Previous Page Next Page 
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 16

 

    నేను పుష్కలంగా డబ్బు సంపాదించబోతున్నానని తెలిసింది. నేను భయపడాల్సిన అవసరమూ లేదని అర్ధమవుతోంది. కానీ ఇదే నా జీవన విధానం కాకూడదని నా ఆశ.
    మధ్యలో ఒకసారి బాస్ తో- "మీరు మనుషుల నెలా నమ్ముతారు?" అనడిగాను.
    "నమ్మకానికి తగ్గ ఋజువు చూపించిన వారికే ఇక్కడ ఉద్యోగం లభిస్తుంది" అన్నాడు బాస్.
    "మరి నేనేమీ చూపించలేదే?" అన్నాను.
    "నీకు తిరుగులేని రికమెండేషన్ ఉంది."
    "రికమెండేషన్లు మీరు నమ్ముతారా?"
    "అందరివీ కావు, కొందరివి"
    "ఉదాహరణకు నేను మిమ్మల్ని మోసం చేస్తే."
    "నష్టం నీకే ....మాక్కాదు.
    "మీక్కూడా నష్టం కలిగించే స్థితికి ఎదిగేక మోసం చేస్తే....?"
    "అప్పుడు నువ్వు మోసం చేయాలను కోవు. ఎందుకంటె నువ్వూ మాలో ఒకడివి అయిపోతావు."
    నేను ఆలోచిస్తున్నట్లుగా -- "ఉద్యోగంలో చేరేముందు నమ్మకానికి ఎలాంటి ఋజువులు చూపించాలి?" అన్నాను.
    "నీకా వివరాలు కావాలంటే స్టాక్ రూమ్ లో పదకొండో నంబరు రాక్ చూడు. అందులో ఎవరెవరేటువంటి ఋజువులిచ్చారో.... ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫైల్స్ లో వివరాలుంటాయి" అన్నాడు బాస్.
    "నేను చూడొచ్చా ?" అన్నాను.
    "నీ రెకమెండేషన్ -- నీ హోదా నిక్కడ పెంచింది .వెళ్ళి చూడొచ్చు."
    నేను స్టాక్ రూంకు వెళ్ళాను. పదకొండో నెంబరు రాక్ లో "జి" లో వున్న ఫైలు తీశాను. గోవిందరాజులు పేరు కోసం వెతికాను. దొరికింది.
    అక్కడి వివరాలు చదివి ఆశ్చర్యపోయాను.
    గోవిందరాజులు చాలా కష్టాల్లో వున్నాడు. అతడి మొదటి పేరు సీతారామయ్య. కొత్త జీవితం కోసం అతడు పేరు మార్చుకున్నాడు. డబ్బు కోసం ఏం చేయడాని కైనా సిద్దంగా వున్నాడు. నమ్మకం కోసం అతడు కంపెనీకి కన్నకూతురిని నగ్నంగా ఫోటోలు తీసి యిచ్చాడు. ఈ ఋజువు అరుదైనది. కంపెనీ అతడికి నమ్మకస్తు లలో ఏ గ్రేడ్ యిచ్చింది.
    నేనిది న,నమ్మలేదు. మేష్టారలాంటి పని చేయడని నాకు ఖచ్చితంగా తెలుసు. కంపెనీ మేస్టారిని బ్లాక్ మెయిల్ చేయడానికి తీసిన ఫోటోలను -- ఆయనే ఋజువుగా ఇచ్చాడంటుంది . ఆ విధంగా కంపెనీకి సమస్య వుండదు.
    నేను తిరిగి బాస్ దగ్గరకు వెళ్ళి గోవిందరాజులు విషయం చెప్పి -- 'అయన గతం నాకు తెలుసు. అయన లాంటి మనిషి కాదు. ఈ ఋజువులు కంపెనీకి ఉద్యోగులిచ్చినవి కాదు. కంపెనీయే ఉద్యోగుల్ని బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఉపయోగించుకుంటున్న విశేషాలు ....' అన్నాను.
    'కంపెనీ కటువంటి అవసరం లేదు. ఎందరో ఇందులో ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు" అన్నాడు బాస్.
    నాకంతా విచిత్రంగా అనిపించింది. కొన్నాళ్ళ పాటు ఆఫీసు వ్యవహారాలు శ్రద్దగా గమనించేక బాస్ మాటలు అబద్దం కావనిపించింది.
    
                                    5
    నేను తరచు మేష్టారింటికి వెళ్ళి లక్ష్మీని కలుసుకుంటున్నాను. ఆరంభంలో లక్ష్మీ నా పట్ల అట్టే ఆసక్తిని చూపేది కాదు. క్రమంగా నేనంటే ఇష్టపడడం ప్రారంభించింది- నాకోసం ఎదురు చూడడం కూడా మొదలు పెట్టింది.
    ఒకరోజామెతో నేను తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పాను.
    లక్ష్మీ ఆశ్చర్యంగా -- "నా గురించి నాన్న నీకు చెప్పలేదా?' అంది.
    'చెప్పాడు" అంటూ గోవిందరాజులు నాకు చెప్పిన విశేషాలు దాచకుండా చెప్పాను.
    లక్ష్మీ మరింత ఆశ్చర్యపడి -- "నాన్న నీకు -- అలా చెప్పాడా?' అంది.
    అప్పుడు నే నాశ్చర్యపడ్డాను--"ఎలా చెబుతారనుకున్నావ్?"
    "నేను నిజం దాచను ..." అంటూ లక్ష్మీ అటూ ఇటూ చూసి -- "నాన్న తనే కావాలని ఈ ఉద్యోగంలో చేరాడు. ఆయనకు డబ్బు పిచ్చి పట్టుకుంది. వాళ్ళు ఋజువులాడిగారని తనే నాకలా ఫోటోలు తీశాడు" అంది.
    షాక్ తిన్నాను. ఈ నిజం నా వంట్లో శూలంలా గుచ్చుకుంది.
    "లక్ష్మీ....ఇది నేను నమ్మలేను"అన్నాను.
    లక్ష్మీ విషాదంగా నవ్వి ఊరుకుంది.
    "ఈ నిజం నువ్వు నాకెందుకు చెప్పినట్లు ?" అన్నాను మళ్ళీ.
    "నువ్వు నా తండ్రిని విష వలయం లోంచి రక్షించాలను కున్నావు. అందులో అయన ఇరుక్కున్నాడని నీ భ్రమ. నీ భ్రమను నీకు తెలియబర్చాలన్నది నా ప్రయత్నం" అంది లక్ష్మీ.
      "మీ నాన్న నాకబద్దమెందుకు చెప్పాడు?"
    "ఏమో -- నువ్వే ఊహించు."
    "ఊహ కందని విశేషాలేన్నో జరిగిపోతున్నాయి. మేష్టారులా మారిపోతారని నేనెప్పుడూ అనుకోలేదు."
    "నీ గురించి నాన్న యింట్లో ఒక మాటన్నాడు" అంది లక్ష్మీ సాలోచనగా -- "నా శిష్యుడికి నా గురించి ఉన్నతాభిప్రాయాలున్నాయి. అందుకే నాదారినే తొక్కడానికి అతడు సందిగ్ధంలో పడ్డాడు. నేను నేనుగా చచ్చిపోయినా నా ఆదర్శాలు-- అతడిని మంచిదారిలో నడిపిస్తే -- నేను బ్రతికున్నట్లే లెక్క! నేను నా అంతట నేనుగా కాక-- పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా తయారయ్యాననీ-- ఈ విషయంలో నే నిసహయుడిననీ-- నన్నాడించగల వ్యక్తీ వేరే యింకొకడున్నాడనీ అతడను కోవడం ముఖ్యం-- అని నాన్న అమ్మతో అంటుంటే నేను విన్నాను."
    ఈ మాటలు వినగానే మళ్ళీ నాకు మేష్టారి పై గౌరవం పెరిగిపోయింది. అయన స్వార్ధంతో కాక నా మంచి కోరి అబద్దం చెప్పారు. నేను చెడిపోతే అందుకు నేనే కారణం కావాలి కానీ - అయన కాకూడదు.
    "లక్ష్మీ! నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను" అన్నానావేశంగా.
    లక్ష్మీ ముఖం విషాదంగా అయిపొయింది.
    నేనశ్చర్యపడి - "నేను నీకు నచ్చలేదా -- అలా అయిపోయావు" అన్నాను.
    లక్ష్మీ విషాదంగానే నవ్వి -- "నువ్వు నా గురించి ఆలోచించడం లేదు. నాన్న వ్యక్తిత్వంతో నన్ను ముడి పెట్టి -- నాన్న కోసం నన్ను పెళ్ళి చేసుకుంటా నంటున్నావు ...." అంది.
    'అయితే ఏమంటావు?"
    "సీతారామయ్య మేష్టారి కూతురుగా కాక - నన్ను నన్నుగా ప్రేమించగలిగితే నాకెంతో సంతోషంగా వుంటుంది -" అంది లక్ష్మీ.
    చెప్పాలంటే అప్పుడు నాకా మాటలు సరిగా అర్ధం కాలేదు.అవి అర్ధం చేసుకుందుకే ఏమో నాకు మర్నాడే దూర ప్రయాణం తగిలింది.

                                      6
    చాలా శ్రమతో కూడిన ప్రయాణమది. ఒకరోజంతా రైలు, బస్సు, లాంచీ , గుర్రబ్బండి వంటి వాటిల్లో ప్రయాణం చేసి చేరుకోవలసిన పల్లేటూరది. మా కంపెనీ ఆ ఊళ్ళో ఓ కార్యాలయాన్నేర్పాటు చేయాలనుకుంటోంది. అందుకు స్థలం కావాలి. ఆవూరి ప్రెసిడెంటు సాయం చేస్తానన్నాడు.
    ఇంటర్మీడియట్లో నా క్లాసు మేటు జనార్దనం ఆ ఊళ్ళో నే స్వంత వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఊళ్ళో నాకు తెలుసున్న వారున్నారు కదా అని బాస్ నాకీ డ్యూటీ ఏర్పాటు చేశాడు.
    నేను ముందుగా ఉత్తరం రాయకపోయినా జనార్దనం ఊళ్ళో నే ఉండడం నా అదృష్టం. అతడు నన్నెంతో ఆప్యాయంగా ఆదరించాడు.
    కాలేజీ రోజుల్లో ఇద్దరం బాగా చనువుగా ఉండేవాళ్ళం . అప్పట్లో నేను సీతారామయ్య మేష్టారి గురించి తరచుగా చెబుతుండేవాణ్ణి. ఒకసారి సెలవుల్లో యింటికి వెళ్ళి వచ్చి "నువ్వు చెబితే యింకా ఎవరో అనుకున్నాను. అయన మా ఊళ్ళో నే పనిచేస్తున్నారు" అన్నాడు.
    జనార్దనం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పూర్తీ చేయలేదు. తండ్రికి జబ్బు చేయడం , తనే పెద్ద కొడుకు కావడం -- అతణ్ణి చదువుకు దూరం చేశాయి. మా స్నేహం అక్కడే ఆగిపోయింది.
    మాటల ప్రసక్తిలో సీతారామయ్య మేష్టారి ప్రసక్తి వచ్చింది. నేను ప్రస్తుతపు విశేషం చేబుదామనుకునే లోగా "పాపం - మేష్టారు ఆర్ధికంగా చాలా యిబ్బంది పడ్డారు. కూతురికి జబ్బు చేస్తే వైద్యానికి పట్నం తీసుకుని వెళ్ళారు. కూతురు పట్నం లోనే చచ్చిపోయింది. తిరిగి వచ్చి అయన నాతొ - నాకీ ప్రపంచమంటే పగ పుడుతోందోయ్ ....డబ్బు సంపాదించి ఈ ప్రపంచం మీద పగ సాధిస్తాను అన్నారు. తర్వాత ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోయారు...." అన్నాడు జనార్దనం.
    నేను తెల్లబోయి - "అయన కూతురు చచ్చిపోయిండా?' అంటే ఏ కూతురు ? పెద్ద కూతురా.....చిన్న కూతురా " అన్నాను.
    "ఆయనకొక్కతే కూతురు. పేరు లక్ష్మీ అనుకొంటాను. తర్వాత ఇద్దరు మగపిల్లలు. అంతే! అన్నాడు జనార్దనం.
    ఈ ఒక్క మాటతో నాకెన్నో ప్రశ్నలకు సమాధానం లభించింది. మేష్టారు కి లక్ష్మీ అంటే ప్రాణం సరైన వైద్యం చేయించలేక కూతుర్ని పోగొట్టుకొని ఆవేశంలో -- పట్నం వచ్చి తప్పుదారి తొక్కారు. అయితే కన్న కూతురి కాయన నగ్నంగా ఫోటోలు తీయగల నీచ స్థితి కాయానేలా దిగి పోయారో -- ఇప్పుడే నాకర్ధ మయింది.
    "సీతారామయ్య మేష్టారి కూతురి గా కాక నన్ను నన్నుగా ప్రేమించ గలిగితే నాకెంతో సంతోషంగా వుంటుంది --" అన్న లక్ష్మీ మాటలు నా చెవుల్లో గింగురు మంటున్నాయి.
    ఇప్పుడు నేను మేష్టారి గురించీ, నా భవిష్యత్తు గురించీ కాక లక్ష్మీ సంతోషం గురించి ఆలోచించాల్సి వుంటుంది. మేష్టారి పతనానికి అయన కూతురే కారణం అయినప్పటికీ లక్ష్మీని కూతురని చెప్పుకుంటూ అయన చేయలేని న్యాయం నేను లక్ష్మీకి చేయగలిగినప్పుడు -- మేష్టారి కూతురుగా ఆమెకు సరైనా న్యాయం జరుగుతుందని నా కనిపిస్తోంది."

                                   *** 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS