'ఇంటి దగ్గర్నించి వచ్చేవా రాజూ! మా వాళ్ళంతా కులాసాయేనా! క్రిందికి పద' అంది కామేశ్వరి. కామేశ్వరి ఇంతవరకూ గవర్రాజు తో మాట్లాడి ఎరుగదు. మాట్లాడాల్సిన అవసరమూ కలగలేదు! ఈ రోజు తన పుట్టింటివద్దనుంచి వచ్చేడు తనకు అతిధిగా! ఆదరంగామాట్లాడి పంపాల్సిన బాధ్యత ఆమె మీది వుందికదా! అందుకని పలకరించింది!
ఇద్దరూ క్రిందికిదిగి హాలులోనికి వచ్చారు. హాలులో కుర్చీల్లో, రామనాధం, మాధవ, నళినీ కూర్చున్నారు. ఇద్దరు యువకుల్నీ గుర్తుపట్టాడు గవర్రాజు! వాళ్ళతో సమానంగా కుర్చీల్లోకూర్చుని, కులాసా కబుర్లు చెప్పుకుంటూన్న నళినిని చూసి కొంచెం సిగ్గుపడ్డాడు! అందమైన ఆధునికంగా అలంకరించుకున్న 'నళిని' స్వేచ్చ గవర్రాజుకి చిన్నతన మనిపించింది.
'జ్ఞాపకమున్నానా? మళ్ళీ ఇక్కడ కలుసుకుంటా మనుకోలేదు!' అన్నాడు గవర్రాజు.
గ్లాస్కో పంచెకట్టు సిల్కు లాల్చీ ధరించి, ప్రక్కపాపిడి తీసి వంకులు వంకులుగా జుత్తు ఎగిరేటట్లు దువ్వుకున్న క్రాఫింగ్ తో కునేగా పరిమళంతో గవర్రాజు ఆకర్షణీయంగా అగుపించేడు నళినికి. రామనాధం, వకకుర్చీ చూపి,
'కూర్చోండి!' అన్నాడు.
గవర్రాజు సంకోచించకుండా, కూర్చున్నాడు. కామేశ్వరి, కాఫీ తయారు చేయటానికి లోపలికి వెళ్ళింది.
'మీరు ఉద్యోగం చేసేవూరు ఇదేనేమిటి!' అన్నాడు గవర్రాజు. రామనాధంతో.
'వూఁ! మా తమ్ముడు చదువుకునేదీ ఈ వూరే!' అన్నాడు రామనాధం.
'ఏం! ఇల్లా వచ్చేరు?' అడిగాడు మాధవ.
'వాళ్ళ తోటల్లోంచి అరటిగెలలూ, చెరుకులూ వచ్చేయి! ఇంటికి పెద్దమ్మాయి! పెళ్ళయి ఏడాదయినా పుట్టింటి గడప తొక్కలేదని, వాళ్ళమ్మ గారు వూరికే బెంగపెట్టుకున్నారు! నేను పనిమీద ఈవూరు వెళ్తున్నానని చెబ్తే నన్ను అమ్మాయిని చూసి అవి ఇమ్మన్నారు! పంపుతే కూడా తీసుకరమ్మన్నారు! నాలుగురోజు లుంచుకుని పంపుతామన్నారు! అందుకని ఇటుకూడా వచ్చేను. లేకపోతే రాను! పట్నం మటుకు వారానికోసారి వస్తాను. హోటల్ వినోడాలో సగం భాగం నాకు వుంది. దాని వ్యాపార వివరాలు చూసుకుందుకు వస్తోవుంటాను?' అన్నాడు గవర్రాజు.
'మీకు వినోదాలో షేరు వుందా!' ఆశ్చర్యపోతూ అడిగాడు మాధవ.
'ఆఁ! బాలుచెట్టి లాస్ లో పడ్డాడు! అప్పుడు నేను అప్పుని సగం భరాయించి హాఫ్ వాటా తీసుకున్నాను' అన్నాడు గవర్రాజు.
నళిని విభ్రాంత యైంది. హోటల్ వినోదాకు నళిని తరుచు వెళ్తూ వుంటుంది. ఆ పట్నంలో కల్లా మోస్ట్ లక్జూరియస్ హోటల్ గా వినోదా ప్రసిద్ధి కెక్కింది! తరుచు మంత్రులు, సినిమా తారలూ, అక్కడికి వచ్చినప్పుడు ఆ హోటలులోనే మకాం వేస్తారు. మూన్ లైట్ డిన్నర్లు రూఫ్ గార్డెన్స్ లో ఎంతో ఆహ్లాదకరంగా ఏర్పాటు చేస్తారు హోటల్ వినోదా వాళ్ళు.
'మిమ్ము, మిమ్ము వినోదాలో చూచిన గుర్తు లేదు నాకు!' అంది నళిని.
'మీరు వస్తో వుంటారా?' అన్నాడు గవర్రాజు.
'నేను 'వినోదా'లో మూన్ లైట్ డిన్నర్లని మిస్ కాను' అంది నళిని.
'నేను ఎప్పుడూ డిన్నర్ కి వుండను. అందుచేత మీరు నన్ను చూసి వుండరు! నేను ఇక్కడకు వస్తే మావాళ్ళ ఇంటికి వెళ్ళుతాను' అన్నాడు గవర్రాజు.
'ఇక్కడ మీ వాళ్ళున్నారా?' అంది నళిని.
'వున్నారు! నాకు ఇద్దరు అన్నలూ, వదినలూ, వాళ్ళ పిల్లలూ వున్నారు! వాళ్ళని చూసి భోజనంచేసి వెళ్ళిపోతాను' అన్నాడు గవర్రాజు.
గవర్రాజు, నళినీ, ఒకళ్ళ వివరాలు ఇంకొకళ్ళు ఆడి తెల్సుకుంటూ కబుర్లల్లో పడ్డారు. మాటల సందడిలో నళిని, కామేశ్వరికి 'సవతి కూతురు' అవుతుందని తెల్సుకున్నాడు గవర్రాజు.
రామనాధానికి కామేశ్వరికి పెళ్ళయి నట్లు తెలిసింది? కాని ఎవరితో అయ్యింది? పెళ్ళి అంటూ అయితే కాలేజీలో జేరి ఎందుకు చదువుతోంది? అంటూ ఆలోచనల్లో పడ్డాడు. మాధవకి ఇదంతా చిత్రంగా తోచింది. 'చిన్నబడ్డీలో కిళ్ళీ కొట్టు పెట్టుకుని వ్యాపారం చేస్తోన్న గవర్రాజు, పెద్దహోటలు భాగస్వామి కాగల డబ్బు ఎల్లా సేకరించాడు? అతను పెద్ద ధనవంతుడని తెలీగానే, 'నళిని' తన దృష్టి అంతా అతనిమీదే కేంద్రీకరించటంలో ఆడపిల్లలకి డబ్బుమీద, ధనవంతుల్ని చేబట్టాలనే కాంక్షమీద అమితాసక్తి చూపుతారని తెలిసిపోతోంది. కామేశ్వరి మీద ఇతనికి బాగా మోజు వున్నట్లు వుంది. స్వయంగా, పళ్ళూ అని తెచ్చాడు.' అనుకున్నాడు మాధవ. ఇంతలో 'ట్రే'లో నాలుగు కప్పులూ, సాసర్లూ పెట్టుకుని వచ్చింది కామేశ్వరి.
అదే సమయానికి వాకిట్లో 'కారు పార్కు చేయబడిన ధ్వని విన్పించింది. కేశవ కూడా కారుదిగి లోనికి వచ్చాడు! కామేశ్వరి, కాఫీ కప్పులున్న ట్రే 'టీపాయ్' మీద పెట్టి.
'కాఫీలు తీసుకోండి!' అంది.
కేశవ తనుకూడా, ఒక కుర్చీలో కూర్చుంటూ,
'ఇక్కడ నాలుగే కాఫీలున్నాయ్!' అన్నాడు ట్రేలోని కాఫీకప్పుల వంక చూస్తూనూ,
'మీకూ తెస్తాను!' అంటూ లోనికివెళ్ళింది కామేశ్వరి.
కామేశ్వరి వెనుతిరిగి పోబోతుండగా ఆమె పాదాలమీద జీరాడుతున్న చీర కుచ్చెళ్లు తొలగి ఆమె పాదాల వ్రేళ్ళకున్న మట్టెలు కన్పించాయి మాధవకి!
'అయితే కామేశ్వరికి పెళ్ళి అయిపోయిందన్నమాట!' అప్రయత్నంగా పైకి అనేశాడు మాధవ! రామనాధం, కేశవ, మాధవ వెంపు తెల్లబోయి చూసారు! గవర్రాజు, నళినీ పకపకా నవ్వేరు! కామేశ్వరికీ నవ్వులేం విన్పించలేదు. తన మానాన్న తను భర్తకి కాఫీ తేవటానికి లోనికి వెళ్ళింది.
మాధవకి వాళ్ళు నవ్వుతోంటే కోపం వచ్చింది.
'నువ్వు చెప్పావు కాదేం నళినీ? కామేశ్వరికి పెళ్ళి అయిపోయిందని?' అన్నాడు మాధవ.
'ఈ వూరేనా ఆమె అత్తవారిల్లు?' అమాయకంగా అడిగాడు రామనాధం'
అతని కాతరస్వరంలోని ఆతృతని పసిగట్టేడు కేశవ. 'నళిని' తండ్రి ఎదుట ఏమీ అనలేక వూరుకొంది. గవర్రాజు,
'ఏం బాబూ అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? మీకు నచ్చకపోయినంత మాత్రాన్న ఆమెకి పెళ్ళే కాదనుకున్నా రేమిటి? ఇదిగో! ఈయనే పెళ్ళి చేసుకున్నారు!' అన్నాడు.
ఆకాశం విరిగినట్లు అన్పించింది మాధవకి! పిడుగు మీద పడినట్టు భారంగా ముడుచుకు పోయేడు రామనాధం!
'కేశవగారు మళ్ళీ పెళ్ళాడుతారని కాని, ఆ పెళ్ళి చేసుకోవటంలో ఇరవయి ఏళ్ల ప్రాయపు జవ్వనినే కోరుకుంటా రని కానీ వూహించలేకపోయేడు మాధవ! నళినితో కామేశ్వరి కాలేజీకి ఎందుకు వస్తోందో బోధ పడింది మాధవకి! కేశవ సిగ్గుతో చేయరాని మహాపరాధం చేసి నట్లు ముడుచుకు పోయేడు!
'వక్కనాడన్నా చెప్పావు కాదేం నళినీ?' దీనంగా అన్నాడు మాధవ!
'నళిని'ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు! హృదయాలను కలుపుకున్న తామిద్దరిలో, రహస్యాలకు తావుండరాదనుకున్నాడు! అందుకనే, కామేశ్వరికి ఇంకా పెళ్ళికాక, వీళ్ళ ఆశ్రయంతో చదువుకుంటూందనే వూహతో కామేశ్వరిని తన అన్న ప్రేమించినట్లు చెప్పాడు! అప్పుడన్నా, 'కామేశ్వరి కి పెళ్ళి అయ్యింది! మా నాన్న పెళ్ళిచేసుకున్నాడు!' అని చెప్పలేదు నళిని. ఎంచేత? ఇందులో దాచాల్సినంత అవసరం ఏముందీ? ఛీ! ఈ ఆడవాళ్ళు ఎందుకని అబద్దాలు ఆడుతారో వాళ్ళని సృష్టించిన బ్రహ్మకి కూడా తెలీదేమో! నళిని దెంత నీచ బుద్ధి?' అనుకున్నాడు మాధవ.
కామేశ్వరి కాఫీ కప్పుతో హాలులోనికి వచ్చి, కేశవకి ఇచ్చింది. అక్కడ వున్న వాళ్ళందరూ, నిశ్శబ్దంగా కాఫీలు పుచ్చుకున్నారు.
'అన్నగారూ!' అన్నాడు గవర్రాజు.
కేశవ అతని సంబోధనకి ఆశ్చర్యంతో ముఖం పైకెత్తి చూసాడు.
'కామేశ్వరమ్మని, వాళ్ళ అమ్మగారు నాల్గురోజులుండి వెళ్ళటానికి పంపమన్నారు. మీరు పంపితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. మీకు వీలుంటే మిమ్మల్ని కూడా రమ్మన్నారు!' అన్నాడు గవర్రాజు.
'నీతోనా పంపమంట!' అన్నాడు కేశవ.
'మీకు ఇష్టమెల్లా అయితే అల్లానే!' అన్నాడు గవర్రాజు.
'వేసంగి సెలవుల్లో వస్తుంది. అని చెప్పు!' అన్నాడు కేశవ.
'సర్లెండి! మరయితే నేను వెళ్ళి వస్తాను! కామేశ్వరమ్మా! అత్తగారితో కూడా చెప్పు!' అంటూ లేచాడు గవర్రాజు.
'అదేమిటి? భోజనం చేయకుండానే వెళ్తావా!' అన్నాడు కేశవ.
'లేదు! మా ఇంటికి వెళ్తాను' అని వెళ్ళాడు గవర్రాజు.
అతనికి ఆ వూళ్ళో అన్నగార్లున్న సంగతీ, 'వినోదా'లో షేర్లున్న సంగతీ చెప్పింది నళిని కేశవతో!
రామనాధం మాధవ కూడా వెళ్ళివస్తామంటూ లేచారు.
'అదేం! అప్పుడే లేచారేం! మీ అన్నగారు బాగా షాక్ అయినట్లున్నారు!' అంది నళిని.
'ఏమయింది?' అన్నాడు కేశవ.
'కామేశ్వరిని ఈయన కిద్దామనుకున్నారుట! మొదట అంది నళిని.
'అల్లాగా!' అన్నాడు కేశవ.
'మరి పెళ్ళి ఎందుకు జరగలేదు?' అని అడుగుతాడు తండ్రి అనుకొంది నళిని. కాని కేశవా అడగలేదు. రామ నాధం కామేశ్వరిని ఎందుకు చేసుకోలేదో కేశవ వూహించలేనంత అమాయకుడు కాడు!
'కామేశ్వరిని చూపులప్పుడు చూసేక ఇంకేపిల్లని చూసినా రామనాధానికి నచ్చటం లేదట! అందుచేత పెళ్ళికి వాయిదాలు వేస్తున్నాడట!' అంది నళిని.
అప్పుడన్నా తండ్రిలో ఏదన్నా మార్పు కలుగుతుందేమో అనుకొంది నళిని.
అప్పుడన్నా తండ్రిలో ఏదన్న మార్పు కలుగుతుందేమో అనుకొంది నళిని.
'అహఁ అల్లాగా!' అని వూరుకున్నాడు! నళినికి ఇంక కామేశ్వరిని గూర్చి చెప్పే వోపిక లేకపోయింది.
'మీకు కారు కావాలా నాన్నా!' అంది.
'అక్కర్లేదు! నీకు అవసరం వుంటే తీసుకవెళ్ళు!'అని మేడమీదకు వెళ్ళి పోయాడు కేశవ.
నళినికి ఏమీ తోచలేదు. కారు తీసుకుని నెమ్మదిగా, బీచ్ వెంపు వెళ్ళింది. సాగర తీరం.... చల్లగా హాయిగా వుంది అక్కడక్కడా చెదురుమదురుగా జనం వున్నారు. ఉధృతమైన కెరటాల అలలు నురుగులతో పరవళ్ళు త్రొక్కుతూ, తీరపు ఇసుకని తమలోనికి విలీనం చేసుకుంటున్నాయి. నళిని కాస్సేపు సముద్రపు ఒడ్దమ్మటే ఇటూ అటూ నడిచింది. చాలాదూరంలో నల్లని డెకరాన్ పాంటుతో తెల్లని ఇన్ షర్టుతో, మాధవలా ఒకవ్యక్తి కన్పించాడు. మాధవే అయివుంటాడు, అనుకొంది. మాధవ వస్తుతః భావుకుడు. ఈ రోజు కామేశ్వరికి పెళ్ళి అయిపోయిందన్న విషయం అతనికి మొదటిసారిగా, తెలిసింది! తన అన్న, ఆమెని అమితంగా ప్రేమించడనీ, అందుకనే, తన అన్నకి ఇతరత్రా పెళ్ళి చూపులు ఫలించటం లేదనీ, అతనివూహ! ఆ వూహ ఆధారంగా అతను ఎన్నెన్నో గాలిమేడలు కట్టాడు! పునాదిలేని ఆ మేడ, ఈ రోజు కూలిపోయింది! మాధవ వద్దకు చరచరా నడిచింది నళిని. మాధవ కెరటాలలోనికి దీర్ఘంగా చూస్తూ కూర్చున్నాడు. నళిని రాకని అతను గమనించలేదు! నళిని చనువుగా అతని భుజాల మీద చేతులు వుంచి కుదుపుతో.
'ఏమిటో అంత దీర్ఘాలోచన!' అంది. ఉలిక్కిపడ్డాడు మాధవ!
'నువ్వా!' అన్నాడు.
'వూఁ! నేను కాక ఇంకెవరయినా నీతో ఇంత చనువుగా వుంటారా మాధవ్!' కులుకుతూ అంది నళిని. అల్లా అంటూనే అతని ప్రక్కన రాసుకుంటూ కూర్చుంది!
'నళినీ! వక్కమాట అడుగుతాను. చేస్తావా?' అన్నాడు మాధవ. అతని స్వరంలోని కాఠిన్యానికి నళిని విస్తుబోయింది. మునుపు మాధవ నళినితో మాట్లాడే స్వరం, ఆపేక్షతో కూడుకొని వుండేది!
