వాడన్న దుష్టశిక్షణ అన్నపదం నాకు నచ్చింది. నేను మాదురిని హత్యచేయడాన్ని వాడు దుష్టశిక్షణగా అభివర్ణించడం నా మనసుకు బాగుంది. నేనుచేసింది మంచైనా చేద్దయినా దాన్నెవరైనా సమర్ధిస్తే నాకు కొండంతబలం వస్తుంది.
వాడిని వదిలిపెట్టేయాలని నిశ్చయించుకున్నాను. వాడు నన్నేమీ చేయలేడని నాకు అనిపించింది. మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది ఒకే ఒక్క మనిషిమీద ఆధారపడి బ్రతుకుతూంటారు. ఆ సంగతి నాకూ తెలుసు. ఒకప్పుడు నామీదకూడా నలుగురుమనుషులు ఆధారపడి ఉండేవారు. అమ్మ, అత్తయ్య, ఇద్దరు తమ్ముళ్ళు.
చిన్న ఉద్యోగం చేసేవాణ్ణి. నేనాట్టే చదువుకోలేదు. ఉద్యోగంలో నే నాఫీసుకువెళ్ళిన రోజున డబ్బొచ్చేది. లేనిరోజున లేదు. నాకు జ్వరంవస్తే ఇంటిల్లపాదీ పస్తులు పాడుకునేవారు. నా మందులకోసం అప్పులు చేయాల్సొచ్చేది.
నేను ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండేవాణ్ణి. నావాళ్ళంటే నాకెంతో ఇష్టం. నేను లేకపోతే వాళ్ళ బ్రతుకులు బజారు పాలవుతాయని నాకుతెలుసు. అలా జరగడం నాకిష్టంలేదు.
ఓసారి తమ్ముడికి జ్వరంవచ్చింది. మందులు కొనడానికి నా దగ్గర డబ్బుల్లేవు. అడగడానికి మా ఆఫీసు యజమాని ఇంటికివెళ్ళాను.
ఆ సమయంలో అక్కడో ఘోరం జరుగుతోంది. మా ఆఫీసులో పనిచేసే అమ్మాయి నాయన బలవంతం చేస్తున్నాడు. ఆ అమ్మాయి పారిపోలేక, ఒప్పుకోలేక నానా అవస్థాపడుతోంది.
పారిపోవడానికి తలుపుగడియ ఆ అమ్మాయితీసిన సమయంలో నేనా ఇంట ప్రవేశించాను. ఆ అమ్మాయి పారిపోయింది. నా యజమానికి నామీద అంతులేని కోపం వచ్చింది. నా కోరికవిని-'అలాగా!" అని క్రూరంగా నవ్వి, ఓ గదిలోకి తీసుకువెళ్ళాడు. అందులో నేను బందీనయ్యాను.
అందులో వారం రోజులున్నాను. అప్పుడప్పుడు యజమాని వచ్చి నన్ను తలుపుతీయకుండానే పలకరించి క్రూరంగా నవ్వుతూండేవాడు. నేను విని గోలపెట్టేవాన్ని. నా తమ్ముడికి మందులు అత్యవసరమనీ నన్ను వదిలిపెట్టమనీ గుండెలుకరిగేలా రోదించేవాణ్ణి. ఆయన చలించే వాడుకాదు.
పక్కకిటికీలోంచి నాకు రొట్టెలూ, మంచినీళ్ళూ అందుతూండేవి. బాధగా ఉన్నప్పటికీ బ్రతకడంకోసం అవితినేవాణ్ణి.
ఒకరోజు యజమానివచ్చి తలుపులుతీసి-"నిన్ను వదిలిపెడుతున్నాను. ఈవేళ్టికి సెలవుకూడా ఇస్తున్నాను. రేపట్నించి ఆఫీసుకురా. ఈ పదిరూపాయలూ దగ్గరుంచుకో-" అన్నాడు. ఆయన సంతోషంగా ఉన్నాడు. అందుక్కారణంకూడా నాకు అర్ధమైపోయింది.
ఆరోజు పారిపోయిన అమ్మాయిప్పుడు అక్కడేవుంది. ఉద్యోగం పోయిందామెకు. వారంరోజులాగి ఆమె ఇప్పుడు యజమాని ఇంటికివచ్చింది. ఆయన చెప్పిందానికి అంగీకరింస్తాననీ మళ్ళీ ఉద్యోగం ఇప్పించమనీ అడుగుతోంది. యజమాని తనకాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగమన్నాడట. అలాగే అడిగిందట.
నామూలంగా ఆమె తప్పిపోయిందన్న కోపం అప్పటికి తగ్గిందాయనకు.
మందులు కొనకుండానే హడావుడిగా ఇంటికి వెళ్ళాను. మందులు కొనకపోవడం మంచిదే అయింది. అప్పటికి తమ్ముడు చచ్చిపోయి రెండురోజులయింది.
ఏడుద్దామనుకున్నాను కానీ ఏడుపురాలేదు. కసి, కోపం, ఆవేశం నాలో చోటుచేసుకున్నాయి. ఆ క్షణంనుంచీ నేను మారిపోయాను. రెండు సంవత్సరాలు మొండిధైర్యంతో పెద్ద దొంగతనాలు చేశాను. ఆ సంపాదించిన డబ్బును అమ్మకిచ్చి హాయిగా బ్రతకమనిచెప్పి వాళ్ళను వదిలిపెట్టాను. ఇప్పటి నా జీవితానికి బంధాలూ, అనుబంధాలూ పనికిరావు.
వాళ్ళనెంత తప్పించుకు తిరిగినా అమ్మకు నామీద మమకారం చావలేదు. నాలుగేళ్ళక్రితం అమ్మ నాకు మాధురిని కట్టబెట్టింది. ఇప్పుడు నేను మాధురిని మట్టుబెట్టాను.
చంద్రశేఖరశర్మను చూశాను. అతనిలో నాకు నేనే కనిపించాను. అందుకే అతన్ని వదిలేయాలనిపించింది. కట్లు విడిపించి-"వెళ్ళు. వెడుతూనే నన్ను మరిచిపో. ఇక్కడ జరిగిందీ, నువ్వు చూసిందీ-అన్నీ మరిచిపో. మరిచిపోకపోయావో.....రెండుసార్లు నేనింతవరకూ ఎవరి మీదా జాలిపడలేదు....." అన్నాను.
చంద్రశేఖరశర్మ వెళ్ళేముందు నా పాదాలంటుకుని మరీ వెళ్ళాడు. పునర్జన్మ నెత్తిన అనుభూతి అతని కళ్ళలో కనబడుతోంది.
3
ఇంట్లో మాధురి లేకపోవడం లోతుగానేవుంది. గొడవ పెడుతూనే, ఏదోవిధంగానో ఆమె నాకు దగ్గర కావడానికే ప్రయత్నించేది.
రాత్రికి మళ్ళీ రామాయమ్మ దగ్గరకు వెళ్ళాను. అప్పుడామె ఒంటరిగాలేదు. జంటగావుంది. విటుడు పోవడానికో అర్ధగంటపట్టింది. తర్వాత నన్నామె పలకరించింది.
"నిన్ను పెళ్ళిచేసుకుని శాశ్వతంగా నా దగ్గరుంచేసుకుందామనుకుంటున్నాను..." అన్నాను.
"నీ పెళ్ళాం ఒప్పుకుంటుందా?"
"ఏడిసింది-దాని అనుమతి ఎవడిక్కావాలి?"
రామాయమ్మ నవ్వి-"అందుకే నేను పెళ్ళిచేసుకోను..." అంది.
"అదేం"?"-అన్నాను.
"ఈ దేశంలో మగాళ్ళకి పెళ్ళామంటే విలువలేదు. పెళ్ళికి నా అనుమతి అడుగుతున్నావు. కానీ నీతో జీవితం పంచుకోవడానికి వచ్చిన ఆడదాన్ని నాముందు తీసిపారేస్తున్నావు. రేపు నేను నీ పెళ్ళాన్నయితే-ఇంకో భీమాయమ్మ ముందు నన్నూ తీసిపారేస్తావు...."
నిజమేనేమోననిపించింది-"అయితే నన్ను పెళ్ళిచేసుకోవా?"
"ఇప్పుడు నాకోసమొచ్చేనా? ఇంకోళ్ళెవరో ఉండడం వల్ల చచ్చినట్లు కాసేపు ఆగేవు. అదే పెళ్ళాం విషయంలో అయితే ఏంచేస్తావ్? చంపినా చంపేస్తావ్......నిన్నేకాదు......ఎవర్నీ పెళ్ళిచేసుకోను. మగాళ్ళ నిలా నా చుట్టూ తిప్పుకోవడమే నాకు బాగుంది...." అంది రామాయమ్మ.
రామాయమ్మ నా భార్యకాదు. కానీ భార్య ఇవ్వాల్సిన సుఖం ఇస్తోంది. అదే సుఖం మాధురీ ఇస్తోంది నాకు. మరి రామాయమ్మ జీవితవిధానం మాధురి అనుసరిస్తే నాకంత కోపమెందుకు వచ్చింది. ఆమె నాకు భార్య కాబట్టా?
