Previous Page Next Page 
జీవన సంగీతం పేజి 15


    కిషన్ తోటకు వెళ్ళాలని బయలుదేరాను. సాయంకాలం.
    వరండాలో కూర్చుని ఉన్నాడు నాన్న, 'ఎక్కడి కమ్మా?'
    'అలా వెళ్ళి వస్తాను నాన్నా, షికారు.'
    'వెళ్ళు. కిషన్ తోట దిక్కుగా మాత్రం వెళ్ళకు. ఆ పాము అక్కడక్కడే తిరుగుతూందట ఎంత ప్రయత్నించినా చంపడానికి అలవికావడం లేదట.'
    'దేవుడికి ఏ కొంచెం కరుణ ఉన్నా ఆ సాముచేత నన్ను కరిపించి నా కిషన్ తో చేరుస్తాడు! ఆశోద్వేగంతో వెళ్లాను.
    మాలిలేని తోట వెలవెలబోతున్న ట్లనిపించింది. తోటలో అడుగు పెడుతూండగానే పెంపుడు జింక వచ్చి నా చీరపట్టి లాగసాగింది. ఒళ్లంతా నాకుతూంది. దాన్ని కౌగలించుకొని వలవలా ఏడిచాను. చెట్లమీద ఆగిన పావురాలు గుంపులు గుంపులుగా వచ్చి వాలాయి, కుప కుపలాడుతూ. 'మా పోషకుడెక్కడ?' అని అడుగు తున్నట్లనిపించింది. 'ఆయన లేరమ్మా. మిమ్మల్ని దిక్కులేనివారిని చేసి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారు.' పక్షులతో, జింకలతో, తరులతలతో మూగభాషలో నా బాధ చెప్పుకొని నిశ్శబ్దంగా రోదించాను.
    పక్షులకు గింజలు తెచ్చి చల్లుదామని కుటీరంకేసి సాగాను. దేవుడు లేని కోవెలలా ఉన్న కిషన్ శూన్యకుటీరంలో అడుగు పెడుతూ ఉంటే ఎక్కడలేని దుఃఖం పొంగి వచ్చింది. చిత్రఫలకం ముందు కిషన్ బొమ్మలు చిత్రిస్తూ కూర్చున్నట్లే మనస్సు భ్రమించింది.
    పక్షులకు ఆహారం అందించి వాటి రెక్కలు నిమురుతూంటే ఏదో ఊరట కలుగుతూంది మనసుకు. కిషన్ కుటీరంలో నివసిస్తూ, అతడు తిరిగిన చోట తిరుగుతూ, అతడి తోట పెంచుతూ, అతడి పెంపుడు జంతువుల్ని పాకుతూ, అతడికి ఇష్టమైన పనులు చేస్తూ అతడి భావసాన్నిహిత్యం దృఢం చేసుకోవడంలో నా జీవితం గడపాలని కోరిక ఉంది.
    కాని-
    ఈ స్థలంలో నా అనుబంధం, ఈ స్థలయజమానితో నా సంబంధం గురించి లోకులకు ఏవిధంగా తెలియపరచగలను? నా గాథ, నా బాధ నాలోనే దాచుకొని కుమిలి కృశించిపోవడంకన్న మార్గాంతరం ఏమి ఉన్నది నాకు? 'ఓ భగవాన్! నీదెంత కరుకు గుండె! ఈ పాత్ర వింత కఠినంగా సృష్టించా వెందుకయ్యా?'
    బావిగట్టుమీద కిషన్ విషన్నవదనంతో కూర్చున్నట్లనిపించింది.    
    'బావా!' అంటూ పరిగెత్తాను. ఎత్తుగా ఉన్న రాయి తగిలి కిందపడ్డాను. 'ఎక్కడ, నా కిషన్?'
    ఆ రాత్రి తరవాత కిషన్ ఎంత బాధపడ్డాడు? అతడు కళాదేవతకు చేసిన అపచారానికి ఆమె ఆగ్రహించి ఆ పామును పంపిందేమో! అతడి మృత్యువుకు నేనే కారణమేమో!
    కిషన్ కు తోటపనిలో అప్పుడప్పుడూ సాయంచేస్తూన్న రాముడు వచ్చాడు. 'అయ్య పోయాడు, తల్లీ!' అంటూ విలపించాడు. 'ఒకరి జోలికి పోయిన వాడు కాదు; ఒకరిని నొప్పించినవాడు కాదు. ఋషి లాంటి అయ్యకు ఎంతటి చావు రాసిపెట్టాడు భగవంతుడు!'
    నోట్లో గుడ్డ కుక్కుకొన్నాను.
    'ఆవేళ తోటకు నీళ్ళు తడుపుతూ, తడుపుతూండగా చీకటి పడిపోయింది. "ఇక్కడే తిని పడుకో అన్నం పెడతాగాని" అన్నాడయ్య తిని పడుకున్నాను. అర్ధరాత్రివేళ అయ్య మూలుగుతూ వచ్చాడు. ఏమైందంటూ లేచి కూర్చున్నాను. "నిద్ర పట్టక తోటలో తిరుగుతూంటే పురుగు ముట్టిందిరా" అన్నాడు. లబో దిబోమంటూ లేచి ఊళ్ళోకి పరిగెత్తబోయాను.
    "కంగారు పడకు. కరిచినచోట గాటుపెట్టాను. చుట్ట అంటించి ఇవ్వు కాలుస్తాను" అన్నారు. చుట్టముట్టించి గాయంమీద నేనే కాల్చాను. "ఏం పాము, బాబూ" అని అడిగాను. చీకట్లో గుర్తు పట్టలేదన్నారు. మాయనిద్ర ఒకటే తరుముకు వచ్చింది. తెల్లారి మేల్కొనేసరికి అయ్యగారు నురగలు కక్కుతున్నారు. ఊళ్ళోకి పరిగెత్తబోయాను. "బ్రతకాలని లేదురా" అన్నాడయ్య. అయ్యమాట లక్ష్యపెట్టకుండా ఊళ్ళోకి పరిగెత్తి సర్పవైద్యున్ని పిలుచుకు వచ్చేసరికి అంతా అయిపోయింది.'
    'బ్రతకాలని లేదురా!' అన్నమాట నా హృదయానికి శూలంలా గుచ్చుకుంది. 'తన్ను మనసారా ప్రేమించి నమ్మిన రూపను ఈ విషమపరిస్థితిలో నిలబెట్టి తను వెళ్ళిపోవడానికి మనస్సెలా అంగీకరించిందో?' నా హృదయం ఆక్రోశించింది.
    భుజంమీది స్టెల్లాతో కళ్ళు తుడుచుకొన్నాడు రాముడు. 'అయ్యగారి చావుకబురు తెలిసి ఎంత జనం, ఎంత జనం! అబ్బా! నిమిషాలమీద కార్లలో వచ్చి వాలారు పెద్ద పెద్ద బాబులు. ఆ కట్టెకు ఎన్ని చేస్తే ఏం? ఆయన బ్రతికిఉండగా ఏకాకే గదా! చచ్చినాక అందరూ బంధువులే, పరిచయస్థులే, స్నేహితులే. పూలమాలలు అలంకరించి వైభవంగా ఊరేగింపుచేసి శ్మశానానికి కొనిపోయి దహనం చేశారు.'
    గొప్ప మాట చెప్పాడు.
    'చీకటి పడకుండానే వెళ్ళిపొండి, తల్లీ. ఆ పాపిష్టి పాము నిన్న పొద్దున్న అదిగో, ఆ కనిపిస్తున్న పుట్టలోకి జారుతూ కనిపించింది'. రాముడు ఇంటికి వెళ్ళిపోయాడు.
    పుట్ట దిక్కుగా పరిగెత్తాను. 'నన్నూ నా దైవంతో చేర్చునాగదేవతా!' అంటూ కనిపించిన రంధ్రంలో అల్లా చెయ్యి దూర్చాను. పాము కరవలేదు. ఎక్కడలేని దుఃఖం పొంగుకు వచ్చింది. పుట్టాను కౌగలించుకొని బావురుమని ఏడవసాగాను. 'ఎంత నిర్దయ నీకు! నా దైవాన్ని కాటువేసినన్నీ నరకజీవితం పాల పడేశావు. నా బాధ తీర్చవెందుకు?' విలపిస్తూ ఎంత సేపు పడి ఉన్నానో తెలియదు.
    'రూపా!'
    అన్నయ్య కరుణస్వరం విని గబగబా కన్నీళ్ళు తుడుచుకొన్నాను. అన్నయ్య దగ్గిరగా వచ్చి భుజం మీద చెయ్యివేశాడు. 'లే, రూపా! విలపిస్తే పోయిన వాడు వస్తాడా?'
    అన్నయ్య ఊరడింపు మాటలకు గట్లుతెంచుకొంది నా కన్నీరు.
    'ఛ! ఏడవకు, రూపా!' కన్నీరు తుడిచాడు. కిషన్ తోటి నా గురుశిష్యసంబంధమే ఊహించాడో, అతడితో నా స్నేహబంధమే భావించాడోగాని నా దుఃఖం చూచి కదిలిపోయాడు. 'కాని అంతటి ఉత్తమ వ్యక్తిని మనం జీవితంలో చూడలేం.' అన్నయ్య కంఠం గద్గదమైంది.
    'అక్కడ కూర్చొని మాట్లాడుతున్నట్లుగా, ఇక్కడ నిలబడి నవ్వుకొంటున్నట్లుగా ఇంకా కళ్ళు భ్రమపడుతూనే ఉన్నాయి. కిషన్ బావ మనల్ని వదిలి పోయాడంటే కలలా ఉంది, అన్నయ్యా!'
    'అనుకున్నది కాదుకదా? ఆడుతూ, పాడుతూ ఉన్నవాడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు.'
    'అంత్య దర్శనమైనా చేసుకో నోచని దురదృష్ట వంతులం!'
    'అదృష్ట దురదృష్టాలు మన చేతిలోనివి కాదు కదా? ఏం చేస్తాం? లే చీకటి పడింది.' చెయ్యిపట్టి లేపి నడిపించాడు.
    సెలవలు అయిపోయాయి. నేనూ, అన్నయ్యా వెళ్ళిపోయాము.
    నా మనస్సు పూర్తిగా చదువులో నిమగ్నం చేసి నా బాధ మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాను.
    కొన్నాళ్ళుగా ఒంట్లో చురుకుదనం లేకుండాపోయింది. ఒకనాడు బాగా జ్వరం వచ్చింది. లేవకుండా మంచం పట్టాను. డాక్టరుకు చూపించి మందు ఇప్పించేందుకు ఎవ్వరూ దగ్గిర లేరు. అన్నయ్య లేడు. నాన్నకు సుస్తీగా ఉందని ఉత్తరం రావడంవల్ల చూచి రావడానికి వెళ్ళాడు.
    సాయంకాలం రత్న వచ్చింది, ఆవేళ నేను కాలేజీకి వెళ్ళని కారణం తెలుసుకోడానికని. నా పరిస్థితి చూచి కంగారు పడింది. 'మీ అన్నయ్య లేడూ?'
    'నాన్నకి సుస్తీగా ఉందని ఉత్తరం వచ్చింది. చూచి రావడానికి వెళ్ళాడు. రేపు వస్తానని చెప్పాడు.' రత్న ఆత్రంగా తన కారులో వెళ్ళింది, డాక్టర్ని తీసుకు రావడానికని.
    డాక్టరూ, రత్నా గదిలో అడుగు పెట్టేసరికి వాంతి చేసుకొని ఆయాసపడుతున్నాను. రత్న నీళ్ళు ఇచ్చింది. నోరు కడుక్కుని నీరసంగా పక్కమీద పడుకొన్నాను. డాక్టరు పరీక్ష చేశాడు. ఆయన ముఖం వివర్ణం కావడం చూశాను. బయటికి వెడుతూ రత్నను తీసుకుపోయాడు.
    నా గుండెలో దడ ప్రారంభమైంది.
    తిరిగి వచ్చిన రత్నముఖంలో ఎంత కాఠిన్యం, ఎంత జుగుప్స!
    'ఛీ!' అంటూ డభాలున కూలబడింది కుర్చీలో.
    "ఏం చెప్పాడు డాక్టరుగారు?' కళ్ళు మూసుకొని ఉదాసీనంగా ప్రశ్నించాడు. నాకు తెలుసు, ఆయన ఏం చెప్పారో!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS