"తెలివిగా పని పూర్తీ చేస్తే....?"
"బహుమతి వుంటుంది. జీతం కాక అదనం...."
'అయితే నాకు బహుమతి తధ్యం" అన్నాను.
'తాయిలమంటే ఎవరికైనా ఆశే. నువ్వు శ్రద్దగా పని చేస్తానని నాకు నమ్మకం..." అన్నాడు గోవిందరాజులు.
తాయిలమన్న పదం వినగానే గోవిందరాజుల్ని నేను గుర్తుపట్టాడు.
"మేస్టారూ?" అన్నాను ఆశ్చర్యంగా.
గోవిందరాజులు వులిక్కిపడి -- "మేస్టారేమిటి -- ఎవర్నువ్వు?" అన్నాడు . అతడి ముఖంలో కంగారు కూడా వుంది.
"చిన్నప్పుడు నాకు ప్రతిదానికీ తాయిలమిస్తానని ఆశ పెట్టేవారు. గుర్తు లేదా మేస్టారూ - నేను రామనాదాన్ని!' అన్నాను.
వేషం మారడం వల్ల గుర్తుపట్టడం ఆలస్యమైంది కానీ - మేస్టారి లో పెద్ద మార్పులేదు.
గోవిందరాజులు తను సీతారామయ్య మేస్టర్నేనని ఒప్పుకొన్నాడు. నన్ను గుర్తు పట్టడానికతడికి కాసేపు పట్టింది. "గుర్తించలేక -- "నువ్వా- రా- కూర్చో!" అన్నాడు.
ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం.
"నువ్విక్కడేలా చేరావు?" అన్నాడు గోవిందరాజులు.
నేను నా పరిస్థితి వివరించి చెప్పి - "మేస్టారూ -- మీరు చెప్పిన ఆశయాలు వంట పట్టించుకుని నేను దేశానికు పయోగ పడాలనుకుంటున్నాను. మీరేమో పేరు కూడా మార్చుకుని- ఇలాంటి సంస్థలో చేరారు. నాకు చాలా బాధగా వుంది" అన్నాను.
గోవిందరాజులు నిట్టూర్చి - "నా గత చరిత్ర మర్చిపో. నన్ను గోవిందరాజులు గానే గుర్తుంచుకో -- " అన్నాడు.
"కానీ మీరెందు కిలా మారారు?"
"స్వార్ధం .'
"నేను నమ్మలేను."
"జరిగింది చెబితే నువ్వు నమ్ముతావు.'
'అసలేం జరిగింది ?'
"ఆర్ధిక ఇబ్బందులలో ఈ ఊళ్ళో అడుగు పెట్టాను -- ఎనిమిదేళ్ళ క్రితం. అప్పుడు నా కూతురు లక్ష్మీకి పద్నాలుగేళ్ళు . కానీ మనిషి ఏపుగా ఎదిగి పద్దెనిమిదేళ్ళ పిల్లలా వుండేది. దాన్ని ప్రేమ పేరుతొ ఓ వంచకుడు మోసం చేశాడు. ఎలా తీశాడో నగ్నంగా ఫోటోలు తీశాడు. అవి బట్టబయలు చేస్తానని బెదిరించి నన్నీ సంస్తలోచేర్చాడు. ఈ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేయబడుతున్నావారే!"
నేను ఆశ్చర్యంగా - "లక్ష్మీకి పెళ్ళయిందా?" అన్నాను.
"లేదు. ఆ ఫోటోలు సంస్థలో వుండిపోయాయి. పదేళ్ళు నమ్మకంగా పని చేస్తే తప్ప నాకా ఫోటోలు తిరిగి రావు. ఫోటోలు తిరిగి వచ్చేవరకూ లక్ష్మీకి పెళ్ళి చేయలేను." అన్నాడు గోవిందరాజులు.
"ఎందుకని?"
"దాని జీవితం నాశనం కాకుండా ఉండడానికి?"
"మేస్టారూ ఆ ఫోటో లేక్కడుంటాయి?"
"నాకు తెలియదు."
"పదేళ్ళ తర్వాత వెనక్కు వస్తాయన్న గ్యారంటీ వుందా?"
"లేదు"
"ఇది చాలా అన్యాయం "అన్నాను.
"ఆ విషయం గురించి ఆలోచించకు."
"మేస్టారూ! ఆ ఫోటోలు బయటకు తెచ్చి మిమ్మల్నీ విష వలయం లోంచి తప్పిస్తాను. మీరిలాంటి చోట పని చేయడం నాకెంతో బాధగా వుంది ." అన్నాను.
"అది నీ వల్ల కాదు."
"ప్రయత్నిస్తాను మేస్టారూ."
"నేను చెడిపోయాను. నువ్వు నా గురించి ఆలోచించకు ఈ సంస్థలో చేరి నువ్వూ చెడిపోతావు. అందుకు వ్యతితెరేకంగా నిన్ను ప్రోత్సహించే అర్హత నాకూ లేదు కాబట్టి ఇప్పుడు నీకు నీ పని చెబుతాను . శ్రద్దగా చేయి-" అన్నాడు గోవిందరాజులు.
"చెప్పండి?" అన్నాను.
"మరోసారి హెచ్చరిస్తున్నాను. అతి తెలివికి పోయావంటే నాశనమయ్యేది నీ భవిష్యత్తే!" అన్నాడు గోవిందరాజులు.
"గుర్తుంచు కుంటాను...." అన్నాను.
3
పని తేలిగ్గానే అయిపొయింది. నాకు అయిదు వందల రూపాయలు బహుమతిగా లభించాయి. ఎంతో సంతోషం కలిగింది.
సాయంత్రం మేస్తారింటికీ వెళ్ళాను.
ఇంట్లో మేస్టారి భార్య అంబిక వుంది. ఆమెలో బాగా మార్పు వచ్చింది . అప్పట్లో సన్నగా , నాజుగ్గా వుండేది. ఇప్పుడు బాగా వళ్ళు చేసింది.
నేను నా గురించి పరిచయం చేసుకొని -" మేష్టారింట్లో వున్నారా ?" అని ఏమీ తెలియనట్లడిగాను.
ఆమె సంతోషంగా - "ఇంకా రాలేదు. వచ్చేసరికి లేటవుతుంది. నువ్వు బాగా మారిపోయావు" అంది.
"లక్ష్మీ వుందా ?" అన్నాను.
వెంటనే ఆమె ముఖం అదోలాగై పోయింది- "పిలుస్తా నుండు " అంటూ లోపలకు వెళ్ళింది.
మేష్టారింటి వైభవం నాకస్చార్యం కలిగిస్తోంది.
విశాలమైన పెద్ద యిల్లది. ఇల్లంతా ఖరీదైన ఫర్నిచరు తో నిండివుంది. మేష్టారి భార్య ఇంట్లో కూడా పట్టుచీర కట్టుకుని తిరుగుతోంది.ఆమె మెడ నిండా నగలున్నాయి.
కాసేపట్లో లక్ష్మీ వచ్చింది.
ఆమెను చూసి బాగా ఆశ్చర్యపోయాను.
వయసు స్త్రీలో ఎలాంటి మార్పులు తెస్తుంది ?
నాకు తెలిసిన లక్ష్మీకి ఈ లక్ష్మీకి ఏమీ పోలిక లేదు. అప్పుడు లక్ష్మీకి ఆరేడేళ్ళు. మనిషి చామన ఛాయా యినా నలుపుకు దగ్గర్లోనే వుండేది. కోలముఖం -- పెద్ద పెద్ద కళ్ళు. ముఖమంతా కళ్ళేనా అనిపించేటట్లు ఉండేవా కళ్ళు ముక్కు సూదిగా వుండేది.
ఇప్పుడు లక్ష్మీ అప్సరసలా వుంది. మనిషికి బాగా రంగు వచ్ఘింది. కళ్ళు మరీ అంత పెద్దవిగా లేవు కానీ ముఖానికి కళ్ళే అందమనిపిస్తున్నాయి.
"గుర్తున్నానా?' అన్నాను.
ఆమె తల అడ్డంగా ఊపింది.
"పోనీ -- నేనెవరో తెలుసా?"
"అమ్మ చెప్పింది --" అంది.
ఇప్పుడు లక్ష్మీకి ఇరవై రెండేళ్ళు. నాకంటే మూడేళ్ళు చిన్న.
నేను లక్ష్మీని పెళ్ళి చేసుకుంటే ?
మేష్టారి సమస్య పువ్వులా విడిపోతుంది.
అప్పుడు నేను ఆ ఫోటోలు సంపాదించనవసరం లేదు.
లక్ష్మీని చూసేవరకూ ఈ ఆలోచన నాకు రానేలేదు.
మేస్టారి భార్య నాకోసం టిఫిన్ తీసుకొని వచ్చింది. నేను తింటుండగా గోవిందరాజులు వచ్చాడు.
నన్ను చూస్తూనే - "వెరీ గుడ్! ఇంటి కొచ్చావన్న మాట --" అన్నాడు గోవిందరాజులు.
"మేస్టారూ ! మీతో ప్రయివేటుగా మాట్లాడాలి --" అన్నాను.
గోవిందరాజులు సరేనని నన్ను వేరే గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ గదిలో ఖరీదైన కార్పెట్ పరిచి వుంది. గోడకు ఒక మూలగా నేలమీదే పరుపులు పరిచి వున్నాయి. నేను, మేష్టారు వాటిపై కూర్చున్నాం.
"మీ సమస్యకు పరిష్కారం ఆలోచించాను. నేను లక్ష్మీని పెళ్ళి చేసుకొంటాను" అన్నాను.
గోవిందరాజులు తెల్లబోయి -"ఎందుకు ?' అన్నాడు.
"మిమ్మల్ని తిరిగి సీతారామయ్య మేస్టారిగా చూడాలనుంది నాకు...." అన్నాను.
"ఫోటోల సంగతి తెలుసు గదా నీకు?"
"తెలిసింది నాకు కాబట్టి లక్ష్మీ భవిష్యత్తు గురించి మీరేమీ బెంగ పెట్టుకోనక్కర్లేదు."
"ఈ పెళ్ళికి నీ తలిదండ్రులు లోప్పుకోరు."
"వాళ్ళ అనుమతి నా కవసరం లేదు."
'అయితే ఒక విషయం నువ్వాలోచించాలి."
"చెప్పండి."
"లక్ష్మీ నా కూతురు. నువ్వు నా శిష్యుడివి. ఒకరి కారణంగా ఒకరికి అన్యాయం జరగడం నాకిష్టం లేదు. లక్ష్మీకి తీసిన ఫోటోలు నేను చూడడం నా దురదృష్టం. అయితే ఒక విషయం చెప్పగలను లక్ష్మీ సహకారం లేకుండా ఆ ఫోటోలు తీయడం ఫోటో గ్రాఫర్ కు సాధ్యం కాదు."
'అంటే?"
"ప్రేమ మైకంలో లక్ష్మీ తప్పు చేసిందని నా ఉద్దేశ్యం ."
"తప్పు చేసినా లక్ష్మీని నేను క్షమించగలను. తప్పు చేయడం మానవ సహజం. మీ అమ్మాయి ఒకసారికి మించి తప్పు చేయలేదని నా నమ్మకం.
గోవిందరాజులు తడబడ్డాడు -- 'సరే-- ఈ విషయంలో త్వరపడి ఒక నిర్ణయానికి రాకు. కొంతకాలం వేచి వుండు."
"మేష్టారూ ! మీకీ విష వలయం నుంచి బయటపడాలని లేదా?" అన్నాను.
"వుంది, కానీ నిన్ను బలిపశువును చేయలేను. ప్రస్తుతానికింకేమీ అడక్కు " అన్నాడు గోవిందరాజులు.
4
ఉద్యోగంలో జేరి నెల్లాళ్ళయింది. మొదటి జీతం అందుకొన్నాక నాకెంతో ధైర్యం వచ్చింది.
మొట్టమొదటి వేరే యిల్లు చూసుకొన్నాను.
జీతం పన్నెండువందలు అందులో మూడు వందలు నేనుండే గదికి అడ్వాన్సు ఇచ్చాను. మూడు వందలు పెట్టి దూరపు బంధువులింట్లో వాళ్ళకు చిన్నచిన్న బహుమతులిచ్చాను.
ఈనెల రోజుల్లోనూ మొత్తం మూడు సాహస కార్యాలు చేసి రమారమి రెండు వేలు సంపాదించాను. మొదటిసారి మాత్రమే గోవిందరాజులు ద్వారా పనిచేశాను. రెండో సారి, మూడోసారి బాస్ తనే నాకు పని చెప్పాడు. పని ముగిసేక సెబాస్ అని కూడా అన్నాడు.
