Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 15


    ఆవిడ అంద చందాలతోగానీ, భోగభాగ్యాలతో గాని నాకు పనిలేదు. నాకు కావాల్సింది ఆవిడ మనసు - నన్ను కోరే మనిషికి నేనంకితమై పోతాను. నన్నసహ్యించుకొనే వ్యక్తిని నేను లెక్క చెయ్యను. ఇక జీవితంలో ఆవిడతో నా కెటువంటి వుండబోవు - నా కథలో ఒకభాగం ముగిసింది.
    కృష్ణవేణీ! నీకోసం అంతా ఓసారి సింహావలోకనం చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు నన్ను అర్ధం చేసుకోవాలని అతి విపులంగా చెప్పాను-కోపంతో మండిపడుతూ నువ్వు రాసిన చిన్న వుత్తరం అందింది. అంతా విన్నతర్వాతైనా నువ్వు నన్ను క్షమించగలవని నమ్ముతున్నాను. త్వరలో మరొక ఉత్తరం రాస్తాను. ఇంతలో నీ జవాబులక్కర్లేదు. అంతా శ్రద్దగా విని నన్ను అర్ధంచేసుకో. అకారణంగా నామీద కోపం పెంచుకోకు- ఇక్కడికిది విరమిస్తున్నాను.
                                                                                          ఇట్లు,
                                                                                       స్నేహితుడు!
                                                                                       మాధవ్ రావ్!
            
                           *    *    *

    మాధవ్ నా ఎట్టెదుట నిలబడి తన కథంతా విన్పిస్తున్నట్టు తప్ప అంతసేపూ వుత్తరం చదువు తున్నానన్న సంగతే మర్చిపోయాను. లేఖ ముగించి కుర్చీలో వెనక్కి జేరబడి కూర్చున్నాను. మాధవ్ ని గురించి చెడ్డగా అనుకున్నందుకు తొందరపడ్డాననే అనిపించింది. ఎప్పుడూ చిరునవ్వులు చిందించే మాధవ్ లో ఇంత కథ వుందని ఎలా అనుకోను?
    మాధవ్ వంటి వ్యక్తి అరుణ కంటికి ఆనలేక పోయాడు. ఆ కంటి చూపుకి ఒక లక్ష్య మంటూ వుండివుండదు. తళుకు బెళుకుల మాదిరి చెదిరిపోతూ వుంటుంది. రత్నాలనుకూడా కాళ్ళ దన్నుకొనే వ్యక్తులుంటారు. అటువంటిదే అరుణ. కాని ఏనాటికైనా తననుతాను తెలుసుకో గలిగితే అదృష్టవంతురాలే. మాధవ్ వంటి భర్త వేయి పుణ్యాల ఫలం! అంతకన్నా అనుకోవాల్సిందేమీలేదు - మాధవ్ నన్ను దగా చేశాడు. ఆకోపం నాలో చల్లారదు. అతని బ్రతుకు చూసి బాధపడతాను గానీ, అతనిమీద కోపం మర్చిపోలేను. ఆ వుత్తరం రేణుకి చూపించలేదు. మాధవ్ కి జవాబూ రాయలేదు - వారం రోజుల్లో మరో వుత్తరం వచ్చింది.
    
                            *    *    *

    కృష్ణవేణికి ....
    ఆశీస్సులు ..
    నా మొదటి వుత్తరం వల్ల నాకథంతా తెలుసు కున్నావు. ఈసారి నామనోభావాలు-నా వ్యక్తిత్వం-ఇన్నాళ్ళుగా నేను గడుపుతున్న తీరూ తెలియజేస్తాను. నన్ను నమ్ముతూ ముందుకు సాగుతూంటే నన్ను నువ్వు పూర్తిగా అర్ధం చేసుకో గలుగుతావు కృష్ణా!
    నా దృష్టిలో పెళ్ళి అనేది చాలా పవిత్రమైన కార్యం. బ్రతుకులో ముఖ్యత అదే అంటాను. ఆక్షణమే జీవితరధం గొప్ప మలుపు తిరుగుతుంది. ఆ మలుపు తర్వాత నాకమో-నరకమో ఏదో ఒకటి ఎదురుకావచ్చు. జీవితంలో శాశ్వతంగా మరోవ్యక్తికి చోటిస్తున్నప్పుడు-ఒంటరి బ్రతుకులు జంటగా మార్చుకొంటున్నప్పుడు-
    ఆ రాబోయే సహచారిణి గురించీ-గడపబోయే భవిష్యత్తుని గురించీ ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా ఆలోచించుకుంటాడు. రాబోయే వ్యక్తి తనకి అనుకూలంగా వుంటుందనీ-ఇకనుంచి తామిద్దరమూ కష్టాలకీ సుఖలకీ, అండదండ కలిపి గడుపుతామనీ-ఒకరి సంతోషం కోసం ఒకరు ఏమైనా చేస్తామనీ-తోడునీడా అన్నపదాన్ని సార్ధకం చేస్తామనీ-ఇంకా ఎన్నెన్నో.
    అందరిలా నేనూ అదే అనుకున్నాను. నాభార్య నన్ను ప్రాణంలా ప్రేమిస్తుందనీ, -భర్తగా గౌరవిస్తుందనీ. కాని అదే నా బ్రతుక్కి కరువైంది. నేనేమీ అత్యాశలకు పోకపోయినా సామాన్యమైన జీవితానికే దూరమయ్యాను. నా దాంపత్యంలో అనుకూలత అన్నభావమే లేకుండాపోయింది. నేను తెచ్చిన చీర కట్టుకోమని ఎంతో ప్రాధేయపూర్వ కంగా ఆప్యాయత కోరితే నాకోరిక నిరాకరించిన మనిషి నా సంతోషంకోసం ఏమైనా చేస్తుందని ఎలా అనుకోను?-పుట్టెడు జబ్బుతో చావుకు సిద్ధమైతే రాత్రింబవళ్ళూ దగ్గిరుండి సేవ చెయ్యకపోగా కనీసం కంటితో చూడటానికైనా ఇష్టపడని మనిషి నాకష్టసుఖాల్లో తోడునీడగా వుంటుందని ఎలా గర్వపడను?
    ఆ మనిషికి నా సంతోషం-నా సుఖం ఏమీ అక్కర్లేదు. అసలు నేనే అక్కర్లేదు. నాపెళ్ళి నిరర్ధకం అయిపోయింది. నా బ్రతుకు నాశనం అయింది. -దానికి నేను బాధపడని క్షణం లేదు. నేనేం పాపం జేసుకున్నానని ఇలా పాపిష్టి జీవితం గడపాలి? భగవాన్! నాకెందుకీ శిక్ష? అంటూ ఏడవని ఘడియ లేదు. మూర్కురాలైన ఒక ఆడదాన్ని గురించి నేను స్త్రీ జాతినంతా ద్వేషించను. స్త్రీ సహచర్యం లేని ఏమగవాడికీ శాంతిదొర కదు. ఇంతవరకూ స్త్రీ లోని మాతృత్వమే అనుభవించి అర్ధం చేసుకోగలిగాను. ఇక మీదట ప్రణయదేవత వడిలో సర్వస్వం. మర్చిపోగలిగే అనుభవం పొందాలని వాంఛించాను. స్త్రీకి ప్రకృతే మార్దవం-సౌకుమార్యం ప్రసాదించింది. అందుకే పురుషుడు స్త్రీని సౌందర్య దేవతగా అలంకరించి ఆనందిస్తాడు. తన తేనె పలుకులతో-కరుణాపూరితమైన చల్లని చూపు లతో-పురుషుని సేదతీర్చి శాంతి ప్రసాదించగల శక్తి గృహదేవతయైన స్త్రీకే వుంది.
    ఇంటికి చేరేసరికి చిరునవ్వుతో చల్లటి చూపు లతో నన్నాదరించే ఆడది కావాలని మనసుకోరుతుంది. ఆవిడ ప్రసాదించే శాంతి సౌఖ్యాల కోసం హృదయం తహతహలాడుతుంది. బాధ్యతలుగల కుటుంబీకుడిగా-తండ్రిగా సంసారం గడపాలని అనుక్షణం అనిపిస్తుంది.
    అమ్మచేతుల్లో పెరగాల్సిన రోజులూ - ఆ అవసరాలూ గడిచిపోయాయి. ఇప్పుడు ఆవిడే నాచేతుల్లో పెరగాలి.
    కాని ఇకమీదటనైనా మరొక రకంగా నన్ను పెంచాల్సిన అవసరం ఓవ్యక్తి కుంటుంది! నాకెవరున్నారని అనుకోను? 'నా ఇల్లు "నా సంసారం" "నా పిల్లలు" అనే బాధ్యతలు కావాలంటే మాత్రం ఎలా వస్తాయి? నా సంపాదన సార్ధకమవుతుందనే తృప్తి నాకులేదు. బజారునుంచి వస్తూంటే పూలమనిషి తీసుకోమని బ్రతిమలాడుతూ ఓ చెండు చేతిలో పెడుతుంది. పువ్వులు తెచ్చి ఏం చేసుకోను? ఎవరికివ్వను? అక్కడికీ ఒక్కో సారి కాదనలేక తెచ్చి ఏపక్కింటిపాపకో ఇస్తూంటాను. నేను పువ్వులు తెస్తాను. సంతోషంగా అంచుకొనే ఆడది వుంటే ....? నాకు శాంతి లేదు కృష్ణవేణీ!    
    ఈ మూడు సంవత్సరాలలో నేను నీతి తప్పిపోవాల్సిన అవకాశాలు రాకపోలేదు. వ్యభిచారం గురించి నీ అభిప్రాయాలకన్నా గొప్ప అభిప్రాయాలే నావి. నా ప్రవర్తనకి నేనే గర్వపడతాను. నాకు భార్యగా శాంతిసౌఖ్యాలు చూపించే వ్యక్తి కోసమే నా తహతహగానీ కేవలం ఒక్క శారీరక సుఖాలకి నేను ప్రాధాన్యత ఇవ్వను. ఆభావం నాకు ఏనాడూ రాదు. అటువంటి అపవిత్రమైన జీవితం అంటేనే నాకు ఏవగింపు. ఓసారి హైదరాబాదు వెళ్ళినప్పటి సంగతి చెప్తాను. అక్కడ నాకో స్నేహితుడున్నాడు. ఉద్దేశ్యాలు వేరైనా స్నేహానికేమీ ఆటంకాలు లేవుకదా? వాడి తరహా పూర్తిగా నాకు విరుద్ధం. భోగాలనేవి అనుభవించటానికేనట. చక్కటి భార్య నుంచుకుని కూడా వాడికదేం గుణమో మరి. వాడికేవో నీతులు చెప్పబోతే వాడి దగ్గిర మనమే నేర్చుకోవాల్సి వస్తుంది.
    సరే! నగరంలో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూపించాడు-మెహందీకి తీసికెళ్ళాడు. వెళ్ళే వరకూ అదేమిటో నాకు తెలీదు. విశాలమైన హాలూ-అక్కడో డాన్సరూ కంటపడగానే కొంత అర్ధం చేసుకోగలిగాను. సినిమాలలోలా ఓ అమ్మాయి కొంతమంది రసికుల ఎదుట డాన్స్ చేస్తోంది. ఆ పాటలేవిటో నాకేం అర్ధంకాలా. అంతా తురకగోల. కొంతసేపయాక మావాడు నన్నా అమ్మాయికి పరిచయం చేశాడు. ఆవిడ వయ్యారాలొలకబోస్తూ -ఓరకంట చూస్తూ తమలపాకులు నోటికే అందించబోయింది. చిరాకు పడి చేతితో తీసుకున్నాను. ఆరాత్రి ఆమేడలో వుండిపోదాం అన్నాడు మావాడు. నేను ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి కూడా భాషలో ఏమొ చెప్పింది-నాకు మాత్రం చాల అసభ్యత అని పించింది. డాన్సింగు గెస్ట్ గా ఓ ఐదురూపాయలిచ్చి బయటపడ్డాను. తర్వాత మాటల సందర్భంలో ఈసంగతి-అంటే మెహందీకి వెళ్ళి వచ్చానని-ఆఫీస్ లోనూ, క్లబ్బులోనూ చెప్తే వాళ్ళంతా "గొప్పవాడవోయ్! మెహందీ చూసి వచ్చావన్నమాట." అంటూ తెగ అభినందించారు. చూశావా? మగవాడికి అదీ గర్వింపదగ్గ విషయమే. మంచీ - చెడూ ఎవరికీ అక్కర్లేదు. సంఘం ప్రసాదించిన పురుషహక్కులు వినియోగించుకోలేనివాడిని అప్రయోజకుడంటారు. అందుకే నేను నలుగుర్లో కబుర్లు దొర్లినప్పుడు గొప్ప గ్రంథకర్తలా మాట్లాడుతాను.

                             *    *    *   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS