Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 16


                                     23
    అరుణ ఇప్పుడుఅప్పటి అరుణ కాదు. నలుగురి తో కలిసి మెలిసి తిరగడం వల్ల ఆ అమ్మాయి లో వయస్సు కు మించిన తెలివి తేటలూ, ప్రపంచ జ్ఞానమూ కలిగాయి. సెలవులు కాబట్టి ఇప్పుడు అరుణ సేతుపతి గారి ఇంటిలోనే ఉంటుంది. అక్కడికే వచ్చింది. రంగయ్య చౌదరి వ్రాసిన ఉత్తరం. అన్ని విషయాల్నీ పూసగుచ్చి నట్టు వ్రాశాదాయన. అంటే , అన్నింటికీ లేనిపోని చక్కటి రంగును కల్పించే! అయినా శంకర నారాయణ గారు ఎక్కడ ఉన్నదీ అయన వ్రాయలేదు. కారణాన్ని కూడా వివరించాడు. అందరూ ఉత్తరం లోని విషయాల్నీ విని సంతోషించారు. ఇక అరుణ సంగతి సరేసరి!
    "సీతామహాలక్ష్మీ, సరస్వతి ఎంత మంచి వారనుకున్నారు! సీత ఇప్పుడు సెకండ్ ఫారం చదువు తుంటుంది. సరూ ఏమో అయిదో తరగతి! అక్కడ నాన్నగారు బాగా సంపాదిస్తున్నారట కూడా! దేవుడు నిజంగా మంచి వారిని ఏనాడూ అన్యాయం చెయ్యడు, సార్!"
    "చెయ్యడమ్మా, అరుణా! మానవుల్లోనే 'అపకారికి ఉపకారము నేపమోన్నక చేయువా'రున్నప్పుడు , ఇక ఆ మహానుభావుని సంగతి వేరే చెప్పాలా?"
    'అవును. మీరు నిజం చెప్పారు, సార్!"
    ఇంత చనువు ఉన్నా, ఇన్నాళ్ళూ సేతుపతి గారి ప్రేమానురాగాల్ని చూరగొన్నా అరుణ మాత్రం సేతుపతి ని "సార్, సార్' అనడం మానలేదు! విన కష్టంగా ఉండేది సేతుపతికి. ఎన్ని తడవ లో అరుణ ను బ్రతిమాలారు కూడా అలా అనవద్దని. కానీ, "సార్ " అంటే , అదేంటో గౌరవ ప్రదంగా పిలవడమని అరుణ అభిప్రాయమై ఉండిపోయింది.
    ఇక, ఈనాటి నుంచీ అలా పిలిపించదలుచుకొనట్టు సేతుపతి, 'అమ్మా అరుణా, నాకో ఉపకారం చేస్తావా ?' అన్నారు.
    "ఏమిటి, సార్?"
    "ఆ సారే! 'సార్" అని దయచేసి నన్ను పిలవద్దు."
    "మరేమని పిలవమన్నారు , సార్?"
    "మళ్ళీ 'సార్!' వద్దమ్మా అంటుంటే? మరే విధంగా తెలీకుంటే, నన్ను సామాన్యంగా 'సేతుపతీ' అని పిలు."
    "తప్పు సా......"
    "ఆపావు కదా? థాంక్స్! నీవే ఆలోచించు. నాకు వేరే ఏదైనా పిలుపు సంపాదించు. 'సార్' అన్నావంటే మాత్రం నేను మంచివాణ్ణి కాను!"
    చాముండేశ్వరి అందరితో పాటు అక్కడే ఒక సోఫాలో కూర్చునే ఉంది. అంతటినీ వింటూనే ఉంది; ఇక ఆగలేక పోయిందామె!
    "అయ్యో పాపం! అయన గారికి నీచేత 'మామగారూ' అని పిలిపించు కోవాలని మహా సరదాగా ఉందే! పోనీ, అలానే పిలు. పిలిచినంత మాత్రాన నీకు వారు మామగారై పోతారా, మాకు నీవు కోడలి వైపోతావా?' అనేసింది చాముండేశ్వరి కుండ బద్దలు కొట్టినట్టు.
    అరుణ చాలా సిగ్గు పడింది.
    "ఏమమ్మా, అలా పిలుస్తావా?" సేతుపతి ఆశగా అన్నారు. అరుణ అక్కణ్ణించి పారిపోయింది. సేతుపతి పకాలున నవ్వారు! చాముండేశ్వరికి పట్టరానంత కోపం వచ్చింది.
    "పాడు కాలాలూ, పాడు బుద్దు లూను! జానెడు బెత్తెడు లేదది! 'మామగారూ' అని పిలవ మనగానే దాని కెందుకో అంత నస!" అంటూ అందరూ వినేలా సణుక్కుని వెళ్ళిపోయింది. ఆమె మాటల్ని అట్టే పట్టించుకునే అలవాటు సేతుపతి ఏనాడో వదిలేశారు! కానీ, అయన మనస్సులో ఏవేవో ఆలోచనలూ, పదకాలూ పుట్టుకు వస్తున్నట్టున్నాయి.
    "సంబంధం!"
    "సర్?"
    "రాత్రి తొమ్మిది గంటలకు అరుణ ను నన్నోకసారి కలుసు కొమ్మనండి. స్టీవెన్ సన్ గారింట్లో డిన్నరు నించి అంతకంటే త్వరగా రాలేననుకుంటా. ఓ అరగంట అటో, ఇటో అయినా, నాకోసం కాచుకో మనండి."    
    "వెరీ గుడ్ , సర్!"

                               *    *    *    *
    "ఏమమ్మా, అరుణా, మరి నీవు కాలేజీ లో చేరిపోతావా? రెండేళ్ళు అగుతావా? ఆగితే రఘు కూడా సీనియర్ కేంబ్రిడ్జి పూర్తి చేస్తాడు. అప్పుడు ఇద్దరూ ఒకే కాలేజీ లో చేరవచ్చు; కలిసి చదువు కోవచ్చు."
    'అగుతానండీ , మామయ్యగారూ!"
    ఏదో పరధ్యానంగా ఉన్నారు సేతుపతి . అందుకనే అరుణ పిలుపులోని ఆ కొత్తదనం అయన చెవులకు ఇంపుగా సోకలేదు. కానీ, ఏదో సరికొత్తగా వినిపించినట్ట యింది.
    "ఆ?...." అన్నారాయన అనుమానాస్పదంగా.'    'అగుతానండీ, మామయ్యగారూ."
    "హుర్రే! అలా పిలవాలి! ఇవాళ నీవు నిజంగా బుద్ది మంతురాలి వనిపించు కున్నావు. థాంక్ యూ , అరుణా!"
    "ఎందుకండీ? నేనలా పిలవడం మీకింత ఆనందాన్ని కలుగ జేస్తుందనుకుంటే ఏనాడో పిలిచేదాన్ని. మీకు సంతోషాన్ని, తృప్తినీ కలుగ జేయడానికి నేనేమైనా చేయగలను, చేస్తాను!"
    "ఏమో తల్లీ! ఒకనాడు నాకోసం నావారి కోసం నీ సుఖాన్నీ, శాంతినీ త్యాగం చేయవలసి వస్తుందేమో నీవు!"
    'అంతటి అదృష్టానికే నేను నోచుకుని ఉంటె , ఈ జీవితంలో నాకింకేం కావాలండీ మామయ్య గారూ? పొతే, నా మీది అధికారం సగం నాన్నగారిది; సగం మీది. మీ సగం మీ కివ్వడానికి ఏనాడయినా నేను సిద్దమే నండీ, మామయ్యగారూ."
    "థాంక్ యూ , తల్లీ! పన్నెండేళ్ళ కన్నెలా కాకుండా , నూటపన్నేడేళ్ళ పండు ముత్తైదువలా మాట్లాడావు నీవు. కారణం , నీకు మీ నాన్నగారు అన్నీ పాతకాలం బుద్దులే నూరిపోశారు. దాని సత్ఫలితం నేనను భవిస్తున్నాను."
    అరుణ ఏమీ అనలేదు. మిన్నకుంది.
    "ఈ రెండేళ్ళూ ఏం చేస్తావమ్మా?"
    "అమ్మగారికి ఇంట్లో చేదోడు వాదోడుగా ఉంటానండీ.
    "నో! నో! అది నాకిష్టం లేదు. నేనో మాట చెబుతాను. వింటావా?'
    "చెప్పండి సా ,.....మామయ్యగారూ!"
    "ఈ రెండేళ్ళూ నీవు నా పెర్సనల్ సెక్రెటరీ పని చెయ్యి. నెలకు రెండు వందలు జీతం అంతా కలిసి. ఏమంటావు? నీ చదువు ఖర్చు విషయం లో అప్పుడు నీవు నాకేమీ ఋణపడి ఉండవు. మళ్ళీ శలవులు వచ్చాయనుకో. మళ్ళీ పని చెయ్యి. నా వద్దనే సుమా! నీ చదువంతా అయిపోయాక అప్పుడు అక్కౌంట్ చూసుకుందాం!"
    "అలాగే నండీ , మామయ్యగారూ."
    "అబ్బా! అప్పుడే పదకొండు కావచ్చిందే? గుడ్ నైట్!"
    "గుడ్ నైట్, సర్!"
    "ఆ? మళ్ళీనా?"
    "మరి నేనిప్పుడు మీ పర్సనల్ సెక్రెటరీ ని కదండీ, మామయ్యగారూ?"
    హృదయ పూర్వకంగా నవ్వారు సేతుపతి! జీవితంలో అటువంటి ఆనందాలు నిమ్పుకోగల అదృష్ట వంతులు ఎందరు మనలో?

                                                             24
    రెండేళ్ళు గడిచినాయి. అరుణ సేవింగ్స్ అకౌంట్ లో బోనస్ లతో సహా ఆరువేల రూపాయలు పడ్డాయి.
    ఒక్కోసారి సేతుపతి అరుణను తనతో పాటు డిల్లీ, బొంబాయి మొదలయిన నగరాలకు కూడా తీసుకు వెళ్ళేవారు. అక్కడ అంతమంది పెద్దలకూ అరుణను తన పెర్సనల్ సెక్రటరీ గా పరిచయం చేసేవారు. అందరూ అబ్బుర పడి పోయేవారు.
    "ఆ.....మీరేదో నవ్వులాట కంటున్నారు! అరుణ మీ కూతురో, లేక చాలా దగ్గిర బంధుగురాలో అయి ఉంటుంది!" అనేవారు కొందరు.
    "అంటే , మీ అభిప్రాయం ? కేవలం ఆ అమ్మాయి నా బంధువు రాలాయి నంత మాత్రాన ఈ పొజిషన్ సంపాదించిందనా? అమ్మా, అరుణా భగవద్గీత లోని జ్ఞానయోగం లో నుంచి రెండు శ్లోకాలు చదువు, తల్లీ. అప్పుడు గానీ ఈ మూడుల అవిశ్వాసం పోదు!"
    "యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత,
    అభ్యుత్దానమధర్మస్య తదాత్మానం స్పజాన్యుహం.
    పరిత్రాణాయ సాధూనాం వినాశాయ త దుష్కృతాం,    
    ధర్మ సంస్తాపనార్దాయ సంభవామి యుగేయుగే."
    సిగ్గుపడుతూ అరుణ అతి శ్రావ్యంగా పాడేది! అందరూ కరతాళధ్వనులు చేసేవారు.
    సేతుపతి సగర్వంగా , "మీరంతా అలాగే చూస్తుండండి. ఒకరోజు మా అరుణ నా ఇండస్ట్రియల్ ఎంపైర్ ని రూల్ చేస్తుంది" అనేవారు. అందరికీ అది సంభవమేమో ననిపించేది కూడా.
    దేశమూ, కాలమూ, పరిస్థితులు కూడా అటు వైపే దారి తీస్తున్నట్టు అగుపడ్డాయి. ఆ మార్గ మధ్యంలో జరిగిన సంఘటన లన్నీంటి ని కాకపోయినా ముఖ్యమైన వయినా కొన్ని చెప్పి తీరాలి.
    మొదట అరుణ ను గురించి, ఆడపిల్లలు ఈవేళ ఒకలా ఉంటారు. రేపు మరోలా ఉంటారు. ఆ తరవాత మళ్ళీ మనం వాళ్ళను చూసేసరికి , ఇంకేముంది? కన్యలు  స్త్రీ లై, మనం గుర్తు పట్టలేనంత ఇదిగా మారిపోతారు!
    మెట్రిక్ పరీక్ష పాసయిన నాటి అరుణ కూ, పి.యు.సి చదువుతున్న నాటి అరుణ కూ అసలు సంబంధం లేదు. ఆ రెండు , రెండున్నర సంవత్సరాల్లోనే అదే అరుణ అంత శోభాయమానంగా, ఎలా మారిపోయిందీ అంటే, అంతా సృష్టి వైచిత్ర్యం! అమ్మాయిది అర్ధం లేని అందమై పోయింది. ఠీవి గా, నిర్ధాక్షిణ్యంగా , మనోహరంగా మనల్నేదుర్కునే అ అమ్మాయి అంగసౌష్టవము, సొబగు; అన్ని వేళలా అమాయికర , అమృత ప్రాయాలయిన చిరునవ్వులే వెదజల్లే అరుణ ముఖార విందము , చెంపకా చారెడేసి కళ్ళు....అమ్మాయి అందాన్ని చూచి ఏమీ చెయ్యలేక మతి చలించిన మానవుడు , ఉరి పోసుకోడానికి వీలుగా ఉన్నంతటి అ వాలు జడ నిజంగా అరుణ అందం చెప్ప శక్యం కానిదై కూర్చుంది. ఆమెను చూడగానే అన్ని సమస్యల నూ, ఘర్షణ లనూ, ఒడి దుడుకులనూ మరిచిపోగలిగే వారు సేతుపతి! అందుకనే చాముండేశ్వరికి  అట్టే ఇష్టం లేకపోయినా , అరుణ ను తన ఇంటిలోనే ఉంచుకుని , పూలలో బెట్టి పెంచు కుంటున్నారాయన!
    రఘుపతి కూడా బాగానే ఎదిగాడు. ఆ పద్దెనిమిదేళ్ళ వయసుకు ఐదడుగుల పది అంగుళాల ఎత్తు; ఎత్తుకు తగ్గ లావు; మనిషీ మరీ అందగాడు కాకపోయినా ఏమాత్రం అనాకారి కాడు. చూడగానే అతనిలోని ఏదో శక్తి అందర్నీ ఇట్టే ఆకర్షించేది. ఇన్నాళ్ళూ డాన్ బాస్కో లోని క్రమశిక్షణ వల్ల రఘు అవసరం ఉన్నప్పుడే మాట్లాడ్డం, అన్ని మర్యాదల్నీ పాటించడం మొదలయినవి చేసేవాడు.
    ఇప్పుడు కాలేజీ వాతావరణం లో పడి పది పన్నెండు మంది స్నేహితులు పోగయ్యాక మనిషిలో కొంత అహంభావం బయలుదేరింది.
    రఘుపతీ, అరుణా కలిసి కారులో కాలేజీ కి బయలు దేరేవారు; వచ్చేవారు. రఘుపతే కారు నడిపేవాడు. ఈ సావాసా గాళ్ళు చేరాక, ఒక్కోరోజు అరుణ కాలేజీ నుంచి బస్సులో ఇల్లు చేరుకోవలసి వచ్చేది. సాధారణంగా ఇటువంటి చిన్న చిన్న విషయాల్ని గురించి పట్టించుకునే తీరికే సేతుపతి గారికి ఉండేది కాదు. అరుణ చాడీలు చెప్పేంత సంకుచిత స్వభావం కల పిల్ల కాదు.
    ఆనాడు అరుణ సేతుపతి గారి ఇంటి సమీపంలో బస్సు దిగుతుంది. సరిగా ఆ సమయానికే సేతుపతి గారూ అలా రావడం తటస్థించింది. అయన కారు ఆగింది. లోలోన భయపడుతూనే అరుణ అయన గారిని సమీపించింది. అయినా తన ముఖంలో చిరునవ్వు తప్ప మరేమీ అగుపించరాదనీ ప్రయత్నించింది.
    "ఏమమ్మా, బస్సులో వచ్చావు? రఘు ఏడీ?"
    "ఏదో టెన్నిస్ మాచ్ జరుగుతుంటే చూడ్డానికీ వెళ్ళాడండీ. నన్ను ఇంటి దగ్గిర దింపి వెళతానన్నాడు. నేనే వద్దన్నాను."
    "మంచి పని చేశావులే. గెట్ ఇన్."    
    ఇంటికి వెళ్ళాక అరుణతో కలిసి టీ పుచ్చుకుంటూ, "అయినా ఆ బడుద్దాయి కి ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లేదా? నువ్వు వద్దంటే మాత్రం వాడి ఇష్టం వచ్చినట్లు వాడు వెళ్ళిపోవడమేనా?' అన్నాడు.
    "అబ్బ, పోనీలెండి, మామయ్యగారూ. అసలు మధ్యాహ్నం మూడు గంటలకే పోటీలు మొదలయ్యాయట. కడపటి ఆటలో కృష్ణ నూ, విష్ణూ మోహనూ క్లాష్ అవుతున్నారని పాపం, ఆదరాబాదరా వెళ్ళిపోయాడు."
    "అల్ రైట్ , అల్ రైట్!" అన్నారు సేతుపతి కాస్త విసుగ్గానే. అంతటితో ఆనాటి సమస్య అణగారి పోయింది.
    కానీ, రఘు సమస్యల్ని కొని తెచ్చుకునే వారి సాంగత్యమే చేశాడు. రెండు మూడు తడవలు, రఘు తన స్నేహితులతో కలిసి ఆ దియేటరు వద్దా, ఈ సినిమా హాలు వద్దా, జింఖానా క్లబ్బు లోనూ సేతుపతి గారి కంట పడ్డాడు. కుర్రాడు సినిమాలు చూస్తె తప్పేమీ లేదుగా? క్లబ్బు లో కూల్ డ్రింక్స్ తాగినంత మాత్రాన చెడిపోడుగా! అయినా ఒకనాటి రాత్రి మాత్రం ఇలా అన్నారాయన.
    "బీ కేర్ పుల్. నీవు సినిమాలూ చూస్తున్నావనీ, చదువు మీది కంటే స్పోర్ట్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నావనీ నాకేం బాధ లేదు, రఘూ. ప్రతి దానికీ ఒక పరిమితి ఉంది.అరుణను చూడు. నీకూ పాకెట్ మనీ ఇస్తున్నాను. అరుణ కూ ఇస్తున్నాను. ఆ డబ్బు తోటీ నీవేం చేస్తున్నావు? అరుణ ఏం చేస్తుంది? నేను నిద్ర లేవగానే బెడ్ కాఫీ అందివ్వడం దగ్గిర నించీ , ఆఫీసు కి వెళుతుండగా టై సర్దడం వరకూ ణా పనులన్నీ ఆ అమ్మాయే చేస్తుంది! నేననేది టైం క్వశ్చన్! నువ్వు బయట తిరుగుళ్ళ తో ఎంత కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నావో, ఆ అమ్మాయి ఆ కాలాన్నే ఇంట్లో అంత సద్వినియోగం చేస్తుంది. ఆ అమ్మాయి చదువు మీద చూపుతున్న శ్రద్ధ చూడు. నీవా మాత్రం పుస్తకం పట్టినట్టు నేనీ మధ్య ఎన్నడూ చూడలేదు. అరుణ ఫస్టు క్లాసులో ఫస్టు వస్తుంది. నాకేమీ అనుమానం లేదు. బట్ ....నీ సంగతేమిటి? కనీసం పాసవడా నికయినా ప్రయత్నించు. అది ణా సలహా అనుకో; తండ్రిగా నేను నీకు కాస్త కటువుగా బుద్ది చెప్పడమనుకో. ఇట్ ఈజ్ అప్ టు యూ . గుడ్ నైట్!" అంటూ అటూ , పైప్ రెండు మూడు మార్లు నింపుకుని వెలిగించుకుని పీల్చి పచార్లు చేశారు.
    రఘు చిరచిర లాడుతూ వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS