Previous Page Next Page 
ఋతుపవనాలు పేజి 16


    గ్రీహ్మం వెళ్ళిపోయింది. వర్ష ఋతువు వచ్చీ రావడంతో, ఒక మహా వర్షంతో ఎండిన పొలాల్నీ జలమయం చేసింది. రైతుల ముఖాలు వికసించాయి. ఉత్సాహంగా సేద్యాలకు దిగారు. రైతులు, కూలీలు కష్టపడి, భూమిని సంస్కరించి విత్తనానికి తగినట్లుగా ఉంచినారు. ఉన్న ఆర్ధిక శక్తిని ఖర్చు పెట్టి, సన్నద్దులై సమయం కోసం చూస్తున్నారు. ఎక్కడ, యేవేళ, ఎవరు సంభాషించినా వాళ్ళ మాటల్లో 'వాన' అన్న మాట రాక తప్పదు. కానీ, ఆ వాన చినుకు భూమి మీద రాలలేదు. దావాంబర వీధి విశ్రుత విహారిణిలా, పట్టిన మబ్బునూ ఏ మూల నించో వచ్చిన గాలి నిర్దయగా చెల్లాచెదురు చేస్తుంది.
    ఆ సమయంలో కూలివాళ్ళ స్థితి ఘోరంగా తయారయింది. పని దొరకదు. ఏ చేల గట్టునున్న కంప నరకట మో, గరిక తవ్వటమో లాంటి పనులున్నా రైతు కూలీ వాణ్ణి పిలువలేదు. 'ఒక్క రోజులో గాకపోతే, మూడు రోజుల్లో అవుతుంది. మించిపోయిందేముంది? కూలి డబ్బులన్నా మిగులుతాయి' అనుకుని స్వయంగా చేసుకుంటాడు. లేదా, వానొచ్చే వరకూ వాయిదా వేసుకుంటాడు.
    ఆకలి వాయిదాలు వెయ్యడాని కొప్పుకోదు. రెండు పూటలకు, మూడు పూటల కొక్కసారయినా దీని కింత ఉపశాంతి నివ్వాలి. లేకపోతె దాని కక్ష మనిషి మీద తీర్చుకుంటుంది. రక్తం తాగుతుంది. కండలు పిండుతుంది. ఎముకలు విరిచేస్తుంది. పైశాచిక బీభత్సం ప్రారంభిస్తుంది.
    ఆరోజు సుబ్బరామయ్య ముందరికి వచ్చి చేతులు కట్టుకుని నిలుచున్నారు వాళ్ళు! మూరడేత్తు గ్లాసుతో పాలు తాగుతున్న సుబ్బరామయ్య , ముఖం చిట్లించి 'దిష్టి తగిలేరు వెధవలు!' అనుకుంటూ అటు పక్కకు తిరిగి తాగేసి, మూతి తుడుచుకుంటూ ఇటు తిరిగాడు! గూనేంకడు, కర్రే గంగడు, పోలుకొండు గాడు, ఒలేశు!
    "ఏం? ఎన్నడూ రానివాళ్ళంతా ఇట్లా వచ్చారు?'
    ఒకరి ముఖా లొకరు చూసుకున్నారు. వాళ్లు ఎన్నడూ రాని వాళ్ళు కాదు. ఎన్నడు రాణి వాళ్లు వాళ్ళొక రకమైన మూగవాళ్ళు! వాళ్లు కొన్ని మాటలు మాట్లాడతారు. మరికొన్ని మాట్లాడలేరు.
    'ఏమర్రా! మాట్లాడరూ?' సుబ్బరామయ్య నవ్వి, బీడీ ముట్టించాడు.
    "ఏందో, సోమీ , వానదేవుడు దయసేయలా.'
    'అయితే, నన్నేం జేయమంటారు?'
    'ఎవరేం జేత్తారు? అదిగాడు, సోమీ! పనుల్దొరకడం లేదు. కొంపల్లో ఎలగ్గోరకను గింజ లేదు. పిల్ల ముండలతో సావయింది. ఏదో మనిషి కిరసో, తూమేడో గింజలు గోలిపిత్తే ఇంకా నాల్రోజులు బతుకుతాము....'
    'నా దగ్గర గింజలు లేడివిరా! మొన్న వానొచ్చినప్పుడు నేనూ అమ్మలేదూ?'
    'ఆరోజు గింజలు కొలిచినప్పుడు నేనోచ్చినా -- పెద్ద పాత రింగా వాడనే లేదు...' అన్నాడు కర్రె గంగడు.
    సుబ్బరామయ్య కు చర్రున కోపమొచ్చింది.
    అతనబద్దం చెప్పాడు, ఆ సంగతి వాళ్లకు తెలిసిండ్. న్యాయంగా అతని మీద వాళ్లకు కోపం రావలసింది. కానీ, అట్లా జరగదు లోకంలో.
    'అవును . పెద్ద పాతర అట్లనే ఉంది. అయితే ఏం వోయ్! మీకు బాకీనా?'
    'మాకేంది బాకీ! సంగటి లేని నాయాళ్ళం.....నిన్ను జూసి ఊరు నమ్ముకుని బతుకుతున్న వాళ్లం. వానొచ్చేతలికి పనుల్దోరకతాయి, ఆమనీలోగా బాకీ సెల్లుబెదతాం.'
    'ఆ-- చెల్లుబెడతారు! మీ సంగతి నాకు తెల్దూ? ఇవన్నీ కడుపు కాలుతున్నప్పటి మాటలురా! అవతల ఇసుకోమంటే చూసుకోమంటారు. గింజ లిచ్చినవాడు కూలి పారేసే వాడి దగ్గరికి గుంపులు పరుగెత్తుతారు. కుక్కలు మేలురా, మీకంటే. ఈ రోజు ముందుగా గింజ లివ్వడ మెందుకు? ఆరోజు నే నిబ్బంది పడట మెందుకు? లక్షణంగా మీరు పనిచేసిన రోజున మీ కూలి మీరు తీసుకపొండి! నా అభ్యంతరం లేదు.'
    'అందాకా మేం బతుకుతే గదా!'
    'పోవాలనుంటే సావండ్రా! నేనోద్దంటే మానుతారా? ఏదో నేనూ, అప్పటికి బతికున్న వాళ్లనే పిలుచుకుంటాను.' లోపలి కెళ్లి పోయాడు.
    అంతా తల వంచుకుని వెళ్లి పోతున్నారు. ఊరికి ప్రెసిడెంట్ . గొప్ప ఆసామీ. పాతర్ల లో మిగులు దాన్యం మున్నవాడు. పది మందిలో పని చేయించుకునేవాడు. ప్రాణం పోతుందని అడిగితె పనికి వచ్చినప్పుడిస్తా నంటాడు.
    రోజు కోక ఇంటి కొకరు కూలి లేకుండా ఊరక పనికి రావాల. ఇదేన్నేళ్ళనించో అలవాటయింది. ఆ రకంగా రోజూ కూలీలకు సంగటి వెయ్యడం తప్ప కూలి రూపంగా ఒక్క శేరు గింజలు ఒళ్లో వెయ్యడు సుబ్బరామయ్య!
    అది ప్రెసిడెంటు మామూలంట! ఆరోజు ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎవరి పన్లోకో ఒప్పుకునుంటే, సుబ్బరామయ్య దెబ్బలతో తోలూడుతుంది. ఇంట్లో ఇద్దరుంటారు. ఒకరి కూలీ పాత బాకీలో జమ అవుతుంది. మరో కూలీ కైనా గింజలు తెచ్చుకుంటే సంగటి తినవచ్చు! ఆ కూలీ సుబ్బరామయ్య మామూల్లోకి చేరుకున్నప్పుడిద్దరూ పరగడుపే! ఇట్లాంటి అనుభవాలెన్నో వాళ్లకు.
    వాసవీ, సూర్యనారాయణా మంచం మీద కూర్చుని మాట్లాడు కుంటున్నారు. పక్కనే సరస్వతి జడల్లు కుంటూ కూర్చొని వింటుంది.
    "ఏంరా! ఇట్లా వచ్చారు?' అన్నాడు సూర్యనారాయణ.
    మళ్ళీ ఓపిక తెచ్చుకుని వల్లించారు.  
    'మా నాయనేమన్నాడు?'
    'ఎయ్యనన్నాడు....'
    'సరే, పదండి! మళ్లీ అడిగి చూద్దాం!'
    'బావా! అయన కసలే నీ మీద కోపంగా ఉంది' అన్నాడు వాసవి.
    'నన్ను తిట్టినా ఫరవాలేదు లే. వాళ్ళకు గింజ లిస్తే చాలు!'
    సుబ్బరామయ్య లేడు. రాధాక్రిష్ణ ఎదురుగా వస్తున్నాడు.
    'నాయనేడీ?'
    "ఎవరి నాయన?'
    సూర్యనారాయణ కి కోపం వచ్చింది . 'మన నాయనా.' ఒత్తి పలికాడు.
    'ఈ ఇంట్లో మా నాయన మాత్రమే ఉన్నాడు.'
    'సరే! మీ నాయన్నడిగి వీళ్ళందరికీ తలో ఇన్ని గింజలిప్పించు!'
    'ఆ మాట చెప్పడానికి నువ్వెవడివి?'
    'రాధాక్రిష్ణా!'
    'అరిస్తే భయమా? తండ్రి మాట కాదని , ఛీ! ఫో! మా కక్కర్లేదన్న వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగావు. పెళ్లి కాకముందే పొలాల్లో, ఏర్ల లో చెడ తిరిగి, ఆ మోజులో పడి....'
    దూరంగా ఉన్న వాళ్ళు పరిస్థితి ఇట్లా మారినందుకు భయంతో చూస్తున్నారు.
    'సరే! నిన్నడగట మెందుకు? మీరంతా వెళ్లి   మీ వాళ్ళను పిలుచుకుని పాతర దగ్గరికి రండి! నేనొచ్చి కొలిపిస్తాను....'
    'నీకేం హక్కుంది! నీఅస్తి పంచుకున్నావు.'
    'ఆస్తి పంచుకున్నాను. ధాన్యం పంచుకోలేదు. ఇంతకూ ముందు అమ్మిన దానిలో నాకూ అర్ధ భాగ ముంది. నా ఒక్కని భాగం ఏభై ఎకరాలు. మీ అందరిదీ కలిఫై ఏభై ఎకరాలు! నా ఖర్చెంత? మీ అందరి ఖర్చెంత? లెక్కవేసి సిద్దంగా ఉంచు.'
    సుబ్బరామయ్య, రాదాక్రిష్ణా ల పితా పుత్ర సంబంధం దృతరాష్ట్ర , దుర్యోధనుల వంటిది. అయితే సుబ్బరామయ్య లో ఉన్నంత లౌక్యమైన రాధాక్రిష్ణలో లేదు. లేదంటే బొత్తిగా లేదని కాదు. సూర్యనారాయణ ఆస్తి పంచుకున్నాడే గానీ, ధాన్యం పంచుకోలేదనీ, ఆ విషయం మాట్లాడితే తనకే ఇబ్బందనీ తెలుసుకోలేని అమాయకుడు కాడతను. కానీ, చిత్రంగా అతని సంభాషణ అక్కడికే దారి తీసింది. ఆలోచన అతన్ని నడిపించడానికి ముందుగానే , అహంకారం అతన్ని పట్టి ఈడుస్తుంది! అన్ని విషయాల్లోనూ రాధా క్రిష్ణా పద్దతి అది! పైగా తన పొరపాటుకు ఎదుటి మనిషి బాధ్యుడన్నట్లు-- మండి పడతాడు.
    సూర్యనారాయణ ఇంటికి వెళ్ళే సరికి పొద్దు తిరిగింది.
    'ఇంతసేపయిందేం? ఏమన్నా జరిగిందా?' అంది సరస్వతి. అప్పుడు రాదా క్రిష్ణ మాటలు జ్ఞప్తికి వచ్చినాయి.
    'నవ్వొస్తోందెందుకూ?'
    'నువ్వు పెళ్ళి కాకముందే నన్ను ఒళ్లో వేసుకున్నావట! అప్పు డెందుకో ఆ మాటకు నవ్వు రావలసింది పోయి కోప మోచ్చేసింది.'
    'ఓహో! అందు కిప్పుడు నవ్వోస్తోందా? ఇంకా నవ్వే విషయం చెప్పనా?'
    "ఏదీ! చెప్పు!'
    'దగ్గరగా....'
    'నీ లోపలికా...'
    'అదే!- నా లోపలి కొచ్చేశావు ...' కళ్ళు మూసుకుంది! సూర్యనారాయణ గాడమైన కౌగిలి లో ఒదిగి పోయింది!

                            *    *    *    *
    'నిరుడే మేలు! పాతిక పైరన్నా పండింది. చేయడానికి పనన్నా ఉండింది. ఈసారి ఇత్తనమే భూమిలో పడేట్లు లేదు' అని భయపడుతున్నప్పుడు వర్షం కురిసింది. తడిపొడి పదునయింది. అంతా పరుగులాడి ఇత్తనమేశారు. మొలక మొగం జూస్తే ఆశ మొలకెత్తుతుంది. అంతా కలుపు తీసుకుంటున్నారు. ముందు అంతగా వానల్లేనందువల్ల , ఒక్కసారిగా కలుపు బలుపు చూసింది. ఎక్కువ పొలం ఉన్న వాళ్ళు స్వంతంగా తీసుకుని పొద్దు గుంకే టప్పటికి నెత్తిన మోపులతో ఇల్లు చేరుకుంటున్నారు.
    వాసవి కొర్ర లో మెట్ల గుంటక తోలుతున్నాడు. నన్నయ్య జొన్న వేసే చెలనికి ఎరువు తోలుతున్నాడు. అందువల్ల అనంతయ్య కు వేరు సెనగ లో కలుపు తీయించే పని తగిలింది. 'చూద్దాం లే! తరవాత చెద్దా'మనే పని  కాదు. 'కలుపు దొంగ కనపడుతున్నాడు, ఖబదార్ గుండు' అనేది మెట్ట రైతుకు తెలిసిన నానుడి!
    శ్యామల అనంతయ్య కూ, కూలీలకు అన్నం తెచ్చింది. ఇదివరకు ఈ పని సరస్వతి మీద ఉండేది. ఇప్పుడు సరస్వతి స్వంత కాపురం ఏర్పాటు చేసుకుంది. ఆడపిల్ల అంతే! ఒకటి రెండు సార్లు సావిత్రి శ్యామలను వాసవి కిచ్చే విషయాన్ని ప్రస్తావించింది. తనకూ అది మేలు గానే కనిపిస్తుంది. వాసవి కీ పెద్ద అభ్యంతర మున్నట్లు లేదు కానీ, అట్లాంటి రక్త సంబంధమున్న దాంపత్యాలు ఆరోగ్యవంతమైన సంతాన న్నివ్వలేవని శాస్త్రజ్ఞుల సిద్దాంత మన్నాడు. అది నిజమే కావచ్చు, కానీ ఏ శాస్త్రం సిద్దాంతం దానిదే. శారీరక శాస్త్రం సాంఘిక సమస్యల్ని పరిష్కరించ లేదు. ధార్మిక జీవనాన్ని రక్షించే ధర్మ కర్త లాంటి రైతు మనస్సు గూడా నేడు మారిపోయింది. ఇప్పటి వాని ఆలోచనలు ఇంతకూ ముందువి కావు. ఇంటికి తెచ్చుకునే కోడెల్నూ , కోడల్నూ ఎన్నుకునే పద్దతి అప్పుడు నేదు!
    పిల్లవాడెలాగుంటాడు? ఎలాంటి వాడు?
    'పిల్లవాడు గుణవంతుడు, నాలు గెకరాల భూమి, ఇల్లు కలిగిన వాడు. చక్కని సేద్యగాడు.'
    'పిల్ల ఎలాంటిది?
    'పిల్ల అడకువగా ఉంటుంది. వండనూ, వర్చానూ అన్నపూర్ణకు నుద్ది. పాడీ పంటల్లో చెయ్యి కలిపేది....' ఇవీ అతడు కోరేది, ఇంతకూ ముందు.
    'పిల్లవాడు దర్జాగా ఉంటాడు. స్వంత సేద్యం మానేసి భూములు గుత్తల కిచ్చేశాడు. డబ్బు వడ్డీకి తిప్పుతున్నాడు. తల్లి లేదు. తండ్రి నేడో, రేపో అనేట్లున్నాడు. మన పిల్ల ఒక్క పని చెయ్యవలసిన పని లేదు -- అసలు పట్నం లో కాపురం పెడతాడు......'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS