Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 15


    "అంటే?" అన్నాడు కిల్లర్ ఆశ్చర్యంగా.
    "సీమ తమ్ముడికి ప్రైవేటు చెప్పడానికి నేను వాళ్ళింటికి వెళ్ళేవాణ్ణి. అదే మా పరిచయానికి దారితీసింది. నాకు మొహమాటం ఎక్కువ. సీమ తనే కల్పించుకొని మాట్లాడేది-"
    "ఎందుకని?"
    "మొదట్లో నాకు తెలియలేదు. కానీ తర్వాత తెలిసింది, చాలా విచిత్రమైన కేసు...." అన్నాడు నవనీత్. అతడు చెబుతున్నది కిల్లర్ కుతూహలంగా విన్నాడు.
    సీమను మోహనరావు ప్రేమించి పెళ్ళి గురించి అడగడానికి రెండేళ్ళ ముందునుంచీ నవనీత్ వాళ్ళింట్లో ప్రయివేట్ చెబుతున్నాడు. మోహనరావుతో పెళ్ళి సీమకిష్టంలేదు. ఆ పెళ్ళినుంచి తప్పించుకోవడంకోసం నవనీత్ తో ప్రేమకథను సృష్టించింది సీమ.
    "అందువల్ల ప్రయోజనం?"
    "రెండువిధాలు ఒకటి మా యిద్దరి పెళ్ళికీ తల్లిదండ్రులామోదించరు. సీమ గతం గురించి తెలిసిన మోహనరావుక్కూడా ఈ పెళ్ళంటే విముఖత బయల్దేరుతుంది కానీ అలా జరుగలేదు...."
    "నువ్వు నిజమే చెబుతున్నావా?"
    "అబద్దం చెప్పాల్సిన అవసరం నాకు లేదు..."
    "ఉంది-" అన్నాడు కిల్లర్-"నీకుద్యోగం లేదు. ఎప్పుడు దొరుకుతుందోకూడా తెలియదు. సీమను న్జంగా ప్రేమించావు. కాబట్టి నువ్వామె సుఖాన్ని కోరి పెళ్ళికి ఒప్పుకోలేదు. మోహనరావుతో ఆమె దాంపత్య జీవనం సరిగా కొనసాగాలని మీ ప్రేమ అబద్ధమని చెప్పావు."
    నవనీత్ నవ్వి-"మీ రెలాగనుకున్నా నా కభ్యంతరం లేదు-" అన్నాడు.
    "నాకు నిజం కావాలి-" అన్నాడు కిల్లర్.
    "సీమ నిజంగా నన్ను ప్రేమించలేదు. పెళ్ళిని వాయిదా వేయడంకోసమే ఆమె ఈ ప్రేమను నటించింది..."
    "మోహనరావుతో పెళ్ళి సీమకిష్టంలేదంటే- అందుకొక్కటే కారణం...ఆమె యింకెవరినో ప్రేమించి వుండాలి..." అన్నాడు కిల్లర్.
    "కావచ్చు. ఆ ప్రేమికున్ని నేను మాత్రం కాను" అన్నాడు నవనీత్.
    "పోనీ-ఎవరో నీకు తెలుసా?"
    "ఉన్నట్లు కూడా నాకు తెలియదు..."
    కిల్లర్ చటుక్కున-"నువ్వు సీమకు చివరిసారిగా రాసిన ఉత్తరం చనిపోయేముందుకూడా భద్రంగా తన వద్దనే దాచుకుంది. దాని సంగతేమిటంటావు?" అన్నాడు.
    "నేను సీమకెన్నడూ ఉత్తరాలే రాయలేదు...."
    కిల్లర్ తెల్లబోయి-"అయితే సీమవద్ధ దొరికిన ఆ ఉత్తర మెవరు రాశారు?" అన్నాడు.
    "ఏమో - నాకు తెలియదు..."
    "నువ్వు ప్రయివేట్లు చెబుతున్నావు గదా- నీ స్టూడెంట్సు గురించి ప్రిపేరు చేసిన నోట్సేమైనా నీ దగ్గరున్నాయా?" అన్నాడు కిల్లర్....
    "ఉన్నాయి-" అంటూ నాలుగు పుస్తకాలు తెచ్చిచ్చాడు నవనీత్.
    కిల్లర్ వాటిని శ్రద్ధగా పరిశీలించి-"నేను చెప్పినట్లో ఉత్తరం రాయి-" అన్నాడు.
    నవనీత్ కాగితం, పెన్నూ, అట్ట తీసుకొన్నాడు.
    "ప్రియా!" అంటూ ప్ర్రారంభించాడు కిల్లర్. నవనీత్ రాస్తూంటే అతడి ముఖభావాలనే శ్రద్దగా గమనించసాగాడు. అతడిలో యేవిధమైన ప్రత్యేక భావాలూ వుండవు.
    ఉత్తరం రాయడం ముగిసేక అందులోని దత్శూరీని నోట్సులోని దస్తూరీతో సరిపోల్చి తృప్తిగా తలాడించి-"ఈ ఉత్తరం దుర్వినియోగం చేసుకోను. నాకిస్తావా?" అన్నాడు.
    "తప్పకుండా!" అన్నాడు నవనీత్.
    "సీమ ఆత్మహత్య చేసుకుందంటే నీకేమీ అనిపించడం లేదా?...."
    "లేదు నా కష్టాలు నాకున్నాయి...." అన్నాడు నవనీత్.
    "ఓ అద్బుత ప్రేమికున్ని చూడాలని వచ్చాను. నిన్ను చూశాను. నువ్వు మీ ప్రేమ అబద్దమన్న సంగతి మోహనరావుకు చెప్పావా?" అన్నాడు కిల్లర్.
    "చెబుదామని ఒకసారి వెళ్ళాను-సీమ పెళ్ళికి ముందే! అతడు నేను మాట్లాడకుండానే నేను చెప్పదల్చుకున్నది చెప్పి-నువ్వు చెప్పాలనుకుంటున్నదిదే అయితే ఈ విష్యం సీమద్వారా నేనెప్పుడో విన్నాను అన్నాడు. నేను ఖంగారుపడి - ఇది మేమిద్దరం కలిసిఆడుతున్న నాటకమని అనుకోవద్దు. నిజంగానే మేము ప్రేమికులం కాదు- అని చెప్పాను. అతడు పెద్దగా నవ్వి యే అవగాహనా లేకుండానే మా పెళ్లెలా జరుగుతుంది? సీమ నాకు అన్నీ చెప్పింది నేనామెను నమ్ముతున్నాను - అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సీమ ఒక విచిత్ర వ్యక్తి అనిపించింది నాకు....." అన్నాడు నవనీత్.
    "నీ మాటలు నమ్మశక్యంగా లేవు..." అన్నాడు కిల్లర్.
    "నాకు తెలిసిన నిజం చెప్పాను...." అన్నాడు నవనీత్.
    "ఇంతకీ సీమ, మోహనరావు పెళ్ళికిముందే ఒకరి నొకరు బాగా అర్ధం చేసుకొన్నారని అంటావు...."
    "అవును కానీ మోహనరావు మాటలు నాకు నమ్మకం కలిగించలేదు. సీమ ఈ పెళ్ళి గురించి చాలా తీవ్రంగా ప్రతిఘటించింది...." అన్నాడు నవనీత్.
    "ఏమిటో- ముందుకు వెళ్ళినకొద్దీ కేసు మరింత అయోమయంగా తయారవుతోంది. పెళ్ళి తప్పనిసరి అని గ్రహించి సీమ మోహనరావుకు నీతో ప్రేమ అబద్దమని చెప్పి వుండవచ్చు. అయితే పెళ్ళికి ప్రతిఘటించడానికి ఆమె వేరే యువకున్ని ప్రేమించడం కారణమయుండ వచ్చు. అతడెవరో తెలుసుకోవాలి?" అని-"సీమ ఆత్మహత్య చేసుకొంటుందని నీకనిపిస్తోందా?" అన్నాడు కిల్లర్.
    నవనీత్ పెదవి విరిచి నిట్టూర్చి-"నేనేం చెప్పగలను? ఆమె గురించి నాకు తెలిసింది చాలా తక్కువ-"అన్నాడు.

                                    8

    డిటెక్టివ్ కిల్లర్ ఇన్ స్పెక్టర్ గోవర్ధన్ ని కలుసుకొని శవం దగ్గర ఉత్తరాన్నీ, నవనీత్ ఉత్తరాన్నీ సరిపోల్చి చూశాడు. రెండూ వేర్వేరు దస్తూరీలలో వున్నాయి.
    "సీమ ఆత్మహత్య చేసుకొంది. అందుక్కారణం ఆమె ప్రేమ. చివరి క్షణంవరకూ ఆమె తన ప్రియుడి ఉత్తరాన్ని తనవద్ద దాచుకొంది. మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఆ ఉత్తరం నవనీత్ వ్రాసినదై వుండాలి. ఇప్పుడు తేలిందాన్ని బట్టి సీమకు వేరే ఇంకెవరో ప్రియుడుండి వుండాలి. ఆ ప్రియుడి గురించి సీమ తల్లిదండ్రుల క్కూడా తెలియదు...." అన్నాడు కిల్లర్.
    "మనమూ తెలుసుకోవద్దు. ఊరుకుందాం-" అన్నాడు గోవర్ధన్.
    "నేనూరుకోలేను...."
    "తెలుసుకొని ఏం చేస్తారు?"
    "అతడే హంతకుడు కావచ్చు...."
    "ఎలా?"
    "నా అభిప్రాయంలో సీమ తన ప్రియుడివల్ల బాగా ప్రభావితమైంది. ఏ కారణంవల్లనో అతడి గురించి ఆమె యింట్లో చెప్పుకోలేకపోయింది. తాత్కాలికంగా నవనీత్ ని ఉపయోగించి పెళ్ళి తప్పించుకోవాలనుకొంది. ఫలించలేదు. అప్పుడు నిజంగానే ఆమె ఎటూ తేల్చుకోలేకపోయింది.
    ఆమెలో రెండు భావాలమధ్య పోరాటం ప్రారంభమై భిన్న వ్యక్తిత్వాలకు రూపకల్పన జరిగింది ఒక వ్యక్తి మోహనరావును ద్వేషించాలనుకొంది. రెండో వ్యక్తి మోహనరావును ప్రేమించాలనుకొంది. అందుకే ఆమె విచిత్రంగా ప్రవర్తించింది.
    ఈలోగా ఆమె ప్రియుడామెను కలుసుకొన్నాడు. సీమను తనదాన్ని చేసుకోవాలని ప్రయత్నించాడు. సీమ భర్తను ద్వేషిస్తోంది కానీ ప్రియుడికి చేరువకాలేకపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS