ఎందుకంటె ఒకప్పుడు మా ఇల్లు కూడా పొరుగింటి వాళ్ళదే. ఆవిధంగా మా దొడ్లోని నిధికి వెంకట్రావు వారసుడయ్యే అవకాశముంది.
వెంకట్రావు కాస్త ఇబ్బందిగా ఆ రాత్రిని అందుకుని "బంగారమానుకుందామంటే కనీసం రంగైనా కాస్త పచ్చగా లేదు"అని అవతల పారేయబోయాడు.
"అయ్యో అలా పారేయకు దీన్ని బంగారంగా భావింఛి అందుకునే వాడెక్కడో ఈ భూ ప్రపంచంలో పుట్టి తిరుగుతున్నాడు మరి" అంటూ ఆ రాతిని మళ్ళీ భద్రంగా అందుకుని పట్టుకు పోయాను. నా మాటల్లోని హాస్యం వెంకట్రావుకి అర్ధమయ్యే అవకాశం లేదు పాపం!
10
శోభ నవ్వుతోంది. నేను మట్టి తీస్తున్నాను.
అప్పటికి దొడ్లో కొబ్బరి మొక్క కాక మరికొన్ని మొక్కలు పాతాం. ఒక వరుసలో నాలుగు గులాబీలు వేశాం. వాటికి కొంచెం ప్రక్కగా కనకాంబరాలు ఇవతల వంగనారు పాతాం. ఇంకా ధనియాలు, తోటకూర ఒక చోట పక్క పక్కగా వేశాం. ఒక పధకం ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తున్నాం.
ఇప్పుడు మామిడి మొక్క కోసం ఈ ప్రయత్నం. ఇందాకా నేను కొంతలోతు తవ్వాను. ఇప్పడు శోభ తవ్వుతోంది. నేను మట్టి తీస్తున్నాను. నేను మట్టి తీసి " ఏదో గట్టిగా తగుల్తోంది మరో దెబ్బ వేయి " అన్నాను. శోభ గునపం పైకి ఎత్తింది. నేలపై బలంగా దింపింది. ఖంగు మన్న శబ్దమైంది. ఆగిపోయిందామె.
ఇద్దరం జాగ్రత్తగా ,మట్టి తీయసాగాము. "శ్రమ వృధా 'అన్న మాటలు ఆ పర్యాయం శోభ నోటి నుంచి రాలేదు. ఆమె ముఖంలో ఉత్సాహం కనబడుతోంది. నేనామెకు సహాయం చేస్తున్నాను మట్టి తీయడంలో.
గునపాన్ని వుపయోగించి మొత్తమ్మీద ఒక వస్తువు ను బయటకు తీయగలిగాము. అది ఒక చిన్న ఇత్తడి పెట్టె.
శోభ చేతులు వణుకుతున్నాయి. నేను కుతూహలంగా చూస్తున్నాను. "ఇలాంటి పెట్టె భూమికి ఇంత తక్కువ లోతులో దొరుకుతుందని నేననుకోలేదు"అంటూ శోభ పెట్టె మూత తెరిచి ఉలిక్కిపడి "చూడు ఇందులో ఏమున్నాయో" అంది.
నేను చూసి "చిల్లరపెంకులు"అన్నాను.
"నీకూ అలాగే కన్పిస్తున్నాయా?" అంది శోభ నిరుత్సాహంగా.
"ఇదేనంటావా నిధి"అన్నాను చప్పగా. "మాట తప్పను. చిల్ల పెంకులు నీవి ఇత్తడి పెట్టె నాది."
"అదేమిటి వసంతా చేతికి దక్కిన పెన్నిధి చూస్తె నీకు వేళాకోళంగా ఉంది" అంది శోభ అదోలా.
"వేళాకోళం కాదు. ఇదివరలో నువ్వూ, సుజాత అన్నా కలిసి తవ్వారు చూడు. నేనింట్లో లేనప్పుడు అదే రోజున నువ్వింట్లో లేనప్పుడు నేనూ అక్కడే తవ్వాను. ఓ నల్లరాయి దొరికింది. దాన్ని భద్రంగా దాచాను. ఈ రోజున చిల్లరపెంకులు దొరికాయి. వీటిని ఆ రాతి పక్కన పోస్తాను. బహుశా నేను ఇంట్లో ఇంకో గది కట్టించుకోవాలేమో దొరికిన నిధులు దాచుకోడానికి . ఇంకా ఇలాంటి నిదులేన్ని దొరుకుతాయో ఏమిటో" అన్నాను.
శోభ ఆశ్చర్య పడింది. 'అయితే నిధి గురించి నువ్వు వేదుకుతున్నావన్న మాట."
"భలే దానివే నా ఇంటి పెరట్లో నిధి మీద నాక్కాక పొతే నీకుంటుందంటావా ఆసక్తి!" అన్నాను.
"అయితే నిధి పెరట్లో వుందని నీకు తెలుసా?" అంది శోభ.
'ఉందని తెలియదు. కాని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఉందేమోనని ఆశ కలుగుతుంటుంది" అన్నాను.
శోభ పరీక్షగా చిల్లర పెంకుల వైపే చూస్తోంది. "వీటిని అశ్రద్ధ చేయకూడదు. ఇవి మామూలు చిల్లర పెంకులు కాదు ఇత్తడి పెట్టెలోని చిల్లర పెంకులు" అంది సాలోచనగా.
"అందుకే అవి నీకే ఇచ్చేస్తున్నాను. పెట్టె మాత్రం నాది - మరిచి పోకూడదు" అన్నాను.
"వీటికి అసలు వారసులేవరో ప్రయత్నించి తెలుసుకోవాలి" అని శోభ అంటుంటే వస్తున్న నవ్వు నాపుకుని మరో ప్రక్కకు తిరిగాను.
11
నేనను కున్నది జరుగలేదు. శోభ ఇంకా నాతో పాటే నా ఇంట్లో నే ఉంటోంది. చిల్ల పెంకులు మాత్రం భద్రంగా దాచుకుంది. ఒకరిమీద ఒకరికి ఎటువంటి అనుమానాలున్నా మా ఇద్దరి స్నేహం మాత్రం నానాటికీ బలపడుతోంది. ఒకరంటే ఒకరికి ఇష్టం పెరుగుతోంది.
ఒకరోజున నేను శోభ ను అడిగాను. "వివాహ విషయంలో నువ్వు సర్వ స్వతంత్రురాలివి నన్నావు. నిన్ను మనసారా ప్రేమించిన వ్యక్తీ ఒకడున్నాడు. అతగాడు సర్వస్వతంత్రుడు. మీ ఇద్దరి వివాహానికి ఇంకా ఆలస్యమెందుకు?"
శోభ సిగ్గు పడింది. వివాహం ప్రసక్తి తీసుకు వచ్చినందుకు. కానీ కాస్త మెల్లగా అంది. "వివాహ మయ్యేక నేను మరి ఉద్యోగం చేయను. ప్రస్తుతం అతని ఉద్యోగం చిన్నది. తన ఒక్కడి సంపాదనతో ఒక చిన్న సంసారాన్ని కంఫర్టబుల్ గా ఈదగల స్థాయికి తన సంపాదన పెరిగే దాకా నన్నాగలసిందిగా అతను కోరాడు. ప్రస్తుతం అతనా ప్రయత్నాల్లో వున్నాడు."
"ఏమిటి ఎక్కడైనా నిధి కొడుతున్నారేమిటి మీ ఇద్దరూ కలిసి" అన్నాను కాస్త డైరెక్టుగా.
"అవుననుకో. లేదనుకున్న చెల్లెలు అతనికీ, నీ అంత అందమైన ఆడపడుచు నాకు దొరికితే అదే పెద్ద నిధి" అంది శోభ.
"కానీ నా దగ్గర మాత్రం ఏ నిధి లేదు మరి" అన్నాను.
"దొరక్కూడదని లేదు గదా దొరికితే మాకిస్తావా?"
'అమ్మా నా నిధి నాది లేకపోతె కాబోయే మావారిది కానీ అన్నా వదినల కెందుకిస్తాను?" అన్నాను చిలిపిగా.
శోభ నవ్వి "కాబోయే వారికి నిధి కట్ట బెట్టాలని చూస్తున్నావు . నీకంటే నిధి ఎందుకమ్మా మీ ఆయనకి" అంది.
'అలాగే సుజాత అన్న అనుకుంటే మీ వివాహం ఇంకా కాకుండా ఉండేదా?" అన్నాను జవాబుగా. శోభ మరి మాట్లాడలేదు.
నేను మళ్ళీ అన్నాను "శోభ నువ్వెందుకు నా జీవితంలో ప్రవేశించావో నాకు తెలియదు. కానీ భయంకర మైన ఒంటరితనం నుంచి నన్ను రక్షించి నా జీవితంలో ఉల్లాసాన్ని, ప్రవేశ పెట్టావు. నీకు నేను సర్వదా కృతజ్ఞురాలీని."
శోభ ఇంకా మాట్లాడలేదు. "ఒంటరి ఆడదాన్ని నాకు నిజంగా పెద్ద నిధి దొరికిందనుకో అనుభవించడానికి కలకాలం బ్రతకగలనంటావా?" అనడిగాను మళ్ళీ నేను.
'అదేం అనుమానం అసహ్యంగా?" అంది శోభ.
"ఎందుకో నాకు భయంగా ఉంది. నా పెరట్లో నిధి ఉందో లేదో నాకు తెలియదు కానీ కొంతమంది ఇతరులకా అనుమానముండి వెతుకుతున్నారని నేను గ్రహించాను. వాళ్ళకు ఎందుకా అనుమానం వచ్చిందో మాత్రం నాకు తెలియకుండా ఉంది."
శోభ తమాషాగా నవ్వి "ఉదాహరణకు నీ అనుమానం నా మీదనే ఉన్నదనుకో , డబ్బు కోసం హత్యల వరకూ వెళ్ళేటంత ధైర్యం ఉన్న మనిషిగా నేను కనబడుతున్నానా? ఏదో సామాన్య మనవురాలిని. ఉంటె కాస్త నీ డబ్బు మీద ఆశ ఉండొచ్చు" అంది.
శోభ మాటల్లో నాకు ఎన్నో అర్ధాలు గోచరించాయి. నేనామె మనస్తత్వాన్ని , అమెమనసులోని ఉద్దేశ్యాన్ని ఇంకా సరిగా అంచనా వేయలేక పోతున్నా ననే చెప్పాలి.
శోభ నా వంక ప్రేమగా చూసి "నాకు తెలీకడుగుతాను- నీ పెరట్లో నిధి వుందని నీకు తెలీదూ" అంది.
"ఎలాగని అనుకోను? ఈ ఇల్లు అమ్మ కొన్నది. అందువల్ల మా పూర్వీకులెవరైనా పెరట్లో నిధి పాతిపెట్టి ఉంచే అవకాశం లేదు. అమ్మ నా కోసం నిధిని పెరట్లో పాతిపెట్టి ఉంచగలిగేటంత ధనవంతురాలు కాదు. ఎన్నో శ్రమల కోర్చి నన్ను పెంచి పెద్ద చేసింది అమ్మ. అటువంటప్పుడు పెరట్లో నిధి ఉంటుందని నేననుకునే అవకాశ మెక్కడిది?"
"ఈ ఇల్లు కోనేముందే మీ అమ్మకు ఈ ఇంట్లో నిధి వున్నదని తెలుసుండవచ్చును. అందుకే ఆవిడ ఈ ఇల్లు కొని ఉండవచ్చును. పెరట్లో నిధి ఉన్నట్లుగా ఎన్నడు మీ అమ్మ నీకు చెప్పి ఉండలేదా?" అనడిగింది శోభ.
నేను కాస్త సూటిగానే శోభ వంక చూస్తూ ఇలా అడిగాను. "శోభా మా పెరట్లో నిధి ఉందని మా అమ్మకు తెలిసే అవకాశ మున్న్ట్లు కేవలం ఊహించి తెలుసుకోవడం సాధ్యం కాదు. నీ ప్రశ్నను బట్టి మా అమ్మకు పెరట్లో నిధి ఉన్న విషయం తెలుసునన్న సమాచారం నీకు ఖచ్చితంగా అంది వుండాలనే నేనూహించుకో గలుగుతున్నాను. ఇన్నాళ్ళ మన స్నేహాన్ని పురస్కరించుకుని ఈ నిజాన్ని నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను. చెప్పగలవా?"
"తప్పక చెబుతాను. మా ఆఫీసులో కొలిగా ఒకామెకు ఒంట్లో సరిగా లేకా జనరల్ హాస్పిటల్ లో జాయిన్ అయింది. ఆమెను చూడ్డానికి నేను వెళ్ళాను. అప్పుడు మీ అమ్మ ప్రాణాపాయ స్థితిలో వున్నది. డాక్టర్లు అనుకోని పరిస్థితి అనుకుంటూ కంగారు పడుతున్నారు.
ఆ సందర్భంలో ఆవిడ నీ పేరు కలవరించి పెరట్లో నిధి వుంది కదమ్మా నేను లేకపోయినా నువ్వు సుఖ పడతావు అంటూ కలవరించింది. ఆవిడ మాటలు నేనోక్కర్తినే శ్రద్దగా ఆసక్తితో విన్నాననుకుంటాను. అటువంటి కలవరింతలూ, పలవరింతలూ అక్కడి డాక్టర్లూ , నర్సు లకూ మామూలే కదా.
