వెంకన్న మళ్ళీ చెప్పాడు.
"అందుకు ఋజువు వుందా?"
"నేనే అందుకు ఋజువు...."
"మీ ఋజువులు నేను నమ్మను...." అంది జానకి.
"ఈ హత్యకు అతడు సాయం కోరాడు. పదివేల రూపాయల ప్రతిఫలానికి నేను రాత్రి పన్నెండింటికి మీ యింటికి వచ్చి అతడికి రివాల్వర్ ఇస్తాను. అతడు హత్య చేస్తాడు. అదీ పధకం. ఇప్పట్లో మీకేమైనా సందేహాలున్నా రాత్రి పన్నెండింటికి మీకింకే సందేహాలు ఉండవు...." అన్నాడు వెంకన్న.
"ఇంతకూ డిటెక్టివ్ గా మీరు చేసే పనేమిటి? హంతకులకు హత్యల్లో సాయపడడమా?"
"అవును....నిజమే! ఇంతకీమీ భావమేమిటి?"
"మీ భర్త మిమ్మల్నేందుకు హత్య చేయాలను కుంటున్నాడో తెలుసా?' అన్నాడు వెంకన్న.
"తెలియదు...." అంది జానకి.
వెంకన్న క్లుప్తంగా సూర్యారావు కధ చెప్పాడు.
"మైగాడ్! అయన మనసులో ఇన్ని ఆలోచనలుంటే మాట వరసకైనా ఒక్కసారి నాతొ అనలేదు." అంది జానకి. ఆశ్చర్యం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనబడుతోంది.
"అదాయన మంచితనం అనుకోండి. మీమటుక్కు మీరు ఆయనతో నిజం దాచకుండా కిషోర్ తో పెళ్ళి ముందు మీకున్న సంబంధం గురించి ముందుగానే చెప్పి వుంటే అయన మీ తప్పు క్షమించి వుండేవారు. అనవసరంగా ఆ రహస్యం దాచి మీరాయన్ని క్షోభ పెట్టి మీపట్ల మనసు విరిగిపోయేలా చేసుకున్నారు....' అన్నాడు వెంకన్న.
"నా ప్రవర్తనలో ఆయనకేమైనా తప్పు కనిపించిందా?" అంది జానకి.
"లేదు. అది వెతికి పట్టుకునేందుకు అయన నన్ను నియమించాడు. నేను శాయశక్తులా ప్రయత్నించి విఫలుడై విసిగిపోయి మిమ్మల్ని చంపేయమని సలహా కూడా ఇచ్చాను. అందుకోసం అయన ఉదయం నా దగ్గరకు కాలేజీ రోజుల్లో మీకు బహుమతిగా వచ్చిన కత్తి తీసుకుని వచ్చి చూపించాడు...." అంటూ వెంకన్న తను రివాల్వర్ ఇస్తానన్న ఉదంతం చెప్పాడు.
"అయితే యిప్పుడు నన్నేం చేయమంటారు?' అంది జానకి.
'చేసిన తప్పు ఒప్పుకుని ఆయన్ను క్షమాపణ వేడుకొండి...."
"తప్పు చేయలేదనే అనడానికి నేను సిద్దపడితే...."
"ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఎక్కడికైనా పారిపోండి--"
జానకి అదోలా నవ్వి -- "మృత్యువు నిజంగా తరుముకుని వస్తుంటే మనిషి ఎక్కడని దాగుంటాడు? ఎక్కడ దాగున్నా మృత్యువు మనిషిని వదిలి వేడుతుందా?' అంది.
"నేను మిమ్మల్ని మృత్యువు బారి నుండి రక్షించగలను. మీరు నాకు గత చరిత్ర చెప్పాలి...." అన్నాడు వెంకన్న గంభీరంగా.
"నా గత చరిత్ర ఏమిటని మీ ఉద్దేశ్యం?'
"మీ గత చరిత్ర ఏమైనా అందులో కిషోర్ వున్నాడు...."
జానకి వెంకన్న వంక చురుగ్గా చూసి -- "ఇది పూర్తిగా మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం. ఇందులో ఇతరుల జోక్యం నేను సహించను. ప్రమదం గురించి హెచ్చరించినందుకు మీకు నా ధన్యవాదాలు. ఇంక మీరు నన్నేమీ అడగొద్దు...." అంది.
12
అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం....
వెంకన్న ఆ యింటి తలుపు తీశాడు. తీయగానే తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు తెరుచుకోగానే హాల్లోంచి సోఫాలో కూర్చుని వున్న సూర్యారావు అతన్ని కలుసుకుని -- "ఆమె నిద్రపోతోంది--' అన్నాడు.
వెంకన్న ఆశ్చర్యంగా -- "ఆమె నిజంగా నిద్రపోతోందా?" అన్నాడు.
"ఏం -- మీకా అనుమానమెందుకు వచ్చింది?" అన్నాడు సూర్యారావు ఆశ్చర్యంగా.
"మీ ప్రవర్తనలో ఎక్కడా రాత్రి జరగబోయే ఘోరం గురించి ఆమెకు సూచనలందలేదా?" అసలే ఆమె ఎంతో తెలివైనది ....." అన్నాడు వెంకన్న.
"ఎవరి తెలివికైనా పరిమితి వుంటుంది...." అన్నాడు సూర్యారావు-- "నేను తన్ను హత్య చేస్తానని ఆమె కలలో కూడా ఊహించను...."
"ఈరోజామే ప్రవర్తన ఎలా వుంది?'అనడిగాడు వెంకన్న.
"ఎలా అంటే?"
"తనకేదైనా హెచ్చరిక అందినట్లుగా ప్రవర్తించిందా?"
"హెచ్చరిక యెందుకు అందుతుంది? ఎవరు అందిస్తారు?"
"తెలివైనవారికీ ఒకోసారి మానవాతీత శక్తులు సాయపడుతుంటాయి. దాన్ని ఇంట్యుషన్ అని అంటారు. ఆమెకు ఇంట్యూషన్ ఎక్కువని నాకు నమ్మకం --" అన్నాడు వెంకన్న.
"అలాంటి దేమీ లేదు. రోజూలాగే ఉందామె ప్రవర్తన!" అన్నాడు సూర్యారావు.
తన హెచ్చరిక వినకుండా ఆమె రోజులా ఉండగలిగిందంటే ఆమె గుండెలు తీసిన బంటే అయుండాలి. ఇలాటి మనిషి చచ్చినా సరే కిషోర్ తో తనకున్న సంబంధం గురించి ఒప్పుకోదు. తన ఆఖరి అస్త్రం ఎలా పనిచేస్తుందో చూడాలి మరి! ఇప్పుడు సూర్యారావు కంటే ఎక్కువగా ఆమె గత చరిత్ర గురించి వెంకన్నకు కుతూహలం గా వుంది. తన తెలివి తేటలు వృధా -- ...." ఆమె గురించిన రహస్యం విడదీయ లేకపోతే !
"రివాల్వర్ తెచ్చారా?'ఆత్రుతగా అడిగాడు సూర్యారావు.
వెంకన్న రివాల్వర్ అతడికి అందించి - "వెళ్ళి ఆమెను నిద్రలేపి -- మీ నాటకం ఆరంభించండి ...." అన్నాడు.
సూర్యారావు పడకగదిలోకి నడిచాడు. వెంకన్న గుమ్మం పక్కగా నిలబడ్డాడు.
మంచం మీద నిద్ర పోతోంది జానకి! ఎంతో అందంగా అమాయకంగా వున్నాదామే! స్వచ్చటి నిండి వున్నాదామే ముఖంలో....సూర్యారావామెను తట్టి లేపాడు. కళ్ళు నులుముకుంటూ లేచిందామె.
'ఆమె నిజంగానే నిద్రపోయింది- ' అని గ్రహించిన వెంకన్న కు కలిగిన ఆశ్చర్యమింతా అంతా కాదు.
"ఏమిటండీ--"అంది జానకి మత్తుగా.
"నా చేతిలో ఇదేమిటో చూశావా?" అన్నాడు సూర్యారావు కటువుగా.
"జానకి ఉలిక్కిపడి -- "రివాల్వర్ -- ఇదెందుకు మీకు?" అనడిగింది.
"ఎందుకా -- నిన్ను చంపడానికి ...." అన్నాడు సూర్యారావు.
"నన్ను చంపుతారా -- ఎందుకు?" అంది జానకి.
"కిషోర్ కీ నీకూ వున్న గత చరిత్ర నాకు చెప్పకుండా దాచినందుకు...." అన్నాడు సూర్యారావు.
'దాచకుండా చెబితే ఏం చేసేవారు?"
"నిన్ను క్షమించి ఉండేవాడ్ని...."
"అలా క్షమించే భర్తంటే నాకు అసహ్యం. అందుకే నేను మీకది చెప్పలేదు--" అంది జానకి.
"ఎందుకని?" అన్నాడు సూర్యారావు. ఆమె అలా అంటుందని అతడూహించినట్లు లేదు.
"భార్య ఏదో తప్పు చేసిందనీ -- ఆ తప్పు దాచి పెట్టిందని, తెలిసిన భర్త -- అ తప్పు ఆమె చేత ఒప్పించి అప్పుడామేకు క్షమాభిక్ష పెట్టాలనుకుంటే - అంతకంటే చచ్చు మగాడుండడు...."అంది జానకి.
"మరేం చేయాలి?" అన్నాడు సూర్యారావు దిగులుగా. అతని ధైర్యం అడుగంటింది.
"దమ్ముంటే భార్యను నిలదీసి అడగాలి. లేదా ఆమెను చంపేయాలి...."
"చంపెయాలా?" ఆశ్చర్యంగా , భయంగా అడిగాడు సూర్యారావు.
"అంతే -- కిషోర్ అయితే అదే పని చేసి వుండేవాడు...."
సూర్యారావు రక్తం మరిగింది -- "సిద్దంగా వుండు. నేనూ అదేపని చేయబోతున్నాను...."
"నేను కోరుకున్నది కూడా ఇదే -- వెంటనే ట్రిగ్గర్ నొక్కండి --" అంది జానకీ.
"నువ్వు....నన్ను చంపమని అడుగుతున్నావా?" అన్నాడు సూర్యారావు.
"అవును-- మన పెళ్ళయ్యాక మీరు చేతకాని వాళ్ళని ఇంట్లో అంతా చెప్పుకునేవారు. అది నిజం కాదని కనీసం నా మనసుకు తెలిసినా బాగుండుననిపించింది. - మిమ్మల్ని కిషోర్ అని పిలుస్తానన్నాను. మీరు ఒక్కసారి కూడా ఏమిటా పేరు, అందుక్కారణమేమిటి-- అని అడగలేదు. కొంత కాలం నుండి అతడి పేరు నిద్రలో కలవరించాను. అప్పుడూ మీరు నన్ను కిషోర్ గురించి అడగలేదు. ఆఖరికి మీకోసం డైరీ రాయనారంభించాను. అందులో కిషోర్ గురించి రాసుకునేదాన్ని. అది చదివి కూడా మీరావేశపడలేదు. అంటే నా సమర్ధత నుపయోగించుకుంటూ అనామకుడిగా బ్రతకడానికే సిద్దపడ్డారు మీరని నాకర్ధమైంది. అందుకు నాకెంతో బాధ కలిగింది. కిషోర్ కూ నాకు ఏ సంబంధం లేదు. ఆ కిషోర్ ఎవరో తెలుసుకుని వాడి కంటే ఉన్నత స్థానానికి వెళ్ళాలని మీరనుకుంటారని ఆశించాను. జీవితంలో కష్టపడి ఏమైనా సాధించవచ్చునని నిరూపించిన కిషోర్ మీలో అసూయను రేపి -- మీ మగతనాన్నీ పురుషహంకారాన్ని రెచ్చగొట్టి మిమ్మల్నొక సమర్ధుడైన మగవాడుగా తయారు చేస్తాడని ఆశించాను. అది జరిగినా జరక్కపోయినా ఆఖరికి మీరు నన్ను చంపాలనుకునే పౌరుషమైనా సంపాదించారు. అందుకే నాకెంతో సంతోషంగా వుంది. మీలో ఈ పౌరుషాన్నే నేను కోరుకునేది. చంపండి-- నేను సిద్డమే!" అంది జానకి.
సూర్యారావు తెల్లబోయి -" నువ్వు రాసిన డైరీ కూడా అబద్దమా?' అన్నాడు.
"అది డూప్లికేట్ డైరీ అని నేనీ క్షణమే రుజువు చేయగలను. అసలు డైరీ మీకు కనబడకుండా నేనే ఉంచుకుంటూన్నాను ...." అంది జానకి.
"జానకీ -- నేను నీకు తగను. నువ్వు నన్ను బాగుచేయాలని ప్రయత్నిస్తుంటే నేను తప్పుదారిలోనే నడుస్తున్నాను. నేను జీవించ తగను....'అంటూ సూర్యారావు చటుక్కున తన్ను తనే పేల్చుకుని నిలువునా కూలబడ్డాడు.
జానకి ఒక్క ఉదుటున్న మంచం దూకి -- "ఏమండీ -" అంటూ సూర్యారావును సమీపించింది. అదే క్షణంలో వెంకన్న కూడా గదిలో ప్రవేశించి -- "భయపడకండి జానకి గారూ!" ఆ రివాల్వర్ లో గుళ్ళు ప్రాణాలు తీయవు. మనిషి కి స్పృహ తప్పిస్తాయి. అంతే!" అని - "మిమ్మల్ని చూసేవరకూ నా తెలివి తక్కువ తనం అర్ధం కాలేదు. ఎంతో తెలివిగా మీ గత చరిత్ర కప్పి పెడుతున్నారనే భావించాను గానీ -- అంత తెలివైన మీరు మీ డైరీని మీ భర్త కళ్ళబడకుండా ఎందుకు దాచలేదూ అని ఆలోచించలేక పోయాను...." అన్నాడు.
"ఆయనకు ఎప్పుడు స్పృహ వస్తుంది!" అంది జానకి బేలగా.
"కొద్ది నిముషాల్లో వస్తుంది. స్పృహ వచ్చేక అతడు పునర్జన్మ ఎట్టినట్లే నని భావిస్తున్నాను....' అంటూ వెంకన్న తన రివాల్వర్ తీసుకుని అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
----:అయిపొయింది :-------
