Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 15


    "ఏమండీ ఎలాగుంది?" అనడిగింది శారద.
    "నే నిక్కడున్నానని ఎలా తెలుసు?" అనడిగాడు రఘు నీరసంగా నవ్వుతూ.
    "అందులో ఆశ్చర్యమేముంది?"
    "నాకు ఆక్సిడెంటయినట్లు సాయంత్రందాకా నీకు చెప్పొద్దని చెప్పాను-" అన్నాడు రఘు-"అయినా ఇది పెద్ద యాక్సిడెంటేంకాదు. ఓ గంట రెస్టు తీసుకుని ఇంటికెళ్ళిపోవచ్చు నన్నాడు డాక్టర్-"
    "మీరు చెప్పకపోతే నాకు తెలియదనుకున్నారా. మిమ్మల్ని వెన్నంటి ఉండే నా మనసు ఎప్పటికప్పుడు మీ గురించి నాకు సమాచారం అందజేస్తూనే ఉంటుంది. మీకలా ఆక్సిడెంటు కాగానే-నేను మీ ఆఫీసుకు ఫోన్ చేశాను. వాళ్ళు తమకేమీ తెలియదన్నారు. నేను ఆఫీసుకు బయల్దేరి వెళ్ళాను. అప్పుడే వార్త అక్కడికి చేరింది. నేను హాస్పిటల్ కి పరుగునవచ్చాను-"
    రఘుకు పెద్దగా దెబ్బలేం తగల్లేదు. అతడు ఆశ్చర్యంగా భార్యవంక చూస్తూ-"నీకేమైనా మానవాతీత శక్తులున్నాయా అని అనుమానంగా ఉంది-" అన్నాడు.
    "మంచి మనసు ఉంటే శక్తులు మనిషిని వెతుక్కుంటూ వస్తాయి-" అంది శారద.
    రఘు రెండు రోజులు ఇంటిపట్టునే ఉండి విశ్రాంతి తీసుకున్నాడు. గత కొద్దిరోజులుగా అతడి ప్రవర్తనలో మార్పు కనబడుతోంది. అతడు అమ్మాయిలకు బాగా దూరంగా ఉంటున్నాడు. తనకో మగ పర్సనల్ సెక్రటరీని నియమించుకున్నాడు. ఆఫీసులో ఏకాంతం కూడా తగ్గించాడు. ఇంట్లో భార్యతో అతను అనేకమార్లు ఇలా చెప్పాడు.
    "శారదా, నాలో స్త్రీలోలత్వం ఉంది. అది నా బలహీనత. ఒప్పుకుంటాను. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ కోసం ప్రాణాలిమ్మన్నా ఇస్తాను. నువ్వు కష్టపడితే సహించలేను. నువ్వు లేకపోతే బ్రతకలేను. నువ్వు నా జీవితంలో ప్రవేశించడం నా అదృష్టం. నా బలహీనతను జయించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ప్రయత్న లోపమేమీ ఉండదు. కానీ నా ఉద్యోగం పరిస్థితి నీకు తెలుసు. యెందరో నామీద వలలు పన్నుతుంటారు. ఋష్యశృంగున్ని కూడా పడగొట్టగల లలనామణులు రంగంలో దిగుతారు. అలాంటప్పుడు నేను తప్పుచెయ్యచ్చు. చెయ్యకూడదన్నదే నా ఆశ. కానీ తప్పుచేస్తే నన్ను క్షమించు. నీ ప్రాణాలు తీసుకోకు. ఒకవేళ నీకు పానాలు తీసుకోవాలనిపిస్తే-ముందు నా ప్రాణాలు తీసి తర్వాత యేమైపోయినా ఫర్వాలేదు. నీ గురించి ఎటువంటి దుర్వార్తా విని భరించలేను నేను-"
    ఈ మాటలు చెప్పినపుడు అతడి కళ్ళలో నిజాయితీ ప్రతిఫలించేది. ముఖంలో అమాయకత కనబడేది. అప్రయత్నంగా శారద అతడి కనులలో కరిగిపోయేది.
    భర్త ఆఫీసులో చేసిన మార్పుల గురించి శారద విన్నది. ఆమె సంతోషించింది.
    ఒక రోజున శారద భర్తతో కలిసి బజారుకి వెళ్ళి నపుడు మెరుపుతీగలాంటి అమ్మాయి కనబడితే-క్షణం పాటు రఘు ఆమెను రెప్పవాల్చక చూశాడు.
    శారద అతడిచేయి గిల్లి-"కావాలనిపిస్తోందికదూ-పాడు బుద్ధి!" అంది.
    రఘు శారదవంక అదోలా చూసి-"అందాన్ని నే నొక్కన్నేకాదు. చాలామంది చూస్తారు...." అన్నాడు.
    "చాలామంది చూసి ఊరుకుంటారు. మీకూ చాలా మందికీ అదే తేడా!"
    రఘు అక్కణ్ణించి కదుల్తూ-"చిన్న పనివుంది-ఇక్కన్నించి పోదాం-" అన్నాడు. శారద మాట్లాడకుండా అతణ్ణి అనుసరించింది. కాసేపలా బజార్లో తిరిగి ఇద్దరూ ఓ దుకాణంలోకి వెళ్ళారు. రఘు అక్కడ ఆరంగుళాల పొడవున్న స్టెయిన్ లెస్ స్టీల్ బాకు ఒకటి ఖరీదు చేశాడు.
    బైటకు వచ్చేక-"ఇదెందుకు?" అంది శారద.
    "ఇంటికెళ్ళాక చెబుతాను-" అన్నాడు రఘు మౌనంగా.
    ఇద్దరూ ఇల్లుచేరాక శారద వెంటనే బాకు గురించి అడిగింది. ఆమెకు చాలా కుతూహలంగా ఉంది.
    "చంపడానికి!" అన్నాడు రఘు.
    "యెవర్ని?" అంది శారద అనుమానంగా.
    "ఆ పిల్లను..."
    "యే పిల్లను?" ఆశ్చర్యంగా అడిగింది శారద.
    "ఇందాకా షాపులో నేను చూడగా నువ్వు అనుమానపడ్డావే-ఆ పిల్లను!"
    "ఆ పిల్లను చంపడమెందుకు?" అంది శారద మరింత ఆశ్చర్యపోతూ.
    "యెందుకేమిటి? ఆమెను వాంఛిస్తున్నాననిగదా నీ అనుమానం. ఆమెనెంతగా ద్వేషిస్తున్నానో నీ కర్ధం కావడంకోసం ఆమెను చంపేస్తాను...." అన్నాడు రఘు.
    శారద రఘు ముఖంలోకి చూసింది. అతడి కళ్ళల్లో దృఢ నిశ్చయం కనబడింది.
    "కొంపతీసి అంతపనీ చేశారు గనుక...." అంది అదో జోక్ కింద తీసిపారేస్తూ.
    "చేస్తాను..." అన్నాడు అతను.
    "మీకేం పిచ్చిపట్టడం లేదుకదా!" అంది శారద.
    "నీ అనుమానం నాకు పిచ్చిపట్టిస్తోంది. ఈరోజు నుంచీ కంటికి కనిపించిన అందమైన ఆడపిల్లనల్లా చంపేయడమే నా వృత్తిగా పెట్టుకుంటాను-"అన్నాడు రఘుకసిగా.
    శారద అతడి గుండెలమీద చేయివేసి-"పరాయి స్త్రీలకు మిమ్మల్ని దూరంగా ఉండమన్న దెందుకు? మీరు నాకు మరింత దగ్గరవుతారని...మీరో హంతకుడుగా మారితే నాకేం ప్రయోజనమండీ-మీరెప్పుడూ నాతోనే వుంటూ నన్నే తలవాలి. మనం ఒకరికోసం ఒకరం బ్రతకాలి. అదీ నా కోరిక...." అంది.
    రఘు ఆమెను దగ్గరగా తీసుకుంటూ-"ఇరవై నాలుగ్గంటలూ నువ్వు నన్ను అనుమానిస్తూ ఉంటే అదెలా సాధ్యపడుతుంది? నేను మారానని నమ్మకం నీక్కలక్కపోతే నేను హంతకుణ్ణి కాక తప్పదు...." అన్నాడు.
    "మీరు మారారని నేను నమ్ముతున్నాను. ఇందాకా ఏదో జోక్ చేస్తే మీరు సీరియసైపోయారు. యెప్పుడూ మీరు హత్యల గురించి మాట్లాడకండి. నాకు భయం వేస్తుంది-" అంది శారద.
    "ఒక్కసారి మాట్లాడనీ-" అంటూ బాకు తీశాడు రఘు. శారదకు దాన్నందించి-"ఇది నీ దగ్గరుంచు. యెప్పుడైనా నీ మనసు నా గురించి తప్పుచేసిన సమాచారం అందించిందా-అప్పుడీ బాకుతో నన్ను చంపేసేయ్. ఈ విషయంలో ఇహ నీవేం చెప్పినా వినదల్చుకోలేదు. నువ్వు నన్ను చంపని పక్షంలో-నీ నుంచి అభియోగం విన్న తక్షణం ఇంక నేనే ఈ బాకుతో నన్ను నేను చంపుకుంటాను. అందుకే ఈ బాకు కొన్నది-"
    శారద భయంగా ఆ బాకువంక చూసింది. అది తళతళా మెరుస్తోంది.

                                       8

    అతను తలుపు తట్టాడు.
    ఆమె తలుపు తీసి-"వచ్చావా?" అంది.
    "నీ పిలుపు నెప్పుడు కాదన్నాను?" అన్నాడతను.
    "అలా మాట్లాడకు స్వరూప్-" అంది ఆమె.
    "మరెలా మాట్లాడకు శారదా!" అన్నాడతను.
    "నేను వివాహితను. మనసా, వాచా రఘుకు అంకితమై పోయినదాన్ని నన్ను వేరే ఒకరు ప్రేమించడం, ఆరాధించడని నేను సహించలేను. ఒక అన్నలా నిన్ను అభిమానించాలని ఆశిస్తున్నాను..." అంది శారద.
    "నా శరీరాన్ని శాసించగలవు కానీ నా మనసును నువ్వు శాసించలేవు శారదా! ఎటొచ్చీ నీకు కష్టం కలిగించే పని యేదీ చేయలేదు నేను. ఇకముందు కూడా చేయబోను...." అన్నాడు స్వరూప్.
    స్వరూప్ శారదను ప్రేమించాడు. శారద తండ్రి కూడా అతణ్ణి ఆమెకు తగిన భర్తగా భావించాడు. కానీ శారద రఘుని ప్రేమించింది. వివాహం చేసుకుంది.
    "నువ్విచ్చిన ఎలక్ట్రానిక్ ట్రీ అమోఘంగా పనిచేస్తోంది-" అంది శారద.
    "అది నీ కోసం నా మేధనంతా వినియోగించి తఃయారుచేశాను. పనిచేసి తీరాలి-"
    "పద-చూద్దువుగాని...." అంది శారద.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS