Previous Page Next Page 
జీవన సంగీతం పేజి 16

   
    'నీ పాపపు పని బయటపెట్టారు.' వికటంగా అరిచింది.
    అరవదూ? అన్నయ్యను ప్రేమిస్తున్నానిప్పులాంటి మనిషి రత్న. రత్న నా క్లాస్ మేట్. ప్రాణస్నేహితురాలు. వాళ్ళది సిటీకి సమీపంలోనే ఓ గ్రామం. తల్లికి ఒక్కగానొక్క బిడ్డ. తండ్రి లేడు. మంచి స్థితిపరులు. తల్లి పల్లెలోనే ఉంటూంది. రత్న ఇక్కడే స్వంత ఇంటిలో ఉంటూ చదువు సాగిస్తూంది.    
    రత్నకు నామీద ఎంతటి అభిమాన స్నేహవాత్సల్యాలు ఉన్నా నేను చేసిన పని క్షమించదని నాకు తెలుసు.
    'ఇంతటి తుచ్చపు పనిచేయడానికి నీకేం ఖర్మ వచ్చిందే? ఆమాత్రం నిగ్రహం లేకపోతే మీవాళ్ళు పెళ్ళి చేయలేకపోయారా? ఇంత నీచాని కెందుకు పాల్పడ్డావు?'
    రత్నముందు నేరస్థురాలివలె తల వాల్చడం తప్ప, నా తప్పు సమర్ధించుకోగల శక్తి నాకు లేదు.
    'ఇది బయటపడితే నీ కుటుంబానికి ఎంత తల వంపు! నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తూన్న మీ అన్నయ్య ఏమనుకొంటాడు? ఛీ, ఛీ! ఎందుకు బతకాలి ఇలాంటి నీచపు బతుకు?' ఛీత్కారంచేసి చరాలున వెళ్ళిపోయింది రత్న.
    'అవును. ఎందుకు బతకాలి. అందరికీ తలవంపులు తెచ్చే బ్రతుకు?' అనుకొన్నాను.
    నా కిషన్ పోయినప్పుడే నాకు జీవితేచ్చ పోయింది. ఎవరికోసం బ్రతకాలి? ఇది అన్నయ్యకు తెలిస్తే ఎంత బాధ పడతాడు! ఆ నిష్కళంక ప్రేమమూర్తి ముందు తల ఎత్తుకోగలవా? వృద్ధాప్యంలో అడుగుపెట్టిన తల్లిదండ్రులు! కూతురి ప్రయోజకత్వం బయట పడితే వారి గుండెల్లో దావాగ్ని రగులుతుందనడంలో సందేహం లేదు! ఈ మచ్చతో వారి జీవితాలు నిలవడమే కష్టం!'
    లేని సత్తువ తెచ్చుకొన్నాను. పెరటి నూతి దగ్గిరికి నడిచాను. నడుముకు కొంగు బిగించాను. రత్న పరుగున వచ్చి నా చెయ్యి గట్టిగా పట్టుకొంది.
    'రూపా!' గర్జించింది. 'ఇటువంటి పని ఏదో చేస్తావనే తిరిగి వచ్చాను. అనుకొన్నంత పనీ జరిగింది.'
    నీరసంగా మూలిగి అసహాయంగా చూశాను రత్న ముఖంలోకి.
    'ఏమిటి ఈ సాహసం, రూపా?' అనునయంగా, ఆవేశంగా అంది రత్న. 'తప్పు చేశావు; శిక్ష అనుభవించడం నీవంతు. కాని, అందుకు ఇతరుల్ని బలిచెయ్యడానికి నీకేం హక్కుంది? నీ దారిని నువ్వు పోయినట్లా? వృద్దులైన నీ తల్లిదండ్రులకు అంత్యకాలంలో కడుపు శోకం పెట్టినదానివి కాదూ? నీ మరణం నీ అన్నయ్యని పిచ్చెత్తిస్తుందనడంలో సందేహం లేదు.'
    'నాకింతకంటే మార్గాంతరం లేదు, రత్నా. బ్రతికి ఉండి వారికి తలవంపులు తెచ్చేకన్నా నేను వారికి ప్రసాదించబోయే దుఃఖం ఎక్కువ బరువు కాదు. నన్ను వదిలెయ్యి రత్నా, వదిలెయ్యి!'
    'అహఁ వదలను. నిన్నూ వదలను; వాణ్ణి వదలను. అసలు సంగతి చెప్పు. వాడెవడు? ముక్కుపట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించి మూడు ముళ్ళు వేయించేదాకా విశ్రాంతి తీసుకోను.' భీషణ ప్రతిజ్ఞ చేసింది.
    'నీవంటి స్నేహితురాలిని కలిగి ఉన్నందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. కాని నేనంతటి అదృష్టానికి నోచుకోలేదు, రత్నా, నువ్వు అతణ్ణి తీసుకురాలేవు.' విరక్తిగా నవ్వాను.
    'హుఁ! అంతటి మొనగాడా! అదీ చూస్తాను.' మగవాడయిఉంటే మీసాలమీదికి చేతులు పోయేవి. నవ్వు వచ్చింది రత్న అనుమానానికీ, ఆత్మవిశ్వాసానికీ,
    'ముందు నువ్వు ఇంట్లోకి పద.' బలవంతంగా నన్ను ఇంట్లోకి ఈడ్చుకుపోయింది. మంచంమీద కూలవేసి, 'ఇక చెప్పు, అతడెవరు?' అని అడిగింది సూటిగా, నా ముఖంలోకి గుచ్చి చూస్తూ.
    ఇన్నాళ్ళు దాచుకొన్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకొంది. 'రత్నా' అంటూ కౌగలించుకొని వలవలా ఏడిచాను. 'అతడెవరైనా, ఎక్కడ ఉన్నాడని చెప్పను?'
    'ఈ లోకంలో ఎక్కడ ఉన్నా సరే వెదికి...'
    'లోకంలో ఉంటే ఈ సమస్యే వచ్చేది కాదు.' విషాదంగా నిట్టూర్చాను.
    కిషన్ వృత్తాంతం విని ప్రాణం లేనిదానిలాగా కాస్సేపు కుర్చీలో కూలబడిపోయింది రత్న.
    'ఇంతటి అభాగ్యురాలి వనుకోలేదు.' గద్గదంగా అంది, నీళ్ళు నిండిన కళ్ళతో నాకేసి చూస్తూ. 'పూల బాట కావలసిన నీ జీవితంలో దైవమే నిప్పులు పోశాడు. దానికి ఎవరేం చెయ్యగలరు?'
    'అందుకే నన్ను నా నిశ్చయానికి వదిలెయ్యి!' జాలిగా ప్రార్దించాను.
    'రూపా, తిరిగి ఆ మాట అనకే.' రత్న బేలగా నన్ను కౌగలించుకొని ఏడవసాగింది. అవును. దానికి నామీద అంత ప్రేమ! మా స్నేహం అంత బలవత్తరమైనది. 'నువ్వు ప్రాణం తీసుకుంటే ఇవతల ఎవరి ప్రాణాలూ నిలవవు. అందరూ ఏ నిద్రమాత్రలో మింగి నిన్ను చేరుతారు.'
    'మరి నా పరిస్థితి ఎలాంటిదో ఆలోచించు.'
    'ఆలోచిస్తున్నాను.' రత్న కొంచెం సేపాగి అంది: 'మందు తీసుకో.'
    దెబ్బతిన్న పాములా సుళ్ళు తిరిగిపోయింది నా హృదయం. 'అసంభవం!' ఆవేశంగా అన్నాను. 'చస్తే సంతోషంగా చస్తానుగాని ఆ పని చెయ్యను.'
    'అయితే, బిడ్డను కని పెంచుతావా?' కోపంగా అడిగింది.
    '...............................'
    పసిబిడ్డకు బుద్ధి చెప్పుతున్నట్లు అంది రత్న: 'అంతకంటే అందరికి ఇంత విషం సప్లయి చేసి నువ్వింత తిని చావు! కాని అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మనస్సు రాయి చేసుకో, చెప్పినట్లు విను. కొన్నాళ్ళలో జరిగిన గాథ మాసిపోతుంది. ఆపైన నీ తల్లిదండ్రులు నిశ్చయించిన వరుణ్ణి అంగీకరించి సంసారంలో పడిపో. డాక్టరుతో మాట్లాడి కుదుర్చుకువస్తాను' అంటూ లేచింది.
    రత్నను పట్టుకొని హృదయవిదారకంగా విలపించాను. 'దయచేసి ఆ పనిమాత్రం చెయ్యకు నీ కాళ్ళు పట్టుకొంటాను. నా కిషన్ కు ప్రతిబింబంగా, అతడికి స్మృతిచిహ్నంగా నా గర్భంలో పెరుగుతూన్న చిన్నపాపను లోకం చూడకముందే కసాయి హృదయంతో రూపు మాపలేను. ఆ పని నావల్ల సాధ్యం కాదు.'
    'స్మృతులకోసం పాకులాడితే నీ జీవితం నాశన మౌతుంది, రూపా, సాధ్యమైనంత మటుకు ఆ సంఘటనలు విస్మరించడానికే నువ్వు ప్రయత్నించాలి.'
    'నా జీవితం ఏనాడో నాశనమైంది. ఈ ఒక్క ఆశనూ చిగురు పెట్టకుండా నాశనం చెయ్యడానికి ప్రయత్నించకు.' చేతులు జోడించి అర్ధించాను, దీనంగా.
    'సరే!' కర్తవ్యనిష్ఠతో రత్నముఖం గంభీరమైంది. 'కాని ఒక షరతు. బిడ్డ ను కనగానే బిడ్డను త్యజించ డానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. నువ్విందుకు ఒప్పుకుంటే అంతవరకూ నిన్ను కంటికి రెప్పలా కాపాడతానని మాట ఇస్తాను.'
    ఆలోచించాను. చచ్చి నావారిని దుఃఖంలో ముంచి పోవడంకన్నా, బతికి ఉండి నావారికి తలవంపులు తెచ్చేకన్నా, గర్భవిచ్చిత్తి ప్రయత్నంకన్నా రత్న చూసిన మార్గం హాయిగా ఉంది. ఎక్కడ పెరిగినా నా కిషన్ కు ప్రతిరూపం ఈ లోకంలో నిలిస్తే చాలు.
    'నన్ను కరుణించి నా జీవితానికి వరం ఇవ్వడానికి వచ్చిన దేవతవు, రత్నా' అన్నాను రత్న భుజాలు పట్టి ఊపుతూ.
    'రెండు నెలలవరకు నీ రహస్యం దాచడానికి ప్రయాసపడ నక్కరలేదు. ఈ రెండునెలల్లో పరీక్షలుకూడా అయిపోతాయి. తరవాత నాలుగు నెలలు. ఊళ్ళు చూడాలన్న నెపంతో నిన్ను ఇక్కడనుండి తీసుకువెళతాను.' కార్యక్రమం వివరించింది రత్న.

                            *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS