రామాయమ్మపైన నాకేమీ హక్కులేదు. మాధురిపై వుంది. అందువల్ల రామాయమ్మ ప్రవర్తన నన్ను బాధించడం లేదు. మాధురి ప్రవర్తన బాధించింది. మాదురికీ నాపైన హక్కు వుంది. మరి నా ప్రవర్తన ఆమెను బాధించదూ? అయినా ఆమె నన్ను చంపలేదు.
రామాయమ్మ దగ్గరున్నప్పుడు నన్ను చూసిన మాధురి ఏడ్చి గోలపెట్టింది. చంద్రశేఖరశర్మతో మాధురిని చూసిన నేనామె గుండెల్లో బాకు దింపాను.
ఇలా ఆలోచిస్త్జూంటే నాకు బాగోలేదు.
అక్కణ్ణించి ఇంటికెళ్ళేసేరికి రాత్రి పన్నెండు దాటింది. గుండెను నెమ్మదిగా మళ్ళీ రాయిగా మారుస్తున్నాను.
తలుపు తాళం తీసి లోపలకు వెళ్ళాను. తలుపులు వేసి తిన్నగా బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద వాలాను. మంచం కోడుకి చంద్రశేఖరశర్మ, నేలమీద శవం కంటికి కనిపించాయి.
కళ్ళు మూసుకున్నాను. అయినా అవే కనిపిస్తున్నాయి. ప్రయత్నిస్తున్నాను నిద్రపోవడానికి. అవే గుర్తుకొచ్చి నిద్ర పట్టడం లేదు. అతి కష్టంమీద నిద్రపడితే-కలలో కూడా మాధురి శవం, చంద్రశేఖరశర్మ కనబడ్డారు.
ఎప్పుడో నిద్ర పట్టింది. ఓ పట్టాన మెలకువ వచ్చేది కాదు కానీ ఎవరో తలుపులు దబదబా బాదుతున్నారు. టైము చూసుకున్నాను. ఎనిమిదయింది.
వెళ్ళి తలుపులు తీశాను.....పోలీసులు!
తడబడ్డాను. ఇద్దరు కానిస్టేబుల్స్ నన్ను పట్టుకున్నారు. మిగతావాళ్ళు హడావుడిగా ఇల్లంతా కలయదిరుగుతున్నారు. ఓ గంటసేపు ఇల్లంతా సోదా చేశారు. కొంతమంది దొడ్లోకి కూడా వెళ్ళినట్లున్నారు. శవం బయట పెట్టారు.
బహుశా పోలీసు ఇన్ స్పెక్ట్రరనుకుంటాను-నా దగ్గరకు వచ్చి "నీ దొడ్లో శవం పాతిపెట్టబడి వుంది. దీనికే మంటావ్?" అడిగాడు.
ఆశ్చర్యాన్ని ప్రకటించాను. ఆ శవం ఎవరిదో నాకు తెలియదన్నాను. ఇష్టం వచ్చినట్లు బుకాయించాను.
చుట్టుపక్కల వాళ్ళను రప్పించారు. ఆమె మాదురి అనీ, నా భార్య అనీ అంతా గుర్తుపట్టారు నిన్న మా ఇంట్లోంచి కేకలు వినపడ్డట్లు కూడా పొరుగావిడ చెప్పింది. నా ప్రవర్తన మంచిది కాదని మాధురి ఇరుగు పొరుగుల దగ్గర ఏడ్చేదని కూడా అప్పుడే నాకు తెలిసింది.
నేను అరెస్టయ్యాను.
నాకున్న ఆశ్చర్యమల్లా-ఇంత త్వరగా నేనెలా పట్టుబడ్డాను? అన్నది.
చంద్రశేఖరశర్మను వదిలివేయడం పెద్ద తప్పయి పోయింది. వాడింత పని చేస్తాడని నేననుకోలేదు. మానవత్వానికి విలువ లేదు. పొరపాటుగా కూడా మానవత్వానికి లొంగకూడదనుకున్నాను.
"ఎవరు చెప్పారు మీకీ ఇంట్లో శవం దొరుకుతుందని?" అనడిగాను.
"అతని పేరు చంద్రశేఖరశర్మ...."
"వాడే నా పెళ్ళాన్ని చంపి దొడ్లో పాతిపెట్టాడేమో" అన్నాను.
"అతనికా అవసరం లేదు. అతను జరిగినదంతా వివరించాడు. అన్ని ప్రశ్నలకూ అతని వాంగ్మూలంలో సమాధానం లభిస్తుంది నీకు. నీ మీద కేసు పక్కాగా వుంది" అన్నాడు ఇన్ స్పెక్టర్.
మాధురి, చంద్రశేఖరశర్మతో కలిసి తప్పుచేయలేదుట. నన్ను మార్చడం కోసం అతనినలా నటించమన్నదట.
ఈ విషయం నేను నమ్మలేను. ఆడదీ మగాడూ అంతదగ్గరగా అలాంటి పరిస్థితిలో పవిత్రంగా పవిత్రభావాలతో వున్నారంటే వాళ్ళు జడులయి వుండాలి. అంతే!
కానీ ఇన్ స్పెక్టర్ కి చంద్రశేఖరశర్మ అలా చెప్పాడు బహుశా తన పరువు కాపాడుకుందుకు. నా ముందు నేను చేసింది దుష్టశిక్షణ అన్నాడు. ఉత్త అవకాశవాది!
"వాణ్ణి నేను వదలకుండా వుండాల్సింది. వాడిమీద పెద్ద సంసారం ఆధారపడి వుందని జాలిపడి వదిలిపెట్టాను. అవకాశమొస్తే వాడి అంతం చూస్తాను...." అన్నాను.
"ఆ అవకాశం నీకు రాదు" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"మంచి లాయర్ను పెట్టుకుంటాను. నాకూళ్లో మంచి పలుకుబడి వుంది. చాలా మంది పెద్దలు నాకు సాయపడతారు..." అన్నాను.
"అయినా లాభం లేదు...." అన్నాడు ఇన్ స్పెక్టర్.
"ఎందుకని?"
"అతనికి యాక్సిడెంట్ జరిగింది. ట్రక్కు కిందపడ్డాడు. హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో వుండగా అతను నీ కథ చెప్పి, పోలీసులకా వివరాలందజేయమన్నాడు. చచ్చే ముందయినా ఒక దుర్మార్గుడిని ప్రజల మధ్యనుంచి తొలగించడం తనకు తృప్తినిస్తుందన్నాడు."
"తర్వాత....?"
"చచ్చిపోయాడు."
నా కళ్ళు తిరిగాయి. కాసేపు అన్నీ మరిచిపోయాను.
నా కళ్ళ ముందు తనని బ్రతికించమని నన్ను వేడుకుంటున్న చంద్రశేఖరశర్మ మెదుల్తున్నాడు. తనప్రాణాలు తన కోసం కాదనీ తనవాళ్ళకోసమనీ అంటున్న శర్మ కదుల్తున్నాడు. అతను లేచి-అతనివాళ్ళు కూడా నా మనసులో మెదుల్తున్నారు.
నేను కటిక కసాయివాడిని. నాలో కరుణ లేదు. నాకిష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను. నన్నెవరైనా ఏదయినా అంటే సహించను. నా కిష్టంలేని పని చేస్తే అన్నింటికీ నన్నే నమ్ముకుని వచ్చిన, కట్టుకున్న భార్యను కూడా చంపి పాతేస్తాను.
ఇటువంటి నేను చంద్రశేఖరశర్మను అతని కుటుంబం కోసమని వదిలిపెట్టాను. అందువల్ల నాకు ప్రమాదముందని కూడా నాకు తెలుసు. అయినా రిస్కు తీసుకున్నాను. ఆ విధంగా నేను మానవత్వాన్ని ప్రదర్శించగలిగాను.
కానీ చంద్రశేఖరశర్మ యాక్సిడెంట్లో మరణించాడు. యాక్సిడెంట్స్ దైవసంకల్పం. చంద్రశేఖరశర్మ దేవుడికి చేసిన అపచారమేమీ లేదు. చేసినా కూడా అతని కుటుంబాన్ని దృష్టిలో వుంచుకొని ఆయన క్షమించవచ్చు.
"ఒరేయ్ దేవుడూ-నీకు నాపాటి మానవత్వం కూడా లేదురా!" అనుకున్నాను. అయినా దేవుడికి దైవత్వమే కానీ మానవత్వమెలాగుంటుంది? అనుకుంటూ పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టాను.
* * *
