మరో విషయం వింటావా? ఓ ఏడాది క్రిందట జరిగింది. మా ఇంటికి దగ్గిరగా ఓ ఇంట్లో ఒక కుటుంబం కొత్తగా దిగింది. నాకట్టే పరిచయం లేకపోయినా నా ఆడవాళ్ళకి మా అమ్మకీ మాటామంచీ - ఆ ఇంటికీ ఈ ఇంటికీ రాకపోకల మూలంగా కొంచెం తెలుసు. ఆ ఇంట్లో ఓ అమ్మాయి వుంది. బయటకెక్కడికి వెళ్తున్నా వస్తున్నా వాళ్ళ వరండాలో నిలబడి చూస్తూవుండేది. దారితప్పి నేనూ చూసినప్పుడు చిన్నగా నవ్వేది. కాని అంతవరకూ సాహిసిస్తుందని ఏనాడూ అనుకోలేదు నేను. ఓనాటి సాయంకాలం వాళ్ళ తమ్ముడితో ఏదో చీటీ పంపింది- "మీతో మాట్లాడాలని ఎన్నాళ్ళనుంచో కోరికగా వుంది. ఈ రాత్రికి మా పెరటి వైపుకు వస్తారని ఎదురు చూస్తాను. సెలవు." అంతే. నాకు చాల అసహ్యమనిపించింది. నీతిమాలిన ఆడవాళ్ళంటే నా దృష్టిలో గౌరవం లేదు. ఆ రాత్రి అదే ఆలోచిస్తూ పడుకున్నాను. ఎంతకీ నిద్రరావటంలేదు. మనసంతా గందరగోళంగా తయారైంది. ఆ అమ్మాయి తెల్లగా చాల అందంగా వుంటుంది. ఎప్పుడు చూసినా నవ్వుతుంది. నన్ను కావాలని కోరి పిలిచింది. ఏమిటి తప్పు? నేను నీతినియమాలలో ఎందుకుండాలి?ఎవరికోసం నేనిలా అన్నిటికీ దూరమై పోవాలి? నిప్పువంటి నా ప్రవర్తనకి ఎవరు ముచ్చటపడాలి? ఎవరూ లేరు. నా మంచిచెడ్డలు ఎవరికీ అక్కర్లేదు - ఆ అమ్మాయి చాల అందమైంది. నాకోసం ఎదురుచూస్తూ వుంటుంది. బయటకొచ్చాను. వెన్నెల రాత్రే ఐనప్పటికీ చందమామకి మబ్బులు కమ్మటంతో వెన్నెలంతా మసకబారిపోయింది. ఏదో ఆవేశంతో నడుస్తూన్న నేను ఎవరో అడ్డగించినట్టు ఆగిపోయాను హఠాత్తుగా. ఎక్కడికి వెళ్తున్నాను? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఏనాడూ లేనిదే ఏమిటీ విపరీతం? క్షణికమైన అనుభవం కోసం ఎందుకీ దొంగబ్రతుకు? నన్ను చూసుకునే గర్వపడేనా నీతినియమాలే గంగలో కలిశాయి? వద్దు....అమాయకురాలైన ఓ చిన్నపిల్ల బ్రతుకు నాశనం చెయ్యొద్దు. తెలిసో, తెలీకో తప్పుగా ప్రవర్తించింది. తెలిసి తెలిసీ నేను చెయ్యబోయే నిర్వాకం ఏమిటి? లక్ష్మే ఇలా ప్రవర్తించిందని కలిస్తే ఎంత బాధపడతాను? - తిరిగి పక్క మీదకి చేరుకున్నాను. ఎందుకో అయోమయంగా ఎంతసేపు వెక్కి వెక్కి ఏడ్చాను. ఏనాటికైనా నా ఆత్మనిగ్రహం సడలిపోవచ్చు. చెడుదారుల్లో బ్రతుకు సాగించవచ్చు. వూరూ పేరూ లేని అనామకుడిగా, అప్రయోజకుడిగా గడిచిపోతుంది. బ్రతుకు - ఇల్లాలితో - పిల్లలతో గౌరవ కుటుంబీకుడిగా ఎంత ఉచ్చస్థితిలో బ్రతకాలనుకున్నాను! చివరికెలా తయారవుతాను? నేనేం చెయ్యను కృష్ణవేణీ?

ఆ మర్నాటి సాయంత్రం ఆ అమ్మాయి మళ్ళా వుత్తరం పంపింది "మీకోసం రాత్రంతా ఎంతో ఆరాటపడ్డాను. కణకణం మీరు వస్తారనేఎదురు చూశాను. మీకు దయ లేకపోయింది. నన్ను నిరాశ పరిచారు. ఎవరైనా చూస్తారని భయపడ్డారేమో అనుకుంటున్నాను. అటువంటి జంకుమాత్రం ఏమీ అవసరం లేదు. తాతగారు వూరెళ్ళారు. ముసలావిడ ఎక్కడో నిద్రపోతోంది. దయచేసి ఈ రాత్రికైనా వస్తారని ఆశతో ఎదురుచూస్తాను", అని రాసింది- వెంటనే దానికి జవాబు రాశాను-
చెల్లీ!
సోదరప్రేమతో చెప్తున్న ఈ నాలుగుమాటల్నీ నిర్లక్ష్యంగా త్రోసివెయ్యకు. నీ ఆహ్వానం మరెవరికి పంపినా సంతోషంగా స్వీకరించేవారే. స్త్రీకైనా పురుషుడికైనా శీలాన్ని మించిన ఆభరణం మరేదీ లేదమ్మా! నిలకడలేని మనసు వేయి విధాల పరుగులెడుతుంది. తుచ్చమైన కోరికలకు పవిత్రమైన శీలాన్ని బలిచేసుకోవటం నీతి కాదు చెల్లీ! నిండైన సోదర ప్రేమతో చెప్పిన ఈ నాలుగు మాటలూ బ్రతుకంతా గుర్తువుంచుకుంటానని నమ్ముతాను.
ఆ చీటీ వాళ్ళ తమ్ముడిచేతే పంపించాను. దాని ప్రభావం ఆ మనిషి మీద ఎలా వుంటుందో నాకు తెలీదుగానీ నేనేదో గర్వించదగ్గ పనిచేసినట్టు ఫీలయ్యాను - ఆ ఏడాదే ఆ అమ్మాయికి పెళ్లయింది. పెళ్ళికి వెళ్ళి నేను కుంకుమ భరిణ బహూకరించాను. ఇప్పుడా కుటుంబం ఇక్కడ లేదు. ఆ తర్వాత అమ్మాయి ఎక్కువ కన్పించేదేకాదు. కన్పించినా తలదించుకొనేది. అప్పుడప్పుడూ నాకు ఆ అమ్మాయి గుర్తు వస్తుంది.
నన్నర్ధం చేసుకోవాలనే నీకీ విషయాలు చెప్పాను. నా బ్రతుకు గుర్తువస్తే ఒక్కోసారి తీరని ఆవేదనపాలౌతాను. ఎందులోనైనా పడిచావాలనుకుంటాను. లేదా నన్ను నమ్మే అమ్మాయిని తీసుకొని ఏ దూర తీరాలకో పారిపోదామనుకుంటాను. కాని ఏదీ చెయ్యలేను కృష్ణా! అన్నిటికీ అప్రయోజకుడినే, ఈ వయసులో వున్న అమ్మని ఏం చెయ్యను? ఆవిడికి గర్భశోకం ఎలా కలిగించను? అన్నిటినీ మించి నావంటి దురదృష్ట వంతుణ్ణి కరుణించే హృదయం ఏదీ? నేను దేనికీ నోచుకోలేదు. జీవిచ్చవంగా ఇలా రోజులు దొర్లిస్తున్నాను - ఒక సరదాలేదు.ఒక సందడి లేదు. కనీసం నాకు సినిమాకూడా చూడాలని పించదు. అదేమిటో చూస్తున్నంతసేపూ ఎందుకో బాధపడతాను. అందుకే ఎపుడూ వెళ్ళను.
సరే! నా ఈ రెండో వుత్తరం ముగిస్తాను. త్వరలో నా భవిష్యత్ నిర్ణయంతోనూ - నీ ప్రశ్నలకి జవాబుగానూ ముచ్చటైన మూడో వుత్తరం రాస్తాను. నన్నుగురించి ఆలోచిస్తూ వుండు.
స్నేహితుడు!
మాధవ.
'స్నేహితుడు మాధవ" అనుకున్నాను మరొకసారి. మాధవంటి స్నేహితుడున్నందుకు నిజంగా గర్వపడాలి. ఎంతపవిత్రమైనవాడు. కోరిపిలిచే ఆడదాన్ని సోదరిగా భావించి తిరస్కరించే గొప్ప గుణం ఎంతటి వాళ్ళకి? నిజమే......మాధవ్ గుణాలకి ఎవరు ముచ్చట పడాలి?
మాధవ్ రాసే ప్రతీవుత్తరం కొత్తకొత్త సందేహాలు తెచ్చిపెడుతుంది.
"నన్ను గురించి ఆలోచిస్తూ వుండు"
"ముచ్చటైన మూడోవుత్తరం రాస్తాను. నా భవిష్యత్ నిర్ణయంతో........"
"నన్ను నమ్మే అమ్మాయిని తీసుకోని ఏదూర తీరాలకో.........
ప్రభూ! ఏమిటిది? ఇతిమిద్ధంగా తేల్చుకో లేకపోయినా, మాధవ్ మాటల్లో ఏవో అర్ధాలు దాగివున్నాయి. ఆ రాబోయే మూడో వుత్తరం చాలా భారంగానే వుండి వుండవచ్చును.....మాధవ్ స్నేహితుడు! అంతే! నే నెటువంటి విపరీత పరిస్థితుల్లోనూ చిక్కుకో కూడదు.
ఆక్షణంనుంచి నాకేమిటో భయంగా వుండేది. మాధవ్ వంటి స్నేహితున్ని వదులుకోనూ లేను. దగ్గిరికి చేర్చుకోనూలేను. ప్రతీక్షణం అదేధ్యాస! అదే ఆలోచన! తిలకం దిద్దుకుంటున్నప్పుడు మాధవ్ అద్దంలో అవతరిస్తాడు. నేనెటువంటి పరిస్థితిలో వున్నానో, నాకే ఆగమ్యగోచరంగా తయారైంది.
"మాధవరావు ఏమైనా వుత్తరాలు రాస్తున్నాడా?" అంది రేణు ఓసారి. నాకంత చెప్పాలని అనిపించలేదు. -" ఆఁ ఒకటి రాశాడు." అని నసిగాను. రేణు చిత్రంగా చూసింది.-" జవాబు రాశావా?" అంది.
లేదని తలూపాను.
"ఇంకా అతనితో వుత్తరాలేమిటి కృష్ణవేణీ!
"నేనేం రాయలేదే! అతనే ఏదో రాశాడు".
"నువ్వూరుకుంటే ఎందుకు రాయడూ?"
"అతని విషయం పూర్తిగా తెలిస్తే ఇంత ఇదిగా మాట్లాడవు రేణూ! పాపం అతన్ని తల్చుకుంటేనే చాల జాలేస్తుంది." నేను మాధవ్ ని ఎందుకు సమర్ధించానో నాకే తెలీదు.
"సరేగాని నీకోసం ఏమైపోయింది?" అంది రేణు వెటకారంగా.
మర్నాడు మాధవ్ మొదటివుత్తరం రేణుకి ఇచ్చాను. చదివింది. తనంతగా బాధపడినట్లు నాకేం అనిపించలేదు.
'బావుంది. ప్రతీమనిషికీ ఏదో గొడవ వుంటుంది. దానికి మనం చెయ్యగలిగిందేమీ లేదు." అంది మామూలుగా వుత్తరం ఇచ్చేస్తూ.
నేను వూరుకున్నాను.
క్షణం ఆగి-" నువ్వుమాత్రం జాగ్రత్తగా వుండు. ఇంకా ఉత్తరాలు గిత్తరాలేం రాయకు." అంది బుద్దిచెప్తున్నట్లు.
రేణుకి మాధవ్ ప్రసక్తంటేనే పడదు. ఆకోపమేదో నేను మర్చిపోగలిగాను కాని, రేణులో చిరాకలానే వుండిపోయింది.
రోజులు గడుస్తున్నాయి. క్లాసులు జరుగుతున్నాయి. కొత్త పాఠాలూ! ఆఖరి సంవత్సరం. భారంగానే వుంది వ్యవహారం.
* * *
కాలేజీనుంచి రాగానే టేబుల్ మీది ఉత్తర చూసి వులిక్కిపడ్డాను. గుండెలు దడదడాకొట్టు కున్నాయి. కవరు ముట్టడానికే భయమనిపించింది. తెరిస్తే చాల గొడవ వుండి ఉంటుందని చదవకుండా చించేస్తే.....? తిరిగి పంపిస్తే.....? చీకటిపడి దీపాలు పెట్టేవరకూ ఆలోచనలతోనే కూర్చుండిపోయాను. తెంపు చేసుకోలేని ఆలోచనల్లోంచి లేచి లైట్ వేసుకుని రాధాకృష్ణుల నిగ్రహాలకి అలవాటుగా నమస్కరించాను. ఏమేమో ప్రార్దించాను. ఏదో దైర్యంతో వుత్తరం తెరిచాను. అంతులేని ఆతృతతో సంబోధన చూస్తూనే ఆగిపోయాను. గుండెలు ఝల్లు మన్నాయి. ఒళ్ళు జలదరించింది.
"అనుకున్నంతా అయింది. మాధవ్! ఏమి టిది?"
నన్ను నేనే ఎరగని పరిస్థితిలో కళ్ళు అక్షరాల బారుల వెంట పరుగెత్తాయి.
ప్రేయసీ!
కృష్ణా!
ఆశ్చర్యపోతావా? నిన్ను పిలిచే భాగ్యం ఈనాటికా? ఈ క్షణం నుంచి మన మధ్య అరమరికలే వుండవు. నా మనసు విప్పి నీ పాదాలముందు పెడుతున్నాను. ఎలా స్వీకరిస్తావో నా అదృష్టంమీద ఆధారపడివుంటుంది.
ఆనాడెప్పుడో బస్సులో నిన్ను చూసిన తొలి స్మృతి నా హృదయంలో ఇంకా సజీవంగానే వుంది. ఆ ఘడియలో ఏదో మహత్తు వుంది. కృష్ణా! కాకపోతే మనమధ్యఏమిటీ పరిచయం? స్నేహం? నీలో నాకేదో ప్రత్యేకత కన్పించింది. ఆ, ప్రత్యేకతే నన్ను ఆకర్షించింది. నిలవేసి నీ హృదయాన్నివుసికొల్పింది. నిన్ను పార్కుకి రమ్మని పిలవటంలో సాహసమే చేశాననిపిస్తోంది. సాహసంతో పరిచయం చేసుకున్న నిన్ను సాహసంగానే దగ్గిరకు చేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. పార్కులో మొదటి రోజు నీతో ఎంతో హుషారుగా మాట్లాడాను. నాకు తెలుసు. కాని ఆ రాత్రి నా ప్రవర్తన గురించి నేనే ఎంత దీర్ఘంగా ఆలోచించుకున్నా ననీ! తొందరపడి నీ స్నేహాన్ని కోరుతున్నానేమో! నీకు లేనిపోనీ భ్రమలు కల్పిస్తున్నానేమో! ఈ కాలం స్నేహం అనేది ఎలా పరిణమిస్తుందో! దూరాలోచన లేకపోతే రెండు మనసులూ బాధ పడాలి సుమా! అని నన్ను నేనే హెచ్చరించుకున్నాను. అందుకే రెండోనాడు ముభావంగా వుండి పోయాను. నీవుత్తరాలు ఒద్దని చెప్పాను. కాని మంచికో చెడుకో ఈ క్షణం వరకూ వచ్చింది. చెడుకని ఎందుకనుకోవాలి? మంచికనే నా మనసు నమ్ముతూంది.రాను రాను నీకు నా స్నేహంతో నమ్మకం- నాపైన అనురాగం, కలుగుతూ వచ్చాయి కదూ? నీలా మనసు విప్పి చెప్పుకో టానికి అంత త్వరలో నేను సాహసించలేకపోయాను. -అప్పట్లో నేను అవివాహితుడనని నీ నమ్మకం. అలాని నేనెప్పుడూ చెప్పలేదు. మరుగు పర్చాలని అనుకోలేదు. అనలా ప్రసక్తి తెచ్చుకో వాల్సిన అవసరమే లేకపోయింది. నేను అవివాహితుడనని చెప్పుకున్నా పొరపాటు కాదంటాను.
