Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 15

 

    సత్యం వడికి తట్టుకుంటూ ప్రకాశాన్ని మోసుకుని ఓ పది నిమిషాలసేపు నడిచి ఒడ్డు చేరాడు. అక్కడతన్ని పడుకోబెట్టి తనూ సొమ్మసిల్లి పడిపోయాడు. అలా ఇద్దరూ అక్కడెంత సేపున్నారో తెలియదు. కానీ ముందు సత్యానికే మెలకువ వచ్చింది. అప్పుడతను ప్రకాశాన్ని పరీక్షించి చూశాడు.
    అతడి చేయి బాగా కాళింది. మనిషి వళ్ళు వేడిగా వుంది. భయం వల్లనో, నీటిలో బాగా తడవడం వల్లనో అతడికి బాగా జ్వరం వచ్చినట్లుంది. అతడి శరీరం తడిమి చూస్తున్నప్పుడు సత్యానికి పాంటు జేబులో తోలు సంచీ తగిలింది. దాన్ని బయటకు తీశాడు. జిప్ లాగి చూశాడు.
    అందులో బంగారు నగలున్నాయి.
    సత్యాని కిప్పుడు తృప్తిగా వుంది. ఈ నగలు తను దొంగతనం చేసి తీసుకోవడం లేదు. ఒక మనిషి ప్రాణాలు రక్షించి తీసుకుంటున్నాడు.
    తోలు సంచీ ని తన జేబులోకి తోసేసి అక్కణ్ణించి కదిలాడు సత్యం. అయితే ప్రకాశాన్నలా వదిలి వెళ్ళడానికి అతడికి మనసొప్ప లేదు. చుట్టూ పక్కల ఏదైనా ఊరుందేమో నని చూశాడు. కాలిబాటల ను బట్టి దగ్గర్లో ఏదో ఊరున్నట్లే వుంది.
    సత్యం ప్రకాశాన్ని భుజం మీద వేసుకున్నాడు. అతడికి నీరసంగా వుంది. అయినా తప్పదు!'
    భగవంతుడు కరుణామయుడు! మృత్యువు వాడి కోరల నుంచి తామిద్దరూ వెంట్రుక వాసిలో తప్పించుకుని బయట పడ్డారు.
    అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఊరోకటుంది. సత్యం అక్కడి ప్రజలకు తమ దుస్థితి వివరించాడు. ప్రకాశం ఊరి వివరాలు చెప్పాడు. అతణ్ణి కాస్త జాగ్రత్త గా చూడమని చెప్పాడు.
    ఆ ఊళ్ళో నూ హడావుడిగా వుంది. వరదలక్కడికి రాకపోవడం చాలా అదృష్టంగా చెప్పుకుంటున్నారు. ప్రకాశం గ్రామానికి యీ గ్రామానికి ప్రస్తుతం మాట్లాడే దారి కూడా లేదు. అదృష్టవశాత్తు అక్కడో డాక్టరు న్నాడు. అయన ప్రకాశానికి వైద్యం చేస్తున్నాడు.
    ప్రకాశానికి స్పృహ వచ్చేవరకూ ఎక్కడికీ వెళ్ళవద్దని ఆ ఊరి వాళ్ళు సత్యాన్ని కోరారు. కానీ సత్యం అందుకంగీకరించలేదు. అవతల తనవాళ్ళు తన కోసం కంగారు పడుతుంటారన్నాడు. ఏదో విధంగా విశాఖపట్నం చేరాలన్నాడు. అతను వెళ్ళిపోయాడు.
    నీటిలో ఉన్నంతసేపూ అంతకు ముందు ఒంటరిగా ఉన్నంతసేపూ సత్యానికి ప్రకాశమంటే భయం లేదు. ప్రకాశం సత్యం కంటే బలహీనుడు. అందువల్ల దొంగతనానికి బాధలేదు. నీట్లో ప్రకాశానికి ఈత రాదు. ఒక మనిషిగా సత్యం అతన్ని రక్షించాడు కానీ ఇప్పుడు మరో గ్రామ ప్రజల మధ్య అతను మనిషికాదు దొంగ! అందవల్ల అతనక్కడ ఎక్కువసేపు ఉండడు. ఉండలేడు. మనుషుల మధ్యన దొంగలకు రక్షణ లేదు.
    
                                   4
    ఆ ఊళ్ళో ప్రకాశం రెండు రోజులున్నాడు. అతడికి స్పృహ రావడానికే ఒక రోజు పట్టింది. ఆతర్వాత పరిసరాలు తెలుసుకోవడానికి మరో రోజు పట్టింది.
    "చాలా అదృష్ట వంతులు! సమయానికి వైద్యం జరిగింది" అన్నాడు డాక్టర్.
    "మీ ఋణం ఎలా తీర్చుకునేది డాక్టర్ - నన్ను బ్రతికించారు" అన్నాడు ప్రకాశం.
    "నిజానికి నిన్ను బ్రతికించింది నేను కాదు - నీట్లో అపస్మారక స్థితిలో ఉండగా అతను నిన్నెలా రక్షించగలిగాడో నా కర్ధం కావడం లేదు -- ఏదో మానవాతీత శక్తి ఆ రూపంలో నిన్ను కాపాడిందని పిస్తోంది !" అన్నాడు డాక్టర్.
    ప్రకాశం ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. అతడికి సత్యం గుర్తుకొచ్చాడు. ఎలక్ట్రిక్ పోల్ మీద తను వాడితో అన్న మాటలు గుర్తు కొచ్చాయి. దొంగయినా సరే తానతడిని నమ్ముతానన్నాను. అతని కోసం ఏమైనా ఇస్తానన్నాడు. ఆఖరికి తన దగ్గరున్న బంగారం సంతోషంగా అతడికిస్తానన్నాడు.
    ప్రకాశాని కిప్పుడు తన బంగారం గురించి గుర్తు కొచ్చింది. అప్రయత్నంగా జేబులు తడిమాడు.
    "డాక్టర్! నా జేబులో ఓ తోలు సంచీ వుండాలి. లేదు! అన్నాడు ప్రకాశం.
    "ఆ మహా ప్రవాహం లో తోలు సంచీ లేమిటి? ఈ తోలు తిత్తి దక్కడమే అదృష్టం!' అన్నాడు డాక్టర్ ఉత్సాహంగా వేదాంతం మాట్లాడుతూ.
    "అది కాదు డాక్టర్! నాకు షాక్ కొట్టి పడిపోయేవరకూ కూడా అది నా జేబులోనే వుంది. ఈ పాంట్ జేబులోంచి అది పోవడం అసాధ్యం. అతడే తీసి వుంటాడని నా నమ్మకం !" అన్నాడు ప్రకాశం.
    అతనలా సత్యం మీద అభాండం వేయడం డాక్టర్ కి నచ్చినట్లు లేదు. అయన ముఖ కవళికల్ని బట్టి ప్రకాశం అది ఊహించి సత్యానికీ తనకూ గల కధంతా చెప్పాడు.
    'అయితే ఇందుకన్న మాట -- అతనిక్కడి నుంచి పోవాలని త్వరపడింది ...." అన్నాడు డాక్టర్.
    'ఇంతలో ఏమయింది లెండి. నేను విశాఖపట్నం లో వెంకటరత్నం షాపులో బంగారం కొన్నాను. దానికి ప్రత్యెక మైన మార్కులున్నాయి. ఇతగాడు దాన్నేక్కడ మార్చడానికి ప్రయత్నించినా దొరికిపోతాడు. పోలీస్ రిపోర్తిచ్చానంటే...." అన్నాడు ప్రకాశం ఏదో ఆలోచిస్తూ.
    "వెర్రి వాడా- నగలు నగల్లా ఎవ్వరూ అమ్మరు. వాటిని కరిగించేస్తారు" అన్నాడు డాక్టరు.
    "అయినా నా తృప్తి నాది. ఒకటి కాదు .....రెండు కాదు పదమూడు వేల రూపాయల బంగారం. వాణ్ని వదిలి పెడతానా? పోలీస్ రిపోర్టిచ్చి తీర్తాను. అదీకాక వాడు మళ్ళీ ఎప్పుడు కనిపించినా గుర్తు పట్టగలను నేను" అన్నాడు ప్రకాశం పట్టుదలగా.
    ప్రకాశం సత్యాన్ని పట్టుకోగలడా? పట్టుకున్నా అతడి నగలతడికి దొరుకుతాయా?
    ఈ ప్రశ్నలకు జవాబు లంత ముఖ్యం కాదు.
    ప్రాణాలకు తెగించి ఓ మనిషి ప్రాణాలు కాపాడే మానవత్వం వున్న సత్యం దొంగ ఎలా అయ్యాడు? ఎందుకయ్యాడు? ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దగ్గరున్న బంగారాన్ని కానుకగా ఇవ్వాలనుకుని- ప్రాణాపాయం తప్పగానే- ఆ బంగారం తీసుకున్నందుకే సత్యాన్ని జైల్లో వేయిన్చాలనుకునే ప్రకాశం వంటి మానవత్వం లేనివారే - సత్యం వంటి వారిని దొంగలుగా మారుస్తున్నారా ?    
    నిజానికి దేశానికి, సమాజానికి అసలైన ప్రమాదకారులేవరు? దొంగలా? హంతకులా? లేక వారిని తయారు చేస్తున్న మానవత్వం లేని మనుషులా?

                                        ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS