రెండువందలరూపాయలూ పుచ్చుకున్న గవర్రాజు ఏంచేయాలో తోచక, నాలు గయిదురోజులు అటూ ఇటూ వూరికే తిరిగాడు! ఒక నెలరోజులూ పూర్తిగా గడిచేసరికి, గవర్రాజు చేతిలో ఒక యాభయ్ రూపాయలే మిగిలాయ్! గవర్రాజుకి గాభరాపట్టుకుంది. అనుకోకుండా తల్లీతండ్రీ గుర్తుకివచ్చి కళ్ళు చెమ్మగిల్లాయ్! దుష్టుడైనా, శిష్టుడైనా ప్రయోజకుడైనా, అప్రయోజకుడైనా, కన్నకడుపు కనుక, కన్నతల్లితండ్రులు కోరకుండగానే క్షమిస్తారు! కాని పైవాళ్ళకి, అన్నాతమ్ములకయితే మటుకు క్షమించాల్సిన అవసరం ఏముంది? లోకంతోపాటే వాళ్ళూనూ!
రైల్వే ఫ్లాటు ఫారంమీద, కళ్ళ నీళ్ళతో, అలగం తిరుగుతూ ఆలోచించుకుంటూన్న గవర్రాజుకి, చిన్న ఇత్తడి పళ్ళెంలో బీడీకట్టలూ, కిల్లీలూ, పెట్టుకుని అమ్ముకుంటూన్న పధ్నాలుగేళ్ళు వున్న కుర్రవాడు కన్పించాడు. గవర్రాజుకి తారకమంత్రం దొరికినంత బ్రహ్మానంద మయింది. అతను వ్యాపారం చేయాలనుకున్నాడు. కానీ ఏం వ్యాపారం చేయాల్నో అతనికి తోచేదికాదు! ఇప్పుడు, ఆ కుర్రాడిని చూస్తూంటే అతనికి అకస్మాత్తుగా ఈ కిల్లీల వ్యాపారం సులువనిపించింది! అయిదు రూపాయలుపెట్టి కిళ్ళీలూ, సిగరెట్టు పెట్టెలూ కొని ఫ్లాట్ ఫారం మీదకి వచ్చాడు. నాలుగయిదు ట్రయిన్స్ వెళ్ళే సరికి అతని అయిదురూపాయల సరుకూ అమ్ముడు పోయింది. డెబ్బయ్ పైసలు లాభం తేలింది. కాని రైల్వే ఫ్లాటుఫారం మీద సరుకు, అమ్ముకోటానికి లైసెన్స్ వుండాలి! ఆ లైసెన్స్ అంత తేలిగ్గా వచ్చేది కాదు! దానికి చాలామందిని కాళ్ళూ కడుపూ పట్టుకుని బ్రతిమిలాడుకోవాలి! అల్లాంటి శషభిషలు పట్టం గవర్రాజుకి చేతకాదు! అంచేత ఖర్చు తక్కువలో చిన్న రేకు బడ్డీ చేయించి, నరసయ్యగా రింటిముందున్న ఖాళీజాగాలో ఆయన అనుమతి తీసుకొని పెట్టాడు. ఆ జాగా లోనికివచ్చి చేరిన వేళావిశేషం ఏమిటో కాని అతని రేఖ సుడి తిరిగింది! గాలి మళ్ళింది! ఆజాగా నాలుగురోడ్ల కూడ లిలోవుంది! బస్సులూ, లారీలూ, రాకపోకలూ, సమ్మర్ధంగా వున్న రాస్తా అవటంనించి, అతని వ్యాపారం సాఫీగా గడిచిపోయేది! పైగా ఆ నాలుగురోడ్ల మధ్యా అదొక్కటే పాన్ బీడా షాపు! ఒక ఏడాది గడిచేసరికి, అన్నగారి రెండు వందలరూపాయలూ పట్టుకుని వెళ్ళాడు! పిల్లలందరికీ పిప్పరమెంటులూ, చక్కర కేళీబిళ్ళలూ, వదినలకి జాకెట్టుబట్టలూ, ఇచ్చాడు! వదినలు ఎంతో సాదరంగా కుశల ప్రశ్నలు వేసి స్నానానికి వేన్నీళ్ళు పెట్టి కమ్మని నేతితో, పెరుగుతో, బంగాళా దుంపలకూరతో భోజనం పెట్టారు! అన్నలు తమ్ముడి ప్రయోజకత్వం చూసి సంబరపడ్డారు. మెచ్చుకున్నారు.
'ఎక్కడో అరవైమైళ్ళ దూరంలో నీవక్కడ వంటిగా వుండటం ఎందుకు? ఆ షాపు ఇక్కడే పెట్టుకోవచ్చుగా? వేళ పాళాలేకుండా, హోటలుకు వెళ్ళుతుంటే ఆరోగ్యం చెడిపోదూ?' అన్నాడు చిన్నన్న!
డబ్బు యొక్క విలువ బాగా తెలిసి వచ్చింది! గవర్రాజుకి! 'మా సంసారాలు మేమే జరుపుకోలేకుండా వున్నాం నిన్ను తేరగా ఎక్కడ పోషిస్తాం?' అన్నవాళ్ళకి ఇంత దయ కలగటానికీ, వంటిగాడయిపోయేడే తమ్ముడు- అన్న ప్రేమ కలగకపోడానికీ, కారణం డబ్బేకదా! ప్రేమగానే చూసారు కదా అని, ఆ షాపు ఎత్తిపెట్టుకుని ఇక్కడకువస్తే మళ్ళీ నష్టం వస్తే, వీళ్ళ తీరుమారదన్న హామీ, ఎక్కడ వుంది? లాభంవస్తే దాయాదులు నంజుతారుకాని, నష్టంవస్తే భరిస్తారా? తనకు తనవాళ్ళెవరూలేరు! అన్నలు స్వార్ధపరులు! వాళ్ళ సంసారం గొడవలేకాని, ఇతరుల జోక్యం కలిగించుకోరు! తనకి కూడా ఒక 'భార్యా పిల్లలూ, అన్న సంసారం ఏర్పడితే తన ఆర్జనకి లక్ష్యం ఏర్పడుతుంది. కష్ట సుఖాల్లో పాలుపుచ్చుకోగల బంధువు తల్లితండ్రుల తర్వాత భార్య వక్కతే అయివుంటుంది!
గవర్రాజుకి శరీరం గగుర్పొడిచింది. అతనికి ముఫ్ఫయ్ ఏళ్ళు పైబడ్డాయి! ఇంతవరకూ స్త్రీ సాహచర్యం ఎరగడు! తల్లితండ్రులు ఇచ్చిన డబ్బు కేవలం పేకాట, సినిమాలూ, సిగరెట్లకే ఖర్చు అయిపోయేది కాని స్త్రీ వ్యసనం మటుకు లేదు! అంచేతనే అతని ఆరోగ్యం దృఢంగా వుంది! నాలుగుడబ్బులు కూడేసుకుని తర్వాత నెమ్మదిగా అయినింటి పిల్లని చూసుకుని పెళ్ళి చేసుకుని గృహస్థుగా మారాలి' అనుకున్నాడు గవర్రాజు! అంచేత,
'అక్కడిజాగా, నాకు అచ్చివచ్చింది! చిన్నన్నా! నాలుగయిదేళ్ళు అటువెంపే వుంటాను! నష్టం వచ్చినా భరించకలిగే స్తోమతు కలిగేక ఇంక ఎక్కడికి వచ్చి వున్నా ఇబ్బంది వుండదు! మళ్ళీ మొదటికి వస్తే ఎలా మీరు మటుకు భరాయిస్తారు?' అన్నాడు గవర్రాజు.
'గడుసుతనం నేర్చారు మరిదిగారు! మీ సంపాదనమటుకు, అన్నలు ఖర్చుపెడుతారా! ఏదో ఇంటిపట్టున వుంటే, పెళ్ళీ పేరంటం, చేయొచ్చని మీ అన్నల వూహ!' అంది పెద్ద వదిన.
గవర్రాజు నవ్వి వూరుకున్నాడు!
* * *
8
గవర్రాజు కిప్పుడు నాలుగు డబ్బులు వెనకేసుకోవటం చాతనయింది. పగలల్లా కొట్టుమీద కూర్చునేవాడు! సాయం కాలం మొదటాట సినీమాకి వెళ్ళిపోయే వాడు. రాత్రుళ్ళు నరసయ్యగారి వీధరుగు మీదవున్న చిన్న కొట్టు గదిలో పడుక్కునేవాడు! అతనిదగ్గర నాలుగయిదు వేల రూపాయలు చేరాయి! పెళ్ళి చేసుకున్నాక ఎక్కడయినా చౌకలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలని అతని ఆశయం!
నరసయ్యగారు, కామేశ్వరి పెళ్ళికోసం వెతికి వెతికి వేసారి పోతూంటే గవర్రాజు తనలోతనే నవ్వుకునేవాడు! తనకి ఎవరూ పిల్లని ఇస్తామంటూ రాకపోవటం చూసి ఆశ్చర్యపోయేవాడు! గవర్రాజు చూపులకు బాగానే వుండేవాడు! మంచి ఉన్నతమైన శరీరమూ, చామనిచాయ రంగుతో, వంకులు వంకులు తిరిగిన జుట్టుతో అందంగానే కనపడేవాడు! సిగరెట్ కన్న ఇంకేం దురభ్యాసమూ లేదు! ఇదివరలో పేకాట ఆడేవాడు! స్వంత ఆర్జన మొదలెట్టిన తర్వాత ఆ పూర్వపు జుట్టుని వదిలిపెట్టాడు! మరెందుకని కన్యాదాతల చూపులు తనమీద పడటం లేదు? అని ఆలోచించేవాడు! నరసయ్య గారు మటుకు వందరూపాయల జీతం తెచ్చుకునే గుమాస్తాకోసం మూడు వేలూ, రెండువేలూ, కట్నం ఇస్తామని తిరిగేవారు కాని, కంటిముందు, నెలకి రెండుమూడు వందలు ఆర్జించుకునే గవర్రాజు పెళ్ళికొడుకుగా ఆయినకి తోచేదికాదు!
'ఎదురుగా నేను కనపట్టం లేదు కాబోల్ను! అల్లా వూళ్ళట్టుకు తిరుగు తున్నారు! 'గవర్రాజూ! మా కాముడుని పెళ్ళిచేసుకోకూడదుటోయ్!' అని ఒక్క ముక్కంటే, తను కానీ కట్నం తీసుకోకుండా, పెళ్ళాడడూ! ఆ నేరేడు పండుకి నేను తగనా!' అనుకునేవాడు గవర్రాజు, కామేశ్వరికి వచ్చిన సంబంధమల్లా తిరిగి వెళ్ళిపోతూంటే లోపల్లోపల మురిసిపోయేవాడు గవర్రాజు.
'ఆఁ! ఈసారి తప్పక నన్నే పెళ్ళాడ మంటారు! పెళ్ళి చెయకుండగా ఇంకెన్ని రోజులు అట్టే పెట్టుకుంటారు? పెద్ద పిల్ల కాకుండా, చిన్నదికూడా రోజురోజుకీ గుర్రమల్లె ఎదిగి కూర్చుంటోంది! పెద్దమ్మాయికి పెళ్ళి చెయ్యాల్సిన ఈడే తప్పిపోతోంది!' అనుకునేవాడు. కాని నరసయ్యగారి దృష్టిలో గవర్రాజు, పెళ్ళి కొడుకుక్రింద అనేవాడు కాదు! వక్కసారైనా ఆయన,
'నీకు పెళ్ళయిందా!' అని కానీ,
'పెళ్ళి చేసుకోకుండా ఎన్నాళ్లుంటావ్!' అని కానీ వ్యక్తిగతమైన ప్రశ్నలు వేసేవారుకాదు. అయిదూ, పది అవసరంవస్తే అడిగేవారు. గవర్రాజు లేదనకుండా అప్పు చేసయినాసరే ఇచ్చేవాడు! చిట్టిబాబుని తరుచు సినీమాలకు తీసుకెళ్ళేవాడు! కామేశ్వరికి వొచ్చే సంబంధాలన్నీ తిరిగి వెళ్ళిపోవటానికి తగిన ప్రయత్నాలు చేసే వాడు! చిన్నపిల్లని దాచి, పెద్ద పిల్లనే చూపెట్టుతారనీ ఆ పిల్ల నల్లగా కాటి క్కాయలా వుంటంనించి ఎవళ్ళకీ నచ్చటం లేదనీ చిన్నపిల్ల తెల్లగా బాగుంటుంది కనుక అందరూ ఆ అమ్మాయినే చేసుకుంటామంటున్నారనీ వచ్చిన ప్రతీ సంబంధాల వాళ్ళతోనూ చెప్పేవాడు! నాలు గయిదురోజులు గడిచాక చిట్టిబాబుని అడిగేవాడు!
'మీ అక్కను చూసుకుందుకు వచ్చేరుగా పెళ్ళివారు? ఏమన్నారు?'
'ప్చ్! నచ్చలేదని వ్రాసేసారు!' అనేవాడు చిట్టిబాబు! అదంతా తన ప్రజ్ఞ వల్లే జరిగిందనుకొని మురిసిపోయేవాడు గవర్రాజు!
ఉన్నట్లుండి మేఘంలేని ఆకాశం ఉరిమింది! నరసయ్య ఇంటిముందు నాలుగు రాటలు పాతి పచ్చని కొబ్బరి ఆకులతో పందిరి వేసారు! మామిడాకులతో తోరణాలు కట్టారు. ఇంటా బయటా పిల్లా పెద్దా సందడిగా తిరుగుతున్నారు. తనతో సంప్రతించకుండా ఎవళ్ళు కామేశ్వరిని పెళ్ళాడుతున్నారా? అని ఆశ్చర్యపోయేడు గవర్రాజు!
'ఏమిటోయ్! సందడి?' అని అడిగేడు చిట్టిబాబుని.
'మా అక్కపెళ్ళి!' అన్నాడు చిట్టిబాబు.
'మీ బావ ఏం చేస్తున్నాడు?' అన్నాడు,
'కాలేజీలో లెక్చరర్! చెప్పాడు చిట్టి బాబు. ఈసారి విస్తుబోయేడు గవర్రాజు!
ఎవళ్ళూ చేసుకోకుండా వుంటే ఏ పౌరోహిత్యాలు చేసుకుని కాలం గడిపే వాళ్ళ పిల్లాడికో ఇస్తున్నారేమో అనుకున్నాడు గవర్రాజు. అల్లాంటప్పుడు, తను ఆకస్మికంగా పందిట్లోకి ప్రవేశించి,
'మీకేమన్నా మతిపోయిందా? ఆ యవారం చేసుకునేవాడికిస్తున్నారా నిక్షేపం లాంటి పిల్లని? నూరేళ్ళ నిండు జీవితాన్ని ధ్వంసం చేస్తున్నారా! ఒక ముక్క, నాతో చెబ్తే నేను చేసుకోకుండా వుండే వాడినా!' అంటూ కామేశ్వరి విభ్రాంత చూపులతోపాటు ఆ నిర్భాగ్య తల్లితండ్రుల మెప్పుని కూడా పొందాలని ఆ కాంక్షించేడు!
'రెండోపెళ్ళా!' అన్నాడు గవర్రాజు.
చిట్టిబాబు గవర్రాజు ప్రశ్నకి చిన్న బుచ్చుకున్నాడు.
'అవును!' అన్నాడు.
గవర్రాజుకి ఎందుకనో పట్టరాని సంతోషం కలిగింది! 'రెండోపెళ్ళి పంతులుకి చేస్తున్నారన్నమాట! బహుశా ఆ పెళ్ళి కొడుకు నేడో రేపో రిటయిరయి పోయే స్టేజ్ లో వుంటాడు! తన్ని గుర్తించనందుకు తగినశాస్తి జరిగింది కామేశ్వరికి! అనుకున్నాడు. అంతలో మళ్ళీ స్ఫుటంగా తనతప్పు తెలుసు కున్నాడు!' కామేశ్వరికి శాస్తి జరిగిందనుకుంటున్నాడు తను! తనెప్పుడయినా కామేశ్వరితో తన మనసులోనిమాట చెప్పుకున్నాడా!
ఆమెమీద తన కెందుకు ఈసు కలగాలి! ఆమెకి తన అభిప్రాయం ఈ షణ్మాత్రమూ తెలీదు! తనలోతనే మల్లగుల్లాలు పడుతూ కాలం వృధా పుచ్చేసాడు! వక్కనాడయినా ఆమెతో తను మాట్లాడలేదు! తను తన అభిప్రాయం చెప్పుకున్నాక ఆమె తన్ని కాదనటం జరిగితే కదా! ఆమెకి తగిన శాస్తి జరిగిందనుకుంటూ, తాను సంతోషించటం? ఇన్నాళ్ళూ తనకే కామేశ్వరి నిచ్చి పెళ్ళి చేయక తప్పదనే పరిస్థితి వస్తుందని వూహించాడు కనుక అల్లా జరగకపోవటంతో ఆమెమీద కోపం వస్తోంది తనకి!'
గవర్రాజు కామేశ్వరి పెళ్ళికి సంతోషంతో ఇటూ అటూ తిరిగాడు. పెళ్ళి కొడుకు కేశవని చూసి మరింత ఆశ్చర్యపోయాడు! కేశవ దృఢంగా వున్నాడు! గౌరవంగా కన్పడిన కేశవని, హుందాగా ఉన్నంతగా కన్పడిన కేశవని చూసి మళ్ళీ వకసారి నిట్టూర్చాడు! అతని ఉన్నత మైన దేహం ఆకర్షవంతమైన దేహం ప్రక్కన కామేశ్వరి పీలగా చామన ఛాయగా కన్పడింది!
'ఎల్లా నచ్చిందో ఈ అమ్మాయి ఈతనికి!' అనుకున్నాడు గవర్రాజు.
* * *

