోడి పలావు తింటాడు. అయితే కొడిని చంపుతుండగా చూస్తె మాత్రం రెండు రోజుల పాటు మనసు పాడు చేసుకుంటాడు.
