Previous Page Next Page 
మేఘమాల పేజి 16


    'అయినా ఒకళ్ళన్నారని ఎందుకు?- మీరే ఆలోచించండి!'    
    'నాకు అంతగా తప్పేఁవీ కనబడటం లేదు రాజేశ్వరీ!'
    'గురువింద గింజ సామెతలా వున్నది!' అని నవ్వింది.
    త్యాగరాజు కందగడ్డలా చేసుకున్నాడు మొఖాన్ని.
    'పోనీయ్, మావాళ్ళను గురించైనా ఆలోచించారా? - పెళ్ళికానిదాన్ని ఇలా వచ్చేసి పరాయివాడిదగ్గిర వుండటం వాళ్ళు మాత్రం హర్షించగలరా?' అన్నది సిగ్గు పడుతున్నట్లుగా తలవంచుకొని.
    త్యాగరాజు తేరుకొని పెద్దగా నవ్వుతూ, 'రాజూ ! అర్ధమయింది!... వివాహానికి అంత తొందరెందుకు!' అన్నాడు చాలా చనువుగా, ప్రేమగా.
    జీవితంలో మొట్ట మొదటి సారిగా 'రాజూ' అని అమృతంలా పిలవగా ఆమె మనస్సు ఎంతగానో ప్రఫుల్లమయింది. సంతోషతరంగాలు ఉవ్వెత్తున లేవగా గుండెలు ఎగిరెగిరి పడసాగినయి. ఆమె కాక్షణంలో ప్రపంచంలోని ప్రతివ్యక్తీ ఆనందంతో నృత్యం చేస్తున్నట్లే అనిపించింది.
    -ఆమె చటుక్కున దగ్గిరగా వచ్చి త్యాగరాజు పక్కగా చాపమీద కూర్చున్నది.
    'నేను స్త్రీని!- నా చర్మం మీ పురుషుల చర్మం కంటే చాలా పలచన-నేను అనుమానాల్ని, అవమానాల్ని భరించలేను!' అన్నది కలల్లో కరిగిపోతూ, ఆనంద పారవశ్యంలో తేలిపోతూ.
    'ఇంకెందుకా దిగులు?- రేపుదయమే మన వివాహం!'
    'క్షణం అతడి కళ్ళల్లోకి కలవరపాటుతో చూచి, 'అదేఁవిటి - మంచి రోజు అక్కరలేదా?' అన్నది.
    'దేవాలయంలో వివాహానికి మంచిరోజుదేనికి? ఆ పవిత్రస్థలంలో మంచీ చెడూ లేదు రాజేశ్వరీ!' అన్నాడు. తృప్తిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, 'సత్యవతినీ ఆసుపత్రికి పంపి-మనం చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి గుడికి వెళదాం!' అన్నాడు. ఆమె వెన్నుమీద చేయివేసి ఆమె ఉద్రేకాన్ని అణుస్తున్నట్లుగా అనునయంగా రాయసాగాడు.
    'అంతదూరంనుండి మావాళ్ళెవ్వరూ రాలేరు-దగ్గరున్న మీ చెల్లెల్ని మీరు రానీయరు -మనతో వున్న సత్యవతినైనా తీసుకువెళ్ళకపోతే ఎలా?'
    'వద్దు రాజూ!-ఆమె చాలా దుఃఖంలో వున్నది-ఆమెను వదిలివేయ్!'
    రాజేశ్వరి మాట్లాడలేదు.
    'మీ వాళ్ళను పిలిపించాలని కోరుకుంటున్నావా?'
    'అంత అవసరమేఁవీ అనిపించటం లేదు?'
    '-శకుంతల కులాసాగా వున్నట్లయితే ఆమెను తప్పక నా వివాహానికి ఆహ్వానించి వుండేవాడిని!' అన్నాడు చిన్నగా వో నిముషం మౌనం తరువాత.
    'అలా ఆమెమీద కసి మరోసారి తీర్చుకోవాలనుకుంటున్నారా?' అప్రయత్నంగా అడిగింది.
    అతడు త్వరత్వరగా, 'నీవూ నన్ను అలాగే ఊహించుకుంటున్నావా?' అన్నాడు కలవరపాటు చూపులతో ఆమె మొఖంలోకి చూస్తూ 'నాకు ఆమె అంటే ఎన్నడూ కోపం లేదు....ద్వేషం లేదు!-ఆమె ఏఁవీ తెలియని అమాయకురాలు-ఆమెలో వేడి పాలు కొద్దిగా ఎక్కువగా వున్నది-అంతేగాదు, ఈనాడు ఆమెలో ఆ వేడి చల్లారిపోయింది-ఆమెను ఆమె తెలుసుకున్నది గూడా-ఇంకెందుకు ఆమెమీద నాకు కోపం? కసి?'
    రాజేశ్వరి మాట్లాడలేదు.
    'వివాహమయ్యేటంతవరకూ.....సత్యవతికీ చెప్పబోకు-రేపు సాయింత్రం చెబుదాం!'
    'నేను సర్వం మీకు అర్పితమయ్యాను- మీ మాటలే నాకు వేదం!' అన్నట్లుగా వెలుగుతున్న కళ్ళనూ, తలనూ అటూ యిటూ ఊపింది.
    'సరే!'
    
                                *    *    *

    సాయంత్రం అయిదుగంటలప్పుడు త్యాగరాజు హాస్పిటల్ కు వచ్చాడు.
    సత్యవతి ఇంటికి ఆరోజు పెందరాళే వస్తూ, 'మిమ్మల్ని వారు ఆసుపత్రికి రమ్మన్నారు!' అన్నది త్యాగరాజుతో.
    'దేనికి?'
    'ఊరికినే అనుకుంటాను!'
    నాలుగుగంటలు దాటుతుండగానే చంద్రం, 'సత్యా! కాసేపు త్యాగరాజు ను పంపరాదుటే నీవు వెళ్ళి!' అన్నాడు.
    సత్యవతీ త్యాగరాజు వేసిన ప్రశ్ననే వేసింది.
    'దేనికి?'
    'ఏఁ వున్నది - కాసేపు చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తాం....మనస్సు మా వూరిచుట్టూ, మా వూరిపక్కగా పోయే కృష్ణా నది చుట్టూ పరుగెడుతోంది!' అన్నాడు చిన్నగా నవ్వి.
    'వాడు చిన్నప్పుడు మా వూరి బయట మర్రిచెట్టు క్రింద గోలీలు ఎంత అద్భుతంగా ఆడేవాడని!'
    'అఁహాఁ!....'
    'ఆఁ .... అంతేగాదు .... నీకు దయ్యాలంటే భయమా?'
    'మీకు లేదా?'
    'నాకా?.... అమ్మ బాబోయ్! .... కాని, వాడికి వీసమెత్తు గూడా భయం లేదు .... గోలీలాడే మర్రిచెట్టంటేనే - దానిమీద దయ్యలున్నయ్యని ప్రతీతి.....ఎవ్వళ్ళూ, పొద్దుగూకితే, ఆ ఛాయలకే వెళ్ళేవారు గాదు! - అటువంటిది, ఒకరోజున ఏం జరిగిందనుకున్నావ్ - ఇంట్లో వెధవపని చేశాడు వాడు - వాళ్ళ నాన్న తన్ని వాకిట్లోకి నెట్టి తలుపులేశాడు!'
    సత్యవతి ఆసక్తితో వింటుంది.
    'అర్ధరాత్రప్పుడు ఎందుకో వాళ్ళ నాన్నకు గుర్తుకు వచ్చి 'వెధవ ఏం చేస్తున్నాడో చలిలో' అని తలుపుతీసి చూస్తే ఏఁవున్నది?- వాడక్కడ వుంటేనా - ముందు వాళ్ళు కలవరపడ్డారు - ఆ తరువాత అలవాటుగా నా దగ్గరికివచ్చి పడుకున్నాడేఁవోలే అని సర్ది చెప్పుకున్నారు!'
    'అయితే ఇంతకీ మీ దగ్గరకు రానే లేదా?' అడిగింది కళ్ళు పెద్దవి చేసుకు చూస్తూ.
    'లేదు! - ఆ తరువాత తెలిసింది- తెల్లవార్లూ ఆ దయ్యాల మర్రిక్రింద కోపంతో ముడుచుకు పడుకున్నాడని!'
    సత్యవతి గుండె భయంతో కొట్టుకున్నది.
    'నిజం!'
    'అవును - నిజంగా! ఆమె చేయి పట్టుకు నొక్కుతూ అన్నాడు. 'అంతే గాదు, వాడి ఆ ధైర్యమే- నా జీవితాన్ని ఒకసారి కాపాడింది గూడా!'
    'ఎప్పుడు?'
    'నేనిలా బ్రతికి బట్టకట్ట గలిగానంటే-వాడి ప్రాణదానమే కారణం!'
    'ఏం జరిగింది?'
    '-నాకు ఈత నేర్చుకోవాలని సరదా!.....చిన్నప్పుడు నేను చాలా లావుగా బరువుగా వుండేవాడినిలే! ,,,, 'అరేయ్ చంద్రా! నీవు అసలే వో చిన్న గున్న ఏనుగుని....నీళ్ళల్లోకి దిగబోకు.....తరువాత ఏఁవైనా అయితే నిన్ను బయటకు లాక్కు రావటం చాలా కష్టం!' అని అన్నాడు....అంతేగాదు కొన్నాళ్ళు పోతే నేనే తినంగా నేర్పుతాలే - ముందు కృష్ణలో నీళ్ళు తగ్గనీయ్!' అన్నాడు!'
    'వారికి వచ్చా ఈత?'.
    'వచ్చా ఏఁవిటి? - గజ ఈతగాడయితే వాడు! - అబ్బే ..... నేను వాడిమాట వింటేనా.....అప్పుడు నాకు మరో మిత్రుడు గూడా వుండేవాడు - 'రామం' అని- వాడిని తీసుకొని దొంగచాటుగా కృష్ణ కెళ్ళాడు...అప్పుడు కృష్ణా నది వురవళ్ళు పరవళ్ళలో పారుతోందిలే!....నాకూ మనస్సులో భయం పీకుతూనే వున్నది-కానీ, అదో సరదా, కోరిక-దానికి తోడు రామంగాడి ధైర్యవచనాలు, ప్రోద్బలం - ఇంకేం బ్రిడ్జి ఎక్కాం - వాడు 'అరేయ్ చంద్రం ! బ్రిడ్జీ మీద నుండి నీళ్ళల్లోకి దూకేయ్-నీళ్ళల్లో పడటం ఆలస్యం, కాళ్ళూ చేతులూ కొట్టుకుంటయి వాటంతటవే - అదే ఈత!' అని అన్నాడు-'నాకు భయంరా' అన్నాను-'రా, వెధవా' అంటూ ఒక్క తోపు తోశాడు-అంతే నీళ్ళల్ల్లో పడ్డాను - ఆ క్షణంలోనే భయంగూడా గుండె ల్లోకి దూకింది - నీళ్ళల్లో బుడుంగు మన్నాను....ఊపిరాడదే.... కొట్టుకుందామన్నా కాళ్ళూ చేతులూ కదలవాయె ....  కళ్ళు గిర్రున తిరిగినయ్ .... ముక్కు ల్లోనూ, నోట్లోనూ నీళ్ళూ.....భయంతో 'బాబోయ్' అని పెద్దగా అరిచాను..... అంతా ఒక్కక్షణం .... ఇంతలోనే ఎక్కణ్ణించి వచ్చాడో దేఁవుడిలా వచ్చాడు .... నీళ్ళల్లోకి ఒక్కదూకు దూకి నా జుట్టు పట్టుకు బయటకు లాక్కొచ్చాడు-తారువాత నాకు తెలిసింది అప్పటికి నేను రెండు మునకలుగూడా వేశానని - ఇంకొకటి గూడా వేసివుంటే ....' చంద్రం నవ్వాడు.
    గుండె బిగపట్టుకున్నదల్లా తేలిగ్గా శ్వాస వదిలింది సత్యవతి.
    'మరి రామం ఏఁవయ్యాడు?'
    'ఇంకేఁవవుతాడు-భయంపుట్టి పారిపోయాడు!'
    - త్యాగరాజు హాస్పిటల్ లో కాలు పెట్టేటప్పటికి ఆ ప్రదేశమంతా ఎంతో నిశ్శబ్దంగానూ, గంభీరంగానూ వున్నట్లనిపించింది.
    చంద్రం త్యాగరాజును చూస్తూనే 'కూర్చో!' అన్నాడు.
    త్యాగరాజు స్టూలును మంచం దగ్గరకు లాక్కొని కూర్చున్నాడు.
    'చెప్పు!'
    'ఏఁవున్నది చెప్పేటందుకు - ఎందుకో నీ చిన్ననాటి చిలిపిపనులు గుర్తుకు వచ్చినయి-'ఖబుర్లు చెప్పుకుంటాం..... త్యాగరాజును పంపవే, సత్యా!' -అన్నాను! నవ్వాడు.
    'చిన్ననాటి ఖబుర్లు అంత చెప్పుకో దగ్గవేఁవున్నయి!'
    'పోనీయ్, ఈ నాటి ఖబుర్లేవైనా చెప్పుకుందామా?' అన్నాడు లోతుకు పోయిన కళ్ళతో త్యాగరాజు గుండెల లోతులు చూస్తూ.
    'మంచిది! కానీయ్....ఏఁవైతేనేం పొద్దుపోవటానికి!'
    ఒక సిస్టర్ హడావుడిగా పరుగెడుతున్నట్లుగా నడుస్తోంది - వాష్ బేసిన్ చేతిలో పట్టుకొని.
    చంద్రం ఒక్క క్షణమాగి, జరిగిన యిరవై నాలుగు గంటలలో ఈ హాస్పిటల్ నుండి ముగ్గుర్ని డిశ్చార్జి చేశారు!' చాలా చిన్నగా గంభీరంగా అన్నాడు.
    'నిజం!' ఉత్సాహాన్ని ప్రకటించాడు త్యాగరాజు.
    'ఎలా అని అడగవేం!'
    'ఎలా?' ఎడంకన్ను టకటకా కొట్టుకుంటుండగా అడిగాడు.
    చంద్రం నవ్వాడు.
    చాలా పేలవంగా నవ్వాడు.
    'యిద్దరిని శవాకారంలో - ఒకరిని మీకిదిగాదు....మరేదో అని పేరుపెట్టి!' అంటూనే మళ్ళీ నవ్వాడు.
    'చంద్రం!'
    చంద్రం నవ్వు ఆక్షణంలో ఏదో భూతపునవ్వులా అనిపించింది.
    త్యాగరాజు గుండెలు ఆక్రోశిస్తున్నాయి.
    ఉద్వేగంతో ముందుకు వంగాడు.
    'చంద్రా! ఏం మాటలురా అవి!' అన్నాడు విసుగ్గా నుదురు చిట్లించి.
    'నిజమే చెబుతున్నానురా. త్యాగీ!'
    'సత్యవతి ముందు గూడా ఇలాగే మాట్లాడుతుంటావా?'
    'ఉహూఁ...తల అడ్డంగా తిప్పాడు. ఇప్పుడు హింసిస్తున్నది చాలక......ఇంకా దానిని ఏడిపిస్తాననే అనుకుంటున్నావా?' జాలిగా చూస్తూ అన్నాడు.
    'నీవు ఇంత మరీ నిరాశావాదివవుతావని నేను ఎన్నడూ అనుకోలేదురా!' అన్నాడు గుండె నిబ్బరించుకుంటూ.
    'పరిస్థితులను చూస్తూ గూడా ఎక్కడినుండి తెచ్చుకోమంటావ్, ఆశలను!'
    'ఎవరి జీవితం వారిది ..... ఎవరి అదృష్టం వారిది......మరొకరితో నిన్నెందుకు పోల్చుకుంటావ్?'
    చంద్రం ఒక్కక్షణం కళ్ళు మూసుకు పడుకున్నాడు.
    తరువాత కొద్ది క్షణాలకు, కళ్ళు తెరవకుండానే, 'ఈ మాటలన్నీ ఎందుకు- నీతో కొన్ని ముఖ్యవిషయాలు మాట్లాడాలి ... అందుకే పిలిపించాను గూడా!' అన్నాడు.
    'అలాగే అనుకున్నాను....చెప్పు!'
    చంద్రం ఏదో చెప్పేందుకన్నట్లుగా నోరు తెరవబోయాడు.
    ఇంతలోనే అతడిని అడ్డగిస్తున్నట్లుగా- 'నన్ను ఏడిపించవుగదా?' అడిగాడు ముడతలుపడ్డ అతడి మొఖంలోకి విచలితుడయి చూస్తూ.
    'అది నీ గుండె గట్టి తనం మీద ఆధార పడి వుంటుందిరా, త్యాగీ!!' నవ్వాడు చంద్రం, కళ్ళు తెరిచి ప్రేమగా స్నేహితుడి కళ్ళల్లోకి చోసోతూ.
    త్యాగరాజు మాట్లాడలేదు.
    ఎందుకైనా సిద్ధపడేందుకు అన్నట్లుగా గుండె బిగపట్టుకు కూర్చున్నాడు.
    'సత్యవతిముందు జీవితం గురించే నేను మాట్లాడబోయేది!'
    'చంద్రా-' పెద్దగా అరుస్తున్నట్లుగా అన్నాడు త్యాగరాజు.
    'ఆవేశపడబోకురా, త్యాగీ! .... ఇప్పుడు ఇప్పుడు ఆవేశపడ్డావో...తరువాత నిప్పుమీద నీళ్ళు చల్లినట్లుగా చప్పబడిపోవాల్సి వుంటుంది.....ఎంతో బాధపడతావు గూడా!' నవ్వాడు.
    'నేను విననురా....వినను....నీవు వేయి చెప్పు....లక్ష చెప్పు.....నేను నీకు హామీ యిస్తున్నానురా...నీవు లక్షణంగా సంపూర్ణ ఆరోగ్యంతో బయిటకు వస్తావ్!' విసురుగాను, దృఢంగానూ అన్నాడు.
    'ఒక్కటిమాత్రం గుర్తుంచుకో - నీవు భగవంతుడివి గౌదురా, త్యాగీ!' అన్నాడు తృప్తిగా మిత్రుడి మొఖంలోకి చూస్తూ - అతడి చేతిమీద నిమరసాగాడు.
    త్యాగరాజుకు అతడికి ఎలా సర్దిచెప్పాలో అర్హం కాలేదు.
    'నిజాన్ని భగవంతుడే చెప్పనక్కరలేదు!" అన్నాడు గొంతు తగ్గించి-మొఖాన గంటుపెట్టుకుని!
    'కాని మానవులు చెప్పే మాటలమీద నాకు అంత నమ్మకం లేదురా!' తిరిగి నిర్లిప్తంగా అన్నాడు చంద్రం.    
    '-అయితే నీ మాటలు - మాననంటావ్!'
    'ఎలా మానమంటావ్?'
    'నా మాటలు విననప్పుడు నేను దేనికి ఇక్కడ?' చర్రున లేస్తూ అన్నాడు. 'అంతేకాదు, ఇలాంటిమాటలు చెప్పటానికే అయితే ఇంకెప్పుడూ నన్ను పిలువబోకు!' అన్నాడు చాలా కష్టంగా.        
    నిలబడ్డ త్య్గాగరాజును చూస్తూ చంద్రం చిన్నగా నవ్వి కళ్ళు రెపరెప లాడించాడు.
    'సత్యవతి చాలా చిన్నపిల్ల, అమాయకురాలు గూడా .... దానిముందు జీవిత మంతా నీమీదే ఆధారపడి వుంటుందిరా, త్యాగీ!.... సాగర్ లో మా యింట్లో నా పెట్టెలో ఇరవై వేలు విలువ చేసే ఇన్సూరెన్స్ పాలసీలు వున్నాయి...'
    -విసురుగా, దుమారంలాగా బయిటకు వచ్చేశాడు త్యాగరాజు.
    'చంద్రానికి ఎంతచెప్పినా బుద్ది లేదు-వట్టి వెధవ.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS