మీ రాయనకు నిజంగా సలహా నిచ్చేరా?"
"ఇచ్చాను-నెల్లాళ్ళ క్రితం ఆయన చెప్పింది విని-సలహా ఇమ్మని బలవంత పెడుతూంటే-నాకు తోచింది చెప్పాను. అందువల్ల నిజంగానే లక్షల్లో లాభించిందంటే నా కాశ్చర్యంగా ఉంది. ఆయన మాటలు నమ్మతగ్గవిగా లేవు...."
"మీ కాయన అబద్దమెందుకు చెబుతాడు?"
"ఎంహుకంతే నాలో నా శక్తిమీద నమ్మకం పెరగాలి ఆశ పుట్టాలి. అందుకోసం నాకు లేని తెలివినీ, శక్తినీ అంటగట్టవచ్చు. నన్ను తన పార్ట్నర్ గా చేసుకోవాలని ఆయన కోరిక...."
"ఎందుకు? ఆయనకు వేరే మనుషులు దొరకరా?-...."
"దొరుకుతారు కానీ నిజాయితీపరులు కావాలాయనకు. తెలివితేటలు, చురుకుతనం, వ్యాపారదక్షత ఉన్న నాలాంటి మొహమాటస్థులాయన కాదర్శం. ఆయన పదిలక్షలు లాభం తీసి నా వాటాకు లక్ష రూపాయలే యిచ్చినా నా కది తృప్తినీ యిస్తుంది-ప్రతిఘటించాలనీ అనిపించదు. అందుకే ఆయన నా కోసం చూస్తున్నాడు-"
"మీ గురించి ఆయనకెలా తెలుసు?"
"అదే వ్యాపార లక్షణం. ఆయనకు నా గురించి-నీ కంటే యెక్కువ తెలుసు-...." అన్నాడు సుబ్బారావు.
"అయితే ఆయనతో కలిస్తే ఏం?"
"కలవచ్చు. కానీ నాది సైన్సు బుర్ర నాకు సైన్సు తోనే ముడివేసి ఉండాలనుంది. డబ్బుకోసం సైన్సు వదిలిపెట్టలేను-" అన్నాడు సుబ్బారావు.
డిటెక్టివ్ వెంకన్న ఆ కాగితాలు చదివి తెలుసుకున్న విశేషాలివి. దాన్నిబట్టి అతడికి కొన్ని విషయాలర్దమయ్యాయి.
సుబ్బారావు తన ఉద్యోగానికి అంకితమైన మనిషి, డబ్బు కూడా అతణ్ణి ఉద్యోగం నుంచి వేరుచేయలేదు. పరిశోధనల ద్వారా అతడంతో యింతో పేరు గడించాడు. ఎవరయినా డబ్బాశ పెట్టి అతడి పరిశోధనలను వక్రమార్గం పట్టించాలనుకుంటే అతడంగీకరించే తరహా కాదు.
ప్రవీణ్ కుమర్ కి అతడి పరిశోధనలపై ఆసక్తి ఉంది. అతడెవరో-ఎలాంటి వాడో తెలుసుకోవాలి. అతఃడికి సుబ్బారావును హత్యచేసే అవకాశముంది. సుబ్బారావు కనిపెట్టిన విశేషం వల్ల అతడేదో ప్రయోజనం పొందాడని వసంత చెబుతోంది. ముందుగా అదేమిటో తెలుసుకోవాలి.
రెండు మృణాళిని. ఆమె మాటలను వసంత సీరియస్ గా తీసుకొకపోయి ఉండవచ్చు. కానీ మృణాళిని తెలివైనది కావచ్చు. తన మాటలను వసంత భర్తకు చేర వేస్తుందని ఆమెకు తెలుసు. అందువల్ల సుబ్బారావు కు తనపై ఆకర్షణ పుట్టవచ్చుననీ ఆమెకు తెలుసు. సుబ్బారావు భార్యవద్ద విషయాన్ని తేలికగా తీసుకున్నట్లు నటించినా-అతఃడు మృణాళిని కోసం ప్రయత్నించి ఉండవచ్చు. ఆ ప్రయత్నాలనామె భర్త తెలుసుకుని ఉంటే-అంతే సంగతులు! సుబ్బారావు మృణాళిని భర్త గురించి కొంత సమాచారం సేకరించి ఉంచాడు. మృణాళిని భర్త కతన్ని హత్యచేసే అవకాశముంది.
ఇక మిగిలింది లక్ష్మీనారాయణ బిజినెస్ పార్ట్నర్ గా చేరనంత మాత్రాన ఏ వ్యాపారస్థుడూ-ఒక వ్యక్తిని హత్య చేయాలనుకోడు. లక్ష్మీనారాయణ సుబ్బారావును హత్య చేయాలనుకుంటే అందుకింకా బలమైన కారణం మరేదో ఉండివుంటుంది. అదేమిటో తెలుసుకోవాలి.
మొత్తంమీద సుబ్బారావు-చిత్రమైన మనిషిలాగే ఉన్నాడు. అతడు శ్రద్దగా పరిశోధనలు చేస్తున్నాడు. అమ్మాయిల నాకర్షిస్తున్నాడు. వ్యాపారుల నూరిస్తున్నాడు. వీటన్నింటినీ కలిపి చూస్తే!
"ఆఫీసులో-సుబ్బారావు శీలం గురించి విచారించాలి-" అనుకున్నాడు వెంకన్న.
4
సెంట్రల్ గవర్నమెంటు లాబరేటరీలో వెంకన్న అనుచరులు సేకరించిన సమాచారం ప్రకారం సుబ్బారావు ప్రవర్తన చిత్రమైనది. అతడిగురించి అందరూ తలోరకంగానూ చెప్పారు. కొందరతడు కోపిష్టి అన్నారు. కొందరతడు మహాశాంత పురుషుడన్నారు. కొందరతడు గర్విష్టి అన్నారు. కొందరతడి కున్న వినయం ఆదర్శ ప్రాయమన్నారు. కోందరతడు ముభావం మనిషంటే మరికొందరతడు వాగుడుకాయన్నారు. కొందరతడు భక్తిపరుడంటే మరికొందరతడు కులాసా పురుషుడన్నారు. ఎక్కువ మంది అమ్మాయిలతడంటే సదభిప్రాయం వ్యక్తపరిస్తే ఇద్దరమ్మాయిలు మాత్రం మరోలా చెప్పారు. ఒకమ్మాయి తన కతడి చూపులు నచ్చవంది. మరో అమ్మాయి అతడు తన చేయి పట్టుకున్నాడని కూడా చెప్పింది.
ఈ సమాచారం సేకరించడానికి వెంకన్న అనుచరులు తమ తెలివితేటల్నుపయోగించాల్సి వచ్చింది. అందరూ అంత సులభంగా తను భావాలు బైటపెట్టరు. అవతలి వ్యక్తి పోలీసుల మనిషి కాదన్న నమ్మకం వారిలో కలగాలి.
వెంకన్న వారినభినందించి బయటి సమాచారం కూడా సేకరించమన్నాడు.
అప్పటివరకూ అతడు సేకరించిన సమాచారంలో అతి ముఖ్యమైనది-సుబ్బారావు చనిపోయే ముందు-ఆఫీసులో అతణ్ణి కలుసుకుందుకో బయటి వ్యక్తి వచ్చాడు. విజిటర్స్ బుక్ లో అతడు తన పేరు శ్రీకాంత్ అని వ్రాశాడు. అతడు కలుసుకున్న సమయం మూడుగంటలు. ఆ సమయంలో అతఃడు సుబ్బారావుతో కలిసి టీ త్రాగాడు. టీ తాగేముందు శ్రీకాంత్-మధుమూర్తివద్ద పనిచేసే లాబొరేటరీ అసిస్టెంటు సుధాకర్ ని కూడా కలుసుకున్నాడు.
వెంకన్న తన అనుచరులకు సూచనలిచ్చి-శ్రీకాంత్ వివరాలు సేకరించుకున్నాడు.
వాళ్ళాపనిలో ఉండగా అతడు తనకు తెలిసిన సమాచారాన్నీ మననం చేసుకోసాగాడు. దాన్నిబట్టి సుబ్బారావు గురించి వెంకన్న కొంత ఊహించాడు.
సుబ్బారావు చురకయినవాడు. కులాసాపురుషుడు. అన్నింటికీ మించి ఎవరిదగ్గ రెలా మసలాలో తెలిసిన లౌక్యుడు. అతడి గురించి చెప్పినవారిలో అతణ్ణి నిందించినవారు, అతడి గురించి చెడ్డగా చెప్పినవారు తక్కువ. కొందరతన్ని ముభావంగా ఉంటాడన్నారు. కొందరు వాగుడుకాయన్నారు. అంటే సుబ్బారావందరి దగ్గరా అతిగా వాగడు కానీ బాగా వాగే అలవాటుంది.
ఇలాంటి వ్యక్తికి పెద్ద పెద్ద పరిచయాలుంటాయి. అంతా అతణ్ణి ఉపయోగించాలనుకుంటారు. తన పరిశోధనల గురించి యితరులెవ్వరికీ చెప్పడని సుబ్బారావు భార్య వసంత అంది. కానీ అసలు విషయమామెకు తెలిసుండక పోవచ్చు. భార్యతో సైన్సు మాట్లాడే పెద్దమనిషి- మరెందరితోనో ఆ విషయం మాట్లాడుతూంటాడని ఊహించవచ్చు. మనిషి వాగుడుకాయ కాకుండా ఉండాలిగానీ-ఉంటే తన గురించి ప్రచారం చేసుకోకుండా ఉండలేడు. సుబ్బారావు తన పరిశోధనల గురించి ఇతఃరులతో మాట్లాడుతూంటాడనడానికి సాక్ష్యం-ప్రవీణ్ కుమార్. ఆ ప్రవీణ్ కుమారెవరో వసంతక్కూడా సరిగ్గా తెలియదు. అంటే వారిద్దరికీ పరిచయం ఇంటిబయటే జరిగుండాలి. ప్రవీణ్ కుమార్ పేరుతో లేబరేటరీలో ఉద్యోగులెవ్వరూ లేరు. ప్రవీణ్ కుమార్ వంటి వారింకా యెందరున్నారో తెలుసుకోవాలి. అలాంటివారెవరో అతడినంతంచేసి ఉండాలి.
వెంకన్న ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడంటే అందుక్కారణముంది. లాబరేటరీలో సుబ్బారావు చేస్తున్న ప్రయోగాల గురించి అతడు విచారించాడు. అవి చాలా మామూలు పరిశోధనలు. నేరస్థులతో పరిచయ ముండే పరిశోధనలు కావవి. నేరస్థులకు సంబంధించినవి కూడా కావు.
