పిల్లలు ముగ్గుర్నీ కూర్చోబెట్టి, తనుకూడా మధ్యలో కూర్చుంది విశాలి.
సదాశివం భార్యతో కాఫీ కలపమని చెపుతుంటే నవ్వుతూ వారించబోయింది విశాలి.
"వద్దనకండి, బాబూ! నా వాటా కాఫీ నాకు లేకుండా పోతుంది."
"అబ్బే! మిమ్మల్ని తాగవద్దని నే ననలేదుగా! ఏమండీ! మీ శ్రీవారికి మాత్రం కలిపి తీసుకురండి. దయచేసి నా కొద్దు."
"అలాగే" అంటూ లోపలికి వెళ్ళిపోయిన లక్ష్మి రెండు గ్లాసులలో కాఫీ తీసుకొచ్చింది.
తీసుకోక తప్పిందికాదు విశాలికి.
ఇంకో ఖాళీ గ్లాసు తీసుకురమ్మని అందులో సగం పోసి లక్ష్మి కిచ్చింది.
"నాకు కాఫీ అట్టే అలవాటు లేదండీ" అంటూనే మొహమాటపడుతూ తాగింది లక్ష్మి.
"నేను మీ ఇంటికి రెండు సార్లు వచ్చాను. ఇంకమీరే బాకీ ఉన్నారు. తప్పకుండా వీలు చూసుకుని మా ఇంటి కెప్పుడైనా రండి" అంటూ లక్ష్మి చెయ్యి మృదువుగా నొక్కింది విశాలి.
* * *
ఆదరా బాదరా ఇంట్లో అడుగు పెడుతూండగా-"ఏమో బజారుకని బయటికి వెళ్ళినప్పుడల్లా ఇంకా ఏమేం పన్లు చక్కబెట్టుకుంటూ ఉంటుందో? ఎవరితో షికార్లు తిరుగుతూ ఉంటుందో ఎవరు చూడొచ్చారు గనక" అంటూ అనసూయమ్మ కొడుకుతో అనడం వినిపించింది విశాలికి.
వాళ్ళ ముఖం వంక చూడటానికికూడా అసహ్యమనిపించిమాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది విశాలి. ఆ తరవాత తల్లీకొడుకు లిద్ధరూ చాలాసేపు ఏవో గుసగుసలు చెప్పుకోవడం గమనించింది. ఆ రాత్రి పది గంటలకి విశాలి అందించిన పాలు తాగుతూ అంది మహాలక్ష్మి: "మా పిన్ని అనే మాట లేవీ పట్టించుకోకు, విశాలీ! ఆవిడ శరీరం పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టు ఉండడమే కాక ఆవిడ మనసూ భయంకరమైనదే! ఎన్ని పచ్చని సంసారాల్లోనో చిచ్చు పెట్టింది. నాకు బాగా తెలుసు ఆవిడ సంగతి. ఇప్పుడు ఆవిడ వేస్తున్న ప్లాను ఏమిటో తెలుసా...."
"పోనీలే, వదినా. రేపు మాట్లాడుకోవచ్చులే! పడుకో."
"కాదు, కాదు! వాళ్ళంతా పడుకున్నారు కదూ? ఇప్పుడే చెపుతాను. ఆవిడ కొక దాసీలాంటి కోడలు కావాలి. కొడు కో వెర్రివెంగళప్ప. శరీరం పెరిగినంతగా మెదడు పెరగలేదు వాడికి. ఆ ప్రబుద్దున్ని చేసుకోవడానికి ఏ పిల్ల మాత్రం ముందు కొస్తుందీ? పైగా, చదువూ, ఉద్యోగం, ఆస్తీ-ఏమీ లేవు వాడికి. మా బాబయ్య పోయాక అప్పటినించీ ఆయన తమ్ముడు-అంటే ఈవిడ మరిదిగారన్న మాట.....పోషిస్తున్నాడు వీళ్ళిద్దర్నీ. ఆవిడ కళ్ళు నీ మీద పడ్డాయి. నువ్వు పెళ్ళంటే మొహం వాచిపోయి ఉంటావని, తన కొడుకుని చేసుకోమంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటావని, అప్పుడు అథార్టీ చెయ్యడానికి తనకికూడా ఓ కోడ లొస్తుందనీ కలలు కంటోందావిడ. ఆవిడ నా దగ్గిర వాగిన వాగుడును బట్టి నే నిది గ్రహించాను. నువ్వు మాత్రం వాళ్ళ దగ్గిర చాలా జాగ్రత్తగా ఉండాలి." దగ్గుతెర రావడంతో మహాలక్ష్మి చెప్పడం ఆపింది.
"నువ్వేం భయపడకు, వదినా! ఆవిడని చూడగానే నేను ఆవిడెటువంటిదో గ్రహించుకున్నాను. నేను జాగ్రత్తగానే ఉంటాను."
వదినకి దుప్పటి కప్పి ఇవతలికి వచ్చింది విశాలి.
* * *
రాజేశ్వరి రాక నిజంగా ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించింది విశాలికి.
ఎప్పటి రాజేశ్వరి!
స్కూల్లో ఫస్టుఫారంనించీ స్కూల్ ఫైనల్ వరకూక్లాస్ మేట్. స్కూల్లో ప్రతి విషయంలోనూ కూడా తన సలహా లేనిదే ఏ పనీ చెయ్యని రాజేశ్వరి. తనంటే ఎంతో ప్రేమాభిమానాలు చూపించిన రాజేశ్వరి.
స్కూల్ ఫైనల్ అవగానే పెళ్ళి చేసుకుని అత్త వారింటికి వెళ్ళిపోయింది.
ఆ తరవాత కొద్ది రోజులకే వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ ఫర్ అవడంతో మకాం ఎత్తిపెట్టేసి వెళ్ళి పోయారు వాళ్ళవాళ్ళు.
వాళ్ళమ్మ, నాన్న ఈ ఊళ్ళో లేకపోవడంతో రాజేశ్వరికి మళ్ళీ ఈ ఊరు రావలసిన అవసరమే కలగలేదు.
వాళ్ళన్నయ్యకి నెల్లాళ్ళ క్రిందట ఈ ఊళ్ళో ఉద్యోగమైందిట. వాళ్ళమ్మా, నాన్నగారూ కూడా కొడుకు దగ్గిరే ఉంటున్నారుట. వాళ్ళన్నయ్య కిద్దరు ఆడపిల్లలు. తనకీ ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్లాట.
"పిల్లల్ని తీసుకురాకుండా వచ్చావే? ఈ ఊరు నువ్వొక్క దానివే వచ్చావా? శ్రీవారు కూడా వచ్చారా?"
విశాలి ప్రశ్నకి ఒక్క నిమిషం మాట్లాడకుండా తల వంచుకుంది రాజేశ్వరి.
"ఏమిటి. రాజేశ్వరీ, అలా అయిపోయావేం?"
"అబ్బే! ఏం లేదు!"
"ఏదో మనసులో బాధ పడుతున్నావు! పోనీలే. నాతో చెప్పకూడనిదైతే చెప్పకు. చెప్పమని నేను బలవంతం చెయ్యను."
ఏం మాట్లాడాలో తెలియనట్టుగా కూర్చుండి పోయింది రాజేశ్వరి.
"మా ఇల్లు ఎలా తెలిసింది నీకు? ఇల్లు మారాం కదా?" రాజేశ్వరిని మాటల్లోకి దించడానికి సంభాషణ మొదలుపెట్టింది విశాలి.
"ఏముందీ- పాత స్నేహితులందర్నీ కలుసుకోవాలనిపించింది. మొదట సువర్ణా వాళ్ళింటికి వెళ్లాను. తనే చెప్పింది నువ్వెక్కడుంటున్నదీ."
తరవాత చాలాసేపు ఇద్దరూ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకున్నారు.
పాట పాడమని పట్టు పట్టింది రాజేశ్వరి.
అనసూయమ్మ, మారుతి పక్క గదిలోనే ఉన్నారు. అందుకే అయిష్టంగా "ఇప్పుడా?" అంది విశాలి. "ఇంకో సారెప్పుడైనా పాడి వినిపిస్తా" నన్నా వినక బలవంతం చెయ్యడంతో పాడక తప్పింది కాదు విశాలికి.
మధురంగా, తీయగా పాడుతూంది. మైమరిచి వింటూంది రాజేశ్వరి.
"మ్రోయించకోయ్ మురళి
మ్రోయించకోయ్ కృష్ణ
తీయ తేనియబరువు
మోయలే దీ బ్రతుకు..."
సన్నగా, తీయగా సాగిపోతూంది పాట.
ఇతర ప్రపంచాన్ని మరిచి, బాధలన్నీ మరిచి ఒక్క ఆ మధుసూదనుని రూపమే మనసులో నింపుకుని పాటలో లీనమైంది విశాలి.
"వలదోయి, అలమునీ
కలలతో నిదురింతు,
భరమోయి నీ ప్రేమ
వరమోయి ఈ రేయి!...."
"నువ్వు పాడితే ఈ పాటకే అందమొచ్చింది. ఎంత బాగా పాడావు!" సంతోషంతో విశాలి చేయి పుచ్చుకుంది రాజేశ్వరి.
"అలా అనకు. ఆ పాటలో ఉన్నంత సొగసు నా గొంతులో ఎక్కడుంది? గోపికాలోలుని అందమంతా ఆ పాటలో ఉంది. నిజాని కా పాట చిలికించిన కవి ధన్యుడు..."
మధ్యలోనే అందుకుంది రాజేశ్వరి "కవులూ, గేయాలూ అంటే నీకు భలే ఆవేశం వస్తుంది."
నవ్వుకున్నా రిద్దరూ.
మరు నిమిషంలో వివర్ణమైంది రాజేశ్వరి ముఖం.
"ఇందాకా నువ్వడిగిన విషయం ఇప్పుడు నీతో చెప్పాలనిపిస్తూంది. నీ సలహాకూడా వినాలని ఉంది."
ఏమిటో చెప్పమన్నట్టుగా చూసింది విశాలి. పైట అంచు కున్న కుచ్చులు పట్టుకుని చూస్తూ ఒక నిమిషం పోయాక చెప్పింది రాజేశ్వరి.
"నాకూ, మా వారికీ చిన్న దెబ్బలాట వచ్చింది. దానితో నాకు ఒళ్ళు మంది మాటకి మాటా చెప్పాను. చినికి చినికి గాలివాన అయింది. విసుగు పుట్టి ఉన్న పళంగా 'నేను పోతున్నాన'ని చెప్పి అమ్మా వాళ్ళ దగ్గరి కొచ్చేశాను పిల్లల్ని తీసుకుని. అమ్మతో అంతా చెప్పాను. రెండు రోజులు కాకపోతే నాలుగు రోజులు పోయాకైనా వచ్చి, నిన్ను బతిమాలి తీసుకెళ్ళకపోతాడా? ఏది ఏమైనా అతనంతట అతను నిన్ను తీసుకెళితే తప్ప, లేకపోతే నువ్వు లొంగిపోయి ఆ గడప తొక్కద్దు' అంది అమ్మ. నాన్న ఉద్దేశంకూడా అదే. వాళ్ళు చెప్పింది విన్నాక, అంతకంటే మరో మార్గం లేదేమో అనిపిస్తోంది నాకుకూడా. మరి నువ్వేమంటావు?" కుతూహలం నింపుకున్నాయి రాజేశ్వరి కళ్ళు. ఆ కన్నుల్లోకి సూటిగా చూసింది విశాలి.
"అడిగావు కనక చెపుతున్నాను. నీ సుఖం కోరి, నీ మంచికోసం చెపుతున్నాను. నువ్వు ఎంత త్వరగా తిరిగి వెళ్ళితే అంత మంచిది. ఇద్దర్లో ఎవరో ఒకరు మొదట లొంగిపోక తప్పదు. ఆ తరవాత రెండోవాళ్ళు తమ తప్పుకూడా కొంత ఉందని తెలుసుకుని తీరతారు. నువ్వు అత్తవారింటికి వెళ్ళిన కొత్తలో నాకు ఒక ఉత్తరం రాశావు. గుర్తుందా? దాని తరవాత మనిద్దరం కూడా మళ్ళీ ఉత్తరాలు రాసుకోలేదనుకో....ఆ ఉత్తరంలో మీ వారు చాలా పట్టుదల మనిషనీ, కానీ మనసు చాలా మంచిదనీ వ్రాశావు. జ్ఞాపకం ఉందా? అటువంటి వాళ్ళ మంచితనం బయటపడడానికి మనం కారకులమైతే అది మనకే గర్వం. కానీ, వాళ్ళ పట్టుదలే నిలబడిపోవడానికి కారకులం ఎప్పటికీ కాకూడదు. నువ్వు వెళ్ళి 'పొరపాటైంది' అని ఒక్క ముక్క అను చాలు. 'నాదికూడా తప్పే! నన్ను క్షమించు' అంటూ నిన్ను గుండెల్లో దాచుకుంటారు. నీ కెలా తెలుసు? అంటావేమో? మంచిమనిషి, మనసున్న మనిషి చేసే పని అదే!" ఒక్క క్షణం ఆగింది విశాలి.
"నీ మేలు కోరి నే నిచ్చే సలహా అదే! అతనే వచ్చి బ్రతిమాలుకుని తీసుకెళ్ళాలి అని కూర్చుంటే ఈ ఆలస్యం అతనిలో పట్టుదలని పెంచి తీరుతుంది. మనసులో నువ్వంటే ఇష్టమున్నాకూడా 'నాకు లొంగి పోయావు నువ్వు' అన్నట్టు చూసే నీ చూపులు భరించ లేక బ్రతిమాలుకుందుకు రాకపోవచ్చు. నువ్వే ముందు రాజీకి వచ్చావంటే తన తప్పు తను తెలుసుకుంటారు. 'తప్పు నీ ఒక్కదానిదే కాదు. నాదికూడా ఉంది' అంటారు. నా మనసులో ఉన్నది చెప్పాను. ఆ తరవాత నీ ఇష్టం." స్నేహితురాలి కన్నుల్లో నీరు చూసింది విశాలి.
"ఛ! ఎందు కా కన్నీరు!"
వెంటనే మాట్లాడలేకపోయింది రాజేశ్వరి. చివరికి స్థిరంగా నిశ్చయించుకున్న మనసుతో మెల్లిగా అంది: "నువ్వు చెప్పింది నాకు నచ్చింది. నూరేళ్ళ పంట నాశనం కాకుండా నా కళ్ళు తెరిపించావు. నువ్వు నిజంగా..."
"ఆఁ! ఆఁ! నన్ను ఆకాశాని కెత్తెయ్యకు. కాస్త నేలమీద నడవనీ!"
మనసుతీరా నవ్వింది రాజేశ్వరి.
మనసుతీరా చూసింది విశాలి.
"రేపు వెళ్ళిపోతాను."
"రేపేనా?"
"ఆఁ ఇంకా ఆలస్యం ఎందుకు? ఆలస్యం అమృతం విషం అని ఇప్పుడే నీ సలహా చెప్పావుగా!"
"మీ అమ్మావాళ్ళూ నన్ను తిట్టుకుంటారేమో?"
"ఎందుకూ?" నిజంగానే అర్ధం కాలేదు రాజేశ్వరికి.
"నా మాట విని కదూ నువ్వు ప్రయాణం కడుతున్నావు?"
"వాళ్ళకి నేను చెపుతాను గనకనా? అయినా ఇందులో నీ గురించి తప్పుగా అనుకోవలసిందిగానీ, నీ మీద కోపం తెచ్చుకోవలసిందిగానీ ఏముంది?"
* * *
రాజేశ్వరి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో ఉత్తరం అందుకుంది విశాలి.
"నిజంగా నీకు నేను ఋణపడి ఉన్నాను. అమ్మా వాళ్ళూ చెప్పినట్టు పంతం పట్టి అక్కడే కూర్చోవడం చేసి ఉంటే నా గీత ఇంకోలా ఉండేదేమో? నీ సలహా ప్రకారం ఇక్కడికి వచ్చేసినందువల్ల నా నూరేళ్ళ పంట నిలబడింది. 'రెండు చేతులూ కలిస్తేగానీ చప్పుడు కాదు. నాది కూడా తప్పే, నీ ఒక్కదానిదే కాదు. ఇద్దరం పంతం పట్టి కూర్చుంటే ఈ బంధం తెగడానికి ఎంతో కాలం పట్టదు. నువ్వైనా ముందు పట్టువిడిచావు. మంచిధైంది' అంటూ అనురాగంతో చేరదీశారాయన. అప్పుడు నేను నీ సంగతి చెప్పాను. ఇదంతా నీ చలవేనని చెప్పాను. మా ఇద్దరి తరపునా నీకు ధన్యవాదాలు ప్పుకుంటున్నాను. రాజేంద్రకి దీవనలు.
-నీ ప్రియమైన రాజేశ్వరి."
"నాకు ఋణపడి ఉన్నానని అనుకోవడానికిగానీ, నన్నంత పొగడటానికిగానీ ఇందులో ఏముంది? మీ ఇద్దరి మనసులూ మంచివి కాబట్టి ఒకరి నొకరు అర్ధం చేసుకోగలిగారు" అంటూ రాజేశ్వరి ఉత్తరానికి వెంటనే జవాబు వ్రాసింది విశాలి.
* * *
