అనంతయ్య కుటుంబం లో పెళ్లి సన్నాహాలు! అవతల ప్రకృతి లో సమాగత వసంత వేళా సముచిత నూత్నాలంకృత సన్నాహం! వసంతుడనే పెళ్లి కొడుకు విడిది నించీ తరలి వస్తున్నాడని శుభవార్త నందించే అప్తునిలా దక్షిణ గంధవాహాడు కదిలి వస్తున్నాడు. వేకువజాముల ఆ కమ్మ తెమ్మరకు సొమ్మసిల్లినట్లు, తెల్లవారింది గూడా తెలియదు. మనస్సు ఝల్లు మనేట్లు చెట్టు చాటు నించో కొత్తగా గొంతు శ్రుతి చేసుకుంటున్న కోయిల కూత!
అప్పుడు మెట్ట పొలాల రైతులకు పెద్ద పనులేమీ ఉండవు. అయితే పని చేయడం కంటే , పని చేయకుండా ఉండడం లోనే వాళ్లకు కష్ట మెక్కువ! బండి కట్టి మట్టి తోలడం ప్రారంభిస్తాడు, లేదా తెల్లవారిన తరవాత గిత్తల్ని కాడి గట్టుకుని, జొన్న కాళ్ల పావనం మొదలు పెడతాడు. రెండు మూడు మలుపులు మళ్లే సరికి ఎండ చురుక్కు మంటుంది. గిత్తల్ని నెమరాడించ డానికి గట్టున నిలిపి, తానూ కూర్చుంటాడు. అప్పుడు పరిశీలిస్తా డతను ప్రకృతిని. ఎంత మార్పు వచ్చేసింది! మొన్న దఫా సేద్యానికి కొచ్చినప్పుడు, ఇదే వేపచెట్టు కింద అంతా ఎండ పొడ . వట్టి కొమ్మలు, ఇప్పుడెంత అందంగా, గొడుగులా ఉంది! లేత లేత ఎర్రఎర్రనీ ఆకులూ, ఆ కదలీ కదలని చిగురాకులు కనపడకుండా ఇరపూసిన తెల్లని పూత! కమ్మని వాసన, చల్లని నీడ! బ్రతుక్కూడా ఇంతేనేమో! అయితే, తన బ్రతుకు లో వసంత మెప్పుడోస్తుంది? నిరాశ శిశిర ఋతువు , ఆశ వసంత ఋతువేమో? ఏ గంటల గలగల లోనో, ఏ పక్క పొలం సేద్య కాని అడలింపు లోనో ధ్యాన భంగ మవుతుంది. కళ్ళు తెరిచి చూస్తె ఎండ మెండైంది! ఆరోజుకు సేద్యం చాలించి ఇంటి దారి బడతాడు!
ఒక్క నెల గడిచింది. చిగురాకు లేత అకుగా, పూత పిందే గా, ఎండ మండు టెండగా మారిపోయింది. సరస్వతి పెళ్లి అయిపోయింది. ఆ పెళ్ళిలో సుబ్బరామయ్య కలవలేదు. పరిణామాల్ని లెక్క చెయ్యకుండా సరస్వతి నే ఎన్నుకున్న సూర్యనారాయణ ను గోదాదేవి మెచ్చుకుంది. పల్లె టూల్లో సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి , ఇంటి ముందు ఆ పెద్ద పందిరి, ఆ పాతకాలపు ముత్తయిదువులు, సరస్వతి కళ్ళలో కొత్త మెరుపులు....ఆమె మనసులో నిలిచిపొయినాయి!
నిన్న అలివేణి ఉత్తరం!
"పెళ్ళయి ఇరవై రోజులయింది! ఏం చేస్తున్నావింకా అక్కడే? నీ పెళ్లి కూడా చేసుకుంటున్నావా ఏం?" నవ్వుకుంది. తన పెళ్లి కూడా ఇక్కడే జరగవచ్చని అలివేణి ఊహించిందా?'
'వాసవీ! నువ్వు నన్నాకర్శించావు, నన్ను పెళ్లి చేసుకో" అనాలా తానె! వాసవి కర్ధం కాలేదా? పరీక్షిస్తున్నాడా? ప్రరీక్ష చేస్తున్నాడా?
"ఏం చేస్తున్నావమ్మా ఒక్కత్తేవూ?' పక్కన సావిత్రమ్మ.
"ఏం లేదు. అలివేణి ఉత్తరం రాసింది. రేపో మర్నాడో వెళ్లి పోవాలి...'
'హూ! ఈ ఊళ్ళో పుట్టిన దానివి. అనుకుంటే ఏడుపొస్తుంది. చిన్నప్పుడు నాన్నగారు నన్ను ఒళ్లో కూచోబెట్టుకుని ఎన్ని పద్యాలు పలికించేవారు? రాఘవరెడ్డి మాటకు రామబాణానికి తిరుగులేదనేవాళ్ళు.' సావిత్రమ్మ కళ్ళు తడి చేసుకుంది. సావిత్రమ్మ ఎంత మంచిది! ఎంత మృదు హృదయం కలది? తానోచ్చినప్పటి నుంచీ గూడా ఎంత అభిమానంగా పలకరిస్తుంది! పాపం! ఇంత మంచిదానికి జీవితంలో అన్నీ బాధలే.
సావిత్రమ్మ కళ్ళు వత్తుకుని అంది:
'అయినా, అప్పుడాయన కేదో విరక్తి కలిగి వెళ్ళిపోయాడు. ఇక్కడ బోలేడాస్తి ఉంది.మేమంతా నీ వాళ్ళం కాదూ? చదువుకుని ఉద్యోగాలు చేసి బ్రతకాలని ఖర్మ ఏముంది?'
'ఇక్కడ మాత్రం ఏం చేయాలి నేను? పొలం పనులా నాకు తెలీవు, అందులో మొగ....' ఆగిపోయిందామె!
'అవునవును. అదీ నిజమే, తల్లీ -- కన్న తండ్రి ఎదిగిన కూతుర్ని ఏదో అయ్య చేతిలో పెట్టకుండా అర్ధంతరంగా వెళ్ళిపోతే ఎంత కష్టమో నాకు తెలుస్తోంది. ఈ దిక్కు మాలిన ప్రపంచం లో , ఏ మనిషి లోపల ఎట్లాంటి మనసుందో అర్ధం కాదు. అంతా డబ్బు! దాని ముందు కన్న తండ్రి లేడు, తోబుట్టువు ల్లేరు...'
గోదాదేవి మనస్సు ఉలికి పడింది. ఎవర్ని గురించి ఆమె అంటుంది?
'కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కన్నబిడ్డ లాంటి నీ ముందయినా చెప్పుకోవాలనిపిస్తుంది. తండ్రి కన్న కూతురుకు మాటిచ్చాడు, ఆ రోజు వాడూ ఒప్పుకున్నాడు. సరస్వతి పెళ్ళితో పాటు దాని పెళ్ళి అయిపోతే -- నేను ఏ యత్రలకో వెళ్లి పోవాలనుకున్నాను...అంతా వట్టి ఆశ...'

'మరి, ఎందు కాగిపోయింది?'
'ఆగిపోయింది. ఎందుకయితేనెం ? పోనీలే, తల్లీ! నా పాడు కత విని నువ్వేం చేస్తావు? ఊరక బాధపదిపోతావు....' లేచి పోబోయింది.
'ఎందుకని ఆగిందో చెప్పండి?' కాతరా స్వరం....
'ఎవరో నమ్మా! పిల్ల ఒక్కతే ఉందట! గొప్ప ఆస్తి! ఎక్కడుందో, ఏమో నా కంత వివరాలు తెలీవు. అడిగి ఏం లాభం?ఆ ఆస్తి తమ పరమైతే పదివేల డబ్బు పారేసి శ్యామల నేవడికో ముడి వేద్దామని ఆలోచన. అదయినా మేలే! ఆమాత్రం సహాయం చేసినా మనవాళ్ళే ననుకో! అందుక్కాదు , డబ్బు మనస్సుకు ఎన్ని వంకలు తీరుస్తుంది? అని ఆలోచన. పోనీ.... తొందరేముంది? ఇంకా రెండు రోజు లుండు. ఈసారోచ్చేటప్పటికి ఉంటానో, ఊడి పోతానో ...' ఆమె వెళ్ళిపోయింది.
ఆమె చెప్పిన విషయం మనస్సులో నాటుకుంది!
ఆమె కావాలనే తనతో అబద్దం చెప్పిందా? లేదు. అట్లా కనిపించలేదు. అసలామె తనతో చెప్పాలని గూడా అనుకోలేదు. తనే బలవంతం చేసి చెప్పించింది. అదీకాక, ఆ ఆస్తి పరురాలైన పిల్ల తనే ఉండచ్చని గూడా ఆమె గుర్తించినట్లు లేదు. శ్యామలను వేరే వాళ్ళ కించేందుకయినా సంతృప్తి పడింది. కనక అందులో అబద్దం ఉండవలసిన అవసరం లేదు. అంటే, సహృదయుడు , సంస్కారి గా, సాహిత్యవేత్త గా కనిపించే వాసవి, ఆత్మవంచన , పరపంచన ఆస్తి కోసం చెయ్యగలడు. అసలిది ఎప్పటి నుంచో పన్నిన వ్యూహమేమో? తన పిచ్చి గాక పొతే, వీళ్ళకు తనకంటే ముందు నించీ తన ఆస్తితో అనుభవముంది. తన విలువ కంటే తన ఆస్తి విలువ తెలుసుకున్న వాళ్ళు! వాళ్ళ దృష్టి ఆవిధంగా కాకా మరేట్లా ఉంటుంది? తన దంతా భ్రమ. నాలుగు రోజుల క్రిందట అతనెవరో అతను చెప్పింది గూడా నిజమే అయి ఉంటుంది.
'పాతి కేకరాల మెట్టకు అయిదువేల గుత్త ఎట్లా చేల్లిస్తున్నావయ్యా?' అంటే, 'ఈరోజు నాలుగు డబ్బులు నష్టపడినా రేపాభూమి మనది కాకుండా పోతుందా?' అన్నడట అనంతయ్య. తామెక్కడున్నదీ ఇంతవరకూ ఇక్కడి వాళ్ళ కేవరికీ చెప్పకుండా దాచడం లో కూడా కొత్త అర్ధం కనిపిస్తుందామెకు. ఆలోచించే కొద్దీ ఆమె కన్నీ అందుకు సాక్ష్యం పలుకుతున్నట్లే కనిపిస్తుంది. తను ఎవర్ని పెళ్లాడితే, తన ఆస్తి వారికి చెందుతుంది. అందుకు తను గూడా సంతోషంతో ఒప్పుకుంటుంది. కానీ, తన ఆస్తి కోసమే తనని పెళ్ళాడినట్లు తెలిసిపోతే, తన మనస్సు నెలా సరిపెట్టు కోవడం?
'ఇంకా ఇక్కడే ఉన్నావే? ఏమి టంత దీర్ఘాలోచన?' వాసవి.
ఈ మధ్య ఇద్దరి సంబంధం 'మీరు' నించీ 'నీవు' అనేంత దగ్గరగా వచ్చింది. గోదాదేవి కొక్క ఊహ తట్టింది. హటాత్తుగా వాసవి కి తెలియకుండానే అతని మనస్సు లోకి తొంగి చూసి, ఏముందో తెలుసుకోవాలని పించింది.
'వర్ణాంతర వివాహాల గురించి ఆలోచిస్తున్నాను.'
'అంటే నీ వయస్సు దాదాపు వందేళ్ళ కు పైబడే ఉందన్న మాట...' నవ్వాడు.
'ఇప్పుడాలోచించవలసినది కాదా?'
'అంటు కట్టిన మొక్కలు బలంగా పెరగడం చూస్తున్నాడు. సంకరజాతి జొన్న ఎక్కువ పంట నివ్వడం తెలుసు. వర్ణాంతర వివాహం అభ్యుదయ చర్యగా భావించే కాలం గూడా వెనక పడిపోయింది. ఈనాటి మానవుడికి కులాన్ని కూల దోయడం జాతీయ జీవనానికి ముఖ్యావసరం...'
'ఆ అవసరం తో పాటు ఆస్తి గూడా లభ్యమైతే మరీ మంచిది. అదింకా అవసరం...'
ఆశ్చర్యంగా చూశాడతను. ఆమె కళ్ళలో ఒక ఉపాలంబన! అర్ధమైందతనికి. ఇలాంటి అభిప్రాయం గోదాదేవి కెందుకు కలిగింది? దీన్ని ప్రవేశ పెట్టినవాళ్ళెవరు? ఈ పరిశోధన వృధా. ఆమె కళ్ళలో కనిపించిన నిందా పూర్వకమైన ఆ చూపు చాలు, తనలో పెరుగుతున్న ఆశాలతల్ని కోసేయ్యడానికి! గోదాదేవి ని మొట్టమొదట ఆ ప్లాట్ ఫారం మీద చూస్తూనే, తన కళ్ళకు ఉషా భాలలా కనిపించింది. క్రమక్రమ పరిణామంగా తన హృదయం లో గాడంగా హత్తుకు పోయింది. అయినా తాను -- "దేవీ! నిన్ను ప్రేమిస్తున్నా' నని చెప్పలేక పోయాడు. ఆస్తి పరురాలైన స్త్రీ కి , అందునా ఒంటరి దైతే మనస్సు అతి విచిత్రంగా ఉంటుంది. అవతలి వ్యక్తీ నించీ వచ్చిన ఎంత మహత్తర ప్రేరణనయినా ఆమె తన ఆస్తి వల్ల కలిగిందిగా భావించవచ్చు. ఆ మనో వైకల్యం గోదాదేవికి కూడా ఉందేమో? నిరీక్షించి చూడాలను కున్నాడు.
ఒక్కొక్కసారి గోదాదేవి ని చూస్తుంటే, తన ఊహ తప్పేమో! అర్ధం లేని కల్పనేమో! ఆస్తి ఉన్న వాళ్ళంతా అలాగే ఉండాలని సిద్దాంత మేముంది? తానె ఊరకుంటే తనకు తానుగా ఎట్లా చెబుతుంది? అనీ ఆలోచించాడు. అయినా తన నమ్మకాలు తన నంత సులభంగా విడిచి పోలేదు. చివరికి ఈ వేళ గోదాదేవి వర్ణాంతర వివాహ ప్రసక్తి తెచ్చినప్పుడు తన మనస్సు వేయి రేకుల పారిజాతం లా విచ్చుకుంది. దగ్గరయింది, దగ్గరయింది! రెండు హృదయాలు ఐక్యమయ్యే శుభ సమయం! తెర తొలగి పోతుంది. 'నీ యాజ్ఞా కూడెనా? గొంతు ముడి వీడేనా?' ఈ నాటితో ఈ గొంతు ముడి విడుతుంది. 'దేవీ!' అన్న పిలుపు దివ్య గీతం లా హృదయపు మూలమూలలా ప్రతిధ్వనిస్తుంది.
అంతా వట్టి ఆశ! ఈ దృష్టి ఉన్న గోదాదేవి తో పెళ్లి కావడం అనేది ఒక దుర్ఘటన! ఆస్తి అన్నది గరళమై దాంపత్యం కంఠనికి చుట్టుకుంటుంది. వాదించి, తర్కించి అలాంటి అభిప్రాయాన్ని ఎవరూ పూర్తిగా పోగొట్టలేరు. అసలంత వరకూ వెళ్ళాలను కోవటం గూడా అల్పత్వమే! అతను మాట్లాడకుండా, ఆమె వైపు చూడకుండానే వెళ్ళిపోయాడు. ఆ ముఖం లోని కళా హీనతకు, తన ముఖం కేసి చూడకుండా బయటి కెళ్ళి పోవడాన్ని అప్పుడున్న ధోరణి లోనే అర్ధం చేసుకుంది గోదాదేవి.
* * * *
