"మెన్షన్ నాట్...నీ ఫోన్ ని మాత్రం అబ్ జర్ వేషన్ లో వుంచేసుకో" అన్నాడు ముందు జాగ్రత్తగా అమితేష్.
"సరే! ఆ డిపార్ట్ మెంట్ లో మన నిఖిల్ కు తెల్సిన ఒకావిడ వుంది. ఆమె ద్వారా తెలుసుకుంటాను. ఈలోగా నువ్వు ప్రింట్స్ చేసిపెట్టు..." అన్నాడు భార్గవ కరస్పర్శ చేస్తూ.
"ఓకే...సీయూ" అన్నాడు అమితేష్.
5
మరోరోజు__
నిర్లిప్త ఆరోజు నిర్లిప్తంగా వుంది. మొహంలో వుట్టిపడుతున్న తెలీని బాధ ఎంత కప్పిపుచ్చుకున్నా.... దుఃఖాన్ని గొంతు దాటి రాకుండా వుంచటం వల్లనేమో దవడలు పీక్కుపోతున్నాయి.
"ఆడది కోరుకునే వరాలు రెండే రెండూ...ఒకటి పచ్చని సంసారం, రెండు వెచ్చని సంతానం..." రేడియో గొంతు నులుముతున్నట్టు బొంగురుగా అరిగి , తిరిగి తిరిగి పాడుతోంది. ఆ గ్రామ్ ఫోన్ రికార్డ్ పిన్ను నిర్లిప్త గుండెల్లో గుచ్చుతున్నట్లు...ఆమె గొంతులో రాగమేదో సమాధియై ఆ బాధకు కన్నీళ్లు ఉబుకుతున్నాయి.
ఒకప్పుడు అదే పాట...
కాలేజీలో పాడి ఫస్ట్ ప్రయిజ్ కొట్టుకొచ్చినప్పుడు ఫ్రెండ్సంతా ఎంతలా ఏడ్పించారు?
"నువ్ కూడా అవే రెండు వరాలు కోరుకుంటున్నావా?" అని....
"ఏ ఆడదైనా యింకేం కోరుకుంటుంది?" తరతరాల పురాణ స్త్రీల ప్రాతివత్యాన్ని పుణికిపుచ్చుకున్నట్లు తన జవాబు.
కానీ ఆ రెండవ వరమిప్పుడు శాపమైనట్లు...
ఈ ప్రపంచంలో మూడు సెకన్ లకు ఒకడు పుడుతున్నప్పుడు....కనేవాళ్ళంతా పిల్లల కోడిలా యింకా యింకా కంటూనే వున్నప్పుడు....వెయ్యేళ్ళు తపస్వినిలా ఎదురు చూస్తున్న తనకు...?
ఎలా పుడతారు?
ఈడ్చుకెళ్ళి శిలువేసినట్లు నిర్దయ నిండిన జవాబు!!
అవును! ఇంకెలా పుడతారు? కాళ్ళ పారాణి ఆరకముందే...మాతృపేగును కత్తెర్లతో కత్తిరించినపుడు ....కన్నె వయసులోనే జానెడు కడుపును సీజర్లతో చీల్చి చెండాడినపుడు....
కట్నం ఎక్కువొస్తున్న పేరాశతో వాడి కర్కశ గుండెను తన కన్నీళ్ళతో కదిపినా చలించలేదే...? మగ బిడ్డకు తండ్రై వుండి....భార్యపోతే పిల్లల్ని సాకడానికి ఆడది తోడు కావాలన్న దగుల్భాజీ...కట్నం వస్తున్న మరో సంబంధాన్ని కాలదన్నుకోలేక...
ఆనాడు ఆడది కన్యాశుల్కం తీసుకున్న పాపానికి నేడు మగాడు వరకట్నం వరించటంలో తప్పేముందని... ఆత్మ చుట్టూ బుల్లెట్ ఫ్రూఫ్ కవచాలు తొడుక్కొని ఎంత బాగా సమర్ధించుకుని కట్న కాసుల వైపు పరుగెత్తాడు.
ఎంతటి ముళ్ళ చెట్టునయినా_అల్లుకునే ఆప్యాయత దేనికుంటుంది?
ఒక్క పందిరికి తప్ప!!
తన కోసం మమతల సమతలాలతో జీవితాన్ని పేర్చుకున్న నిఖిల్ మనస్సుకు మల్లెతీగకంటే గాఢంగా హత్తుకొని-విడదీయరానంత గజిబిజిగా అల్లుకుపోయింది. ఏ కరినాగులూ చొరలేనంతగా!!
నిర్లిప్త ఆలోచిస్తూనే వుంది....పరిపరి విధాలా. కానీ నిర్లిప్తకు తెలీదు....
పందిరి కన్పించనంతగా అల్లుకుపోయిన ఆ మల్లెపొద సౌందర్యమో, అది వెదజల్లుతున్న సౌరభమో...మొత్తానికి ఆకర్షణలోపడిన ఓ కరినాగుకు ఆ రెంటి మధ్య చొరబడాలనే ఆశ....ఆశను బలవంతంగా అణిచిపెట్టుకుంటున్న నిరాశ....
స్త్రీ స్పర్శను జీవితాంతం అనుభవించలేని ఆ కరినాగు శ్వాస బుసలు కొట్టకపోయినా....అంతరాల్లో ఉబికి వస్తున్న విషాన్ని గరళంలో ఆపేసినట్లు....నిశ్చలమై నిర్లిప్తనే చూస్తుండిపోతుంది.
అది మానవత్వం కాదని ఆత్మ ఘోషించినా...నిర్లిప్తపట్ల ఏదో తెలియని ఆరాటం. ఆ ఆరాట పోరాట సందిగ్ధ స్థితుల్లోనే అప్పుడప్పుడు ఆ మల్లెపందిరి దగ్గరకు వస్తూనే వుంటుంది.
తలుపు దగ్గర చప్పుడవటంతో__
నిర్లిప్త చటుక్కున లేచింది.
కొంగు నిండారుగా సర్దుకుంటూ..."రండన్నయ్యా! బాబీ రాలేదా?" అంది. భార్గవ లోపలికి వచ్చాడు.
"నిర్లిప్తా! నిఖిల్ లేడా?" అన్నాడు వరండాలో కూర్చుంటూ.
"స్నానం చేస్తున్నారు. వస్తారు వుండండి. కాఫీ కలుపుకొస్తాను" అంది వంటింట్లోకి వెళ్తూ.
కొద్దిసేపటి తర్వాత నిర్లిప్త తెల్లని నడుం చుట్టూ చల్లని చేయిపాకింది. కాఫీలో షుగర్ కలుపుతున్న ఆమె కెవ్వున అరవబోయి....
"బయట మీ ఫ్రెండున్నాడు. వంటింట్లో ఈ చేష్టలేమిటి?" అంది నిఖిల్ చేతిని విడిపించుకుంటూ. అతని పాలరాతి లాంటి శరీరం నిండా దట్టమయిన వెంట్రుకలు...వాటి మధ్య చిక్కుకున్న నీటి బిందువులు నిర్లిప్త వెనుకభాగాన్ని అక్కడక్కడా తడిపేయి. నడుం చుట్టూ టవల్ తప్ప మరే ఆచ్చాదనా లేదు నిఖిల్ కు.
"వొద్దండీ.....ప్లీజ్..." అంటూనే అతని ముఖాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకోబోయి మరోసారి కెవ్వున అరిచింది. అతని జుట్టునిండా సబ్బు నురుగు మొహాన్ని కూడా సగం కప్పేసింది.
"పుడుతూనే కేర్ కేర్ మని పుట్టక....కెవ్ కెవ్ మని పుట్టావా ఏమిటి? నాకు తలంటాలి. అర్జంటుగా బాత్రూంలోకి పద. కాఫీ నేను భార్గవకు ఇచ్చి వస్తాను" అన్నాడు నిఖిల్ కళ్ళు మూసుకునే.
"ఈ వేషంలో వెళ్తారా?" అంది నవ్వుతూ.
"వెళితేనేం? వాడు పరాయివాడు కాదు. కాఫీలో కాస్త సబ్బు నురగ కూడా వేస్తే పాలు ఎక్కువయ్యాయి అని కూడా అనుకుంటాడు" అన్నాడు కప్పు తీసుకెళ్ళి భార్గవకు ఇచ్చి వేస్తూనే.
"బాత్రూంలోకెళితే అరగంట వరకూ రానిస్తాడా? వూహు....నేను రాను" అంది నిర్లిప్త నిఖిల్ చెవిలో గుసగుసగా.
