"పెద్ద ప్లాను! గొప్ప ప్లాను, సక్సెస్ ప్లాను. ఇంకేమీ లేవా!" వ్యంగ్యంగా అన్నాడు ఆర్ష్.
కురైపతి తలవంచుకున్నాడు,
"నీ అభిప్రాయం ఏమిటి లంబా?"
"మనం కొన్ని నెలలు ఆగటం మంచిది బాస్" లంబా ధైర్యంచేసి అన్నాడు.
"ఇంపాజిబుల్ అని ఇందాకే అన్నాను."
ఆర్ష ఆ మాట అనంగానే పెదవికదిపే ధైర్యం ఎవరూ చేయలేక పోయారు.
"కురైపతీ! నీవింక వెళ్ళవచ్చు, ఈ కేసు కావాలని పోట్లాడి మరీ చేతిలోకితీసుకున్నావు! కాని కొద్దోగొప్పో నెగ్గకపోగా అలజడి, అల్లరి సృష్టించడం జరిగింది. పదిమందికాళ్ళూ వకదనిమీదకి కేంద్రీకరించి ఉండగా ఆ పనిచేయటం అసాధ్యం. ఇదేదో మరొకరికి అప్పగించి నేను చూసుకుంటాను. నీవిక వెళ్ళి విశ్రాంతి తీసుకో."
ఆర్ష అనంగానే ఇంకేమిచెప్పి లాభంలేదన్న సంగతి బాగాతెలుసు కాబట్టి కురైపతి వినయంగా పలాంచేసి తన రూమ్ కి వెళ్ళటానికి వెనుతిరిగి నాలుగు అడుగులు వేశాడు.
ఆర్ష చూపుడు వేలు అందుబాటులో వున్న ఓ స్విచ్చి మీదకి వెళ్ళింది.
అంతే....!
కురైపతి మెడమీద ఏదో చురుక్కున గుచ్చుకున్నట్టు అయింది. అబ్బా అంటూనే దబ్ మంటూ నేలకూలాడు.
కురైపతి ఈ కేసు విషయంలో చాలా అలసిపోయాడు. అతనికి శాశ్వత విశ్రాంతి అవసరం. అతనికి విశ్రాంతి కలుగజేశాను. అతని దేహాన్ని తీసుకెళ్ళి పిడికెడు బూడిదచేసి పుణ్యంకోసం ఆ బూడిదను కృష్ణ, గోదావరి గంగ మొదలైన నదులలో కలపండి."
ఆర్ ష్ ఆజ్ఞఅయిన మరుక్షణం ఇరువురు వచ్చి కురైపతి శవాన్ని తీసుకెళ్ళిపోయారు.
"లంబా!'
"ఎస్ బాస్"
"కురైపతి పని అయిపోయింది. లంబా, ఈ కేసు నీవు చేపడతావా? నీ అభిప్రాయం ఏమిటి?"
"కొన్నాళ్ళు అంటే ఎన్నాళ్ళు?"
"గోల అణిగి......జనం తగ్గి......ప్రజలు ఈ విషయం మరిచిపోయి లంబా అంతవరకూ చెప్పి నాన్చుతూ ఆగాడు.
"ఈ దేశంలో భక్తులు పెరుగుతారుగాని తగ్గరు. శబరిమలై అన్నప్రదేశం వుందని, అయ్యప్పస్వామి అనే దేముడు ఉన్నాడనిగాని పదేళ్ళక్రితం ఎంతమందికి తెలుసు. వేలలో ఒకరికి తెలుసేమో. స్వామి అయ్యప్ప పిక్చర్ వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రాలో అందరికీ (దాదాపు నూటికి పది పాతిక) స్వామి అయ్యప్పని కొలవటం. దీక్షపట్టడం శబరిమలై యాత్ర అలా అలా పెరిగిపోయింది. దీక్షపట్టడం వల్ల బట్టలు ధరించటం అదో మోజుగా మారింది. కనుక రాళ్ళను మొక్కే పిచ్చాళ్ళున్న ఈ దేశంలో భక్తులు తగ్గరు. మనం మరోప్లానువేసి ఈపనిని సాధించాలి. ఈ సమయంలో సాధించటం కష్టమని నాకు తెలుసు. కాని ఇది వాయిదా వేసే విషయంకాదు. నాన్చేవిషయం అంతకన్నా కాదు____ఆర్ష చెపుతుంటే అంతా వింటూ కూర్చున్నారు.
పదినిమిషాల తర్వాత.
".....కనుక మీలో ఎవరైనా ఈ పనిని తక్కువ రోజుల్లో సాధించగలిగితే వాళ్ళకి నా ప్రధమ అసిస్టెంట్ గా స్థానం యిస్తాను. మీరుచేసే మూడుతప్పులని క్షమించి అధరిస్తాను. అంతేకాకుండా మీరు కనీ వినీ ఊహించని గొప్ప బహుమతికూడా యిస్తాను. చెప్పండి మీలో ఎవరైనా ఈ కార్యాన్ని చేబట్టి సాధిస్తారా? లేదంటే నేనే రంగంలోకి దిగుతాను. అయిదే అయిదు నిముషాలు ఆలోచించి చెప్పండి" అన్నాడు ఆర్ష.
లంబా ఆలోచిస్తూ ఉండిపోయాడు. గొప్పకి పోయి దీనిలో తల దూర్చి సాధించలేకపోతే తల ఎగిరిపోవటం ఖాయం. సాధిస్తేమాత్రం తిరుగులేని వీరవిజయం ఖాయం, కాని ఈపని యిది వరకు అయితే తేలికగా అయేది లేనిపోనిబీరాలుపోయి కురైపతి తనకి అడ్డంతగిలి వెళ్ళాడు. ఇప్పుడు పూర్తిగా పైకెగిరిపోయాడు. మార్గమంతా గంటుముళ్ళు ఏర్పడిన ఈ సమయంలో తను తెలిసి తెలిసి అదే మార్గాన నడవాలనుకోవటం తెలివితక్కువ......
అయిదు నిమిషాలు అయిపోయిన సంగతి లంబా గ్రహించలేదు. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు.
ఈ లోపలే.
అయిదో నిమిషానికి అరక్షణం ముందు సాధన చేయిపైకెత్తి లేచి నుంచుంది.
ఆర్ష అభినందనపూర్వకంగా చప్పట్లు కొట్టాడు.
ఉలికిపాటుతో ఆలోచన స్రవంతిలోంచి లంబా ఇవతలకివచ్చాడు.
నవ్వుతూ చప్పట్లు కొడుతున్న ఆర్షాని చేయిఎత్తి నుంచున్న సాధనాన్ని చూడగానే లంబా ముఖం నల్లబడింది. సాధనకి లంబాకి ఎప్పుడూ పడదు. అలాంటిది చెట్టంతమగాడు తను ఇక్కడ ఉండగా సాధన లేచి ఈ కేసు చేపడతావని చెప్పటమా! దానికి బాస్ చప్పట్లు కొట్టటమా?
