Previous Page Next Page 
విశాలి పేజి 15


    నీళ్ళపొయ్యి అంటించి, వంటింట్లోకొచ్చిన విశాలికి ముందర గదిలో రామం ఎవరితోనో మాట్లాడటం వినిపించింది. 'ఇంత పొద్దున్నే ఎవరా వస్త?' అని అనుకుంటూ ఉండగానే రామం కేకేశాడు. పైట నిండుగా కప్పుకుని ఇవతలికి వచ్చింది విశాలి. ఇంచు మించు ఏభయ్యేళ్ళ వయసుగలావిడ, ముఫ్ఫయ్యేళ్ళ యువకుడు రామాని కెదురుగా నిలబడి ఉన్నారు.
    వాళ్ళెవరో తెలియక, సందేహంగా చూస్తూ నిలబడి పోయింది విశాలి.
    ఆ యువకుడు మాత్రం విశాలిని చూస్తూ పళ్ళికిలించాడు. అసహ్యాన్నీ అణిచిపెట్టి మరోవైపు దృష్టి సారించింది విశాలి.
    "నేనూ, మీ వదిన తల్లీ పినతల్లి పెత్తల్లి పిల్లలం. నా పేరు అనసూయమ్మ. "విశాలి భుజంమీద చెయ్యేసి మరీ చెప్పిందావిడ. ఆ బరువైన చెయ్యి పడగానే విశాలి భుజం అదిరింది. కొంచెం నెప్పి పెట్టిన మాటా నిజమే!
    "అలాగా? రండి! లోపలికి రండి."
    రిక్షావాడు పెట్టె, పరుపుచుట్ట లోపల పెట్టి డబ్బు కోసం నిలబడ్డాడు.
    ఎంతివ్వాలో వాడినే అడిగి, జేబులోంచి తీసి ఇచ్చేశాడు రామం.
    "వీడు మా అబ్బాయి." పళ్ళికిలిస్తున్న తన ముద్దుల కొడుకుని విశాలికి చూపించి పరిచయం చేసింది అనసూయమ్మ. పేరు మారుతిట. తరవాత ఆవిడ తిన్నగా మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి, మంచం పక్కన కూర్చుని, "ఎలాంటిదానివి ఎలా అయిపోయావే, తల్లీ!" అంటూ చేతులూ, ఒళ్ళూ తెగ తిప్పుతూ మనసులో లేని బాధ కళ్ళలో చూపించడానికి నానా అవస్థా పడింది.
    అందరికీ కాఫీలందించి, తనుకూడా తాగడం అయ్యాక ముందు రాజేంద్రకి స్నానం చేయించి పౌడరద్ది బట్టలు వేసింది విశాలి.
    విశాలి చేతుల్లోంచి రాజేంద్రని ఒక్క విసురున లాక్కుని మహాలక్ష్మి గదిలోకి తీసుకెళ్ళింది అనసూయమ్మ. వాడేమో కొత్తమనిషిని చూసి ఒకటే ఏడుపు. అదేమీ పట్టించుకోకుండా అనసూయమ్మ తన ధోరణిలో తను ఉంది.
    "అయ్యో! పిల్లా డెలా ఉన్నాడే, నా తల్లీ! తల్లివి నువ్వేమో మంచం పట్టావయ్యె! ప్రేమగా పిల్లాడిని పెంచుకొచ్చే ఇంకో ఆడదిక్కు ఈ ఇంట్లో ఉందా ఏమన్నానా? ఊరుకోరా, వెధవా! అంతేడు పెందుకు? నే నెవరనుకుంటున్నావు? నీ క్కావలసినదాన్నే? నీ అమ్మమ్మని. ఇంక నే నొచ్చాగా నిన్ను బాగా చూసుకుంటాన్లే, అమ్మా!"
    రాజేంద్ర మాత్రం ఏడుపు మానలేదు.
    ఏడుస్తున్నాడు కదా వాడిని తీసుకుందామని గదిలోకి రాబోయిన విశాలి గుమ్మం దగ్గిరే నిశ్చేష్ట అయి నిలబడి పోయింది.
    అనసూయమ్మ మాటలకి అంతులేని ఆశ్చర్యం కలిగింది.
    ఎప్పుడో తను స్కూల్లో చదువుకున్న 'లక్ష్మీ ప్రసాదం'లో పాపాయమ్మ గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకుంది.
    వదినకి తన మంచితనం తెలుసు కాబట్టి, ఈవిడ ఎన్ని మాటలు చెప్పినా ఏం చేసినా వదిన తనని అపార్ధం చేసుకోదన్న ఆలోచనే ఉపశాంతి నిచ్చింది విశాలికి.
    పిన్ని మాటలు ఏమాత్రం నచ్చలేదు మహాలక్ష్మికి కూడా.
    మౌనంగా వచ్చి రాజేంద్రని తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది విశాలి. విశాలి చేతుల్లోకి వాలుతూనే ఏడుపు మానేశాడు రాజేంద్ర.
    విశాలి అటు వెళ్ళగానే అంది మహాలక్ష్మి: "చూశావా, పిన్నీ! విశాలి దగ్గిరి కెళ్ళగానే ఎలా ఏడుపు మానేశాడో! నా కంటేకూడా ప్రేమగా వాడిని చూసుకుంటుంది విశాలి."
    "అయ్యో! సంబడం! నీ కేమీ తెలియదే, పిచ్చితల్లీ! ఎంతైనా నీ తరఫువాళ్లుకి నీ పిల్లల మీదా, నీ మీదా ప్రేమ ఉంటుంది కానీ....దాని కేమిటే నా బొంద, పై కలాగే నటిస్తారందరూ!"
    "పిన్నీ!" అయిష్టంగా మంచంమీద కదిలింది మహాలక్ష్మి.
    స్నానానికి నీళ్ళు పెట్టాను రమ్మని విశాలి పిలవడంతో అక్కడితో ఆ సంభాషణ ఆపి లేచి వెళ్ళింది అనసూయమ్మ.

                            *    *    *

    ఆ రాత్రి ఎనిమిదైనా రామం ఇంకా ఇంటికి రాలేదు.
    "మీరుకూడా కనిపెట్టుకు కూర్చోవడం ఎందుకు? అన్నయ్య ఎప్పుడొస్తాడో ఏమో? మీ ఇద్దరికీ పెట్టే స్తాను. రండి, అత్తయ్యగారూ!" అంది విశాలి పొద్దు పోయేదాకా వాళ్ళనికూడా కూర్చోపెట్టడం ఎందుకని.
    "బాగుందమ్మా! అలాంటివి నీ కలవాటేమో! మగాడు ఇంటికి చేరుకోకుండానే మింగి కూచోమంటావా నన్ను? నువ్వు కానిస్తే కానియ్యి." ముందు గదిలో బారజాపు క్కూచుంది అనసూయమ్మ.
    "అమ్మా! నాకాకలేస్తోందే! పోనీ, నేనుతినెయ్యనా?" పొట్ట తడుముకుంటూ విసుగ్గా తల్లివంక చూశాడు మారుతి.
    "ఏడిసినట్టే ఉంది, బావ రాకుండానే తింటావా?" అంటూనే కొడుకు ముఖం వంక చూసి మళ్ళీ ఏమనుకుందో ఏమో- "ఊఁ! తింటే తిను" అంటూ విశాలి వైపు తిరిగింది.
    వంటింట్లోకి నడిచింది విశాలి.
    ఆ తల్లీ కొడుకుల తీరుకి పొద్దుటినించీ ఆశ్చర్యం గానే ఉంది విశాలికి.
    ముఫ్ఫయ్యేళ్ళ కొడుక్కి ఆకలేస్తే అన్నం తినడానికి కూడా తల్లి పెర్మిషన్ కావాలా?
    పొద్దున్నా అంతే! స్నానం చేశాక ఆవిడే బట్టలు కట్టుకోమందో అవే కట్టుకుని, అవిడెక్కడ కూచో మందో అక్కడే కూచున్నాడు.
    కాసేపయ్యాక "అమ్మా! ఏమీ తోచటంలేదే! కాసేపలా బయట తిరిగొస్తానే" అనగానే కస్సుమందావిడ.
    "ఇప్పుడేం కొంప మునిగిపోయిందని అప్పుడే తిరగ డానికి పోవాలా? సాయంత్రం వెళ్ళు తిరగడానికి కావలిస్తే."
    ఇంక అంతే! మారు మాటాడకుండా కూర్చున్నాడు మారుతి పొద్దున్న.
    విశాలి వంట చేస్తున్నంతసేపూ ఏదో కాపలా కాస్తున్నట్టు వంటింట్లోనే పీట వాల్చుకు కూర్చుని విశాలి చేసే ప్రతి పనీ గుచ్చి గుచ్చి చూస్తూ గడిపిన అనసూయమ్మ కొడుకు భోజనం చేస్తుంటే వంటింటి ఛాయలకే పోలేదు.
    మొహమాటంతో కొంచెం ఇబ్బందిగానే వడ్డన మొదలుపెట్టింది విశాలి. ఆవిడొచ్చి ఈ పక్కన, కొడుకు భోజనం అయ్యేదాకా కాసేపు కూర్చుంటే బాగుండునని రెండు మూడు సార్లనుకుంది మనసు లోనే.
    కానీ, కొంచెంసేపటికే అర్ధం చేసుకుంది ఆవిడ వంటింట్లో కెందుకు రాలేదో.
    ఏ విషయంలోనూ కొడుక్కి స్వేచ్చ నివ్వని ఆ మనిషి ఈ ఒక్క విషయంలోనూ స్వేచ్చ నిచ్చింది గావును. అదైనా ఎందుకూ? ఏదో గూడుపుఠాణి ఉంది. విశాలి ఈ నిర్ణయానికి రావడానికి కారణం మారుతి మెల్లిగా ఏదో రహస్యం చెపుతున్నట్టు నెయ్యి వేస్తున్న విశాలితో- "రేపు మనిద్దరం సినిమాకి వెళదాం, వస్తావా?" అని అడగటమే.
    తెల్లబోయింది మొదట విశాలి ఆ ప్రశ్నతో. తరవాత అతి ప్రయత్నంమీద కోపాన్ని అణిచిపెట్టి ముఖం పక్కకి తిప్పుకుంది.
    ఇంతలో రామం రావడంతో అనసూయమ్మ వంటింట్లో కొచ్చింది.
    ఈవేళ నీళ్ళు ఉన్నారనే అన్నయ్య కాస్త పెందరాళే ఇంటికి వచ్చాడని గ్రహించింది విశాలి.

                              *    *    *

    ఏమైనా రెండు కూరలు, వదినకి నాలుగు బత్తాయి పళ్ళు కొనుక్కొద్దామని రాజేంద్రనికూడా ఎత్తుకుని, అనసూయమ్మతో తలుపేసుకోమని చెప్పి మధ్యాహ్నం మూడింటికి బయలుదేరింది విశాలి.

                                   
    కూరలూ, పళ్ళూ కొని తిరిగి ఇంటికి వస్తుండగా కనుపించాడు సదాశివం.
    నవ్వుతూ రెండు చేతులూ జోడించాడు. "చిరకాల దర్శనం."
    నవ్వింది విశాలి. "నమస్తే."
    "పదండి. మా ఇంట్లో కాసేపు కూర్చుందురు గాని."
    "అబ్బే!ఇప్పుడు కాదండీ!"
    "అలా అంటే ఎలాగండీ? మీరు నాకు ఎప్పుడు, ఎక్కడ కనపడినాసరే మా ఇంటికి తీసుకురమ్మని మా శ్రీమతి ఆజ్ఞ." విశాలి చేతుల్లోంచి రాజేంద్రని అందుకుని నడక సాగించాడు సదాశివం.
    "ఎందుకో?"
    "మీరు చాలా మంచివారుట...."
    "ఊఁ ఇంకా!"
    "మీకు తన కృతజ్ఞత చెప్పుకోవాలిట."
    "భలేవారే!"
    "నిజం. మీరు మా ఇంటికి రాక రాక ఆ రోజు వచ్చారు. వచ్చిన ఆ మొట్టమొదటి రోజే మా మధ్య పరుచుకోబోతున్న అనుమానపు తెర తొలగించారు. మీ రా రోజు ఏం చెప్పారోగానీ లక్ష్మి తన తప్పుతెలుసుకుంది. నా మీద ఉన్న అనుమానం తుడిచేసుకుంది."
    "ఏముందీ? ఆ రోజు నేను ఉన్న మాటే చెప్పాను. మీ ఆవిడ మనసు మంచిది కాబట్టి అర్ధం చేసుకున్నారు మొదటి మాటలోనే." అది తన గొప్ప ఎంత మాత్రమూ కాదన్నట్టు మృదువుగా చెప్పింది విశాలి.
    "ఏమో నా కదేం తెలియదు. ఆ రోజు మొదలుకొని మా ఆవిడ మీరు నా కెప్పుడైన, ఎక్కడైనా కనిపిస్తే ఇంటికి తీసుకురమ్మని మరీ మరీ చెప్పింది. పోనీ, అంతగా నీ కావిడని చూడాలని ఉంటే నువ్వే వాళ్ళింటి కోసారి వెళ్ళరాదా అన్నానోసారి..."
    "అవును! అదీ నిజమే! ఆవిడ రావలసింది మా ఇంటికి."
    "ఏం చెప్పమంటారు? దానికి మహా బిడియంలెండి. ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళదేమో! ఒక్క రోజు పరిచయం తోనే మీ ఇంటికి రావాలంటే తగని మొహమాటపడి పోతోంది. అక్కడికీ నేను చెప్పానుకూడా ఫరవాలేదని...'
    "బాగానే ఉందండోయ్! ఎన్నాళ్ళ పరిచయం కావాలి మీ శ్రీమతికి?" సదాశివంతో వాళ్ళ ఇంటి వైపు నడిచింది విశాలి.
    విశాలిని చూస్తూనే పరుగున వచ్చి చెయ్యందుకున్నాడు బాబు.
    "ఏం బాబూ! నన్ను మరిచిపోలేదా? గుర్తున్నానా?'
    బాబుని ఎత్తుకుని లోపలికి నడిచింది విశాలి.
    "రండి! రండి! వాడి నెత్తుకున్నారేమిటీ! దించండి. చంటిపిల్లాడా ఏ మన్నానా?" చంకలో పాపతో వంటింట్లోంచి ఇవతలికి వచ్చింది లక్ష్మి.
    "పాప నెత్తుకోకుండా బాబు నెత్తుకున్నానని కోపం వచ్చిందా? పోనీ, పాపనే ఎత్తుకుంటాను. ఇటివ్వండి." నవ్వుతూ బాబుని కిందకి దించి పాప నెత్తుకుంది విశాలి.
    చాప వాల్చింది లక్ష్మి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS