ఆమె ముఖంలో కోపం కనబడకపోవడంతో శాస్త్రి ధైర్యం పెరిగింది. 'అందానికి జోహారు అర్పించడం నా బలహీనత. ఈ చీరను కొని నీకే ప్రజంటూ చేద్దామనుకుంటున్నాను..."
"తెలియని వాళ్ళ వద్ద ఊరికే బహుమతులు తీసుకోవడం నా కలవాటు లేదు " అంది గౌరీ శాస్త్రి మాటలకూ ఆమె ముఖం కాస్త ఎర్రబడింది.
"ఊరికే వద్దు ..." అన్నాడు శాస్త్రి.
'అంటే?' అంది గౌరీ కాస్త తీవ్రంగా.
"అలా కోపంగా చూడకండి. నాకు డబ్బుంది. సరదాగా గడపడం నా ఇష్టం. మోసాలంటే నాకు మొదలే ఇష్టం లేదు. నాకు పెళ్ళి కూడా అయింది. మీకు అభ్యంతరం లేదంటే నెహ్రూ పార్కులో సాయంత్రం అయిదు గంటలకు నన్ను కలుసుకోండి. మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి...." అన్నాడు శాస్త్రి.
"నేను రాను...." అంది గౌరీ.
"నేను చెడ్డవాడ్ని కాను. దుర్మార్గుడిని కాను. పెళ్ళి కాని ఆడపిల్లల పై చేయి వేసే రకం కాను. మనసులోని మాటను సూటిగా చెబుతాను. ఇష్టం లేని వాళ్ళను వెంటనే వదలి పెడతాను. పార్కులో నాతొ ఓ అరగంట సేపు మాట్లాడితే మీకు వంద రూపాయలిస్తాను. ఒకటి కాదు రెండు కాదు.... వంద రూపాయలు ...ఆ అర్ధ గంట సేపూ నేను మిమ్మల్ని తాకనైనా తాకను...." అన్నాడు శాస్త్రి.
గౌరీ ఓసారి అతని కళ్ళలోకి చూసి తలదించుకుని సరే - వస్తాను" అంది. అన్న మాటను నిలబెట్టుకుంది కూడా.
'అరగంట మాత్రమే టయిముంది కాబట్టి సమయం వృధా చేయను. నేనడిగిన ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పాలి " అన్నాడు శాస్త్రి.
'అడగండి" అంది గౌరీ.
"నేనిలా అడుగుతున్నానని ఏమీ అనుకో'కూడదు.... నాకు మీ మీద మనసైంది. ఏమైనా అవకాశముందా?"
నివ్వెరపోయి శాస్త్రి వంక చూసింది గౌరీ. ఆమెకు నోట మాట రాలేదు.
"మౌనం అంగీకారమనుకుంటాను. అయితే నాకో ఇబ్బంది ఉంది. ఊళ్ళో చాలామందికి నేను తెలుసు. లాద్జింగు లో వ్యవహారం కుదరదు. మా ఇంట్లో అసలే కుదరదు. మీ ఇంట్లో సాధ్యపడుతుందా ?"
గౌరీ దెబ్బతిన్నట్లు అతడి వంక చూసి -- "నేనలాంటి దాన్నని మీకెవరు చెప్పారు?" అంది.
"నాకు చాలామంది సేల్సు గరల్స్ తో పరిచయముంది. అందమైన వాళ్ళు తటస్థ పడ్డప్పుడు నా ప్రయత్నం నేను చేసుకుంటాను. ఇందులో తప్పుందని అనుకోను. బజార్లో టాక్సీ పోతుంటే కేకేస్తాం. ఇష్టమైతే వస్తాడు. లేకపోతె లేదు" అన్నాడు శాస్త్రి.
"మరి నేను వెళ్ళవచ్చా ?" అంది గౌరీ.
"మీకు వెళ్ళడం నా అనుమతి మీద ఆధారపడితే నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఒక్క రోజుకు అయిదు వందలిస్తాను. ఆలోచించుకోండి ...." అన్నాడు శాస్త్రి.
ఆమె నుంచి ఎటువంటి సమాధానం వినాలోనని అతను బెదిరిపోతున్నాడు.
"రేపు మధ్యాహ్నం రెండు గంటలకు -- ఈ పార్కు దగ్గరకే రండి !" అంది గౌరీ.
శాస్త్రి నిశ్చేష్టుడై ఆమె వంక చూశాడు.
"ఏమిటి విశేషాలు ?' అన్నాడు శాస్త్రి.
రమణమూర్తి గొంతు సవరించుకుని -- "కేసులో నిజంగానే బలముందని తోస్తోంది. ఒక్క కృష్ణ శర్మ నే కాక చుట్టూ ప్రక్కల చాలా వాకబు చేశాను. తెలిసిన వివరాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. నా దురదృష్టం కొద్దీ ఒక్క ఆడపిల్ల కూడా దొరకలేదు. ప్రశ్నలడగడానికి --" అన్నాడు.
"విశేషాలు చెప్పు" అన్నాడు శాస్త్రి.
రమణమూర్తి ప్రారంభించాడు.
"సుబ్బరామయ్య ఇంట్లో ఉదయం పది అయ్యేసరికి ఎవ్వరూ వుండరు. ఆడా మగ అందరూ తలో పని మీదా బయటకు పోతారు. ఆఖరున వెళ్ళినవారు తాళం చెవి ఎదురింట్లో ఇచ్చి వెడతారు. ఆ తాళం చెవికి డూప్లికేటు లేదు. సాధారణంగా సుబ్బరామయ్య భార్య శారదమ్మ అందరి కంటే ఆలస్యంగా బయటకు వెడుతుంది.
ఆడపిల్లలు సేల్సు గరల్స్ గా పనిచేస్తున్నారు. కళ్యాణి స్టెనో గ్రాఫర్. శారదమ్మ కుట్టుపనులు నేర్చుకుంటోంది. సుబ్బరామయ్య గుమస్తా. ఇంతమంది బయటకు వెళ్ళి పోవలసి నప్పటికీ ఆ ఇంటి వాళ్ళు డూప్లికేటు తాళం చెవులెందుకు చేయించుకోవడం లేదో ఆశ్చర్యం. ఎప్పుడూ ఎదురింట్లోనే ఇచ్చి వెడతారు.
అయిదారు సంవత్సరాల క్రితం వరకూ సుబ్బరామయ్య ఆర్ధిక పరిస్థితి ఘోరంగా వుండేది. ఆ ఇంట్లోని ఆడవాళ్ళేవ్వరూ బయటకు వచ్చేవారు కాదు. అయిదారు సంవత్సరాల నుంచి అయన పరిస్థితి మెరుగయింది. ఇంటిల్ల పాదీ సంపాదనలో పడ్డారు. పరిస్థితి మెరుగైనాక సంపాదనలో పడ్డారా, సంపాదనలో పడినాక పరిస్థితి మెరుగుపడిందా అన్నది ఎవరూ చెప్పలేకపోయారు.
సుబ్బరామయ్య చాలా మంచివాడని ఆ వీధిలో పేరుంది. సుబ్బరామయ్య పిల్లల గురించి చాలామంది వంకరగా మాట్లాడారు. అయితే అవి అసూయకు సంబంధించినవే కాని సాక్ష్యాలున్న మాటలు కాదు. అందరి ఆడపిల్లల ప్రవర్తన మీద అభాండాలు వేసే మగవాళ్ళు చాలామంది ఉంటారు."
రమణమూర్తి చెప్పిందంతా విని -" నువ్వు చెప్పింది విన్నాక రెండు విషయాలు నాకశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి " అన్నాడు శాస్త్రి.
"ఏమిటవి?"
"ఆ ఇంటి వాళ్ళు దగ్గర డూప్లికేట్ తాళాలు ఎందు కుంచుకోవడం లేదు? డూప్లికేట్ తాళం దగ్గర లేని పక్షంలో కళ్యాణి తాళం వేసిన ఇంట్లోకి ఎలా వచ్చింది?
"వాళ్ళ దగ్గర డూప్లికేటు తాళాలు వున్నప్పుడు లేవని అబద్దం చెబుతున్నారేమో!" అన్నాడు రమణమూర్తి.
'అలా అబద్దం చెప్పాల్సిన అవసరం ఎవరి కుంటుంది?" అన్నాడు శాస్త్రి.
రమణమూర్తి బుర్రకు పదును పెట్టసాగాడు. వున్నట్లుండి -- "ఆ ఇంటి వాళ్ళందరూ కలిసి ఏదో గుమ్మక్కు చేస్తున్నారు. తమకు పటిష్టమైన ఎలిబీని తయారు చేసుకుంటున్నారు " అన్నాడు.
"ఎందుకు ?" అన్నాడు శాస్త్రి.
"కళ్యాణిని చంపాలన్న ఆలోచన వారికి చాలాకాలం క్రితమే వచ్చి వుండాలి. మాస్టర్ ప్లాన్ వేశారు ..." అన్నాడు రమణమూర్తి.
"కళ్యాణిని చంపవలసిన అవసరం ఆ ఇంటి వాళ్ళ కెందుకు కలిగింది ?"
రమణమూర్తికి జవాబు తోచలేదు. అతను ఆలోచనలో పడ్డాడు.
శాస్త్రి మళ్ళీ "అసలు హత్యలు చేయడానికి కారణాలేముంటాయి ?" అన్నాడు.
"పగ, ద్వేషం...."
"ఇంకా...."
"మోసం చేసినట్లు గ్రహించడం...."
"ఊ...."
"చెప్పిన పనికి ఒప్పుకోకపోవడం ...."
"ఇంకా ...."
"రహస్యమేమైనా బయటపడడం...."
"ఊ.."
"సార్!" అన్నాడు రమణమూర్తి.
శాస్త్రి కళ్ళు మెరుస్తున్నట్లు అతను కనిపెట్టాడు.
'అవును ...." అన్నాడు శాస్త్రి. "ఆ ఇంటి వాళ్ళకు సంబంధించిన రహస్యమేదో వుంది. అది కళ్యాణి కి తెలిసి వుండాలి."
క్షణం ఆగి అన్నాడు శాస్త్రి-- "నువ్వు చేయవలసిన పని ఇంకొకటుంది. కళ్యాణి పనిచేస్తున్న ఆఫీసుకు వెళ్ళి ఆమె గురించి వాకబు చేయాలి...
'పోలీసులు కొంతవరకూ ఆ పని చేసినట్లున్నారు...." అన్నాడు రమణమూర్తి.
"వాళ్ళు అధికారపు హోదాలో ఆ పని చేశారు. నువ్వలా కాకుండా ఒక సామాన్యుడి గా వివరాలు సేకరించు. మన పరిశోధనకు పనికి వచ్చే వివరాలు దొరుకుతాయని నేననుకోను. కానీ కళ్యాణి గురించి తెలుసుకోవడానికా సమాచారం మనకు బాగా సహకరిస్తుంది --" అన్నాడు శాస్త్రి.
"ఈ ప్రయత్నంలో నైనా నాకు కొంతమంది ఆడపిల్లలు దొరక్కపోరు" అన్నాడు రమణమూర్తి.
శాస్త్రి నవ్వి - "డోంట్ బీ టూ అస్టిమిస్టిక్ . నేను నిన్నదాన్ని బట్టి ఆ ఆఫీసులో ఇద్దరే ఆడవాళ్ళున్నారు. ఒకామె కళ్యాణి. రెండువవారు సుమారు ఇరవై ఏళ్ళు గా పనిచేస్తున్న మామ్మగారు...."అన్నాడు.
రమణమూర్తి ఉక్రోషంగా -- "చూసి చూసి నాకిలాంటి బెరాలు తగిలిస్తున్నారు" అన్నాడు.
"నువ్వు కుర్రాడివి. నన్ను నమ్ముకున్నవాడివి. నువ్వు మోసపోతే అందువల్ల నీక్కలిగే నష్టం సంగతి అటుంచి డిటెక్టివ్ గా నాకు చెడ్డ పేరొస్తుంది. ఫలానా డిటెక్టివ్ అసిస్టెంటు మోసపోయాడంటే అది నాకెంత అవమానం ?" అన్నాడు శాస్త్రి.
"నేను సులువుగా మోసపోతానని తెలిసినపుడు నన్ను మీ అసిస్టెంటు గా ఎందుకు నేనుకున్నారు?" అన్నాడు రమణమూర్తి.
"ఒక్క ఆడపిల్లల చేతుల్లోనే నువ్వు సులువుగా మోసపోతావు. నువ్వూ పెళ్ళి చేసుకుని నా అనుభవం సంపాదించగలిగితే అప్పుడు నేను నీకు అన్నీ ఆడపిల్లల కేసులే అప్పగిస్తాను" అన్నాడు శాస్త్రి.
'అన్నట్లు -- మీరు పట్టిన ఆడపిల్లల కేసేమయింది ?" అన్నాడు రమణమూర్తి.
"అదా? అదింకా నువ్వడక్కూడదు ...." అన్నాడు శాస్త్రి.
