Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 15

 

                          తను తవ్విన గొయ్యి
                
                                                                      వసుంధర

    అ ప్రేమ జంట పార్కులో ఓ క్రోటన్స్ మొక్కకు  పక్కగా కూర్చుని వున్నారు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్న పద్దతి చూస్తుంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలైనా ఇచ్చుకుంటారా అనిపిస్తుంది.
    ఆమె వయస్సు ఇరవై దాటదు. మనిషి నిస్సందేహంగా అందగత్తె. కళ్ళలో ఆహ్వానమున్నది. ఆ ఆహ్వానం అతడికేనని తెలుస్తున్నది.
    "లీలా! నీ పరిచయం నా అదృష్టం --" అన్నాడతను.
    లీల మనిహరంగా నవ్వి -- "నన్ను గురించి నేనూ అలాగే అనుకుంటున్నాను -- " అన్నది.
    "ఇంకా అదృష్టం --" అన్నాడతను.
    "నేను అందరి లాంటి అడదాన్నీ కాను. నిన్ను చూసీ చూడగానే నాలో ప్రేమ పుట్టింది. నీతో జీవితం గడపాలనిపించింది. నాకు డబ్బుకి లోటు లేదు. అయినప్పటికీ నా జాగ్రత్త కోసం నేను డబ్బు తీసుకుంటాను -- అన్నది లీల.
    "నీ షరతులు కూడా నాకు వచ్చాయి --" అన్నడతను.
    "థాంక్స్ !' అని నవ్వింది లీల -- "మిష్టర్ సుగుణ్ ! ఈ ప్రపంచంలో పురుషుడికి స్త్రీ అవసర మెంతో స్త్రీ పురుషుడి అవసరమూ అంతగా వున్నది. అయితే పురుషుడికి ఆవేశం ఎక్కువ. ప్రపంచ విశేషాల్లో అతడు ప్రజ్ఞావంతుడు కావచ్చు. ఆలోచనాపరుడు కావచ్చు. స్త్రీ విషయం వచ్చేసరికి అతడి ప్రజ్ఞా , ఆలోచన పని చేయవు. మనిద్దరం మాట్లాడుతున్నప్పుడు నేను నిన్ను గమనించాను. నువ్వు మైకంలో వున్నావు. ఊహాలోకాల్లో తేలిపోతున్నావు ఊహ లోకాల్లో నువ్వే మేమీ చేశావో ఏమేమీ ఊహించుకున్నావో  అన్నీ నిజం చేస్తాను. కానీ ఒక్కసారి మైకం లోంచి బయట పడి నేను చెప్పేది శ్రద్దగా విను --"
    "అన్నీ శ్రద్దగా విన్నాను. నీ తృప్తి కోసం మళ్ళీ వింటాను. చెప్పు!" అన్నాడు సుగుణ్.
    "నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను - " అన్నది లీల.
    "థాంక్స్ !" అన్నాడు సుగుణ్.
    "పెళ్ళి గురించి నిన్ను అందరు ఆడవాళ్ళలా తాళి కట్టమని గానీ, రిజిష్ట్రాఫీసుకు తీసుకు వెళ్ళమని గాని బాధించను. మనిద్ద్దరం కలిసి వుంటాం. ఒకరికొకరు నమ్ముకుంటాం. ఆ నమ్మకం ఉన్నంత కాలం భార్య భర్తలం లేని రోజున విదిపోతాం . నా మటుకు నాకు మనం శాశ్వతంగా కలిసి ఉంటామని నమ్మకం ఉన్నది అన్నది లీల.     
    "నాకూ ఉంది - " అన్నాడు సుగుణ్.
    "ఎటొచ్చీ మనం కలిసి ఉండడం ప్రారంభించిన రోజు నుంచీ నీవు నాకు మొదటి నెల రోజుకు వంద రూపాయల చొప్పున జీతంగా ఇవ్వాలి. రెండవ నెలలో రోజుకు డెబ్బై అయిదు రూపాయలు. మూడవ నెల యాభై. నాల్గవ నెల పాతిక, ఆ తర్వాత నుంచీ నీవు నాకు జీతం ఇవ్వనవసరం లేదు-"
    "చాలా బాగుంది -" అన్నాడు సుగుణ్.
    "ఏ నెల జీతం ఆ నెల ఆరంభంలోనే అడ్వాన్స్ గా ఇవ్వాలి- "
    "మొత్తం నాలుగు నెలల జీతమూ ఒక్కసారే అడ్వాన్స్ గా ఇస్తాను...."
    "నువ్వు ....నువ్వు .... నిజంగా చాలా మంచివాడివి. నన్ను జీవిత  భాగస్వామిగా పొందబోతున్నందుకు నాకెంతో సంతోషంగా వున్నది -" అన్నది లీల.
    "లీలా! నీ విలువ నీకు తెలియడం లేదు. నీ అందానికి వెల కట్టమంటే రోజుకు వేలతో ఇచ్చేవాళ్ళు ఉంటారు. నువ్వు ఇంత చవకగా నా స్వంతం కావడం నాకెంతో ఆనందంగా వుంది -" అన్నాడు సుగుణ్.
    లీల గర్వంగా నవ్వి --" నా విలువ నాకు తెలుసు. నాకు సినిమా అఫర్సు కూడా వచ్చాయి. అయితే గానుగెద్దు జీవితం నాకు ఇష్టం లేదు. స్వేచ్చగా, స్వతంత్రంగా నచ్చిన వాడితో జీవితం గడపగలిగితే అంతకంటే అదృష్టమేముంటుంది -- ఆడదానికి! నాకు డబ్బాశ లేదు. సుఖప్రదమైన జీవితం ...." అని ఆగి సుగుణ్ వంక చూసింది.
    సుగుణ్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు   పెట్టుకోబోయాడు. ఆమె మృదువుగా విడిపించుకుని -- "రేపు డబ్బు తీసుకునిరా. అది బ్యాంకులో నా అకౌంట్లో జమ చేసుకున్నాక -- నేను నీతో కలిసి మీ యింటికి వచ్చేస్తాను. ఆపైన నేను పూర్తిగా నీ దాన్ని!" అన్నది.

                                                            2

    పార్కు దాటి రాబోతుండగా సుగుణ్ భుజం మీద ఎవరిదో చెయ్యి పడింది. సుగుణ్ వెనక్కు తిరిగి తనకు కనబడిన అపరిచితుడి వంక ఆశ్చర్యంగా చూశాడు.
    "ఎనిమిదివేల రూపాయలతో ఓ అందాల రాశిని నాలుగు నెలల పాటు బుక్ చేసుకున్నానని చాలా సంతోషిస్తున్నావు కదూ!" అన్నాడా ఆపరిచితుడు.
    సుగుణ్ తడబడ్డాడు. ఎవరితడు? తన విషయం ఇతడికేలా తెలిసింది? ఇప్పుడితడు తనతో ఏం చెప్పబోతున్నాడు?
    "అవును ...." అన్నాడు సుగుణ్ ముక్తసరిగా.
    "పద....నీతో చాలా మాట్లాడాలి --" అన్నాడా అపరిచితుడు.
    సుగుణ్ కి లీల విషయమే విచిత్రముగా వున్నది.
    సుగుణ్ కి ఓ ఫ్యాన్సీ దుకాణం ఉంది. దాని మీద బాగా సంపాదించుకుంటున్నాడు. మనిషి యెర్రగా బుర్రగా బాగుంటాడు. లీల అతడి దుకాణంలోనికి వచ్చింది. తిన్నగా సుగుణ్ వద్దకే వెళ్ళింది.
    "నీతో మాట్లాడాలి --పార్కుకి వస్తావా?" అనడిగింది.
    లీలను చూసీ చూడగానే అతడి కళ్ళకు మైకం కమ్మింది. వెంటనే ఆమెను అనుసరించి వెళ్ళాడు. ఆమె వివాహం గురించి మాట్లాడింది. అన్నీ అతడికి నచ్చాయి.
    కానీ -- ఆమె ఎవరు? తన వద్దకే ఎందుకు వచ్చింది -- అన్న ఆలోచన అతడికి కలగలేదు.
    ఇప్పుడు....
    సుగుణ్ అతడిని అనుసరించాడు. అప్పటికి లీల వెళ్ళి పోయి అయిదు నిమిషాలవుతుంది. ఆమె వెళ్ళగానే ఆమె కూర్చున్న స్థలాన్నే తాకుతూ కొద్ది క్షణాలు గడిపి అతడు పార్కులోంచి బయటకు వచ్చాడు. అతడెవరో లీల గురించి మాట్లాడుతున్నాడు. అతడు తనకు ఏం చెబుతాడు?
    ఇద్దరూ మళ్ళీ పార్కులో కూర్చున్నారు.
    అదే చోట ....ఇందాక లీల కూర్చున్న స్థానంలో అతడు కూర్చున్నాడు. తన స్థానం మారలేదు.
    "ఎవరు నువ్వు?" అన్నాడు సుగుణ్.
    "నీ పేరు సుగుణ్ అని నాకు తెలుసు. నా పేరు చలం అనుకో. ఇందాకా నువ్వూ లీలా మాట్లాడుకున్న వన్నీ నేను విన్నాను...."
    "ఎందుకు విన్నావు?" చిరుకోపంగా అన్నాడు సుగుణ్.
    "లీల గురించి నీకంటే నాకు ఎక్కువ తెలుసు --" అన్నాడు చలం.
    "నాకు లీల గతంతో నిమిత్తం లేదు" అన్నాడు సుగుణ్.
    "ఒకవేళ లీల గతం నీకు భవిష్యత్తు లేకుండా చేస్తే ?"
    "అంటే ?" అన్నాడు సుగుణ్ ఆశ్చర్యంగా.
    "లీల కామినీ పిశాచి అన్న విషయం నీకు తెలుసా ?"
    "కామిని పిశాచి .... అంటే ?" సుగుణ్ తెల్లబోతూ అడిగాడు.
    చలం మాట్లాడకుండా సుగుణ్ ముఖంలోకే చూస్తూ కూర్చున్నాడు.
    లీల మనిషి కాదా?" ఆలోచిస్తూ అడిగాడు సుగుణ్'.
    "ఆ సంగతి నాకు తెలియదు. కానీ ఆమె ఏ మగాణ్ణి కోరుకుంటే అతడు - మృత్యువు ను ఆహ్వానించినట్లే! ఆమె కోరిక తీరేలోగానే అతడి ఆయువు చెల్లిపోతుంది. అందుకే ఆమె కామినీ పిశాచి అన్నాను-" అన్నాడు చలం.
    సుగుణ్ లీలను గుర్తు చేసుకున్నాడు. ఆ రూపంలో పిశాచ లక్షణాలేక్కడా కనబడలేదు. పైగా అతడికి ఆమె పై మరింత మోహం కలిగింది.
    "కాదు - " అన్నాడు సుగుణ్- "నువ్వూ ఆమెను కోరుతుంటే - ఆమె నీకు లభించకపోతే -- ఈ విధంగా ఆమె పై దుష్ప్రచారం ప్రారంభించావని నా నమ్మకం. ఇది చాలా పెద్ద తప్పు. ఇలాంటి తప్పు ఇంకెవ్వరు క్షమించరు...."
    "నువ్వూ క్షమించవద్దు. ఎల్లుండి దాకా బ్రతికి వుంటే " అని లేచాడు చలం.
    
                                    3
    సుగుణ్ , లీల ఇద్దరూ బ్యాంకు నుంచి బయటకు వచ్చారు.
    "చాలా థాంక్స్ - అన్న మాట ప్రకారం నాలుగు నెలలకు ముందుగానే డబ్బు ఇచ్చేశావు. నీవంటివాడితో జీవితాంతం ఉండగలనని నమ్మాకం-" అన్నది లీల.
    "అదే నా కోరిక - " అన్నాడు సుగుణ్.
    "ఈ క్షణం నుంచీ నేను నీ దాన్ని -" అన్నది లీల.
    'ఆ ఆలోచనే నన్ను పరవశింపజేస్తోంది -" అన్నాడు సుగుణ్.
    "నీ యింటికి వెడదామా !"
    "వద్దు -- " అన్నాడు సుగుణ్ - "నీకు పట్టింపు లేకపోయినా నాకు కొన్ని పట్టింపులున్నాయి. నువ్వు సరిగ్గా సాయంత్రం ఆరింటికి మా యింటికి రా, అప్పుడూ కొన్ని తాతంగాలున్నాయి--"
    "నీ యిష్టం ---" అని వెళ్ళిపోయింది లీల.
    సుగుణ్ తిన్నగా తన స్నేహితుడు రామ్ గోపాల్ దగ్గరకు వెళ్ళాడు. అతడిది పుస్తకాల షాపు.
    "నీతో మాట్లాడాలి!" అన్నాడు సుగుణ్.
    "పద -" అన్నాడు రాం గోపాల్.
    పుస్తకాల షాపులో - కాస్త వెనగ్గా ఓ చిన్న గది వున్నది. అది రాం గోపాల్ ప్రయివేట్ గది. ఇద్దరూ అందులోకి వెళ్ళి కూర్చున్నారు.
    "నీకు చెప్పకుండా నేనో పని చేశాను -" అన్నాడు సుగుణ్.
    "చెప్పు -"
    "సుగుణ్ అతడికి లీల గురించి చెప్పాడు.
    "ఎక్సలెంట్ ఆఫర్ -- వెరీ చీవ్!" అన్నాడు తాం గోపాల్.
    'అప్పుడే అంతా పూర్తీ కాలేదు - " అంటూ సుగుణ్ చలం హెచ్చరిక గురించి కూడా స్నేహితుడికి చెప్పాడు.
    రాంగోపాల్ సాలోచనగా - "ఆశ్చర్యంగా వుందే?" అన్నాడు.
    "ఆశ్చర్యపడితే చాలా -- భయం కూడా పడాలా  అన్నది నా సమస్య...."
    "ఇప్పుడు నువ్వామేకు డబ్బు కూడా ఇచ్చి వచ్చావు . అవునా ?"
    "అవును...."
    "ఒకవేళ డబ్బుతో ఆమె పారిపోతే ....?"
    సుగుణ్ నవ్వి - "బ్యాంకు లోంచి బయటకు వచ్చేక రెండు గంటల వరకూ ఆమెను ఎంగేజ్ చేశాను. అంటే ఈ రోజుకు డబ్బు తీసుకుని పారిపోలేదు కదా - ఈరోజు ఆమె నా యింటికి రాకపోతే రేపు బ్యాంకు దగ్గర కాసి నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. ఇవన్నీ ముందు జాగ్రత్త కోసం తప్పితే -- ఆమె పైన నాకు పూర్తీ నమ్మక ముంది. ఆమెను చూడగానే అమాయకురాలు అనిపిస్తుంది-" అన్నాడు.
    "అందమైన ఆడవాళ్ళంతా అమాయకంగానే అనిపిస్తారు. అది సరే నువ్వు ఆమె రాకపోతే ఏర్పాట్ల సంగతి చూసుకున్నావు.... ఒకవేళ ఆమె వస్తే ...."
    "వస్తే సమస్యే లేరు ...."
    "ఈ వేళ వచ్చి - రేపు డబ్బు తీసుకుని పారిపోతే?"
    సుగుణ్ మాట్లాడలేదు.
    "అంటే ఒక రాత్రికి ఎనిమిది వేలు...."
    'ఆమె అలా చేస్తుందని నేననుకోవడం లేదు. నేనామెను ప్రేమించాను. ఆమె కూడా నన్ను ప్రేమించి నట్లే కనబడుతోంది. ఈరోజు అందుకే పెద్ద తతంగం చేయడల్చుకున్నాడు. నిన్నూ- మరో నలుగురైదుగురు తెలిసిన వాళ్ళను పిలిచి ఆమెను నా భార్యగా పరిచయం చేయదలచుకున్నాను. ఒక ఫోటో గ్రాఫర్ని కూడా ఏర్పాటు చేస్తాను. అతడు ఫోటోలు తీస్తాడు. ఆపైన పురోహితుడు . మేమిద్దరమూ దండలు మార్చుకునేటప్పుడు అయన పెళ్ళి మంత్రాలు చదువుతాడు...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS