దొంగకు సన్మానం
వసుంధర

ఆయనెవరో నాకు తెలుసు. ఆయన్ని చూడగానే నాకు భయం వేసింది. చూడగానే నా పని అయిపోయిందనుకున్నాను.
కొంతమంది పేరు కోసం మాత్రమే మంచి పనులు చేస్తుంటారు. కొంతమంది డబ్బు కోసం మంచి పనులు చేసి సమాజ శ్రేయస్సు కోసం అంటుంటారు. నిజంగా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తూ కూడా ఆ విషయం చెప్పుకొని తరగతి వారు అరుదు. అరుదైన ఈ తరగతికి చెందినవాడే డిటెక్టివ్ వెంకన్న.
బల్ల కట్టి డిటెక్టివ్ జీవితం ప్రారంభించినా అయన పూర్తిగా పరిష్కరించిన కేసులు అరుదు. అందుకు కారణం - నేరస్థుడిని పోలీసులకు అప్పగించడమే నేరానికి పరిష్కారమని అయన నమ్మకపోవడం. నేరస్థుడు బాగుపడడానికి మరో అవకాశ మివ్వడం కోసం ఆయన తను తెలుసుకున్న నిజాన్ని పత్రికలకు చెప్పడు. అయన దాకా వచ్చిన కేసుల గురించి చాలా మందికి తెలియదు.
అయన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళలో నేనొకడిని. ఒక దొంగతనం కేసులో నన్నయన పట్టుకున్నాడు. ఏ పరిస్థితుల్లో నేను దొంగ నైనానో విని జాలిపడి నన్ను హెచ్చరించి వదిలేశాడు. నావద్ద నుంచి దొంగలించిన డబ్బు మాత్రం తీసుకుని అసలు వాళ్ళకి అప్పగించాడు.
ఇప్పుడు వెంకన్నను చూస్తుంటే నాకు భయంగా వుంది. అయన హెచ్చరికను పెడ చెవిన బెట్టి నేను నిన్ననే మళ్ళీ దొంగతనం చేశాను. అది శ్యామలరావు యింట్లో!
శ్యామలరావు స్మగ్లింగ్ వ్యవహారాల్లో చాలా డబ్బు సంపాదిస్తున్నాడంటారు. కానీ ఆయనకు దానగుణం వుంది. అయన చేతికి ఎముక లేదని అంతా అంటారు. అసలు అందరికీ సాయపడడం కోసమే స్మగ్లింగ్ లాంటివి చేస్తున్నాడని కొందరంటారు.
శ్యామలరావు కు భార్య లేదు. పిల్లలు లేరు. యాభై ఏళ్ళ వయసుండి, మనిషి దృడంగా వుంటాడు. ఆయనకు కొంతమంది ఉంపుడుగత్తెలు , అక్రమ సంతానం కూడా ఉన్నట్లు చెప్పుకుంటారు. కానీ చూడగానే ఆయనకు చెయ్యెత్తి నమస్కరించాలనిపిస్తుంది.
శ్యామలరావు మామూలు పెంకిటింట్లో వుంటున్నాడు. ఆ యింటి మీద ఒకటి రెండు సార్లు యిన్ కంటాక్స్ వాళ్ళు రెయిడ్ చేసి డబ్బేమీ దొరక్క ఆయనకు సారీ చెప్పుకుని వెళ్ళిపోయారు.
అయన డబ్బును వేరే ఎక్కడో దాస్తాడంటారు. అదెక్కడో యెవ్వరికీ తెలియదు. ఆయన్ను ఏదో విధంగా కటకటాల వెనక్కు తోయ్యాలని కొందరు పోలీసు ఇన్ స్పెక్టర్లు కసిగానూ, అత్రుతగానూ వున్నారని చెప్పుకుంటారు.
దొంగతనాలు చేసేవారేవ్వరూ ఆయనింటికి వెళ్ళకూడదని ఓ రహస్య నియమమున్నది. అయన యింట్లో అయుదాలేమీ ఉంచుకోడు. ఈ విషయం మాత్రం నేను నమ్మలేదు- నిన్నటి వరకూ!
నిన్నరాత్రి నేను ఆయనింటికే దొంగతనానికి వెళ్ళాను.
నాకు అర్జంటుగా డబ్బు కావాలి! అందుకని శ్తామలరావు యింటినే యేన్నుకున్నాను. ఎందుకంటె అక్కడ నా ప్రయత్నం ఫెయిలయినప్పటికీ అయన పోలీసులదాకా వెళ్ళడు. పోలీసులంటే భయం వల్ల కాదు - మానవత్వం కారణంగా!
అందుకే దొంగ లాయనింటికి వెళ్ళరు. కానీ దొంగలకు నియమాలేమిటి అని నేను సరిపెట్టుకున్నాను. ఆయనింట్లో అట్టే డబ్బుండదని నాకు తెలుసు. కానీ నాకు వెయ్యి రూపాయలయినా చాలు. ఆమాత్రం డబ్బు అయన దగ్గరేలాగూ వుంటుంది.
రాత్రి వెళ్ళాను. ఇంట్లో ప్రవేశించడం సులభమే అయింది నాకు. సింపుల్ గా వెళ్ళి తలుపు తట్టాను. శ్యామలరావు వచ్చి తలుపు తీశాడు. నేను నా గురించి కొన్ని అబద్దాలు చెప్పి లోపల ప్రవేశించాను.
తర్వాత కత్తి చూపించి బెదిరించాను.
శ్యామలరావు ఆశ్చర్యపడ్డట్లు కనపడింది - "నా ఇంట్లో డబ్బుండదు. అనవసరంగా శ్రమపడకు" అన్నాడాయన.
"అది నేను చూసుకుంటాను" అన్నాను.
అయన మాటలేమీ వినకుండా యినప్పెట్టే దగ్గరకు నడిచాను.
పెట్టె తెరిచి చూసే సరికి నా కళ్ళు చెదిరిపోయాయి.
అందులో మొత్తం రెండు లక్షల రూపాయలున్నాయి.
"అంతా తీసుకు వెళ్ళకు. నీక్కావలసిన డబ్బు పది వేల దాకా తీసుకు వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు" అన్నాడు శ్యామలరావు.
నేను ఆలోచిస్తున్నాను. నిజానికి వెయ్యి రూపాయలు చాలనుకున్నాను. కానీ చూస్తూ చూస్తూ రెండు లక్షలు యెలా వదులుకోగలను? ఈ దొంగతనం పూర్తీ కాగానే యింక మళ్ళీ దొంగతనాల జోలికి వెళ్ళ నవసరం లేదు. న్యాయంగా జీవితం గడపవచ్చు.
నా కళ్ళ ముందు యెన్నో రంగుల కలలు.
అయితేశ్యామలరావు నన్ను హెచ్చరిస్తున్నాడు.
"పది వేలయితే నేనే నీకు ఆప్యాయంగా, ఆనందంగా యిస్తాను. మొత్తమంతా తీసుకుపోవాలనుకుంటే నిన్ను వేటాడతాను. నీ అంతు చూస్తాను."
అయన ఆ డబ్బు ఒక శరణాలయానికి గుప్త దానంగా యివ్వ బోతున్నాడట. చావు బతుకుల్లో వున్ననలుగురు అనాధుల కిది ఖరీదైన వైద్యం జరిపించడానికి సహకరిస్తుందిట. సకాలంలో ఆ డబ్బు అందకపోతే ఆ అనాధులు నిష్కారణంగా చచ్చిపోతారుట.
డబ్బంతా జేబుల్లోకి తోసేశాను. కాస్త యెత్తుగా వచ్చినా సులభంగానే పట్టేసింది. నేనాయన్ను మంచం మీద పడుకోబెట్టి కాస్త వదులుగా తాళ్ళతో కట్టి - "ఓ ఆరగంట కష్టపడితే ఈ బంధనాలు విడిపించుకోవడం అంత కష్టం కాదు" అన్నాను.
"కానీ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఇంత వరకూ డిటెక్టివ్ వెంకన్న నా విషయంలో ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదు. జీవితం లో మళ్ళీ మరిచిపోలేని విధంగా నీకు పాఠం చెబుతాను. నువ్వు దొంగతనం చేశావని కాదు నా బాధ. నీ అత్యాశ నా రక్తాన్ని మరిగిస్తున్నది. ఆశ పోతులను నేను భరించలేను."
శ్యామలరావు అరుస్తూనే వున్నాడు. అసలాయన యింట్లో యెప్పుడూ యింత డబ్బు వుండదట. ప్రత్యేకంగా అనాధుల వైద్యం కోసమని ఆయ నీ డబ్బు తెచ్చి ఉంచాడట. రేపుదయం వాళ్ళు వస్తే తనేం చేయాలో తెలియడం లేదని వాపోయాడు.
నేనా యింట్లోంచి బైటపడ్డాను. అంతా నా అదృష్టమే అనుకోవాలి. అదృష్టం లేకపోతె యెప్పుడూ యింట్లో డబ్బుండని శ్యామలరావు అంత డబ్బెందుకు వుంచుతాడు. అనాధులకు వైద్యం సంగతి ! అనాదులుగా బ్రతికే వాళ్ళు తమ జీవితాలను యెంత త్వరగా ముగించగలిగితే అంత మంచిది. వాళ్ళకు వైద్యం జరిపించి- వారి నికృష్ట జీవితాలను పొడగించడం సమాజానికి మంచిది కాదు.
అన్ని విధాల మనసును సరిపెట్టుకుని హోటల్లో కి వెళ్ళి పోయాను.
మా యిల్లు ఆ ఊళ్ళో నే వుంది. నా వాళ్ళంతా ఆ యింట్లోనే వున్నారు. కానీ దొంగతనం చేయాలనుకున్నప్పుడల్లా నేను మారువేషం వేసుకుని హోటల్లో మకాం పెడుతుంటాను. నా గురించి యెవరికీ యెలాంటి అనుమానమూ రాకూడదని నా ఆశ, ఏదైనా అర్జంటు కబురుంటే హోటల్ మేనేజరు కందజేయమని యింట్లో చెబుతాను. నేను హోటల్లో వుంటున్నట్లు యింట్లో వాళ్ళకు కూడా తెలియదు.
చిన్న హోటల్ ముందు ఓ కోయవాడు కూర్చున్నాడు. వాడెందుకో నన్ను చూస్తూనే 'దొరా! నీకు అదృష్టం పట్టబోతోంది!" అన్నాడు. వాడి మాటల్ని నేనంత సీరియస్గా తీసుకోలేదు. అయినా వాడు మాట్లాడడం మానలేదు. నా జాతకం తిరిగి పోతుందనీ, దశ మారిపోతుందని చెప్పడం ప్రారంభించి పది రూపాయ లిమ్మని అడిగాడు.
నేను సీరియస్ గా , 'ఎన్నాళ్ళ లో మారు తుందంటావ్?" అన్నాను.
"రెండు మూడు రోజులు చాలు" అన్నాడు వాడు నమ్మాకంగా.
"అయితే జాతకం తిరిగేక , దశ మారేక అప్పుడు నీకు పది కాదు -- పాతిక రూపాయలిస్తాను. రెండు మూడు రోజులు నువ్వూ ఆగి నీ జ్యోతిష విద్య ప్రభావాన్ని పరీక్షించుకుని వెళ్ళొచ్చు" అన్నాను.
ఇలాగంటానని వాడనుకున్నట్లు లేదు. ఇంకేమీ మాట్లాడలేదు.
వాడు చెప్పింది నిజమే అయింది. నిజంగా జాతకం మారిపోయేటంత అదృష్టం పట్టింది. ఉదయమే వాడికి పాతిక రూపాయలూ యివ్వాలనుకుని గదిలోంచి బయటకు వస్తే తీరా డిటెక్టివ్ వెంకన్న కనిపించాడు.
అప్పుడు నాకు శ్యామలరావు వెంకన్న మీద పెట్టుకున్న ఆశలు గుర్తుకొచ్చాయి. అతడు అందుకే వచ్చాడా?' యిక్కడి కేలా రాగలిగాడు?
వెంకన్న హోటల్ మేనేజరు తో మాట్లాడుతున్నాడు. నేను నా గదిలోనికి వెళ్ళిపోయాను.
అనవసరంగా కంగారుపడడ మెందుకు? ఆయనెందు కొచ్చాడో?
గదిలో అరగంట కూర్చున్నాడు. ఇంక వెంకన్న వెళ్ళి వుంటాడని ఊహించుకుని లేవబోయాను. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మ్రోగింది.
ఎవరై వుంటారు?
తప్పకుండా డిటెక్టివ్ వెంకన్నే అయుంటాడు. అతడికి నా ఉనికి యింత త్వరగా యెలా తెలిసిపోయింది?
మొండి ధైర్యంతో వెళ్ళి తలుపు తీశాను.
బాయ్!
"ఇప్పుడు నాకేమీ అవసరం లేదే!" అన్నాను విసుగ్గా.
"డిటెక్టివ్ వెంకన్న గారట. మీతో మాట్లాడాలంటున్నారు. తమరు క్రిందకు వస్తారా, ఆయన్నిక్కడికి రమ్మంటారా?" అన్నాడు బాయ్.
అనుకున్నంతా అయింది. అయన నన్ను గుర్తించాడు.
"నా కిప్పుడు తల నొప్పిగా వుంది. ఎవరితో మాట్లాడలేను!"
'అలాగంటే అయన ఊరుకోరు సార్! డిటెక్టివ్ లతో లేనిపోని గొడవ లెందుకు సార్! ఓ అయిదు నిమిషాలు మాట్లాడి పంపించేయండి!"
